భానుడి భగభగభ ‘’గప్పా(గొప్ప)ల్
ఎండ వేడి భరిస్తున్నవాళ్ళ గుండె వేడి చల్లార్చటానికి ఈ చిరు హాసపు జల్లులు –
1-ఫోన్ సంభాషణ
వదినా ఎలాఉన్నారు ?
‘’మాడి మసి అవుతున్నాం వదినా
మీ మామగారు బాగా ముసలివారు కదా ఏయే జాగ్రత్తలు తీసుకొంటున్నారు ?
మా మామగారిది మరీ చోద్యం వదినా –ఎండలో తిరగద్దని రేడియో టి వి వాళ్ళు వాయించి పారేస్తున్నారుగా .అది విని ఒకే ఇదై పోతున్నారు .మా అపార్ట్ మెంట్ లో బాత్ రూమ్ ఒకటే చల్లగా ఉంటుంది .ఆయన అక్కడే తిష్ట వేశారు .నేలమీద జ౦పఖానా పరచుకొని ,ఒక దిండు పెట్టుకొని అక్కడే పడక సీను .టిఫిను భోజనం అన్నీ అక్కడికి పంపిస్తేనే తింటున్నారు .అది దాటి బయటికి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంత కంగారు పడి మమ్మల్ని పడేస్తున్నారు .వేరే బాత్ రూమ్ ఉన్దికాబట్టి సరి పోయింది లేకపోతే మా గతి కుక్కలగతే వదినా.
అయినా మీ ముసలాయనకి అంత చాదస్తం ఏమిటి ?బతికి ఇంకేం ఉద్ధరిస్తాడుకనుక
ఆ మాట ఆనకు వదినా మాకు పెద్ద దిక్కు ఆయనే ఆయన ఇష్ట ప్రకారమే మీ అన్నయ్య నడుచుకొంటారు. తండ్రిమీద ఈగ వాలనీయరు .
ఈగంటే జ్ఞాపకం వచ్చింది –బాత్ రూమ్ లో ఈగా దోమా ఆయన్ని ఏమీ కుట్టటం లేదా ?
ఫినాయిలు ,డెట్టాల్ సీసాలకు సీసాలు కుమ్మరిస్తున్నా౦.అవి చచ్చి నా బతకలేవు .సరే వదినా మళ్ళీ మాట్లాడుకొందాం మామగారికి బాత్ రూమ్ లో అన్నం పెట్టె టైం అయింది .
2-అమ్మా ! అమ్మమ్మ ఈ ఎండల్లో ఎలా ఉందే అసలే గుంటూరు ఎండలు మిర్చి ఘాటుకంటే ఘోరం .ఒక కూతురు ఫోన్ లో తల్లితో
నిజమేనే తల్లీ .ఎండలు కావివి బండలు పగల గొట్టే గునపాలు గా ఉన్నాయి సూర్య కిరణాలు .మీ అమ్మమ్మ కేమీ భయం లేదే .జాగ్రత్తలు తీసుకొంటున్నాం .వంటింట్లో పడక కుర్చీలో కోర్చోబెట్టి పంపుకు ట్యూబు తగిలించి అరగంటకోసారి ఆవిడను తడుపుతున్నాం .హాయిగా చల్లగా ఉందని తెగ మురిసి పోతోంది మా అమ్మ .
అమ్మా ! అలా చేస్తే న్యుమోనియా వచ్చి టపాకడుతున్దేమోనే !
తల్లీ ! ఆ మాట ముందే చెప్పాం. మొండిఘటం వింటేగా .వింటే మా నాన్న ముందే ఎందుకు పోయే వాడులే.వాళ్ళ అమ్మకు అలా చేశారట. ఆవిడ నిక్షేపంగా ఉందిట. వేసవిలో తనకూ అలానే చేయాలని పురమాయింపు .తప్పుతుందా తడపక చస్తామా .గంటో అరగంతో వచ్చే కుళాయి నీళ్ళు ఆవిడను తడపతానికే సరిపోతున్నాయి .
మరి మీరందరూ ఏం చేస్తున్నారే -? కూతురి ఫోన్ ప్రశ్న
అమ్మా ! గుంటూరు కదా తాడి లోతు బావి మనకు ఉందిగా .దానిలో అడుగున ఎక్కడో నీళ్ళు ఏడిశాయి .వెయ్యి రూపాయలిచ్చి నీటికి గజం పైన పక్కాగా కర్రలతో మంచే కట్టించాం . గిలకకి గట్టి మోకు కట్టి ఒక్కొక్కరం నూతి పైనుంచి లోపలి మంచే పైకి చేరుకొంటున్నాం .కింద జలం ఉందిగా మహా చల్లగా ఉందిలే .హిమాలయాలలో ఉన్న అనుభూతి కలుగుతోంది తల్లీ . ఇక్కడే చిన్న టి .వి .లాప్ టాప్ ఏర్పాటు చేసుకొన్నారు నాన్నా అన్నయ్యా .ఇక కాలక్షేపానికి కొదవ లేదు. బయట ఎండలు మమ్మల్నేమీ చేయలేవు .’’ఎండలు జయించిన వీరులం ‘’మేము. అమ్మమ్మకోసం మాత్రం ఎవరొ ఒకరం పైకెళ్ళి చూసి తడిపి వస్తాం .ఇక ఉంటానమ్మా అమ్మను తడపాలి పైకి వెడుతున్నా .
అమ్మా ! ఇప్పటిదాకానూతిమీద మంచే మీంచే మాట్లాడావా ?
అవును చిన్నీ
3-పక్కింటి వాళ్ళ సంభాషణ –
అక్కా !ఇవాళ వంట ఏం చేశావ్ ?
చెల్లీ ! ఏడింటికే బియ్యం ఎసట్లో పోసి ఎండలో పెట్టాను .పదినిమిషాల్లో ఉడికి పోయింది లోపలి తెచ్చిపెట్టా .నువ్వేం చేశావ్ ?
చికెన్ ను అట్లకాడకు గుచ్చి ఎండలో పెడితే అయిదునిమషాలలోఉడికి ‘’చికేన్’’ సన్ ‘’దూరీ ‘’ తయారైపోయింది పిల్లలు తెగ ముచ్చట పడి పీక్కు తిన్నారు .టిఫిన్ ఏం చేశావ్ ?
వాకిట్లో నాపరాయి మీద అట్లు వేశాను .పది అట్లు పది నిమిషాల లోపలే ఉడికి మహా రుచిగా ఉన్నాయి
నీ లౌక్యం అందరికీ రాదక్కా కోళ్ళు గుడ్లు పెడుతున్నాయా?
అవిపెతట్టటమేకాదు ఎండలో అయిదు నిమిషాలు ఉంచితే పిల్లలు ఎండకు భయపడి గుడ్డు చీల్చుకొని బిలబిల మంటూ బయటికి వస్తున్నాయి .కోడి ,పొదగటం అనేది ఇక లేనే లేదు .బట్టలు ఎలా ఉతుకు తున్నావ్ ?
వాషింగ్ మెషీన్ బయటే పెట్టాం .నీళ్ళు పోసి సబ్బు పొడి వేస్తె పదే పదినిమిషాలలో పూర్వం చాకలి వాళ్ళు బానల్లో బట్టలు ఉడకేసినట్లు ఉడికి భలే తెల్లగా ఉంటున్నాయి .కరెంటు ఆదా కూడా .
4-ఏరా యెట్లా ఉన్నారు భాగ్యనగర్ లో ?కోస్తా ఆంధ్ర అన్న తెలంగాణలో ఉన్న తమ్ముడిని పరామర్శించాడు ఫోన్ లో
ఎందుకొచ్చిన రాష్ట్రం రాబాబూ అని ఆలో లక్ష్మణా అని ఏడుస్తున్నాం అన్నయ్యా .కరెంటు లేదు గులాబీ ఆయన మాటల తూటాలు తప్ప .నీళ్ళు లేనే లేవు ఆయన వాక్ ప్రవాహం తప్ప .వీధులు ఊడుస్తున్న పోజులేకాని ఊడ్చిన పారిశుధ్య పని వారు లేనేలేరు .వేడికి ఎండకూ మాడిపోతున్నాం పెనం లోంచి పొయ్యిలో పడినట్లు ఉన్దిమా పని .ఉక్క బిక్కు బిక్కు మంటూ జీవితం .పగవాడిక్కూడా వద్దురా ఈ నగర జీవితం .ఏడాదిలో పదేళ్ళు వెనక్కి పోయామేమో ననిపిస్తోంది .శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలూను .అనుకోకుండా వర్షం వస్తే ముల్లోటు నీళ్ళల్లో నాని పోతున్నాం .మీరెలా ఉన్నారు అన్నయ్యా?
ఒరే తమ్ముడూ ! మంచికో చెడుకో విడిపోయాం కాని మా చంద్రబాబు ను జనం తలచుకోని క్షణం లేదంటే నమ్ము .ఒక్క క్షణం కూడా కరెంటు కోత లేదు . ఎండలు మండుతున్నా హాయిగా ఇళ్ళల్లో ఫాన్లు ఏ. సి.లు కూలర్లు పెట్టుకొని కంటి నిండా నిద్ర పోతున్నాం .వేసవిలో అందులోనూ ఇంత భగభగల భాను ప్రతాపం లోనూ మాకు అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు. మహానుభావుడు నిరంతరం విద్యుత్తూ ఇస్తూ మమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడు చంద్రన్న చంద్రునిలా చల్లగా .ఆయన ఋణం ఏమిచ్చినా తీరదురా .మాకు మళ్ళీ మళ్ళీ బాబే ముఖ్యమంత్రిగా ఉండాలి . సరేరా మీ ఏడుపు మీరేడవండి కావాలని తెచ్చుకోన్నారుగా నెత్తిమీడికి గులాబిముళ్ళ కుంపటి.అనుభ వించండి మరి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-15- ఉయ్యూరు
ఈ సంవస్తరం ఎండలు నిజం గా దారునగా ఉన్నాయి….ఆ తాపం లో మీరు పంపిన హాస్య జల్లులు మాకు పంపి ఎండ తాపాన్ని మరపింప చేసారు….కదా వస్తువు బాగుంది…