‘’రావణ దాన్యమాలి’’ –రేడియో నాటకం
ఈ రోజు 24-5-15 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆకాశ వాణి కడప కేంద్రం నుంచి ప్రసారమైన ‘’రావణ దాన్యమాలి ‘’గంట నాటకాన్ని విన్నాను .అద్భుతం అనిపించింది .చిన్నవిషయాన్ని తీసుకొని రావణుని చుట్టూకద అల్లి ,కాటూరి వెంకటేశ్వర రావు గారి ‘’పౌలస్త్య హృదయం ‘’అందులో చొప్పించి ,దాన్యమాలి స్వయం వ్యక్తిత్వానికి ,మాతృత్వ మహిమకు ప్రాధాన్యత నిచ్చి అన్నిపాత్రలకు చక్కని సరస సందర్భోచిత సంభాషణలు కూర్చిన రచయిత పి .లక్షీ కులశేఖర్ అభినందనీయులు .పాత్రధారులందరూ చాలా గొప్పగా తమ పాత్రలను పోషించి న్యాయం చేకూర్చారు .దాన్యమాలి పాత్రధారిణి రావణ పాత్ర దారులిద్దరూ హృదయాలను దోచేసుకొన్నారు .ఎక్కడా వ్యర్ధపదం అనేది లేదు అనవసరపద్య ప్రయోగమూ లేదు .సూటిగా హృదయానికి తాకేట్లుగా ప్రతి పదమూ ఉంది. అందరూ మహాను భావులే అనిపించారు . కద ను కొద్దిగా వివరిస్తా –రామునితో యుద్ధ సన్నాహం లో ఉన్న రావణుడు కొలువు తీరి ఉంటాడు .అప్పటికే ఇంద్రజిత్ తోసహా మహామహులైన వాళ్ళంతా యుద్ధం లో చనిపోయారు .రావణుని రాక్షసత్వాన్ని విభీషణాదులు గుర్తు చేస్తారు .అందులో దాన్యమాలికి జరిగిన అన్యాయం జ్ఞప్తికి తెస్తారు .అక్కడి నుండికద ఫ్లాష్ బాక్ లోకి వెడుతుంది .రావణ సోదరి శూర్పణఖ గంధర్వుడైన విద్యుజ్జిహ్వుని ప్రేమించి పెళ్లి చేసుకొంటుంది. అది రావణుడికి ఇష్టం లేదు .రావణుడు ప్రశాంతంగా ఉన్న గాంధర్వ లోకంపైకి దండెత్తాలని చూస్తాడు .శూర్పణఖ వచ్చి వద్దని వారిస్తుంది ఆమెభర్త రాయబారిగా వస్తే చీత్కారిస్తాడు లంకాధిపతి .చంపాలనీ ప్రయత్నిస్తాడు కాని తమ్ముని హిత బోధవలన ఆపని చేయడు.పెద్దల మాట ప్రకారం అక్కడ ఎవరూ ఏ గంధర్వ స్త్రీని బలత్కారించారాదని వారికిస్టమైతేనే ప్రేమించాలని కట్టడి చేస్తాడు .దాన్యమాలి విజ్జుజ్జిహ్వుని సోదరి .ఆమె పై మరులుగొంటాడు రావణుడు .తాను ప్రేమించాడుకనుక ఆమె కూడా ప్రేమించాల్సి౦దేనంటాడు .తిరస్కరిస్తుంది ఆమె .ఆడదానికీ హృదయం ఉంటుందని దాన్ని అర్ధం చేసుకోవాలని చెబుతుంది .బలాత్కారం చేయలేక ఆమెను బంధించి లంకలో ఉంచాడు రావణాబ్రహ్మ. ఆమె కూడా మనసు మార్చుకొని దశ కంఠుని ఇల్లాలు అవటానికి ఇష్టపడుతుంది. మాతృత్వం కావాలని కోరుకొంటే తిరస్కరిస్తాడు .చివరికి రస యోగం వలన ఆమె కు తన వీర్యం తో మహా బలుడు అనే కొడుకు పుట్టేట్లు ఏర్పాటు చేస్తాడు .రామ రావణ యుద్ధం లో వాడూ చనిపోతాడు .అప్పుడు పశ్చాత్తాపం చెంది రావణుడు దాన్యమాలిని చేరి గాంధర్వ విధిలో వివాహమాడి ఆమె కోరిక తీర్చి ఆమెను’’ రావణ ధాన్య మాలిని ‘’చేస్తాడు .ఆమె సుమంగళిగా చనిపోతుంది .యుద్ధం లో రామబాణానికి రావణుడు నిహతుడవుతాడు .బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూ విశిష్ట స్థానం లభించింది .ఒక జానపద గీతాన్ని బాక్ గ్రౌండ్ లో వినిపించటం భేషుగగా ఉంది ’’టైట్ నిట్’’ అంటే ఏమిటో రుజువు చేసిన నాటకం ఇది .ఈ నాటకానికి దర్శకత్వం వహించింది మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు అని చెప్పగానే ఆగలేక నాటకం అయిపోగానే వారికిసాయంత్రం 4 గంటలకు ఫోన్ చేశాను .
ఆదిత్య ప్రసాద్ గారు నా ఫోన్ నంబర్ గుర్తుపట్టి సాధారణం గా ఆయన భాషలో ‘’మాస్టారూ !ఎలాఉన్నారు ?’’అని అడిగారు .నేను ఇప్పుడే నాటకం విన్నానని మహాద్భుతంగా నాటకం వచ్చిందని అందులో వారి దర్శకత్వ ప్రతిభ ప్రతి అంగుళం లోను కనిపించిందని ,ఎక్కడా అపశబ్ద ఉచ్చారణ లేకుండా గొప్పగా ఉందని అభినందించాను .అప్పుడు ఆయన ఆ నాటకాన్ని తాను కడప కేంద్రం లో పని చేసినప్పుడు దర్శకత్వం వహించానని అది 1989వ సంవత్సరం అని అన్నారు .అంటే ఆ నాటకం సుమారు 25 సంవత్సరాల కిందటిది అన్నమాట. అయినా నూతనత్వం తో తొణికిస లాడిం దని చెప్పాను .అప్పుడాయన అ ‘’అవును మాస్టారూ !అప్పుడు అందరం అంత తపన పడి అంకిత భావం తో చేసేవాళ్ళం అందుకే అంత పెర్ఫెక్షన్ కనిపిస్తుంది .మళ్ళీ అలాచేయగలమా అనిపిస్తూ ఉంటు౦ది ‘’అన్నారు .
నేను పంపిన ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ‘’పుస్తకాలు రెండూ అందాయా అని అడిగాను .అందాయని చెప్పి ఉత్తరం రాద్దామని అనుకొంటూనే కాలయాపన చేశానని అంటూ ‘’మాస్టారూ ! మిమ్మల్ని మీ రచనలని చూస్తూ ఉంటె నాకు విషయపు లోతులు తవ్వి తీసే బిరుదు రాజు రామరాజు గారే ఎప్పుడూ గుర్తుకొస్తారు .ఇది పొగడ్తకాదు నిజం .మీది అంత గొప్ప రిసెర్చ్ వర్క్ .అందరికి స్పూర్తి మీరు ‘’అన్నారు ‘నేను ‘’సార్ !రామరాజుగారికి నాకూ హస్తిమశకాంతరం ఉంది .వారెక్కడ ?వారి ప్రతిభ ఎక్కడ నేనెక్కడ?’’అన్నాను .
నిన్న గుంటూర్ నుంచి దాసరి చంద్ర శేఖర్ గారు ఫోన్ చేశారు .మేమిద్దరం ఫిబ్రవరి తెలుగు సభల్లో కలుసుకోన్నామని గుర్తు చేశారు .దర్శనీయ దైవ క్షేత్రాలను శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి వద్ద చూశానని ,తనతో బాటు గుంటూరు లో ‘’భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ‘’నిర్వహిస్తున్న శ్రీ గొల్లపల్లి సత్యనారాయణ గారు కూడా రామడుగు వారింట్లో ఈ పుస్తకాన్ని చూసి తనతో ‘’రాసినాయన సామాన్యుడు కాదు .ఏంతో పరిశీలనతో, తాదాత్మ్యం తో రాశారు ‘’అన్నారని, రామడుగు వారిని ఆ పుస్తకం ఇమ్మంటే ఇవ్వనన్నారని అది అమూల్య నిదిగా ఆయన భావించారని చదివి ఇస్తానన్నా ఒప్పుకోలేదని చంద్ర శేఖర్ ఫోన్ లో చెప్పారు .అంతేకాక చంద్ర శేఖర్ ఆప్యాయం గా ‘’ప్రసాద్ గారూ ! మిమ్మల్ని చూస్తె ,మిమ్మల్ని గుర్తు చేసుకొంటే శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు పులకించి పోతారండీ .మీ అనుబంధం ఏమిటో మాకు అర్ధం కావటం లేదు .ఆదిత్య ప్రసాద్ గారి మనసంతా మీరు నిండి పోయారండీ ‘’అన్నారు .ఈ మాటను ఇవాళ ఆదిత్య ప్రసాద్ గారికి చెప్పాను ఆయన నవ్వి ‘’మీరంటే నాకు అంతటి అభిమానం మాస్టారూ ! మీలాంటి ఆత్మీయులు నాకు చాలా తక్కువ మందే ఉన్నారు ‘’అన్నారు .ధన్యోస్మి అనుకొన్నాను .
చంద్ర శేఖర్ గారు నిన్న ఫోన్ చేసి మాట్లాడిన దానిలో ‘’గొల్లపల్లి సత్యనారాయణ గారూ మీలాగా నిత్య యవ్వనులు .ఎప్పుడూ ఏదోఒకటి రాస్తూ, సభలు చేస్తూ ఉంటారు .ఈ లక్షణాలున్నవారు’’ దత్తాత్రేయ అవతార ప్రభావం ‘’ఉన్నవారు .అని నేను భావిస్తాను ‘’అన్నారు .వెంటనే నేను ‘’మరీ ములగ కొమ్మ ఎక్కించకండి .సత్యనారాయణ గారు ఎవరో నాకు తెలియదు .ఆయనకు మీరన్నట్లు దత్తాత్రేయ లక్షణాలు ఉండే ఉంటాయి .నాకు అవి ఏమాత్రమూ లేవు .నేనొక సామాన్య సాహితీ సేవకుడినిమాత్రమే ‘’అన్నాను .చంద్ర శేఖర్ నవ్వి నాతొ ఏకీభవించలేదు .తనదీ ,సత్యనారాయనగారిదీ అడ్రస్ లు ఫోన్ నంబర్లూ ఇచ్చారు .క్షేత్రాలు పుస్తకాలూ ఇద్దరికీ పంపమని కోరారు . సత్యనారాయణ గారితో ఫోన్ లో మాట్లాడమని చెప్పారు. మాట్లాడితే ఆయన సంతోషిస్తారనీ అన్నారు . ఒక సారి చేస్తే ఆయన పలక లేదు .రెండో సారి చేస్తే నిద్ర పోతున్నారని చెప్పారు .నిన్ననే వారిద్దరికీ 1-మహిళామాణిక్యాలు ,దర్శనీయ దైవ క్షేత్రాలు ,దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ,గీర్వాణకవుల కవితా గీర్వాణం –నాలుగు పుస్తకాలు బుక్ పోస్ట్ లో పంపాను .సహృదయ స్పందన ఇలా ఉంటుందికదా అని అనిపించి రేడియో నాటకం తో మొదలు పెట్టి ఇంత దూరం లాక్కొచ్చా .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 ఉయ్యూరు