కల్పవృక్షం కనుమరుగు? -వేంపల్లి గంగాధర్.

కల్పవృక్షం కనుమరుగు?

  • 31/05/2015
  • -వేంపల్లి గంగాధర్.. 9440074893

రక్తచందనం.. ఈ మాట ఇప్పుడు దశదిశలా విన్పిస్తోంది. కొందరు భయంతోను, కొందరు ఆశతోను, కొందరు ఆశ్చర్యంతోనూ ఈ మాటను వింటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్ర దొంగలపై కనె్నర్ర చేయడంతో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఇప్పుడు ‘ఎర్రచందనం’ గురించి అన్నీ సంచలన వార్తలే వినిపిస్తున్నాయి. తిరుమల వెంకన్న సమక్షంలో నిశ్చింతగా, ఏపుగా ఎదుగుతున్న ఎర్రచందనం వృక్షాలను నిట్టనిలువునా నరికేసి అక్రమంగా తరలించి విదేశాల్లో తెగనమ్ముతున్నారు. వాయు, జల, భూ మార్గాల్లో దేనినీ వదలకుండా రక్తచందనం దుంగల్ని తరలించేస్తున్నారు. ఈ అక్రమాలలో అంతర్జాతీయ స్మగ్లర్లు, అధికారులు, రాజకీయ నేతలు, పోలీసులు, సినీనటులు, సాధారణ పౌరులు, కూలీలు మమేకమైపోయారు. ఏ ఎదురూ బెదురూ లేని మాఫియా కనుసన్నల్లో శేషాచలం అడవులు చిన్నబోవడం ఇప్పటి తంతుకాదు. అయితే ఇపుడు స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం ఉచ్చు బిగించడంతో నివ్వెరపరిచే నిజాలు బయటపడుతున్నాయి. ఎందుకంత విలువ? ఈ భూగోళంలో రక్తచందనం మొక్కలు పెరిగే వాతావరణం ఒక్క శేషాచలం అడవుల్లోనే ఉంది. చిత్తూరు, కడప ప్రాంతాల్లో విస్తారంగాను, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో అక్కడక్కడ రక్తచందనం చెట్లు పెరుగుతాయి. తమిళనాడు, కర్నాటకల్లో ఒకటీ అరా ప్రాంతాల్లో పెరిగినా ఇక్కడ మొక్కల నాణ్యత అక్కడ లేదు. ఆయుర్వేద ఔషధాల తయారీలో, సంప్రదాయ వస్తువులు, పరికరాల తయారీకి దీనిని విస్తృతంగా వాడతారు. ఈ కలపతో చేసే వస్తువులు ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని చాలామంది విశ్వాసం. చైనా, జపాన్ సహా ఆరు దేశాలకు మనదేశంలోని ఎర్రచందనం కావాల్సి వస్తోంది. చైనా, జపాన్‌లకైతే ఏటా 3వేల టన్నులకు పైగానే ఎర్రచందనం అవసరం ఉంది. 2000 సంవత్సరం నుండి మనదేశంలో ఎర్రచందనం ఎగుమతిపై నిషేధం ఉండటంతో అక్రమ మార్గాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో టన్నుకు సరాసరి 1.5 కోట్ల ధర పలకడంతో ఈ చెట్లు స్మగ్లర్లకు కల్పవృక్షాలుగా మారిపోయాయి. ఈ చెట్లకు ఉండే అరుదైన లక్షణం అణు ధార్మికతను తట్టుకోగలగడం. దీనివల్ల కూడా చైనా, జపాన్‌లు దీని కోసం తహతహలాడుతున్నాయి. ఇప్పటి పరిస్థితి శేషాచలం అడవుల్లో 5,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో ఎర్రచందనం చెట్లు ఉన్నాయని అంచనా. వీటిలో 40 శాతం వృక్షాలు ఇప్పటికే స్మగ్లర్ల చేతుల్లో నేలకూలి, విదేశాలకు తరలిపోయాయి. మిగిలిన వాటిని రక్షించుకునేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. రాజకీయ, ఇతర కారణాలు పక్కనపెడితే రాష్ట్ర ఆర్థిక అవసరాలు కూడా ఎర్రచందనం వృక్షాలను కాపాడుకునే విషయంలో ప్రభుత్వం కరకుగా వ్యవహరించడానికి కారణమవుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో చాలామందికి డబ్బే ప్రధానం. అన్నింటినీ వ్యాపార దృష్టితో చూసేవారికి మంచీ చెడుతో పనిలేదు. మనం బాగుంటే చాలనుకుని, మన తరువాతి తరాల భవిష్యత్ గురించి ఏమాత్రం బెంగలేదనుకునే తత్వం ఉన్నవాళ్లకు పచ్చని చెట్లను నరికేసి, నాలుగురాళ్లు వెనకేసుకోవడం పెద్దకష్టం కాదు. కష్టమైనా వదిలిపెట్టే రకం కాదు వాళ్లు. తమ పనిలో అడ్డొచ్చే చట్టమైనా, చెట్టైనా, అధికారులైనా వారికి ఒక్కటే. ఆ భావనే శేషాచలం అడవుల్లో రక్తచరిత్రకు కారణమవుతోంది. * * * శేషాచలం అడవుల్లో ఇటీవల ఎన్‌కౌంటర్ ఎర్రచందనం చెట్ల దుంగలను తరలిస్తున్నవారు పెద్దసంఖ్యలో మరణించడం దేశంలో సంచలనానికి కారణమైంది. నిజానికి అంతకుముందు చాలాసార్లు ఎదురుకాల్పులు, స్మగ్లర్ల ఎదురుదాడులు, అటవీశాఖ సిబ్బందిని హతమార్చడం వంటి సంఘటనలు జరిగినా ఏమాత్రం స్పందించని సమాజం ఈసారి ఎన్‌కౌంటర్‌తో అతిగానే స్పందించింది. అధునాతన ఆయుధాలు సమకూర్చుకున్న అటవీశాఖ, శేషాచలం అడవుల్లో చాలాచోట్ల నిఘాకెమెరాలు అమర్చి స్మగ్లర్ల కదలికలపై నిఘాపెట్టింది. చాలాకాలంగా స్మగ్లర్లదే పైచేయిగా వస్తున్న వ్యవహారంలో ఇప్పుడు అటవీశాఖ అధికారుల కఠినవైఖరి కారణంగా కథ అడ్డం తిరిగింది. ఎన్‌కౌంటర్‌పై ఎన్ని యాగీలు జరిగినా, ఈ సంఘటనతో ప్రపంచం దృష్టి ఎర్రచందనం, శేషాచలం అడవుల ప్రాశస్త్యంపై పడింది. అలాగే, ఈ ఎర్రచందనం మాఫియా ఎత్తులు, జిత్తులు, ఆ చెట్ల విలువ ప్రపంచానికి తెలిసొచ్చాయి. భయపడని మాఫియా ఈ ఎన్‌కౌంటర్ జరిగిన పనె్నండు రోజులకే కడప సబ్ డివిజన్ పరిధిలో వంద గొడ్డళ్లు, ఎర్రచందనం దుంగలు చిక్కాయి. రైల్వేకోడూరులోని వాగేటికోన రిజర్వాయర్ సమీపంలో ఎర్రచందనం దుంగలు, కూలీలు పట్టుబడ్డారు. ఎన్‌కౌంటర్ ‘చూసిన’ తర్వాత కూడా స్మగ్లర్లు, తమిళ కూలీలు వెనుకడుగు వేయడం లేదంటే, ప్రాణాలకు తెగించి వస్తున్నారంటే వారికి ప్రాణంకన్నా విలువైనదేదో లభిస్తోందని కదా అర్థం. నిజానికి వీరి ప్రాణాలను ఫణంగా పెట్టి దళారుల దండుకుంటున్నదే ఎక్కువ. ఇదీ అక్రమ మార్గం ఎర్రచందనం చెట్లను నరికి, ‘డ్రస్సింగ్’ చేసి, ఆ దుంగలను దిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు తరలిస్తున్నారు. అక్కడ చిన్నచిన్న ముక్కలుగా చేసి సుమారు ముప్పై కిలోల చొప్పున విద్యార్థుల బ్యాగుల్లో సర్ది వారికి విమాన టిక్కెట్లు ఇచ్చి విదేశాలకు ఎగుమతి చేయడం ఒక పద్ధతిగా వెలుగులోకి వచ్చింది. ఇదే కోణంలో నుంచే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎర్రచందనం కొయ్యలను పొడి రూపంలోకి మార్చి దుబాయ్ మీదుగా చైనాకు తరలిస్తున్న వైనమూ బయటపడింది. రెండు, మూడు నెలల వ్యవధిలోనే సుమారు వంద కిలోల ఎర్రచందనం పౌడర్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడమే దీనికి ఉదాహరణ. ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళనాడు కీలక కేంద్రంగా ఉంటోంది. రోడ్డు మార్గాన చెన్నైకి చేర్చుకొని ఆపై సముద్ర మార్గాన చైనాకు యథేచ్ఛగా తరలిస్తున్న ‘బడా స్మగ్లర్లు’ కోట్లకు పడగలెత్తారు. వేరశనగ పప్పు, ఉప్పు, వంట సామాగ్రి పేరుతో ఎర్రచందనం దుంగలు నింపి సింగపూర్‌కు తరలించేందుకు సిద్ధమైన కంటైనర్‌ను గతంలో చెన్నై పోర్టు అధికారులు తనిఖీచేసి 18 టన్నుల ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అనుమానంతో సింగపూర్‌కు బయలుదేరిన మరొక కంటైనర్‌ను వెనక్కి రప్పించగా అందులో పద్దెనిమిది టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకోగలిగారు. తప్పుడు లేబుల్స్, సర్ట్ఫికెట్లు సృష్టించి ఎగుమతి చేస్తున్నారు. మయన్మార్ నెట్‌వర్క్… కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎర్రచందనం చేరుతోంది. ఓడరేవులకు చేరిన తర్వాత అక్కడి కంటైనర్లలో సరకుల కింది భాగంలో దుంగలను చేర్చి తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చూసీ చూడనట్లు వదిలేయడానికి వీలుగా కస్టమ్స్ అధికారులకు ‘ఖరీదైన బహుమతులు’ ఇచ్చి స్మగ్లర్లు ప్రలోభపెడుతున్నారు. ముందుగా రోడ్డు మార్గాల ద్వారా పశ్చిమబెంగాల్, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరం, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాలకు చేర్చుకొని అక్కడి నుంచి బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్, చైనాలకు తరలించేస్తున్నారు. ప్రతి ప్రాంతంలో అక్కడి నిరుద్యోగ యువత, కూలీలతో కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అత్యంత రహస్యంగా సరిహద్దులు దాటిస్తున్నారు. తమ దేశానికి ఎర్రచందనం తరలించగలిగితే ప్రపంచంలో ఎక్కడికైనా స్మగ్లింగ్ చేయగలిగిన సత్తా తమకుందని ‘మయన్మార్ నెట్‌వర్క్’ నిరూపిస్తోంది. బర్మా నుంచి శరణార్థులుగా భారత్‌కు వచ్చిన వారు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుంటారు. మరో దారిలో గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి, అక్కడి నుంచి నౌకల్లో దుబాయ్‌కి ఎర్రచందనం దుంగలు తరలిపోతున్నాయి. పశ్చిమబెంగాల్ నుంచి అగర్తలాకు తరలించి అక్కడి నుంచి చైనా, జపాన్‌లకు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించగలిగారు. చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారి ద్వారా ఒరిస్సా, పశ్చిమబెంగాల్ మీదుగా దుంగలను అగర్తలాకు పంపుతున్నారు. తమిళనాడు నుంచి… తమిళనాడులోని వేలూరు, తిరువన్నామలై, చెంగల్‌పట్టు జిల్లాల నుంచి పెద్దఎత్తున కూలీలు ‘ఎర్రచందనం’ కొయ్యలను కొట్టడానికి ఆంధ్రా అడవుల్లోకి వస్తున్నారు. చిత్తూరు జిల్లాకు యాభై కిలోమీటర్ల దూరంలోంచే సరిహద్దు మొదలవుతోంది. జవాది కొండల్లోని కావలూర్, పల్లంబట్టు, కోమటేరు, వీరప్పనూర్, కోయలూర్, దానమత్తూర్, జమునామరత్తూర్ ప్రాంతాల్లోని కూలీలను ఎంపిక చేసుకొని వృక్షాలను కొట్టడానికి ఏజెంట్లు పిలిపిస్తున్నారు. కూలీలను బృందాలుగా విడదీసి ఎవరు ఎక్కడికి వెళ్లి చెట్లు నరకాలో ముందే చెబుతారు. ఒక కూలీ సుమారు నెల నుండి రెండు నెలల వరకూ అడవిలోనే ఉండవలసి ఉంటుంది. దుంగలు నరకడం, వాటిని మోసుకొని ఒక చోటికి చేర్చడం, అక్కడ్నుంచి వాహనాల్లోకి ఎక్కించడం వంటి పనులన్నీ వారే చేయాల్సి ఉంటుంది. స్మగ్లర్లు కూలీలకు కన్పించకుండా ఏజెంట్ల ద్వారా అన్ని పనులూ చేయిస్తుంటారు. పది రోజుల పనికి ఒక్కొక్క కూలీకి 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కూలీల ప్రత్యేకత ఇదీ.. అడవుల్లో ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు దుంగల్ని భుజాలపై మోసుకొని రాగల శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం తిరువణ్ణామలై, సేలం, విల్లుపురం జిల్లాలకు చెందిన మలయాళీ గిరిజనుల ప్రత్యేకత. మిగతా చెట్లతో పోలిస్తే ధృడంగా, బరువుగా ఉండే ఈ చెట్లను నరకడమే చాలాకష్టం. వీటిని నరికి, తరలించే పని కష్టంతోను, ప్రమాదంతోనూ కూడుకున్నది కావడంతో వారికి భారీ ఎత్తున నగదు ఆశచూపి ఈ రొంపిలోకి ఈడుస్తున్నారు. ఏ పనుల్లేని పేదలు దీనికి ఒప్పుకుంటున్నారు. తమిళనాడు నుంచి దాదాపు ఐదు వేల మంది కూలీలు ఈ పనిపైనే ఆధారపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జైళ్లలో ఇప్పటికే రెండు వేల మందికిపైగా తమిళ కూలీలు శిక్ష అనుభవిస్తున్నారు. తిరుపతి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో చనిపోయిన ఇరవై మంది ఎర్ర కూలీల్లో ఎక్కువమంది జవ్వాదిమలై ప్రాంతానికి చెందినవారే. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూడా జవ్వాదిమలై ప్రాంతానికి చెందినవాడే. వీరప్పన్ హతమయ్యాక అతడి అనుచరులు ఎర్ర చందనంపై దృష్టి పెట్టారు. గత పదేళ్లలో సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించారు. సరిహద్దులు దాటిపోయిన ఎర్రచందనం విలువ అక్షరాలా నలభై వేల కోట్లు! సోమశిల జలాల్లో.. సోమశిల వెనుక ఉన్న జలాల్లోనూ, జలాశయంలోనూ ఎర్రచందనం దుంగలు పలుసార్లు బయటపడుతూ వచ్చాయి. కడప-నెల్లూరు సరిహద్దుల్లోని సోమశిల జలాశయం సమీపాన వెలిగొండ అడవుల్లోంచి ఎర్రచందనం దుంగలను నీళ్లలో డంప్ చేసుకుంటూ తరలించుకుపోయారు. రాపూరు, రాజంపేట, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల మీదుగా వీటిని చెన్నైకి తరలించుకుపోతూ వచ్చారు. జలాశయం వద్ద మత్స్యకారుల్లా, తిరుమలకు భక్తుల రూపంలో వందల సంఖ్యలో తమిళ కూలీలు శేషాచలానికి చేరుకుంటున్నారు. ఏడాదికి పది నుంచి ఇరవై టన్నుల ఎర్రచందనం దుంగలు సోమశిల జలాశయంలో అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. సోమశిల ‘బ్యాక్ వాటర్’ ప్రాంతమైన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం బండారుపల్లి, అట్లూరు, కుడమలూరు, బద్వేలు, నందలూరు ప్రాంతాల్లోని కోనాపురం, కొమ్మూరు ప్రాంతాల్లో చేపల వేట ముసుగులో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోంది. దీన్ని అడ్డుకోవడానికి అటవీశాఖ ‘ఎకో టూరిజం’ పథకాన్ని తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. దాడులు.. ప్రతిదాడులు మామూలే శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల సంచలనం, వివాదానికి కారణమైనా ఇక్కడ కాల్పులు, ఎదురుకాల్పులు, భయంకర దాడులు, హత్యలు సర్వసాధారణం. గతంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినా ఇప్పుడు జరిగింత ప్రచారం కాలేదు. 2011 నవంబర్‌లో శ్రీవారిమెట్టు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను శ్రీనివాస మంగాపురం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద దాచిన కూలీలు, తమను వెంటపడిన అధికారులపై రాళ్లతో దాడిచేయడం, పోలీసులు కాల్పులు జరపడం తెలిసిందే. అదేఏడు నవంబర్‌లో చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె టేకువనం వద్ద అటవీ అధికారులకు, తమిళ కూలీల మధ్య రాళ్లదాడి, ప్రతిగా పోలీసుల కాల్పులు జరపగా స్మగర్లు పరారైనారు. ఆ తరువాతకూడా 2012 డిసెంబర్‌లో మరోసారి చిత్తూరు జిల్లా భాకరాపేటకు సమీపంలో రంగంపేట బేస్ క్యాంపు వద్ద రాత్రి ఎర్రచందనం స్మగ్లర్లకు స్పెషల్ టాస్క్ఫోర్స్‌కు మధ్య కాల్పులు జరిగాయి. కరేపాకుకోన వద్ద స్మగ్లర్లు తిరగబడి రాళ్లు, గొడ్డళ్లతో అటవీ సిబ్బందిపై దాడి చేశారు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుట్ట సమీపంలో రాత్రిపూట గస్తీలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్‌ఛార్జి ఎఫ్‌బీవో జగ్జీవన్‌రావు, శ్రీనివాసరావులపై స్మగ్లర్లు రాళ్ల దాడి చేసి వారి ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్‌తో కాల్చి వేసిన సంఘటన 2013లో జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగడం ఇక్కడ అతిసాధారణం. కర్కోటకులు.. స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల ఘాతుకాలకు పరాకాష్ఠ – అటవీ శాఖ అధికారులు శ్రీ్ధర్, డేవిడ్ కరుణాకర్‌ల్ని బలి తీసుకున్న ఘటన. పెద్దబండ చేను వద్ద స్మగ్లర్లు దుంగలను తరలిస్తున్నారనే సమాచారం అందడంతో డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీ్ధర్ మరో ఆరుగురు సిబ్బందిని వెంటపెట్టుకొని వాహనాల్లో బయలుదేరారు. అడవి మధ్యలో దుంగల్ని మోసుకెళ్తున్న కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరిని పట్టుకోవాలనే వ్యూహంలో వుండగానే – అదుపులో వున్న స్మగ్లర్లు, దూరాన ఉన్న వారు కూడా రాళ్లదాడికి పూనుకున్నారు. దూరంగా నుంచి ముందుగా స్మగ్లర్లు రాళ్ల దాడి చేశారు. స్మగ్లర్లు శ్రీ్ధర్ తలపై రాళ్లతో మోది ప్రాణాలు తీశారు. అతడి బట్టలు ఊడదీసి చిత్రహింసలు పెట్టి తమ కక్ష చల్లార్చుకున్నారు. గొడ్డలితో దేహంలోని భాగాలను విచక్షణా రహితంగా నరికివేశారు. ఇదే సంఘటనలో మరో అటవీ అధికారి డేవిడ్ కరుణాకర్ కూడా స్మగ్లర్ల చేతిలో క్రూరంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన 2013 డిసెంబర్ 15వ తేదీ జరిగింది. అక్కడితో ప్రభుత్వ వైఖరిలో మార్పు మొదలైంది. స్మగర్ల అంతుచూడాలన్న కసి పెరిగింది. కాల్పుల కలకలం శేషాచలం ప్రాంతంలోని వైకోట, గాదెల అడవుల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లు 2014 జూన్ 8వ తేదీన గాలింపు చేస్తున్న సాయుధ బలగాలపై దాడులకు తెగబడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినా కూలీలు వెనక్కి తగ్గకపోవడంతో నేరుగా గురిపెట్టి కాల్పులు జరపడంతో ఒక కూలీ మరణించాడు. అయినా వారు బెదిరిపోలేదు. 2014 జూన్ 21వ తేదీన ఈ సంఘటన జరగగా, ఆగస్టులో కడప సరిహద్దుల్లో మళ్లీ వారు దాడులు చేశారు. అదేనెలలో మరోసారి యర్రావారిపాలెం మండలం చింతగుంట సమీపంలో గాదెలబీట్ నీసువంకలో పోలీసుల పైకి స్మగ్లర్లు రాళ్లతో దాడిచేస్తే పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు కలప కూలీలు మృతి చెందారు. మొన్నటికి మొన్న… ఏప్రిల్ 7, 2015న శేషాచలం కొండల్లో జరిగిన ఎన్‌కౌంటర్ ఒక సంచలనం. ఆ రోజు తెల్లవారుజామున సచ్చినోడిబండ దగ్గర 11 మంది, చీకటీగలకోన వద్ద 9 మంది తమిళ కూలీలు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. రాళ్లు, గొడ్డళ్లతో వాళ్లు దాడికి దిగడంతో ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. వారిని సజీవంగా పట్టుకుని, ఆ తరువాత ఎన్‌కౌంటర్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వివాదం రేగింది. ఈ వివాదం కోర్టుకెక్కింది. మానవహక్కులు సంఘాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక టాస్క్ఫోర్స్, సిట్ ఏర్పాటయ్యాయి. ఆ తరువాత తీగలాగితే డొంక కదిలిన చందాన ఎర్రచందనంలో అసలు సూత్రధారులు ఒక్కొక్కరూ బయటికొస్తున్నారు. ఓ నీతూఅగర్వాల్, ఓ మస్తాన్‌వలీ, ఓ బదానీ ఇలా. చివరకు చైనాకు చెందిన స్మగ్లర్లు, వారి మధ్యవర్తులు పట్టుబడ్డారు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో రహస్యంగా ఉంచిన ఎర్రదుంగల ఆచూసీ లభిస్తోంది. మున్ముందు మరిన్ని సంచలన వివరాలు బయటపడొచ్చు. ఆర్టీసీ బస్సుల్లోనూ… ఎర్రచందనం తరలింపు పకడ్బందీగా, ఎవరికీ అనుమానం రాకుండా జరిగిపోయేది. అంబులెన్సులు, ఆర్టీసి బస్సులు, స్కూలు బస్సులు, పప్పుదినుసుల బస్తాలు, అవీఇవీ అని కావు ఎలా రహస్యంగా పంపేయాలో స్మగ్లర్లకు తెలిసిన మార్గాలు ఊహించడానికి కూడా అందవు. తెలిసిన అధికారులకు నోరువెళ్లబెట్టే స్థాయిలో డబ్బిచ్చి, లేదా వారికి కావలసిన కోరికలు తీర్చి నోరుమూయించడం వారికి వెన్నతోపెట్టిన విద్య. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఒకప్పుడు కీలకమైంది. తమిళ కూలీలను చెన్నై నుంచి రాజంపేటకు తరలిస్తున్న నలభై రెండు మంది ఆర్టీసీ డ్రైవర్లు 2014 డిసెంబర్ 2వ తేదీన అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని కోయంబేడు బస్టాండులో ప్రయాణీకులను ఎవ్వరినీ ఎక్కించుకోకుండా సీట్లు రిజర్వు అయ్యాయని కొద్ది దూరం వచ్చి మార్గమధ్యంలో తమిళ కూలీలను వీరు ఎక్కించుకునేవారు. మధ్యలో ఎక్కడా బస్సును ఆపేవారు కాదు. బైపాస్ రోడ్డు మార్గాన కుక్కలదొడ్డి, రైల్వేకోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లో కొంతమందిని దించుకుంటూ కడపకు చేరుకునేవారు. రాజంపేట – రోళ్లమడుగు రహదారి దగ్గర అడవిలోంచి ఎర్రచందనం దుంగలు తీసుకొస్తున్న తమిళ కూలీలను పట్టుకొని పోలీసులు విచారించినప్పుడు ఇది బయటపడింది. కొంతమంది డ్రైవర్లు దీనికోసం అదే పనిగా డ్యూటీలు వేయించుకొని, ఎక్కువ సార్లు చెన్నై రూట్లో వెళ్లేవారు. ఒక్కొక్క తమిళ కూలీ నుంచి రెండు వేలు నుంచి మూడు వేల వరకు తీసుకునేవారు. ప్రైవేటు బస్సుల్లో ఎవరికీ అనుమానం రాకుండా లగేజీ తరహాలో దుంగలను ప్యాక్ చేసి తరలించేవారు. అధికారుల అక్రమాలు… చిత్తూరు జిల్లా కె.వి.పల్లి మండలం, యర్రవారిపల్లె మండలాల పరిధిలోని స్మగ్లర్ల గురించి స్థానికులు ఎప్పుడో బయటపెట్టారు. శేషాచలం కొండల్లోని తుమ్మలబీటు బంగళా, చాకిరేవు బండ, సానిపాయ రోడ్డు వంటి ప్రాంతాలు ఎర్రచందనం తరలింపులో కీలకంగా వుండేవి. ఇక్కడ పనిచేసే అధికారులు వారికి అండగా నిలిచేవారు. అయితే మామూళ్ల పంపకంలో విభేదాల వల్ల వారి రహస్యాలను వారే బయటపెట్టుకునేవారు. స్మగర్లకు సహకరిస్తున్న అధికారులు 2013 ప్రాంతంలో సుండుపల్లెలో పట్టుబడ్డారు. ఇక స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలు పోలీసుస్టేషన్లలో భద్రపరిచినా మాయమవడం అతిసాధారణమైపోయింది. ఇలా మాయమైనప్పుడు అధికారుల సస్పెన్షన్ మామూలే. ప్రొద్దుటూరు అటవీ డివిజన్‌లోని పోరుమామిళ్ల రేంజ్‌లోని వివిధ బీట్ల పరిధిలోని నలుగురు గార్డులు, ముగ్గురు సెక్షన్ అధికారులను 2013 సెప్టెంబర్ మొదటి వారంలో సస్పెండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సీసీ కెమెరాలు, వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. కానీ భాకరాపేట నుంచి వస్తున్న లారీలో 2014 డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తొంభై నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ రోజు చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తించాల్సిన ఇద్దరు ఫారెస్ట్ బీటు అధికారులు సీసీ కెమెరాలను పని చేయకుండా చేశారనే కారణంతో సస్పెండ్ చేశారు. 2015 మార్చిలో ప్రభుత్వం ఎర్రచందనం వేలం వేయాలని భావించి గోడౌన్లలోని కొయ్యల వివరాలు సేకరించినప్పుడు అటవీ శాఖ అధికారిక గోడౌన్లలో వందల సంఖ్యలో కన్పించకుండా పోయిన వాస్తవాలు బట్టబయలైనాయి. ఐఎఫ్‌ఎస్ అధికారి రాజేష్ మిత్తల్ ఎర్రచందనం ఎగుమతి, అనుమతులు పొందడంలో సక్రమంగా వ్యవహరించనందు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2008లో ఎర్రచందనం వేలంకు సంబంధించిన కీలక పత్రాలు, అటవీ శాఖ అధికారులు సాగించిన ప్రత్యుత్తరాలు వంటి పత్రాలు ఏవీ కనిపించక పోవడం మరో విశేషం. శేషాచలంలో అరుదుగా, అందంగా పెరిగే ఎర్రచందనం సురక్షితంగా ఉండాలంటే ముందు అందరిలో మార్పు రావాలి. వాటిని కాపాడుకోవాలన్న కోరిక కలగాలి. అధికారులు, సామాన్యులు, నాయకులు పరస్పర సహకారంతో, చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో పనిచేస్తే తప్ప అది సాధ్యంకాదు. శేషాచలం అడవులు ఎర్రచందనం అవశేషంగా మిగలకుండా, అశేషాచలంగా పరిఢవిల్లాలన్నదే సగటు తెలుగువాడి కోరిక. *

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.