ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36
16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -2
స్టీం బోట్ పైలట్
ఇరవై రెండేళ్ళ వయసులో మార్క్ నావ పైలట్ అయ్యాడు .అందరి స్టీం బోట్ వాళ్ళతో పరిచయం బాగా ఏర్పడింది .జాతి భేదం లేకుండా అందరూ సన్నిహితులయ్యారు ఈ అనుభవాలను వ్యాసాలూ గా రాస్తూ ‘’నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ‘’అని మొదలు పెట్టి’’ఓల్డ్ టైమ్స్ ఆన్ ది మిసిసిపి ‘’ధారావాహికం గా రాశాడు .అది పెరిగిపెరిగి ‘’లైఫ్ ఆన్ ది మిసిసిపి ‘’గ బృహద్రూపం దాల్చింది .మిసిసిపినది పడమటి తీరం లో ఉన్న ఆయన గ్రామస్తులందరికీ దీనితో బోట్ యాత్ర చేయాలనే కోరిక పెరిగింది .ఇంకా చాలా గొంతెమ్మకోరికలు ఉండేవి .కాని అవి సుప్తంగా నే ఉండిపోయాయి .అప్పుడు ఊళ్లోకి ఒక సర్కస్ వచ్చింది అది చూసి సాం ముఠా అంతా అందులో ఉండే బఫూన్(క్లౌన్) లాగా ఉండాలను కొన్నారు .మొదటి నీగ్రో వచ్చి బాధలన్నీ ఏకరువు పెడితే అలాంటి జీవితాన్ని అనుభవించాలని అనుకొన్నారు . చిన్నతనం కనుక ప్రతిదీ మనసు ఆలోచన మీద ప్రభావం చూపేది .తాము మంచిగా జీవిస్తే దేవుడు తమలని సముద్రపు దొంగలుగా (పైరేట్స్ )గా మారుస్తాడనే విశ్వాసమూ కలిగింది .ఇలాంటి ఎన్నో ఆలోచనలు సముద్ర తరంగాలుగా వచ్చి పోతూ ఉండేవి ఆ వయసులో .కాని స్టీం బోట్మన్ అవాలన్న కోరిక మాత్రం స్తిరంగా ఉండిపోయింది .ఈ రకమైన ఆలోచనల వలన మార్క్ ట్వేన్ లో అనేక విషయాలపై ఆసక్తి కలవాడని వాటిలో నైపుణ్యం ఉండేదని కష్టమైన పనుల్ని చేయటానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని తెలుస్తోంది అని ఆయన జీవిత చరిత్రకారులు అన్నారు .ఈ ఆలోచనలే అమెరికా దేశపు స్థూల రూపాన్ని ఆవిష్కరించింది .అనేక తరహా మనుషులతో పరిచయాలు కలిగించాయి .మనుషుల అంతరంగాలను పరిశీలించే మహా నేర్పు అలవడింది .రివర్ పైలట్ గా ఉండిపోయేవాడే .బాగా డబ్బు వచ్చి మీదపదేదే .ధనికుడిగా చెలామణీ అయ్యేవాడే కాని నాలుగేళ్లతర్వాత అమెరికా అంతర్యుద్ధం వచ్చి పైలటింగ్ కు మంగళం పాడింది .
బానిస వ్యతిరేకత
పైలట్ నుండి తొలగింప బడ్డాక ట్వేన్ యుద్ధ సైనికు డయ్యాడు .అనుకోకుండా కాన్ఫడరేట్ సైనికుడయ్యాడు .ఆయన పైలట్ స్నేహితుడు న్యూయార్క్ వాడు .సౌత్ కరోలినా రాష్ట్రం యూనియన్ నుంచి వేరై పోయింది అని తెలిసింది .మిత్రుడు యూనియన్ ను సమర్ధించాడు కనుక తానూ దానినే సమర్ధిస్తున్నానని చెప్పాడు .ఈ విషయాన్ని సగం నవ్వు సగం హేళన ధ్వనించేట్లు ‘’the Private History of a Campaign that Failed ‘’అన్నాడు .తానూ యెంత వాదించినా మిత్రుడు వినిపించుకోలేదు .దీనికి కారణమన్ తన తండ్రికి బానిసలున్నారు . తండ్రి ఒకసారి ఈ కఠోర సత్యాన్ని ఒప్పుకొని బానిసత్వం హేయం అన్నాడని తన దగ్గరున్న ఒకే ఒక నీగ్రో బానిస ను విడుదల చేస్తానని చట్ట్టం ఒప్పుకొంటే అతనికి ఆస్తికూడా ఇస్తానన్నాడని గుర్తు చేశాడు .ఇలాంటి తాటాకు మంటలేవీ పని చేయవు అన్నాడు మిత్రుడు .కొంతకాలానికి దిగువ మిసిసిపి ప్రాంతం విడిపోయే ఆలోచనలోకి పూర్తిగా వచ్చింది .అప్పుడు తానూ ఎదురు తిరిగానని చెప్పాడు .తనతో బాటు మిత్రుడూ చేయి కలిపాడు .ఆతను బిగ్గరగా బానిస వ్యతిరేకతను చాటేవాడు కాని తనను అలా చేయవద్దని వారి౦చేవాడు .
యుద్ద్ధ సైనికుడు – యుద్ధ వ్యతిరేకత
సివిల్ యుద్ధపు దారుణాలు మార్క్ ట్వేన్ లో కొత్త ఆలోచనలకు దారి తీశాయి .తుపాకీతో కాలుస్తున్న దృశ్యాలు ఎప్పుడూ వెన్నంటి ఉండేవి .యుద్ధం అంటే ఒకర్ని ఒకరుకాల్చుకొని చనిపోవటమే తప్ప అందులో విచక్షణ లేదని పించింది .అవతలివాడిపై శత్రుత్వం లేక పోయినా ,స్వార్ధం కోసం కాకపోయినా కొత్తవారిని కాల్చి చంపటమే అవుతోంది .వాళ్ళు ఆపదలో ఉంటె సాయం చేసే ప్రవ్రుత్తి మనకు అవసరమైతే వాళ్ళు సహకరించే విధం నశించి మానవత్వం కోల్పోయి చంపుకోవటమే యుద్ధం అని పించింది .
సేక్రేటరికి సెక్రెటరి –స్పెక్యులేషన్ –పత్రికా రచన –మార్క్ ట్వేన్ అవతారం
యుద్ధం నుండి క్లేమేన్స్ ను ‘’ఆశక్తుడు ‘’గా భావించి విడుదల చేశారు .పడమటి తీరం చేరి అన్న ఒరియాన్ నవడా రాష్ట్ర సెక్రెటరి అయ్యాడని తెలిసి , కలిసి అన్నకు సెక్రెటరి అయిపోయాడు.కొన్ని రోజులకు సేక్రేటరికి విధులు నిధులు పూజ్యం అని తెలుసుకొన్నాడు .అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిపించి గనుల త్రవ్వకం లో కాలు పెట్టాడు . గని లోతుకు మునిగిపోయాడుపాపం .క్వార్త్జ్ మైనింగ్ లో వేలు పెట్టి కలిసిరాక స్పెక్యులేషన్ వదిలేసి ఆకాశ విహారం మానేసి నేల మీద కాలు ఆనించి నడవటం నేర్చుకొన్నాడు .ఇవేవీ అచ్చిరాలేదని పూర్వపు వ్యాసంగం అయిన న్యూస్ పేపర్ మాన్ గా అవతారమెత్తాడు .వర్జీనియా నగరం నుండి వెలువడే ‘’టేరి టోరియల్ ఎంటర్ ప్రైజెస్ ‘’పత్రికలో చేరి హాస్య వ్యంగ్య రచనలనెన్నిటినో రివర్ పైలట్ గా ఉన్నప్పుడు నచ్చిన మాట ‘’మార్క్ ట్వేన్ ‘’ను కలం పేరుగా పెట్టుకొని రాశాడు .అప్పటినుంచి క్లేమేన్స్ తెరమరుగై మార్క్ ట్వేన్ గా విజ్రుమ్భించాడు .
19 వశతబ్ది మధ్యలో హాస్య రచయితలెవరూ స్వంత పేరు పెట్టుకొని రాయలేదు .ఆ తర్వాతే రాయటం మొదలెట్టారు దీనికి కారణం వారు రాసిన హాస్యాన్ని చదివి నవ్వేవారు కరువవ్వటమే .అందుకే సిగ్గుపడి స్వంత పేరుతొ రాయటానికి జంకేవారు .అదీ రహస్యం .ఒకాయన ‘’పెట్రోలియం వేసూవియాస్ నాస్బి ‘’అనే పెరుపెట్టుకొని రాసేవాడు .నిజానికి ఈయన సీరియస్ ప్రింటర్ .అసలుపేరు డేవిడ్ రాస్ లాకే .రాబర్ట్ హెచ్ న్యుఎల్ ‘’ఆర్ఫియాస్ సి .కార్ అంటే ఆఫీస్ సీకర్ పేరు పెట్టుకొని రాసేవాడు ఈయన ఒక మేగజైన్ ఎడిటరేకాక వర్ధమాన రాజకీయ నాయకుడు కూడా .హెన్రి వీలర్ షా అనే రైతు ,బొగ్గుగనుల నిర్వహణాధికారి ,రియల్ ఎస్టేట్ వ్యాపారి , వేలంపాట ఏజెంట్ కూడా ‘’జోష్ బిల్లింగ్స్ ‘’పేరుతొ కామిక్ విషయాలు రాసేవాడు .ఆల్మేనాక్ వార్డ్ ‘’అనే బిరుదూ పొందాడు .
కానీ సాం క్లేమేన్స్ మార్క్ ట్వేన్ అవతారం ఎత్తాక పై వారినెవరినీ అనుకరించలేదు వార్డ్ తో పరిచయమయ్యాక ట్వేన్ కొన్ని రోజుల్లోనే ఆయన్ను అన్నిటా మించిపోయే కామిక్ రచనలు చేసి మెప్పించాడు .’’సమకాలీన బాక్ వుడ్ హ్యూమర్’’ను పండించాడు .పెద్దకధలు రాశాడు ముతక హాస్యమూ మితిమీరి రాశాడు వార్డ్ కంటే గొప్ప హాస్యాన్ని సృష్టించానని చెప్పుకొన్నాడు .కాని పత్రికాజనం అంతగా పట్టించుకోలేదు .టాం సాయర్ ,హకిల్ బెర్రిఫిన్ లకు వచ్చినంత ప్రాచుర్యం పై వాటికి రాలేదన్నదినిజం .ఆకాలంలో సమాజం లో ఉన్న వెర్రి మొర్రి విపరీత ధోరణులుకు అవి అద్దం పట్టాయి .బడా బాబుల బండారం బయట పెట్టాయి .కారికేచర్ మీద ఎక్కువ దృష్టిపెట్టి రాశాడు .పాత విషయాలనే కొత్త మూసలో కొత్త తరహాలో హాస్యం వ్యంగ్యం మేళ వించి రాయటం మార్క్ ట్వేన్ ప్రత్యేకత .మాండలికానికి పెద్ద పీట వేశాడు .వ్యావహారికాన్ని నెత్తి కెత్తుకొన్నాడు. స్తానికతకు ప్రాదాన్యమిచ్చాడు .ఇవన్నీ కలిసి ‘’హోమ్ స్పన్ ‘’’’స్వదేశే నేత’’ గా గుర్తింపు తెచ్చుకొన్నది , హీరోలు జీరోలు అందరూ తన చుట్టూ ఉన్నవాళ్ళే .పరిసరాలు అవే .అందుకే అంతటి పేరొచ్చింది .సహజత్వాన్ని ఇంత వరకు ఎవరూ కధల్లో నవలలో చొప్పించలేదు .వాల్ట్ విట్మన్ కవి కవిత్వం లో సహజత్వం తెస్తే, హాస్య వ్యంగ్య రచనలో నవలలో కధల్లో మార్క్ ట్వేన్ సహజత్వాన్ని చూపించి ఆధునిక అమెరికన్ నవలా సాహిత్యానికి ఆద్యుడని పించుకొన్నాడు . పత్రిక హాస్య రచయిత కాస్తా సాంఘిక వ్యంగ్య రచయితగా అవతారమెత్తాడు మార్క్ ట్వేన్ –‘’the news paper humorist grew into the social satirist’’.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 30-5-15- ఉయ్యూరు