విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5

విమర్శన సాహిత్యం

కందుకూరి వారు ‘’మంత్రి భాస్కరుని ‘’పై రాశారు .దీన్ని ఖండిస్తూ బ్రాహ్మయ్య శాస్త్రిగారు ‘’భాస్కరోదంతం ‘’అనే గ్రంధాన్ని రాసి  ప్రచురించారు .దీన్ని చూసిన వీరేశ లింగం గారు తాను  రాసిన ‘’కవుల చరిత్ర ‘’లో దొర్లిన తప్పులను దిద్దుకొన్నారు .కాని శాస్త్రిగారికి కృతజ్ఞత చెప్పటానికి ఆభిజాత్యం అడ్డం వచ్చి ఉంటుంది .1911లో ‘’నన్నయ భట్టారక చరిత్రము ‘’రాసి ప్రచురించారు ఇందులో శాస్త్రిగారు చెప్పిన విషయాలే నేటికీ పరమ ప్రామాణీయ కంగా ఉన్నాయని అంటారు. ‘’మను చరిత్ర’’ ,’’వసు చరిత్ర’’ల పై అనేక విశేషాలతో వ్యాసాలూ రాశారు మను చరిత్రకంటే వసు చరిత్ర ప్రశాస్తమైనదని శాస్త్రి గారి అభిప్రాయం .మరో గొప్పరచన ‘’కురుపాండవ దాయభాగ నిర్ణయము ‘’ఇందులో కౌరవ రాజ్యం ద్రుతరాష్త్రుడిదేకాని పాండురాజుది కాదు అని నిష్కర్ష గా తేల్చారు శాస్త్రిగారు .ఈ వాదం లో శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు మొదలైన ఉద్దండులు శాస్త్రిగారికి వ్యతిరేక పక్షం గా మొహరించారు .పాండవులు న్యాయస్తులని  కౌరవులు  అన్యాయం చేస్తున్నారని హిందువులలో గొప్ప నమ్మకం ఉంది .ఈ అభిప్రాయాన్ని శాస్త్రి గారు అనేక సభల్లో ఉపన్యాసాలలో నొక్కి చెప్పేవారు .పూర్వపు వారి అభిప్రాయాలన్నీ సరైనవికావు అన్నిటినీ గుడ్డిగా నమ్మరాదు అని శాస్త్రిగారి భావం .’’ఆంద్ర కవితాగురు కవిత్వాది ప్రశంశ ‘’,అప్పకవి ‘-పోతనామాత్యులు ‘’,ఉత్తర రామ చరిత్ర యందలి రస విచారము ‘’మొదలైన సారస్వత విమర్శలను ఎన్నిటినో శాస్త్రి గారు రాశారు .మహామహోపాధ్యాయ బిరుదు పొందిన శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు సంస్కృత భాష ఒకప్పుడు లోక వ్యవహారం లో ఉన్న సామాన్య భాషగా ఉండేదని ఒక వ్యాసం రాశారు .బ్రహ్మయ్య శాస్త్రి గారు అతి నైపుణ్యం తో సంస్కృతం ఎప్పుడూ లోక వ్యవహార భాషగా లేదని ,అదెప్పుడు పండితుల భాషగా మాత్రమె ఉండేదని అందుకే దానికి ‘’గీర్వాణ భాష’’ ,’’విబుధ భాష’’ మొదలైన పేర్లు వచ్చాయని సప్రమాణం గా రుజువు చేశారు .శాస్త్రి గారి లోతైన ఆ పరిశీలనకు అందరూ ముక్కున వేలేసుకొని ఆశ్చర్య పోయారు .

భాషా శాస్త్ర రచనా పాటవం

బ్రహ్మయ్య శాస్త్రిగారు భాషా శాస్త్ర విషయానికి సంబంధించిన రచనలు చాలా చేశారు ‘’కాగడా ‘’అనే చిన్న పుస్తకం లో కాగడా శబ్ద చరిత్రను అంతా సేకరించి వివరించారు .’’అరవము లోని వింత అక్కరము తెలుగునా గలదా ?’’అనే శీర్షిక తో శాస్త్రి గారు రాసిన వ్యాసపరంపర అతి ఉత్కృష్ట మైనవిగా పరిగణిస్తారు .’’దాస శబ్దార్ధ చంద్రిక ‘’మొదలైన వ్యాసాలూ శాస్త్రిగారి భాషా స్వరూప ఆలోచనలకు ప్రమాణాలు .శాస్త్రి గారికి భాషలో నాగరికులం అనుకొనేవారు తెచ్చే వ్యావహారికమార్పులు నచ్చేవికావు . అవి భాషాభివృద్ధికి హానికరాలు అని భావించి దానిని రుజువు చేయటానికి చాలా గ్రంధాలు రాశారు .చాలా చోట్ల మహోపన్యాసాలిచ్చారు .ఆనాటి వ్యావహారిక భాషా వాదులు శాస్త్రి గారి వాదాన్ని కాదన లేక గమనిస్తూ ఉండేవారు శ్రద్ధతో .అప్పుడప్పుడు శాస్త్రిగారు తమవాదపు తీవ్రతను తగ్గించుకొని సవరించుకోవటమూ జరిగింది .

విమర్శక విరించి

ఆంద్ర భాషలో శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు రాసినంత విమర్శనా వాజ్మయం మరొకరు రాయ లేదనటం నిర్వివాదా౦శమే .తెలుగులో విమర్శకు బీజం నాటింది బ్రహ్మయ్య శాస్త్రిగారే అని చాలామంది అభిప్రాయం .కాదన్న వారూకొందరు  ఉన్నారు .దీనిపై వాదం జోలికి పోకుండా విమర్శ ప్రారంభించిన తొలి రచయితలలో శాస్త్రిగారున్నారు అంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు .శాస్త్రిగారి విమర్శ అన్నిటికంటే అగ్రేసరం అని బహుజనాభిప్రాయం. అందుకే శాస్త్రిగారికి ‘’విమర్శకాగ్రేసర ‘’బిరుదు లభించింది .ఇది బ్రహ్మయ్య శాస్త్రి గారికి పర్యాయ పదం అయిపొయింది. దేశం లో .సమగ్ర విమర్శకు ఆద్యులు శాస్త్రిగారు. ప్రతి వాదులు లేవ నెత్తిన నెత్తిన ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దాన్ని రాచి రంపాన బెట్టి నిగ్గు తేల్చటం శాస్త్రి గారి అసమాన ప్రజ్ఞ .ఒకే అంశాన్ని స్థాపించటానికి అనేక ఉదాహరణలు ఇవ్వటం యుక్తిగా వాదించి గెలవటం శాస్త్రి గారి బహు నేర్పు .ప్రతి వాది’’ఓడిపోయాను మహా ప్రభో !నన్ను క్షమించి వదిలేయండి బాబో !’’అని కాళ్ళా వేళ్ళా పడి బతిమాలినా అదేపనిగా వాడిని’’ బాది పారేయటం’’ శాస్త్రిగారి విమర్శలో పెద్ద లోపం అని అంటారు .అనవసరంగా తన విమర్శనా కౌశలాన్ని ప్రదర్శించే వారుకాదు .సానుభూతితోనే ఉండేవారని శాస్త్రి గారి రచనలు చదివిన వారికి తెలుస్తుంది .’’వినాశకర విమర్శకుడు ‘’అని కూడా శాస్త్రిగారికి బిరుదు తగిలించారుకొందరు .ఇది సత్యదూరం .శాస్త్రిగారి విమర్శలో వినాశనం తో బాటు నిర్మాణం కూడా ఉందని ,విమర్శక అంశం యొక్క సత్య స్వరూపాన్ని పాఠకులకు తెలియ జేయటమే పరమావధిగా ఎంచుకొన్నారని ,మత ,సాహిత్య విషయాలలో అంతవరకూ ఎవరూ చెప్పని అనేక కొత్త విషయాలను శాస్త్రిగారు తెలియ జేశారని ,విమర్శించటమే పనిగా ఎన్నడూ ఉండలేడని బహు శాస్త్ర పారంగతులైన నిష్పాక్షిక పండితులు శాస్త్రిగారి నైపుణ్యానికి జోహారు లర్పించారు .ప్రతివాదులను ఒక నెపం గా పెట్టుకొని లోకానికి తెలియని అమూల్య విషయాలను వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలనుండి  వెలికి తీసి అంద జేసిన మహా విద్వాంసులు శాస్త్రిగారు .ఆ అంశాలను ఆంధ్రలోకం కళ్ళకు అద్దుకొని మనసుకు హత్తుకోన్నది .మన మత తత్వం లోని ఉత్క్రుస్టతను తెలుసుకొని ముచ్చటపడింది .అన్య మతాల వాదాలను తిరస్కరించే నేర్పు సామాన్య జనులకు కల్గించారు శాస్త్రిగారు .

సారస్వత శాఖా స్వతంత్ర గ్రంధాలు

సాహిత్య శాఖలన్నిటి లోను బ్రహ్మయ్య శాస్త్రిగారు స్వతంత్ర గ్రంధాలు రాశారు .’’మంగతాయి ‘’,’’సైంధవ వధ ‘’,ఉత్తర సరస్వతీ నారద విలాపము ‘’,’’వీర రాఘవము ‘’,అనే నాటకాలు రాశారు .’’వెదురుపాక జనార్దన శతకం ‘’,’’ప్రశ్నోత్తర పద్యాలు ‘’,’’చిత్ర పద్యావళి ‘’,’’కోకిల గీతము ‘’,’’భారతీ స్తుతి గీతములు ‘’,’’గడ్డిపరక ‘’,అభినవ కవితా ప్రశంస ‘’ఆంద్ర కవితా వాజ్మయ ఆస్థానం ‘’అనే ఖండ కావ్యాలు రాశారు . ‘’రావణచరిత్ర ‘’,అనేచక్కని చిక్కని  వచనకావ్యాన్ని రాశారు .అనేక రామాయణాల నుండి విషయ సేకరణ చేసి రాసిన గ్రంధం ఇది .కాకినాడలో  ‘’రావణ వర్ధంతి ‘’ ని  నిర్వహించారు .అందుకోసమే ఈ రావణ చరిత్ర రాశారు .ఇది అచ్చుకాకుండా చేయటానికి శాస్త్రిగారి ప్రతికక్షులు విశ్వ ప్రయత్నం చేశారు .అయినా శాస్త్రిగారు దీన్ని ముద్రించి తన మనో నిబ్బరాన్ని లోకానికి మరో సారూ రుజువు చేసి చూపించారు . సుభద్రా విజయము ‘’అనే ద్వ్యర్ధి కావ్యం రాసి తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించారు .

అనేక గద్య కావ్యాలురాశారు .’’మనుష్యావయవ సంఘ సంస్కార సభ ‘’,మనము మోములకు (ముఖాలకు )వెల్ల వేసు కొందుముగాక ‘’అప్పుడు –ఇప్పుడు ,రూపాయ దండకం ‘’,ముద్దులు –ముచ్చటలు’’ ,మరికొన్ని హాస్య గ్రంధాలు రాశారు .విగ్రహారాధన గురించి ‘’సీతా లక్ష్మణ సంవాదం ‘’శారదా శాసనం పై ‘’రామ కృష్ణ సంవాదము ‘’,గ్రాంధిక వ్యావహారిక భాషా వివాదంపై ‘’గో మహిష సంవాదము ‘’,తారక తారావళి ,’’నిర్గద్య నిరోస్త్య నిష్కంఠయ(thya) జీర్ణ చేల చరిత్ర ‘’,విచారలహరి ‘’,నావిబుధ లోక సందర్శనము ‘’,మొదలైన పద్యకావ్యాలు రచించారు .సీతాకల్యాణం అనే హరికధ రాశారు దీపావళీ వర్ణనము ,మద్య పాన నిషేధము ,త్రొక్కుడు బండి ,సీసమాలికలు మొదలైనవి శాస్త్రి గారి అనేక రచనలలో కొన్ని మాత్రమె .’’విక్టోరియా విలాసం ‘’అనే ద్విపద కావ్యంమృదు మధురంగా   రాశారు .ఇందులో స్త్రీ విద్యకున్న ప్రాధాన్యతను వివరించారు .స్త్రీ విద్య అవసరం అని చెప్పే సంస్కార వంతులు శాస్త్రిగారు .మహిళలకోసం చాలా తేలిక భాషలో అనేక వ్యాసాలూ రాశారు .ఈ వ్యాసాలు ఆనాడు ప్రసిద్ధమైన పత్రిక ‘’హిందూ సుందరి ‘’లో ధారావాహికం గా ప్రచురింప బడేవి .

పత్రికలలో చచ్చి బతికిన శాస్త్రేజీ

శాస్త్రిగారు రాసిన ‘’నా విబుధ లోక సందర్శనము ‘పద్యకావ్యం ‘’ఆంద్ర సాహిత్య పరిషత్ పత్రిక ‘’లో ప్రచురితమైనది .ఈ కావ్యం రాయటానికి కారణం కూడా తమాషాగా ఉంది .’’బ్రహ్మయ్య శాస్త్రి గారు మరణించారు’’ అనే వార్తా ఒకటి పొరబాటున పత్రికలో వచ్చింది .1930 సెప్టెంబర్ లో రాజమండ్రి కి చెందినా కాశీభట్ట లింగ మూర్తి శాస్త్రి గారు అనే ఆయన చనిపోతే హిందూ పత్రిక విలేకరి దాన్ని బ్రహ్మయ్య శాస్త్రిగారికి లంకె పెట్టి బ్రహ్మయ్య శాస్త్రిగారు పరలోక గతులయ్యారని వార్త పంపాడు .దీన్ని చూసి ఆంధ్రపత్రిక కూడా వంత పాడింది .ఇంకాస్త ముందుకు వెళ్ళిన ఆంద్ర పత్రిక బ్రహ్మయ్య శాస్త్రిగారి మరణానికి సంతాపం ప్రకటించి ఆయన సాహిత్య సేవను బహువిధాల సంపాదకీయం లో ప్రస్తుతించింది .ఈ వార్త చదివిన ఆంద్ర దేశం లోని  సాహిత్యాభిమానులు  హిందూమతాభిమానులు   విచారం వెలి బుచ్చుతూ వారి కుటుంబానికి సాను భూతి తెలుపుతూ సభలు జరుపుతూ  లేఖలు కూడా రాసేశారు . వీటిని  పట్టించుకోకుండా శాస్త్రిగారు తమ సాహితీ కృషిని కోన సాగిస్తూనే ఉన్నారు .పత్రికలకు వ్యాసాలూ రాస్తూనే ఉన్నారు అవి అచ్చు అవుతూనే ఉన్నాయి .శాస్త్రిగారు  అఖండ  ఆంద్ర జన సోదరుల సౌహార్దం చేత, భగవత్క్రుప చేత తాను సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూనే ఉన్నానని ఆంద్ర పత్రికా సంపాదకునికి లేఖ రాశారు .అప్పుడు నాలుక కరచుకొన్న ఆ పత్రిక అసత్య వార్తను నమ్మి తాము శాస్త్రిగారి విషయం లో పొరబాటు చేశామని  దీనికి చాల చింతిస్తున్నామని శాస్త్రిగారు సంపూర్ణా రోగ్యం తో ఉన్నందుకు అభినందనలూ తెలిపి బహిరంగ క్షమాపణ కోరింది .ఇదంతా చూడటానికి ,వినటానికి తమాషాగా చిత్రంగా  ఉందని పించింది శాస్త్రి గారికి .ఒక కావ్యం రాయటానికి కావలసిన దినుసు ,సరుకు దొరికింది. వెంటనే ‘’నావిబుధ లోక సందర్శనము ‘’అనే చమత్కార వచన కావ్యం రాసి లోకం మీద వదిలారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-15- ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.