మన్మోహన్ మార్గదర్శనం
- 29/05/2015
వీధిలో కొట్లాడి ఇంట్లోకొచ్చి కౌగిలించుకున్నట్టు- అన్న సామెతను ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు బుధవారం నిజం చేశారు. మనది ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ. అందువల్ల పదవులకు సంబంధించిన విభేదాలు, వైరుధ్యాలు, పరస్పర దూషణ భూషణ తిరస్కారాలు పదవీ నిర్వాహకులకు అంటరాదన్నది సంప్రదాయం. ఏది వ్యక్తిగతం, ఏది సైద్ధాంతికం, ఏది పదవికి సంబంధించినది, ఏది కాదు-అన్న మీమాంసను సమయానుకూలంగా ఎవరికి వారు చేసుకునే స్వేచ్ఛ కూడ మనకుంది. అందువల్ల మన్మోహన్ సింగ్‌ను తమ అధికార నివాసానికి పిలిపించుకొని నరేంద్ర మోదీ చర్చలు జరపడం గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో ఒకటి. తమ ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ తనకంటె ముందు ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన మన్మోహన్ సింగ్‌ను కలుసుకోవడం వ్యక్తిగత రాజకీయ సంస్థాగత విభేదాలకు అతీతమైన రాజ్యాంగ సంప్రదాయానికి అనుగుణమైన చర్య. అయితే ఈ సమావేశం వార్షికోత్సవం రోజున కానీ, అంతకు ముందు రోజున కానీ జరిగి ఉండినట్టయితే జనం మరింత సంతోషించి ఉండేవారు. ఒక రాజ్యాంగ లాంఛనం సంప్రదాయంగా మారి ఉండేది. అలా జరగలేదు. వార్షికోత్సవం రోజున ప్రధానమంత్రి రాష్టప్రతిని ఉపరాష్టప్రతిని మాత్రమే కలుసుకొని గౌరవం ఘటించారు. వార్షికోత్సవం ముగిసిన మరుసటి రోజున మన్మోహన్ సింగ్ బహిరంగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం ప్రధాన రాజకీయ పరిణామం. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాందీ పదేళ్లపాటు నిర్వహించిన ‘రాజ్యాంగేతర’ భూమికను గురించి ప్రచారం చేశారు. అధికార భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరింత ముందుకెళ్లి మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ వలె వ్యవహరించిన ప్రధాని అని నిర్ధారించారు. పదేళ్లపాటు ‘బాధ్యతలేని పరమోన్నత అధికారాన్ని’ చెలాయించిన సోనియాగాంధీ చేతిలో 2004వ 2014వ సంవత్సరాల మధ్య ప్రధాని మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ అన్నది నరేంద్ర మోదీ,అమిత్ షా బుధవారం కనిపెట్టిన మహావిషయం. ఊరందరికీ తెలిసిన రహస్యాన్ని ఊలప్పగారి చెవిలో ఊదినట్టుగా ప్రభుత్వాధినేత, అధికార పార్టీ అధినేత ఎందుకని ఇప్పుడు మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ స్వభావాన్ని సోనియాగాంధీ రాజ్యాంగేతర తత్వాన్ని ఆవిష్కరించినట్టు?
అంతర్జాతీయ సమాజంలో మన జాతీయ ప్రతిష్ఠ పాతాళ పతనం కావడానికి దోహదం చేసిన దూరవాణి తరంగాలు-స్పెక్టరమ్-కేటాయింపు అవినీతి, బొగ్గు కేటాయింపుల అక్రమాలు రూపొందిన సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధాని. బొగ్గు మరకలు రాజ్యాంగ చరిత్రకు మసిపూసిన తరుణంలో ఆయన ప్రధాని మాత్రమే కాక స్వయంగా బొగ్గుశాఖను నిర్వహించారు. బొగ్గు అవినీతి అభియోగ విచారణలో భాగంగా ప్రత్యేక న్యాయస్థానం వారు ఆయనను హాజరుకావాలని ఆదేశించారు కూడ. ఈ హాజరును సర్వోన్నత న్యాయస్థానం వారు నిలిపివేయడం వల్ల మన్మోహన్ సింగ్ ప్రత్యేక న్యాయస్థానలో ఉపస్థితుడై సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చిన ప్రమాదం తాత్కాలికంగా తప్పింది. కానీ ప్రత్యేక న్యాయస్థానంలో నిందితులుగా హాజరవుతున్న ఆయన మాజీ మంత్రివర్గ సహచరులు, అధికారులు, ఇతరులు కూడ మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు మాత్రమే తాము నడచుకున్నట్టు ప్రకటిస్తున్నారు. అంటే మొత్తం అవినీతి కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ప్రధాన పాత్రధారి అన్నది మాజీలు చెబుతున్న మాట. భారతీయ జనతాపార్టీవారు చేస్తున్న విమర్శల కంటె తమ మాజీ సహచరులు, అధికార్లు సంధిస్తున్న ఆరోపణాస్త్రాలు మన్మోహన్ సింగ్‌ను మరింత బాధిస్తున్నాయి. బొగ్గు అవినీతిలో తాను ఇరుక్కుపోయి, న్యాయస్థానం ముందు నిందితునిగా నిలబడడం తప్పదేమోనన్న భయం మన్మోహన్ సింగ్‌ను వెన్నాడుతోంది. బుధవారం తన నిజాయతీ గురించి, నైతిక నిష్ఠ గురించి మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బహిరంగ వివరణ ఇచ్చుకోవడానికి ప్రాతిపదిక ఈ భయం.
సింగ్‌ను తన నివాసానికి రప్పించి చర్చలు జరపడం ద్వారా నరేంద్ర మోదీ ఈ భయాన్ని పోగొట్టినట్టయింది. మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ కాబట్టి బొగ్గు అవినీతిలో ఆయన కేవలం పాత్రధారి. సూత్రధారి వేరే ఉన్నారన్నది అతిత్ షా విమర్శలోని ధ్వని.. ఆ సూత్రధారి రాజ్యాంగేతర శక్తి అయిన సోనియాగాంధీ అన్నది నరేంద్ర మోదీ చేసిన నిర్ధారణ. కలసి వెరసి బొగ్గు అవినీతిని మూల కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలన్న వాస్తవాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షా బుధవారం ఇలా ఉమ్మడిగా ఆవిష్కరించారు. బొగ్గు అవినీతిని మాత్రమే కాదు, కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి-యూపీఏ- పదేళ్ల పాలనలోని అనేకానేక అవినీతి కలాపాలకు కూటమిలోని రాజకీయ పక్షాల అధినేతలు మాత్రమే సూత్రధారులన్నది చారిత్రక వాస్తవం…అందువల్ల మన్మోహన్‌ను కీలుబొమ్మగా చిత్రీకరించడం వల్ల ఆయనకు అభియోగ విముక్తి కలిగింది. న్యాయస్థానాలలో మన్మోహన్ సింగ్ నిర్దోషిత్వం, లేదా నేర ప్రవృత్తిని నిగ్గు తేల్చడానికి ఈ కీలుబొమ్మ, రాజ్యాంగేతర శక్తి సిద్ధాంతాలు ఉపకరించవు. కానీ ప్రజల ముందు మన్మోహన్ నిర్దోషిత్వాన్ని కాపాడటానికి దోహదం చేయవచ్చు. ఇలా మోదీ, అమిత్ షా కలిసికట్టుగా మన్మోహన్ సింగ్ హితాన్ని కోరుతున్నారు..
ఇంతవరకు బాగుం ది..కానీ నరేంద్ర మోదీ తన నివాస కార్యాలయంలో మన్మోహన్ సింగ్‌తో ఆర్థిక వ్యవహారాల గురించి, విదేశాంగ విధానం గురించి చర్చలు జరపడమే ఆసక్తికరమైన అంశం. విదేశాంగనీతి విషయంలో మన్మోహనీయ వైపరీత్యానికి సంపూర్ణ విశుద్ధంగా వ్యవహరిస్తున్న నరేద్ర మోదీ ప్రభుత్వానికి ఆర్థిక నీతి విషయంలో మాత్రం ఏడాదిగా మన్మోహన్ సింగ్ పరోక్ష మార్గదర్శనం లభిస్తోంది. వాణిజ్య ప్రపంచీకరణను నెత్తికెత్తడం ద్వారా దేశ ప్రజల ప్రయోజనాలకు విఘాతకరమైన అంతర్జాతీయ అక్రమ ప్రయోజనాలకు పెద్దపీట వేసిన ఘనత మన్మోహన్ సింగ్‌ది! జాతీయ ప్రయోజనాల పరిధిలో ఇమడని అంతర్జాతీయస్థాయి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్..అంతర్జాతీయ విస్తృత ప్రయోజనమంటే అమెరికా, ఐరోపా, చైనా, దక్షిణ కొరియాల వంటి సంపన్నదేశాల ప్రయోజనమన్నది ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రతిపక్షంలో ఉండగా ఈ ప్రపంచీకరణను వ్యతిరేకించిన భాజపా అధికార స్వీకరణ తరువాత మన్మోహన్ సింగ్ బాటలో నడుస్తుండడం నడుస్తున్న చరిత్ర…బీమా, రైల్వే రంగాలలో విదేశీయ వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించడం, రక్షణోత్పత్తుల రంగాన్ని సైతం బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు కట్టబెట్టడం, వాల్‌మార్ట్, వంటి విదేశీయుల చిల్లర దుకాణాలను దేశమంతటా తెరవడం, తద్వారా స్వదేశీయుల దుకాణాలు మూతపడడానకి రంగం సిద్ధం చేయడం.. ఇలాంటివి మరికొన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లభిస్తున్న మన్మోహన్ సింగ్ మార్గదర్శనానికి నిదర్శనాలు. భూమి సేకరణ బిల్లు పరాకాష్ఠ…అందువల్ల కొత్తగా విదేశాంగ విధానం విషయంలో కూడ నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ మార్గదర్శనాన్ని కోరుతున్నారా? అన్నది సమాధానం లభించవలసిన ప్రశ్న…