భారత్ భద్రమేనా?

భారత్ భద్రమేనా?

  • 24/05/2015
  • -ఎస్.కె.రామానుజం/ బి.శ్రీధర్

‘్భవిష్యత్‌లో భారత్‌కు పెనుభూకంపం ప్రమాదం పొంచి ఉందా?’-అంటే ‘ఔన’నే అంటున్నారు శాస్తవ్రేత్తలు. వారు భయపడుతున్నట్లు అదే జరిగితే తట్టుకోగలిగే శక్తి మన దేశానికి ఉందా? కనీసం ఆ స్పృహ ప్రజలకు, నాయకులు, అధికార యంత్రాంగానికి ఉందా? దేశ రాజధానిలో భూకంపం వస్తే నష్టం, కష్టం ఏ స్థాయిలో ఉంటాయో ఊహించారా? అంటే ఇప్పటివరకూ అలాంటి తీవ్రమైన అంశంపై ఎవరూ దృష్టి సారించడం లేదనే చెప్పాలి. నేపాల్ అనుభవాల నుంచి మనం వెంటనే పాఠాలు నేర్వకపోతే, ప్రకృతే గుణపాఠం చెబుతుందని హెచ్చరిస్తున్న నిపుణుల మాటల్లోని నిజం ఏమిటో తెలిస్తే సగటు భారతీయుడి మనసు బరువెక్కడం ఖాయం. ఇప్పుడేంటి సమస్య? అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లే ఎప్పుడూ ఉండే సమస్యలు మినహా దివ్యంగా ఉన్న ఈ దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమిటి? భారత్ భద్రతకు వచ్చిన సమస్య ఏమిటి? అనుకుంటే మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నామని అర్థం. మన పొరుగున ఉన్న నేపాల్‌లో తాజా భూకంపాలు, అదే సమయంలో మనదేశంలో సంభవిస్తున్న ప్రకంపనలు భారత్‌కు ఓ హెచ్చరిక అని శాస్తవ్రేత్తలు నెత్తీనోరూ మొత్తుకుని చెబుతున్నా వినేవారు, నమ్మేవారు తక్కువే. మనసుదోచే తెల్లని మంచుతెరలతో, ప్రకృతి సోయగంతో మెరిసిపోయే హిమాలయ పర్వత ప్రాంతం నిజానికి అంత చల్లగా ఏమీ లేదు. ఉన్నట్టుండి ఏదో ఒకరోజు, ఏదో ఒక క్షణంలో భూకంపం, అదీ తీవ్రస్థాయిలో అంటే- ఇప్పుడు నేపాల్‌లో వచ్చినదానికంటే ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం చాలా ఉందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. భూకంపాలను కచ్చితంగా పసికట్టడం, కట్టడి చేయడం మానవుడికి ఇంకా సాధ్యం కాని విషయమే. కానీ గత అనుభవాలు, భూకంపాల చరిత్ర, భూగర్భంలో జరుగుతున్న మార్పులను బట్టి వారు ఈ పరిణామాలను ఊహిస్తున్నారు. ఇప్పుడు నేపాల్‌లో వచ్చిన భూకంపాల గురించి వివిధ దేశాలకు చెందిన సెస్మాలజిస్టులు ముందుగానే హెచ్చరించారు. అయితే ఎప్పుడు, ఏ స్థాయిలో వస్తుందన్నది వారు చెప్పలేకపోతున్నా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని దేశాలకు ఈ ముప్పు పొంచి ఉందని చెప్పారు. నేపాల్‌లో భూకంపాల ఫలితంగా భారీ కట్టడాలు పేకమేడల్లా కూలిపోయి, అంచనాలకు అందని రీతిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. మున్ముందు అంతకంటే ఎక్కువ స్థాయిలో భూకంపాలు వస్తే భారత్ తట్టుకోగలదా? నష్టాన్ని నివారించుకోగలదా? అంటే పెదవి విరుపే తప్ప సరైన సమాధానం లేదు. భూకంపాల గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం, నష్టనివారణపై ప్రచారం, ఏర్పాట్లు లేకపోవడంవల్ల మనం పెద్దనష్టానే్న ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇతర ప్రమాదాల మాదిరిగా భూకంపాలు ఎవరి ప్రాణాలు తీయవు. కాకపోతే భూకంపాల తాకిడికి కొండ చరియలు విరిగిపడటం, నిర్మాణాలు కూలిపోవడం, హిమనీనదాలు జారిపడటం, అగ్నిపర్వతాలు పేలడం వంటి పరిణామాలతో నష్టం సంభవిస్తూంటుంది. భూకంప ప్రభావాన్ని తట్టుకోగలగడం, నష్టాన్ని తగ్గించగలగడం మన చేతుల్లోని పనే. అందుకు మనం సిద్ధంగా ఉన్నామా? అంటే లేదనే చెప్పాలి. భూకంపం అంటే.. ప్రపంచం అంతా కొన్ని భూ ఫలకాల సమాహారం. సముద్రాల కింద ఉన్న కొన్ని ఫలకాలు, భూమి ఉపరితలంగా ఉన్న ఫలకాలు కొన్ని నిరంతరం భూమి అంతర్భాగంలో నెమ్మదిగా కదులుతూంటాయి. ఈ ఫలకాల మధ్య రాపిడి, ఒకదానిని మరొకటి ఢీకొట్టడం, ఒకదానిపైకి ఒకటి దూసుకుపోవడం వల్ల అనంతమైన ఒత్తిడి కలిగి పెను శక్తి ఉద్భవిస్తుంది. ఈ శక్తి పైకి ఎగతన్నుకురావడమే భూకంపం. ఆ ఫలకాల సర్దుబాటు పూర్తయ్యేవరకు ఈ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. పూర్తిస్థాయిలో భూకంపం వస్తే- అంటే శక్తి పైకి వస్తే దాని ప్రభావం వల్ల ఆస్తి,ప్రాణనష్టం సంభవిస్తుంది. ప్రపంచంలో హిందూకుష్ పర్వత శ్రేణుల్లోను (హిమాలయాలు సహా), ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఈ ప్రమాదం ఎక్కువ. భూమి అంతర్భాగంలో ఉన్న ఈ ఫలకాల కదలికల్లో భారత ఉపఖండం ఉన్న ఫలకం మిగతావాటికన్నా వేగంగా కదులుతూ పక్కనే ఉన్న యురేషియా ఫలకంతో తరచూ ఢీకొట్టడం, లేదా రాసుకుపోవడం జరుగుతోంది. కొన్ని వందల ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఇనే్నళ్లుగా ఉద్భవిస్తున్న శక్తి బయటకు రాకుండా భూమిలోనే ఉండిపోయి లోపలి భాగంలో ఒత్తిడి పెరిగిపోతోంది. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఈ రెండు ఫలకాలు ఢీకొట్టడం వల్లే వేలాది మైళ్ల పొడవున హిమాలయ పర్వతాలు ఉద్భవించాయి. ఇప్పుడు కూడా అవి ఉన్న ప్రాంతంలోనే భారత ఉపఖండ ఫలకం, యురేషియా ఫలకం వైపు కదులుతూ ఢీ కొడుతూండటంతో ప్రమాదం పొంచి ఉందని సెస్మాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఏమి జరగొచ్చు..? మిలియన్ సంవత్సరాల క్రితం భారత ఉపఖండం ఇప్పుడున్నట్లు ఉండేది కాదు. ఏడాదికి 1నుంచి 6 సెంటీమీటర్ల చొప్పున భారత ఉపఖండ ఫలకం యురేషియా ఫలకం వైపు(అంటే ఉత్తర దిశగా) దూసుకువెళుతోంది. కొన్నివేల సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామం ఇది. ఈ ఫలకాల మధ్య ఒత్తిడి వల్ల ఇప్పటివరకు హిమాలయ పర్వత ప్రాంతాల్లో చాలాసార్లు భూకంపాలు వచ్చాయి. అయినా భూమిలోపల దాగి ఉండిపోయిన అనంతమైన ఒత్తిడి (శక్తి) బయటకు ఇంకా విస్ఫోటనం కాలేదు. ఎప్పటికైనా అది బయటపడే అవకాశం ఉంది. 1255-1934 సంవత్సరాల మధ్య హిమాలయాల చరిత్ర, హై రిజల్యూషన్ ఉన్న ఛాయాచిత్రాలు, ఇతర సాంకేతిక సమాచారం ఆధారంగా లెక్కగట్టిన శాస్తవ్రేత్తలు భారత్, నేపాల్ దేశాలకు ముప్పు చాలా దగ్గరలో, తీవ్రస్థాయిలో ఉందని హెచ్చరిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో సగటున ప్రతి 30 లేదా 75 సంవత్సరాలకు ఒకసారి పెనుభూకంపాలు వచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్శిటీ 2012లో ప్రచురించిన జర్నల్ నేచర్ జియోసైన్స్‌లో భారత్‌కు పొంచి ఉన్న ముప్పును సూచించింది. నేపాల్‌లో తాజా భూకంపాల గురించి ప్రపంచ దేశాలకు చెందిన 50మంది శాస్తవ్రేత్తలు రెండు నెలల ముందే హెచ్చరించారు. అయితే వారు హిమాలయ పర్వత ప్రాంతాల్లో వస్తుందని చెప్పారే తప్ప ఏ దేశం అన్నది స్పష్టం చేయలేదు. అది అంచనాకు సాధ్యం కాదు. ఇప్పుడు నేపాల్ ప్రాంతంలో భూకంపాలు వచ్చాయి కనుక, దిగువ ఫలకం కదలికవల్ల భూమి పొరల్లో కొంత సర్దుబాటు కలిగింది. ఇక మిగిలిన ప్రాంతాలపై దాని ప్రభావం ఉంటుందన్నమాట. మిగిలిన ప్రాంతమంటే భారత్‌లోని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, దిల్లీతోపాటు మరికొన్ని ప్రాంతాలు. గడచిన 150 సంవత్సరాలలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో వచ్చిన అతిపెద్ద భూకంపాలు, వాటి మధ్య ఉన్న కాల పరిమితిని పరిశీలిస్తే ఇక ఎప్పుడైనా మరో తీవ్ర భూకంపం అంటే రిక్టర్ స్కేలుపై 8 పాయింట్లకన్నా ఎక్కువ స్థాయిలో రావచ్చన్నమాట. హిమాలయ ప్రాంతంలో (్భరత్ వైపు) 1897లో షిల్లాంగ్‌లోను, 1905 హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా, 1934లో నేపాల్-బీహార్ సరిహద్దుల్లోను, 1950లో ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్‌లోను పెనుభూకంపాలు నమోదయ్యాయి. ఆయా సంఘటనల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించాయి. ఆ తరువాత ఇప్పటివరకు అంటే మొన్న నేపాల్‌లో వచ్చిన స్థాయిలో అక్కడ భూకంపాలు రాలేదు. అదే ఇప్పటి భయానికి కారణం. భూమిలోపల దాగిఉన్న శక్తి బయటకు వచ్చి ఒత్తిడి తగ్గితే తప్ప ప్రమాదం లేనట్టు భావించలేం. ముఖ్యంగా భారత ఉపఖండ ఫలకం, యురేషియా ఫలకాల రాపిడికి గురవుతున్న 240 కిలోమీటర్ల పొడవున ఉన్న ప్రాంతాల్లో భూకంపాల ముప్పు ఉందన్నమాట. ఆ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో మన దేశానికి చెందిన చమోలి, ఉత్తరకాశి, మున్సియారి, ఉత్తరాఖండ్, జోషిమఠ్ వంటివి ఉన్నాయి. అంటే తొలి ప్రమాదం ఆ ప్రాంతాలకేనన్నమాట. సన్నద్ధత ముఖ్యం..కానీ… ప్రపంచంలో భూకంపాల ముప్పు ఎక్కువగా ప్రాంతాల్లో రెండవది భారత ఉపఖండం. మనదేశంలో 54 శాతం ప్రాంతంలో భూకంపాలు రావొచ్చు. అయినా ఆ ప్రమాదం వస్తే తట్టుకోగలిగే సామర్థ్యం మన వద్ద ఇంకా పూర్తిగా లేదు. ఎదుర్కొనే శక్తి ఉన్నా ఆసక్తి లేకపోవడమే పెద్దసమస్య. భూకంపాల పుట్టగా చెప్పుకునే కాలిఫోర్నియాలో కూడా ఇదే సమస్య. చిన్నదేశమైనా పట్టుదల, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల్లో అవగాహనతో జపాన్ భూకంపాలను తట్టుకోగలిగేలా, నష్టాన్ని కనిష్ఠం చేసేలా అడుగులువేసి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. మొన్నటికి మొన్న నేపాల్‌లో వచ్చిన మాదిరి లేదా అంతకంటే పెద్దస్థాయిలో భూకంపం వస్తే దిల్లీ రూపురేఖలు ఏ మాత్రం మిగలవని నిపుణులు చెబుతున్నారు. పద్ధతీపాడు లేకుండా నిర్మించిన అసంఖ్యాక భవనాలు, నిర్మాణ శైలి, ఒకదానిని ఒకటి ఆనుకుని కట్టడం, యుమునా తీరంపై నిర్మాణాలు పెరిగి, జనాభా పెరిగి ఒత్తిడి ఎక్కువ కావడంతో నష్టాన్ని ఊహించడానికే భయం వేస్తోందని అంటున్నారు. మొన్న వచ్చిన చిన్నపాటి భూప్రకంపనలకే దిల్లీ సచివాలయం ఊగిసలాడింది. ఇక భారీ ప్రకంపనలు వస్తే అది నిలబడుతుందంటే నమ్మేదెవరు? రిక్టర్ స్కేలుపై 8 కన్నా ఎక్కువ ప్రభావంతో భూకంపం వస్తే చారిత్రాత్మక కుతుబ్‌మినార్ తట్టుకోవడం కష్టమేనని వారి వాదన. అంటే హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లోని కొండలు, లోయల్లో ప్రకృతిప్రకోపాన్ని పెంచేలా నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు, అపార్టుమెంట్లు, హోటళ్లు పెను భూకంపానికి పేకమేడల్లా కూలిపోతాయని, పెనునష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే గంగానదీ పరీవాహక ప్రాంతంలో పెరిగిన నిర్మాణాలు, అధిక జనాభా ఫలితంగా భూకంపాలు వస్తే అపారనష్టం అనివార్యం కావొచ్చు. ఆమధ్య గుజరాత్‌లోని భుజ్ భూకంపంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో మేల్కొన్న కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. నైనిటాల్‌లో ‘అడ్వాన్స్‌డ్ స్టడీ ఆన్ జియాలజీ’, గాంధీనగర్‌లోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెస్మాలాజికల్ రీసెర్చ్’ సంస్థలను ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తు నివారణ సంస్థను ఏర్పాటు చేసింది. ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనే సంపూర్ణ, సాధికార సంస్థ ఇంకా రూపుదిద్దుకోవలసి ఉంది. జపాన్ ఏం చేస్తోంది. ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట భూప్రకంపనలు వస్తూనే ఉంటాయి. రోజుకు కనీసం 57 సార్లు భూమి కంపిస్తుంది. కాకపోతే రిక్టర్ స్కేలుపై 3కన్నా ఎక్కువ స్థాయిలో ఉండేవే నమోదవుతాయి. మిగతావి ప్రమాదకరమైనవిగా గుర్తించరు. 4 కన్నా ఎక్కువ స్థాయిలో వస్తే కొందిరికి ప్రకంపనల ప్రభావం అనుభవంలోకి వస్తుంది. భూకంపాలతో తరచూ నష్టపోయిన జపాన్ ప్రకృతిని జయించే దిశగా అడుగులు వేసింది. 2004లో వచ్చిన తీవ్ర భూకంపంతో కకావికలమైన జపాన్ అప్పటికే భూకంపాలను తట్టుకునే సాంకేతిక ప్రగతిని సాధించి అన్ని విధాలా తట్టుకోగలిగింది. అక్కడ ప్రతి వీధిలో, రైల్వేలైన్ పైన భూకంపాలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేశారు. కనీసం కొన్ని క్షణాలముందు లేదా ప్రకంపనలు వచ్చిన వెంటనే హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ ఉంది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు భూకంపం వస్తే సురక్షితంగా ఆ రైళ్లు ఆగేలా ఏర్పాట్లు చేశారు. అప్పటికప్పుడు సురక్షిత మార్గాలు చూపిస్తూ ఎమర్జెన్సీ తలుపులు తెరుచుకునే ఏర్పాట్లు ఉన్నాయి. భూకంపం వచ్చిన వెంటనే టీవీల్లో మిగతా ఛానళ్ల ప్రసారాలు ఆగి, కేవలం జాగ్రత్త చర్యలు చెప్పే వార్తలే ప్రసారమయ్యే ఏర్పాట్లు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఏ భవనమైనా, ఆకాశహర్య్మాలైనా భూకంపాలను తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానంతో కట్టాల్సిందే. భూమిలోపల ఉండే పునాదులు, ఉపరితలం పైన ఉండే నిర్మాణానికి మధ్య ఎక్కడో ఒకచోట ‘షాక్ అబ్జర్వర్’లు, డక్టెల్‌లాంటివి నిర్మిస్తారు. వాటివల్ల భూప్రకంపనలు వచ్చినపుడు కట్టడం అంతా ఊగిపోకుండా ఆ డక్టెల్ లేదా అలాంటి మరో ఏర్పాటు ‘మేనేజ్’ చేస్తుందన్నమాట. మంచినీటి పైపులైన్లు భూకంపాలకు పగిలిపోకుండా కొత్త టెక్నాలజీని సైతం జపాన్ అభివృద్ధి చేసింది. ఇప్పుడు కాలిఫోర్నియా, లాస్‌ఏంజిల్స్‌లోనూ ఈ టెక్నాలజీతో కొత్తగా పైప్‌లైన్లు వేయాలని ప్రయత్నిస్తోంది అమెరికా. కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు భూకంపాలు వస్తే అవి తలకిందులైనప్పుడు అందులో ఉన్నవారికి ప్రమాదం జరగకుండా ఎయిర్‌బ్యాగ్‌ల మాదిరిగా ఉండే సంచులను అమరుస్తారు. వాటిలో ఒకరకమైన లిక్విడ్ ఉంటుంది. దానివల్ల వారికి దెబ్బలు తగలకుండా ఉంటుంది. ఇక స్కూళ్లలో పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భూకంపాలు వచ్చినపుడు ఏం చేయాలో చిన్నప్పటినుంచి, స్కూళ్ల ప్రేయర్ టైమ్‌లోనే నేర్పిస్తారు. అంటే ఏరోజైనా, ఏ క్షణమైనా భూకంపంవస్తే ఎదుర్కొనేలా, క్షేమంగా బయటపడేలా చిన్నప్పటి నుంచే వారికి అవగాహన కల్పిస్తారు. మొన్నటికిమొన్న అక్కడ భూకంపం వచ్చినపుడు విద్యార్థులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదం తగ్గిన తరువాత ఎటువంటి జంకూగొంకూ లేకుండా బయటకు రావడాన్ని సీసీటీవీ ఫుటేజిల్లో చూసి ప్రపంచం అవాక్కయింది. ప్రకంపనలు వచ్చినపుడు ఆరుబయటకు రావడం, భవనాల మధ్య ఉండకుండా గోడల వారకు చేరడం, బల్లలకిందకు చేరడం, కంగారుపడటం, భయపడటం, ఏడ్వటం వంటివి చేయకుండా బయటపడటం, ఎవరో ఒకరు వచ్చేవరకు ఎదురుచూడటం, మానసికంగా బలంగా ఉండటం నేర్పిస్తారు. రోజువారీ కార్యక్రమాల్లో భూకంపాల గురించి, జాగ్రత్తల గురించి చెప్పడం అక్కడ పరిపాటి. జపాన్‌తో పోలిస్తే మనదేశంలో భూకంపాలు తక్కువే అయినా, వస్తేగిస్తే తట్టుకునే శక్తి, సాంకేతిక సన్నద్ధత, ప్రజల్లో అవగాహన ఇంకా ముమ్మరం అవ్వాల్సి ఉంది. రిక్టర్ స్కేల్ – ఎం.ఎం.ఎస్ భూకంపాలను కొలిచే సాధనం ‘రిక్టర్ స్కేల్’. 1930లో దీనిని అభివృద్ధి చేశారు. అంతకుముందు భూకంపాల తీవ్రత లెక్కగట్టే సాధానాలు (వుడ్-అండర్సన్ టోర్సన్ సెస్మోగ్రాఫ్) ఉన్నా దీనికి కచ్చితత్వం ఎక్కువ కావడంతో అదే ప్రామాణికంగా మారింది. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సెస్మాలజిస్ట్ ఛార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్, బెనో గిటెన్‌బర్గ్‌లు రూపొందించిన స్కేల్‌కు ‘రిక్టర్’ పేరు పెట్టారు. ఇది 1930 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇది భూకంప తీవ్రతను చెబుతుంది. ఇది ఒకటికన్నా తక్కువ భూప్రకంపనలను నమోదు చేయదు. ఆధునికయుగంలో అంటే 1970 తరువాత రిక్టర్ స్కేలును ఆధునీకరించి, ఎంఎంఎస్ (మూమెంట్ మాగ్నిట్యూట్ స్కేల్)ను వినియోగిస్తున్నారు. రిక్టర్ స్కేల్ కన్నా దీన్ని మేలైన సాధనంగా చెబుతారు. దీనినే ‘మెరికల్లి ఇంటెన్సిటీ స్కేల్’అని, ‘మెద్వదెవ్-స్పాన్‌హడర్-కార్మిక్ స్కేల్’ అని కూడా అంటారు. రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రతను చెబితే, ఎంఎంఎస్ భూకంప తీవ్రతతోపాటు, అది చూపే ప్రభావాన్నికూడా చెబుతుంది. అంటే నష్ట తీవ్రతను చెబుతుందన్నమాట. నిజానికి చాలా దేశాలు ఇప్పటికీ రిక్టర్ స్కేలునే వినియోగిస్తున్నప్పటికీ అమెరికా జియలాజికల్ విభాగం మాత్రం ఎంఎంఎస్‌నే వినియోగిస్తోంది. సెస్మిక్ జోన్స్ నాలుగు మనదేశంలో భూకంపాల ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో రావచ్చో ఊహించి 2,3,4, 5 సెస్మిక్ జోన్లు ప్రకటించారు. జోన్ 5: ఇక్కడ అతి తీవ్ర భూకంపాలు రావొచ్చన్నమాట. అంటే అత్యధిక ‘రిస్క్’ ఉన్న ప్రాంతం అన్నమాట. హిమాలయ పర్వత సానువులను ఆనుకుని ఉన్న ప్రాంతాలను ఈ జోన్‌లో చేర్చారు. కాశ్మీర్, మధ్య, పశ్చిమ హిమాలయాలు, ఉత్తర బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, రాణ్ ఆఫ్ కచ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ జోన్‌లోకి వస్తాయి. జోన్ 4: ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాలున్న జోన్ ఇది. ముఖ్యంగా గంగ, యమున నదులు ప్రవహించే ప్రాంతాలన్నమాట. దిల్లీ, జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు, నేపాల్-బీహార్ సరిహద్దులు, మహారాష్టల్రోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. జోన్ 3: మోడరేట్ డామేజ్ రిస్క్ ఉన్న ప్రాంతాలు. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాలు, కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. జోన్ 2: సాధారణ నష్టం కలిగే ప్రాంతాలు. పై మూడు జోన్లు కాకుండా మిగిలిన ప్రాంతాలన్నమాట. నిజానికి గతంలో ఆరుజోన్లు ఉండేవి. తాజాగా కేంద్రప్రభుత్వం దీనిని నాలుగు జోన్లుగా మార్చింది. భాగ్యనగరం సురక్షితమే- కానీ.. భూ ప్రకంపనలకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ రెండో జోన్‌లో ఉంది. భూకంపం వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని కచ్చితంగా చెప్పలేని జోన్‌లో ఉంది. ప్రకంపనల వల్ల ఏ ముప్పు ఉండదని చెప్పుకునే ‘ఒకటో నెంబర్ జోన్’ను తొలగించారు. తెలంగాణ రాజధాని రెండో జోన్‌లో ఉందంటే విపత్కర పరిస్థితి పొంచి ఉందని అర్థం. అలాగని భారీ నష్టం జరుగుతుందన్న ఆందోళన అవసరం లేదు. దిల్లీ, జమ్ముకాశ్మీర్ వంటి ప్రాంతాలతో పోల్చితే భూ ప్రకంపనలకు సంబంధించి హైదరాబాద్ సురక్షిత ప్రాంతమే. భూమిలోపల మొత్తం పనె్నండు రకాల ఫలకాలుంటాయి. భూమిలోపల వేడి తీవ్రత కారణంగా కొన్ని ఫలకాలు కరిగి ద్రవ రూపంగా మారినపుడు, వాటిపై

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.