విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం )

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం )

శాస్త్రి గారి చారిత్రిక రచన

బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు .తుని  సంస్థానం వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు  పెట్టించి  శాస్త్రి గారి కుటుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత తమ’’ పెద్దాపురం సంస్థాన చరిత్ర ‘’రాయించి వెయ్యిన్నూట పదహారు రూపాయలు బహుమానంగా సమర్పించారు .ఇందులో శాస్త్రిగారి లోతైన చారిత్రిక అవగాహన ,పరిశీలనా ద్రుష్టి వ్యక్తమవుతుంది .అలాగే  ‘’మాధవ విద్యారన్యులవారు’’,’’శిస్టు కృష్ణ మూర్తి కవి ‘’,’’చేమకూర వెంకట కవి ‘’,’’కృష్ణ దేవరాయలు ‘’’’సంకుసాల నృసింహ కవి ‘’,’’నారాయణ భట్టు ‘’,సారంగ తమ్మకవి ‘’,’’భీమకవి ‘’,’’పిల్లల మర్రి పిన వీరభద్రుడు ‘’,’’నాచన సోముడు ‘’మొదలైన ఘన చారిత్రలు రాసిన మహా పరిశోధక సార్వ భౌములు శాస్త్రిగారు .

శాస్త్రిగారి లలిత కళా విహారం

శాస్త్రిగారు గొప్ప  లలిత కళోపాసకులు .లలితకలలపైన కూడా గ్రంధాలు రాశారు .’’వేశ్యా నృత్తగానములు ‘’గురించి 72 పేజీల గ్రంధాన్ని రాశారు .’’కవిత్వము -చిత్రలేఖనం’’ అనే వ్యాసం లో ఈ  రెండిటికి  ఉన్న పరస్పర సంబంధాన్ని బాగా చిత్రించారు .శాస్త్రిగారికి చిత్ర రచనలోనూ మహా ప్రావీణ్యం ఉంది .తమ వ్యాసాలలో రాసిన భావాల ననుసరించి మోడల్ చిత్రాలను గీసి చూపించారు .

సండే స్టాండర్డ్ లో శాస్త్రి గారి పై కితాబు వ్యాసం

శాస్త్రిగారి మత సంబంధ రచనలను గురించి ముందే ముచ్చటి౦చు కొన్నాం .ఉద్యోగం చేసినకాలం లో శాస్త్రిగారిని గూర్చిపాశ్చాత్యుల  చే  నడుప బడుతున్న  ‘’రవి పత్రిక ‘’ఇలా రాసింది –‘’బ్రహ్మయ్య శాస్త్రిగారు రవి పత్రికకు లేఖకులుగా పని చేశారు .ఎన్నో మంచి విషయాలను చక్కని శైలిలో వ్రాసేవారు .శాస్త్రిగారు  కలెక్టర్ ఆఫీస్ లో   అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో లేఖకులుగా ఉన్నారు .ఇప్పుడు శాస్త్రిగారిని కొవ్వూరు తాలూకాకు బదిలీ చేశారని విని చాలా విచారిస్తున్నాం .వీరి మత భావాలతో మేము ఏకీభ వించక పోయినప్పటికీ ,విద్యార్ధుల హృదయాలలో దేవుడున్నాడని ,సన్మార్గం లో నడవటం పరమ ధర్మమని శాస్త్రిగారు ఎప్పుడూ బోధిస్తారని మాకు తెలిసి మిక్కిలి సంతోషించాం .ఉపన్యాసం లో వీరు చెప్పే విషయాలు మృదు మధురంగా ,ఆహ్లాదకరం గా ఉంటాయని విద్యార్ధుల వలన ,ఉపాధ్యాయులవలన మేము విని తెలుసుకొన్నాం .శాస్త్రిగారికి విశ్రాంతి దొరికనప్పుడేల్లా తెలుగు భాష విషయం లో నే కృషి చేస్తారని ,ఇలాంటి ఉత్తముల సాంగత్యం కాకినాడ  పట్టణానికి ఇక నుండి లభ్యం కాదని ,వీరి నాయకత్వం విద్యార్ధులకు ఇక దొరకటం దుర్లభమైపోతోందని బాధ పడుతున్నాం .శాస్త్రిగారిని బదిలీకాకుండా ఇక్కడే ఉంచే కార్యక్రమాన్ని భాషాభిమానులందరూ కలిసి ఆలోచించి ఫలితం సాధించాలి ‘’అని రాసింది .ఈ వ్యాసం గొప్ప ప్రభావం కలిగించి శాస్త్రిగారి ట్రాన్స్ ఫర్ ఆగి పోయేట్లు చేసింది .

గ్రంధ రూపం లోకి  రాని  శాస్త్రిగారి విపుల  సారస్వత రచనలు

శాస్త్రిగారు రాసిన అనంత సాహిత్యం లో చాలాభాగం గ్రంధ రూపాలను  సంత రించు కోలేక పోయింది .గుడ్డిలో మెల్లగా శ్రీ నందిరాజు చలపతి రావు పంతులుగారు మతపర వ్యాసాలను సేకరించి ‘’ఉపన్యాస పయోనిధి ‘’పేరుతొ అయిదు సంపుటాలు గా ముద్రించి మహోపకారం చేశారు .ఇంకా వారి రచనలు గ్రంధ రూపాలలోకి వస్తే ఇరవై గ్రంధాలు అవుతాయి .శాస్త్రిగారు రాసిన పత్రికా వ్యాసాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న పుస్తకం గా ముద్రి౦ప బడ్డాయి .ఇదివరకే ముద్రింపబడిన శాస్త్రి గారి గ్రంధాలు ఇప్పుడు అలభ్యాలు .ఉదారులు ,వదాన్యులు పూనుకొని శాస్త్రిగారి అమూల్య సారస్వతాన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి .

ఉపన్యాస కేసరి

శాస్త్రిగారి రచనలు ప్రచురించని పత్రిక ఆనాడు లేనేలేదు .అలాగే వారి ఉపన్యాసం వినని పట్టణం కూడా లేనేలేదు .శాస్త్రిగారు అమోఘ మైన మహా వక్తలు . గంగా ప్రవాహం గా వారి ఉపన్యాస ధోరణి సాగుతుంది .ఎక్కడా తొణకటం, బెణకటం ఉండదు .సభలో వ్యతిరేకులు ఎన్ని అడ్డంకులు కల్పిస్తున్నా అల్లరి చేస్తున్నా తమ ప్రసంగాన్ని కొనసాగించి విజయ దుందుభి మ్రోగించేవారు .మాధుర్యమైన పద ప్రయోగం శాస్త్రిగారి ప్రత్యేకత .రచనలో గ్రాంధికమే వాడారు .వందలాది సభలలో ప్రసంగించారు. ఎన్నో సభలకు అధ్యక్షత వహించారు .ఆంద్ర దేశం లో బరంపురం లో ‘’ఆంద్ర సారస్వత సభ’’ ,గుంటూరులో నిర్వహించిన ‘’నిఖిలాంధ్ర దేశ వర్ణాశ్రమ ధర్మ మహా సభ ‘’లలో శాస్త్రిగారే అధ్యక్షత వహించారు .ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి .

ఆ బాల వృద్ధులకు ఆరాధనీయులు

బాలురనుండి వృద్దులవరకు ,పామరుల నుండి పండితులవరకు శాస్త్రిగారంటే అపార గౌరవం .వారికీ అందరి యెడల అపూర్వ అభిమానం. వారి వదనం లో శాంతం ఎప్పుడూ తొణికిస లాడుతూ ఉండేది .మాటలలో మర్యాద స్పష్టంగా కనిపించేది .టీ ,కాఫీ, ముక్కుపోడుం  చుట్ట  మొదలైన అలవాట్లు శాస్త్రిగారికి లేనే లేవు .న్యాయం అని భావిస్తే ఎవరెదురోచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళేవారు .హిందూమత భావ వ్యాప్తికి అంకితమై శాస్త్రిగారు పని చేశారు .దీనికోసం ప్రొమోషన్ వచ్చే పరీక్షలు రాయకుండా వదిలేశారు .శ్రద్ధ పట్టి రాస్తే శాస్త్రిగారు తాసిల్దారు అయ్యేవారు .సంవత్సరానికి ఉద్యోగ వేతనం కాని ,భూములపై వచ్చే ఆదాయం కాని సుమారు ౩౦౦ రూపాయలు మాత్రమె వచ్చేవి .ఇలాంటిపరిస్తితిలో కూడా స్వంత ఖర్చు తోనే పుస్తకాలు ,కరపత్రాలు ముద్రిస్తూ ,ఉపన్యాసాలకోసం దేశాటనం  చేసేవారు .దీనిని బట్టి శాస్త్రిగారి త్యాగనిరతి  ఎంత  ఉత్కృష్ట మైనదో తెలుస్తుంది.

బిరుదులూ సత్కారాలు

శాస్త్రిగారికి ఏలూరు ,సామర్ల కోట ,నెల్లూరు ,కడప ,కూరాడ ,కిర్లంపూడి పట్టణాలలో ఘన సన్మానాలు నిర్వహించి సత్కరించారు .విజయ నగరం లోని ‘’ఆంద్ర సారస్వత సభ ‘’శాస్త్రిగారికి ‘’విమర్శకాగ్రేసర ‘’బిరుదునిచ్చి సన్మానించింది .ఏలూరు ‘’విద్వద్వర విద్వాద్త్ప్రభు ‘’సంస్థ ‘’మహోపాధ్యాయ ‘’బిరుదమునిచ్చి ఘనంగా సత్కరించింది .నెల్లూరు ‘’విద్వజ్జన మహాసభ ‘’ఉపన్యాసక  పంచానన’’ బిరుదుతో గౌరవ సత్కారాలు అందజేసింది .కొవ్వూరు’’ ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠం ‘’’’ఆర్య మతోద్ధారక ‘’బిరుదం ఇచ్చి సత్కారం చేసింది .

ఒక్కసారి శాస్త్రిగారి వ్యాస పరంపర ను దర్శిద్దాం –

1-     సంఘ సంస్కార విషయ౦  పై రాసినవి -24 –ఇందులో సస్కరణలు –సంస్కర్తలు ,వెంకటరత్నం నాయుడుగారి వివాహ బంధం ,దమయంతీ ద్వితీయ స్వయంవరం స్త్రీ పునర్వివాహానికి అనుకూలమేనా ?కాకారాతి –ప్రత్యుత్తరం ,అలీక దేశాభిమానం ,కృష్ణా పత్రిక –వింత మూర్ఖత ,మొదలైనవి

2-     ఆధ్యాత్మిక వ్యాసాలూ -17 –వీటిలో –బ్రహ్మజ్ఞానం ,వేదాంత పునరుజ్జీవనం ,జపాను దేశము –వేదాంతము ,ఏకేశ్వర వాదము,బాలుర వేదాంతము ,మొదలైనవి .

3-     మత ధర్మ విషయ వ్యాసాలూ -43 –ఇందులో –ఆర్య మతము ,జన్నిదము గూర్చి ,యజ్ఞోపవీత రహస్యము ,శ్రీ కృష్ణ మూర్తి ,దీపావళి ,పునర్జన్మము –వీరేశ  లింగం గారు ,ఇండియా దేశపు స్త్రీలు  –  వివాహ ధర్మమూ ,హిందూమతమననేమి మొదలైనవి

4-     సాహిత్య వ్యాసాలూ -62- వీటిలో –కుచావరజ్ఞానము  –కలికాల నీతి బోధకుడు ,పురాతనాంధ్ర పత్రికలూ ,పాత్రౌచిత్య విచారము ,రామ మోహన రాయలు విగ్రహా రాధకులు కారా ?నన్నయ క్షత్రియుడా ? త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా తెలుగు నుండి త్రిలింగము పుట్టినదా ?మానవల్లి వారి మోసపు రాతలు , గ్రామ్యం గ్రాన్దికభాష గా ఉండ దగునా?భాషా సాంకర్యం ,ఆంద్ర దేశ పత్రికలూ మొదాలైనవి

5-     కవిత్వ విషయ వ్యాసాలు  -16 –ఇందులో –ఛందో విశేషాలు ,కలికాల కవిత ,చిత్ర కవిత్వం ,బంధ కవిత్వం ,భారతీ స్తవ గీతాలు గడ్డిపరక ,మొదలనవి

6-     ప్రక్రుతి శాస్త్ర వ్యాసాలూ -11- వీటిలోజ్యోతిస్శాస్త్రము  గూర్చి ,పంచ భూతములు ,ప్రమాణ విచారము ,భూమి యొక్క ఆకర్షణ శక్తి ,భూమి తిరుగు చున్నదా సూర్యుడు తిరుగు చున్నాడా ?పండిత శివనాద శాస్త్రిగారు భ్రమర కీటక న్యాయము ,జగము సృజింప బదడినదా? మొదలైనవి

కొమ్ములు తిరిగిన పండితులనే ఆశ్చర్య చకితులను చేసిన శాస్త్రిగారు

భాషా సాదృశ్య శాస్త్రం లో ,సంస్కృతాంధ్ర వ్యాకరణాలలో ,తత్వ శాస్త్రం లో ,దేశ చరిత్రలలో ,శ్రౌతంలో ఉద్ద్దండులై కొమ్ములు తిరిగిన మొనగాళ్ళు అని పించుకొన్న పండితులకే ఆశ్చర్యం కలిగించే అనేక అమూల్య విషయాలు తవ్వి తీసి బహిర్గతం చేశారు శాస్త్రిగారు .వారి  ధిషణ అంతటిది ..మౌలిక గ్రందాలనేకం శాస్త్రి గారు రాశారు .

77 ఏళ్ళ సార్ధక జీవితాన్ని గడిపిన విమర్శకాగ్రేసర శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు 1940లో పరమపదించి ఆంధ్ర సాహితీలోకం లో శూన్యం మిగిల్చారు .శాస్త్రి గారు జీవితకాలం అంతా కాకినాడ జగన్నాధ పురం లోనే గడపటం మరో గొప్ప విషయం .

ఇంతటి మహనీయుని గురించి నేను చదివినది ,తెలుసుకొన్నది మీకు అందజేసి ధన్యడనయ్యాననే సంతృప్తి నాకు కలిగింది .ఇంకా ఏమైనా విశేషాలు దొరుకుతాయేమో నని తెలుగు విజ్ఞాన సర్వస్వం లోకి తొంగి చూశాను .అందులో శాస్త్రిగారిపై వ్యాసం రాసినవారు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారని తెలుసుకొన్నాను .నేను ఇప్పటిదాకా రాసిన విషయాలే ఇందులోనూ సంక్షిప్తంగా ఉన్నాయి .అదే ధోరణిలో కూడా ఉన్నాయి. కనుక మా నాన్న గారు సంతరించి పెట్టుకొన్న 75 ఏళ్ళనాటి చిన్న గ్రంధం ‘’విమర్శకాగ్రేసర కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి జీవిత చరిత్రము ‘’రచయిత శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారే అనే నిర్ణయానికి వచ్చాను .

సమాప్తం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-15 –ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.