సడలని చైనా ‘పట్టు’

సడలని చైనా ‘పట్టు’

  • 28/05/2015
TAGS:

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వారి దురాక్రమణ బుద్ధి మారలేదని మంగళవారంనాడు మరోసారి స్పష్టమైంది. ‘మెక్ మాహన్’ రేఖను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేయడం ద్వారా చైనా ప్రభుత్వం దశాబ్దులుగా అరుణాచల్‌పై పెడుతున్న పేచీని మరోసారి గుర్తుచేసింది. ఇలా గుర్తు చేయడానికి మే నెల 14 నుండి 16 వరకు మన ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన పర్యటన నేపథ్యం…సరిహద్దు వివాదం పరిష్కరించడానికి చైనా సిద్ధంగా లేదన్నది మంగళవారం ఆ దేశపు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ చేసిన ప్రకటన ఇలా స్పష్టమైంది! ఇరవై ఐదవ తేదీ నాడు అమెరికా ప్రభుత్వం వారి నిఘా విభాగం వారు బయటపెట్టిన మరో విషయం వల్ల చైనావారి భారత వ్యతిరేక ప్రాబల్య విస్తరణ వ్యూహం మరోసారి ధ్రువపడింది. పాకిస్తానీ ప్రభుత్వ గూఢచర్య విభాగం ఐఎస్‌ఐ ప్రతినిధులతో చైనా అధికారులు గతవారం బీజింగ్‌లో రహస్య మంతనాలు జరిపారన్నది అమెరికా బయటపెట్టిన సమాచారం. ఈ మంతనాలు చైనా పాకిస్తాన్‌ల మధ్య మాత్రమే జరిగి ఉండినట్టయితే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఎందుకంటే చైనా ప్రభుత్వం అనేక ఏళ్లుగా పాకిస్తాన్‌ను చేయి పట్టుకుని నడిపిస్తోంది! అఫ్ఘానిస్తాన్‌కు చెందిన తాలిబన్లు కూడ ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నారట! అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించి వెళ్లిన తరువాత వారం రోజులకే చైనా ప్రభుత్వం ఇలా అఫ్ఘానిస్తాన్ పాకిస్తాన్ సమావేశాన్ని అతి రహస్యంగా నిర్వహించడం ప్రాధాన్యత సంతరిం చుకున్న విపరిణామం! ఇలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అఫ్ఘానిస్తాన్ పౌర ప్రభుత్వాన్ని మన దేశానికి దూరంగా జరపడం చైనా వ్యూహంలో భాగం. అఫ్ఘా నిస్తాన్ పునర్ నిర్మాణ కార్యక్రమంలో మన ప్రభుత్వం క్రియాశీల భూమికను పోషిస్తోంది. 2009 నుంచి అఫ్ఘానిస్తాన్‌కు మన ప్రభుత్వం పనె్నండు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహా యం అందచేసింది. ఏడువందల కోట్ల రూపాయల ఖర్చుతో అఫ్ఘానీ పార్లమెంట్ భవనాన్ని మన ప్రభుత్వం నిర్మిస్తోంది. అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ఏప్రిల్ చివరలో మనదేశానికి వచ్చి వెళ్లిన తరువాత ఆ దేశంతో మన సంబంధాలు మరింత పెరిగినట్టు ప్రచారమైంది. నరేంద్ర మోదీ చైనాకు వెళ్లిన రోజుననే తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌లో నలుగురు భారతీయులను హత్య చేశారు. ఇప్పుడు తాలిబన్లకు అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వానికీ మధ్య రాజీ కుదిర్చే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకొనడం ద్వారా చైనా ప్రభుత్వం మన ప్రభావాన్ని అఫ్ఘానిస్తాన్‌లో తగ్గించడానికి యత్నిస్తోందని ధ్రువపడింది! పాకిస్తాన్ వారి గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ- నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమం మన దేశానికి వ్యతిరేకమైన బీభత్సకాండ..నరేంద్ర మోదీ తమ దేశంనుండి నిష్క్రమించిన వెంటనే చైనా ప్రభుత్వం నిర్వహించిన ఈ రహస్య సమావేశం చైనా అమిత్ర వైఖరికి సరికొత్త నిదర్శనం…
చైనా విధానం మారలేదు, వ్యూహం మారలేదు. సరిహద్దు వివాదం గురించి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇప్పించడం గురించి నరేంద్ర మోదీ బీజింగ్‌లో ప్రస్తావించినప్పుడు చైనా అధ్యక్షుడు ఝీజింగ్‌పింగ్ కాని ప్రధాని లీకెఖ్వియాంగ్ కాని నోరు మెదపలేదు. ఇలా నోరు మెదపకపోవడం దశాబ్దుల తరబడి చైనా అనుసరిస్తున్న వ్యూహంలో భాగం. గతంలో చైనా ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు మనదేశానికి వచ్చినప్పుడు మన అధినేతలు ప్రతినిధులు చైనాకు వెళ్లినప్పుడు కూడ పర్యటనలు పూర్తి అయ్యే వరకు ఏ సమస్య గురించి కూడ చైనా నోరు విప్పకపోవడం చరిత్ర. చైనా ఈ వ్యూహాత్మక వౌనాన్ని పునరావృత్తం చేసింది! గత పది ఏళ్లలో మన ప్రభుత్వం వారు పర్యటనల సందర్భంగా సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించలేదు. ఈ వివాదం పరిష్కారం కోసం ప్రతి ఏటా ఒకసారి ఉభయ దేశాల ప్రత్యేక ప్రతినిధులు సమావేశమై చర్చల లాంఛనాన్ని నిర్వహిస్తున్నారు. అందువల్ల మిగతా సమయాలలో సరిహద్దును ప్రస్తావించి చైనా నాయకుల మనోభావాలను గాయపరచరాదన్న విధానాన్ని 2004వ 2014వ సంవత్సరాల మధ్య ప్రధాని మనమోహన్‌సింగ్ ప్రభుత్వ విధానమైంది. దీనికి భిన్నంగా నరేంద్ర మోదీ సరిహద్దు వివాదాన్ని చైనా పర్యటన సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు! చైనా నాయకులు గతంలో వలెనే మోదీ పర్యటన సందర్భంగా కూడ వౌనం వహించడం మారని వారి తీరునకు దర్పణం…
అలా మోదీ పర్యటన ముగిసే వరకు వౌనం వహించిన చైనా మెక్‌మాహన్ రేఖ గురించి ఇప్పుడు ప్రస్తావించింది! చైనా భారత సరిహద్దు తూర్పు విభాగం గురించి తమ ప్రభుత్వం స్పష్టమైన, ఒకే విధమైన విధానాన్ని అనుసరిస్తోందన్నది బీజింగ్‌లో హువాచున్‌యింగ్ చెప్పిన మాట! నిజానికి తూర్పు సరిహద్దు విభాగం క్రీస్తు శకం 1914లోనే నిర్ధారితమైంది! అయితే అప్పుడు అది భారత టిబెట్ సరిహద్దు. భూటాన్ నుండి బర్మా వరకు గల భారత టిబెట్ సరిహద్దు మెక్‌మోహన్ రేఖగా ప్రసిద్ధికెక్కింది. ఇది భారత టిబెట్ సరిహద్దులోని తూర్పు విభాగం మధ్య విభాగం, సిక్కిం ఉత్తర ఖండ్ రాష్ట్రాలకు ఉత్తరంగా ఉన్న భారత టిబెట్ సరిహద్దు. పశ్చిమ విభాగం మన హిమాచల్ ప్రదేశ్, లడక్ ప్రాంతాలకు తూర్పుగాను కశ్మీర్‌కు ఉత్తరంగాను ఉన్న సరిహద్దు! 1914 నాటికి కశ్మీరకు ఉత్తరంగా ఉన్న కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే భారత చైనా సరిహద్దు. మిగిలినదంతా భారత్-టిబెట్ సరిహద్దు! 1914లో మన దేశానికి-బ్రిటిష్ వారు పాలించిన కాలంలో-స్వతంత్ర టిబెట్ దేశానికీ మధ్య సిమ్లాలో కుదిరిన ఒప్పందం మేరకు మెక్‌మాహన్ రేఖ ఏర్పడింది. భారత్ తరఫున చర్చలలో పాల్గొన్న బ్రిటిష్ అధికారి మెక్‌మాహన్ పేరుతో ఈ తూర్పు విభాగం సరిహద్దు ఏర్పడింది. ఈ రేఖకు ఈ వైపున మనదేశంలోని అరుణాచల్ అనాదిగా నెలకొని ఉండిన భౌగోళిక సత్యాన్ని 1914లో స్వతంత్ర టిబెట్ ప్రభుత్వం అంగీకరించింది! 1959లో చైనా టిబెట్టును పూర్తిగా దిగమింగే వరకు ఈ భౌగోళిక చారిత్రిక వాస్తవం వివాదగ్రస్తం కాలేదు. చైనాకు ఈ సరిహద్దుతో సంబంధమే లేదు. అది భారత టిబెట్ సరిహద్దు మాత్రమే!
అలా స్వతంత్ర టిబెట్ అంగీకరించిన మెక్‌మాహన్ రేఖను చైనా అంగీకరించకపోవడానికి కారణం అరుణాచల్ ప్రదేశ్‌ను కబళించాలన్న దుర్మార్గపు ఆలోచన! మెక్‌మాహన్ రేఖను టిబెట్ ప్రభుత్వం వలె చైనా కూడ అంగీకరిస్తే అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలో అంతర్భాగమన్న అనాది వాస్తవాన్ని చైనా కూడ అంగీకరించినట్టు కాగలదు. మెక్‌మాహన్ రేఖ అక్రమమైనదని హువాచున్ యింగ్ చెప్పడానికి ఇదంతా నేపథ్యం! అరుణాచల్ దక్షిణ టిబెట్‌లో భాగమన్న చైనావారి దశాబ్దుల అబద్ధాన్ని ఆమె మంగళవారం పునరుద్ఘాటించిందంతే! నరేంద్ర మోదీ బీజింగలో మెక్‌మాహన్ రేఖ కంటె ఎక్కువగా పశ్చిమ విభాగంలోని వాస్తవ అధీన రేఖ-లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్‌ఏసి-గురించి ప్రస్తావించారు! 1962 నాటి దురాక్రమణ తరువాత తానే ఏకపక్షంగా నిర్ధారించిన ఎల్‌ఏసిని చైనా నిరంతరం ఉల్లంఘిస్తోంది. మన దేశం వైపునకు మరింత జరుపుతూ దురాక్రమణ సాగిస్తునే ఉంది. ఈ విషయం గురించి మాత్రం చైనా మంగళవారం వౌనం వహించింది…


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.