అదేనా అమరావతి?
- 27/05/2015
అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం జరిగిపోతున్న ఆర్భాటం సామాన్య జనాలకు అంతుపట్టడం లేదు. వేధావులకు, ప్రభుత్వ ఉన్నత అధికారులకు, మంత్రులకు సైతం ఈ రాజధాని అమరావతి స్వరూప స్వభావాలు అంతుపట్టిన దాఖలా లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు, నిర్మాణ యోజనలో అయనకు కుడి ఎడమ భుజాలుగా పనిచేస్తున్న ఒకరిద్దరు మంత్రులకు అధికారులకు ఈ బృహత్ ప్రణాళిక అర్థమయివుండవచ్చు. సింగపూరు ప్రభుత్వానికి మరింత బాగా అర్థమయి ఉండచవచ్చు. రాజధాని ప్రాంత విస్తీర్ణం ముప్పయిమూడు వేల ఎకరాలన్నది గత ఎనిమిది నెలలుగా జరిగిన ప్రచారం. ఇప్పుడు అకస్మాత్తుగా యాబయి ఐదువేల ఎకరాలకు అమరావతి విస్తీర్ణం పెరిగిపోయిన వైనం గురించి సింగపూర్ నిర్మాణ నిపుణులు మాత్రమే వివరించవలసి ఉంది. ఎందుకంటె వారు నిర్ధారిస్తే తప్ప ఇది ‘నీరు, ఇది గడ్డి, ఇది పొలం, ఇది స్థలం’ అన్న మైదాన వాస్తవాలు-గ్రౌండ్ రియాలిటీస్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థంకాని అయోమయ స్థితి ఏర్పడి ఉంది. జూన్ ఆరవ తేదీన జరుగనున్న భూమిపూజకు ఈ అయోమయత్వం నేపథ్యం… మొత్తం రాజధాని ప్రాంతం దాదాపు ఏడువేల ఐదువందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుందట. పచ్చని నగరం అన్నది అద్భుతమైన అనుభూతి. పచ్చని చెట్లు మొక్కలు పొలాలు రాజధాని మధ్యలో ఉండడం ప్రాచీన భారత నగర నిర్మాణ పద్ధతి. క్రీస్తుశకం పదునాలుగు పదిహేను పదహారు శతాబ్దుల నాటి హంపీ విజయనగరం ఇలా హరితశోభలతో అలరారుతూ ఉండేదని పాశ్చాత్య చరిత్ర కారులు వ్రాసుకున్నారు. మహానగరం మధ్యంలో మం చినీటి కొలనులు, జలమార్గా లు, అరటి, ద్రాక్ష, మామిడి, నారింజవంటి తోటలు, వరిపొలాలు, వాటిని దునే్న ఎద్దులు నాగళ్లు పట్టిన రైతులు ఉం డడం విజయనగర సామ్రాజ్య రాజధాని స్వరూపం. శాతవాహనుల పాలనలో రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే అనేక శతాబ్దుల పాటు ఇదివరకే ఒకసారి రాజధానిగా ఉండిన అమరావతి-్ధన్యకటకం-కూడ ఇలాంటి ఆకుపచ్చని శోభల అందాల నగరమే. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం వారు ఈ ప్రాచీన భారతీయ నగర నిర్మాణ రీతులను అధ్యయనం చేయించి ఉండినట్లయితే సింగపూర్‌కు, మలేసియాకు, జపాన్‌కు, చైనాకు పరుగెత్తుకొని వెళ్లిరావలసిన అవసరం ఏర్పడి ఉండేది కాదు. సచివాలయం శాసనసభా భవనాలు నిర్మించగల వాస్తు శిల్పులు, స్థపతులు-ఇంజనీర్లు- కళాకారులు, మేధావులు, మనదేశంలోనే లేరన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నిర్ధారణ. భారతీయతకు జరిగిన ఈ అవమానం అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పునాది. అసలు అయోమయం ఇదీ… నిర్మాణ కార్యక్రమాన్ని సింగపూర్‌కు అప్పగించడం.
పదకొండువేల ఐదువందల-దాదాపు- చదరపు కిలోమీటర్ల రాజధాని ప్రాంతం కృష్ణానదికి ఇరువైపులా చిలకలూరిపేట నుంచి నూజివీడు వరకు, నందిగామ నుంచి పామర్రు వరకు విస్తరించడం బాగుంది. కేంద్ర రాజధాని మాత్రం-కోర్ కాపిటల్- నూట ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని ముప్పయిమూడు వేల ఎకరాలలో విస్తరించి ఉంటుందని ఇన్నాళ్లుగా ప్రచారం జరిగింది. ఈ కోర్ కాపిటల్ మంగళగిరికి బాగా పశ్చిమంగా ఉంటుందన్నది జనానికి బోధపడిన విషయం. ఎందుకంటె ఈ భూమి విస్తరించిన ఇరవై తొమ్మిది గ్రామాలూ మంగళగిరికి పశ్చిమంగా వాయువ్యంగా ఉన్నాయి. అమరావతి క్షేత్రం సమీపం వరకు విస్తరించి ఉన్నాయి. ముప్పయి మూడు వేల ఎకరాల కోర్ కాపిటల్ ఈ ప్రాంతంలో ఉంటుందన్నది ఇంతవరకు ఏర్పడిన అభిప్రాయం. అందువల్ల అమరావతికి దగ్గరగాను, మంగళగిరికి దూరంగాను కోర్ కాపిటల్ నిర్మాణం కావాలి. కానీ సింగపూర్ పథకం ప్రకారం బహిర్గతమైన చిత్రపటాలలో మంగళగిరి, ఇంకా దక్షిణప్రాంతం, విజయవాడ, దానికి ఉత్తర ప్రాంతం కేంద్ర ప్రణాళికా ప్రాంతంలో ఉన్నాయి. ఈ కేంద్ర ప్రాంతానికి చాలా పశ్చిమంగా దూరంగా ప్రాచీన అమరావతి బిక్కుబిక్కుమంటూ ఉంది.
కోర్ కాపిటల్ మద్యలో మరో సీడ్ కాపిటల్ ఉందట…అది ఎక్కడ మొలకెత్తి ఉందో తెలియడం లేదు. కోర్ కాపిటల్, సీడ్ కాపిటల్ ఒకటే అయినా లేక కోర్ కాపిటల్ -రాజధాని కేంద్ర ప్రాంతం-లో ఈ సీడ్ కాపిటల్-రాజధాని వేరు వంటి స్థలం- ఒక భాగమైనా కోర్ కాపిటల్ మాత్రం కృష్ణానదికి రెండు వైపులా మంగళగిరి విజయవాడల మధ్య విస్తరించి ఉంటుందన్నది సింగపూర్ నిర్ధారణ. తుళ్లూరు ప్రాంతం కేంద్రంగా కృష్ణానదికి దక్షిణంగా మాత్రమే రాజధాని కేంద్ర ప్రాంతం నిర్మాణం అవుతుందని ఇన్నాళ్లు జరిగిన ప్రచారం ఏమయినట్టు? జూన్ ఆరున శంకుస్థాపన జరగడం లేదని, భూమి పూజ మాత్రమే జరుగుతుందని ప్రచారం అవుతోంది. కేంద్ర రాజధాని భౌగోళిక స్వరూపం ఇలా మారిపోయిన నేపథ్యంలో భూమిపూజ కృష్ణకు దక్షిణ ప్రాంతంలో జరుగుతుందా? ఉత్తర ప్రాంతంలో జరుగుతుందా? సచివాలయం, శాసనసభా భవనం, గవర్నర్ నివాసం ఎక్కడ నిర్మాణం అవుతాయి? ముప్పయి మూడు వేల ఎకరాల భూమిలోకి కేంద్ర రాజధానిలో ఈశాన్య ప్రాంతం కృష్ణకు దక్షిణంగా నెలకొని ఉంది. కానీ సింగపూర్ చిత్రపటం ప్రకారం కేంద్ర రాజధాని నదికి బాగా ఉత్తరంగా విస్తరించింది. అలాంటప్పుడు ఈశాన్య ప్రాంత బ్రహ్మస్థానం నదికి దక్షిణంగా ఎలా ఉంటుంది? సింగపూర్ చిత్రంలోని విచిత్రం ఇదీ. ఇంత పథకం రూపొందించిన వారు రాష్ట్ర సచివాలయం నిర్మించే ప్రాంతం ఎక్కడ ఉంటుందన్నది మాత్రం తేల్చలేదు.
ముప్పయి మూడు వేల ఎకరాల విస్తీర్ణం ఇప్పుడు యాబయఐదువేల ఎకరాలకు విస్తరించింది. ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన ముప్పయి మూడు వేల ఎకరాలలో పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వం భూమి ఉందా? లేక ఈ పదిహేను వేల ఎకరాల భూమి వేరే ఉందా? ముప్పయిమూడు వేల ఎకరాలకు పదిహేను వేల ఎకరాలు కలిపినప్పటికీ యాబయి ఐదువేల ఎకరాల అంకె రాదు. మరో ‘‘ఏడు కలపండి’’ అని లెక్కల మాస్టారు చెప్పవలసి వస్తుంది. అలా కలపవలసిన ఏడువేల ఎకరాలు గాని, ఇరవై రెండు వేల ఎకరాలను కాని ప్రభుత్వం ఎక్కడ, ఎప్పుడు సేకరించనున్నదో స్పష్టం కాలేదు. కేంద్రం ఇలా నదికి ఉత్తరంగా విస్తరించడం, ముప్పయి మూడు వేల నుండి యాబయి ఐదువేల ఎకరాలకు పరిధి పెరగడం సింగపూర్ వారి పథకంలోని కొత్త విషయాలు. మొదటి ముప్పయి మూడు వేల ఎకరాల సేకరణ ప్రహసనంలోనే, పదమూడు వందల ఎకరాల మూడు గ్రామాల రైతులు తమ భూమిని ఇవ్వబోమని మొండికెత్తి ఉన్నారట. అలాంటప్పుడు పరిధి యాబయి ఐదువేల ఎకరాలకు ఎలా పెరిగింది? ప్రభుత్వం ఆర్భాటం లేకుండా సచివాలయాన్ని, ఇతర రాజ్యాంగ విభాగాలను, నిర్మాణాలను, సొంతంగా చేపట్టి ఉండినట్టయితే రాజధాని సహజంగా వికసించి ఉండేది, విస్తరించి ఉండేది. రహదారులు, రైలు మార్గాల వంటి వౌలిక సదుపాయాలు క్రమంగా ఏర్పడి ఉండేవి. మొత్తం నగరం నిర్మించి ఇళ్లను జనానికి విక్రయించాలని అద్దెలనివ్వాలని ప్రభుత్వం భావిస్తోందా? అందుకేనా సింగపూర్ వారి శృంగార విన్యాసాలు?