కాలుష్యతాపం!
- 30/05/2015
ఆకుపచ్చదనానికీ ఎండవేడిమికీ మధ్యగల విలోమ సంబంధం గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కాలుష్యానికి వేసవి అగ్నికీలలకూ మధ్యగల అనులోమ అనుపాతం గురించి శాస్తవ్రేత్తలు చర్చిస్తున్నారు, సలహాలిస్తున్నారు. పచ్చని చెట్లు ఆకుపచ్చని పొలాలు పెరిగితే ఎండవేడిమి తగ్గిపోతుందన్నది విలోమ అనుపాతం- యాడ్వర్స్ రేషియో- పరిసరాలలో కాలుష్యం పెరిగినట్లయితే ఉష్ణోగ్రత కూడ పెరిగిపోవడం అనులోమ అనుబంధం-డైరెక్ట్ రేషియో- ఉభయ తెలుగు రాష్ట్రాలు పదిరోజులకు పైగా నిప్పుల కుంపట్లుగా మారడం ఈ చర్చలకు నేపథ్యం, గ్రీష్మతాప శరాఘాతాలకు ఉభయ రాష్ట్రాలలో తొమ్మిది వందలమంది ఆహుతైపోవడం అభూతపూర్వ విషాదం…ఉభయ రాష్ట్రాలలోను ఆకుపచ్చని స్థలాలు నానాటికీ సన్నగిల్లిపోతుండడం వల్ల రానున్న వేసవి ఋతువుల్లో ఉష్ణోగ్రత యాభయి డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరకు చేరే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందట. ప్రధాని నరేంద్రమోదీ నియమించిన వాతావరణ అధ్యయన మండలి సభ్యులు ‘పచ్చదనం పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని’ సూచించారట. ఈ ఏడాది సగటున రాష్ట్రంలో నలబయి నాలుగు డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇంతమంది ప్రాణాలు ఎండ మంటలలో మాడిపోయాయి. కొన్ని చోట్ల నలబయి ఆరు డిగ్రీలకు ప్రస్తుతం ఉష్ణోగ్రత పెరిగింది. అందువల్ల రానున్న సంవత్సరాలలో యాబయి డిగ్రీల సెంటీగ్రేట్-నూట ఇరవై రెండు ఫారెన్‌హీట్- డిగ్రీలకు వేసవిలో ఉష్ణోగ్రత పెరిగినట్టయితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందన్నది ఊహించుకోవచ్చు. అటవీ విధ్వంసం వల్ల, రసాయన రసాయనేతర విష కాలుష్యం వల్ల ప్రపంచం మొత్తం మీద ప్రతి ఏటా ఉష్ణోగ్రత పెరిగిపోతోందని దశాబ్దులుగా ఆందోళన వక్తం అవుతూనే ఉంది. అయితే మనదేశంలోను పరిసరాలలోను ప్రపంచస్థాయిని మించి ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇందుకు కారణం పచ్చదనం క్రమంగా అడుగంటి పోతుండడం. మూడువందల ఇరవై కోట్ల మొక్కలను పెంచడం ద్వారా ప్రకృతి ప్రాంగణంలో ఆకుపచ్చని అందాల సభలు తీర్చాలన్న తెలంగాణ ప్రభుత్వం వారి సంకల్పం అభినందనీయం…ఈ మొక్కలన్నీ పెరిగి పెద్దవై వృక్షాలుగా విలసిల్లినట్లయితే వేసవి అగ్నిని ప్రతిఘటించగల చల్లదనం విస్తరిస్తుంది. కానీ ఈ మొక్కలు నాటడానికే అనేక ఏళ్లు పడుతోంది. అవి అవినీతి మచ్చనిచ్చే చెట్లుగా మారడానికి ఎంతకాలం పడుతుందో? సమాంతరంగా పారిశ్రామిక వాణిజ్య వాటికలకోసం ఎంత విస్తీర్ణంలో అడవులు, పొలాలు అంతరించిపోతాయి? ప్రపంచీకరణ ప్రకృతి పచ్చని పటానికి కన్నాలు వేస్తుండడం నడుస్తున్న వైపరీత్యం.
కాలుష్యం వల్ల వేడి పుట్టడం కాలుష్యం పెరిగిన కొద్దీ వేడి పెరగడం విశ్వ వ్యవస్థలోని సహజ పరిణామక్రమం. కాలుష్యాన్ని నిర్మూలించకపోయినట్టయితే కాలుష్యం క్రమంగా భూమిని కబళిస్తుంది. కృతయుగంలో క్షీరసాగర మథనంలో పుట్టిన కాలుష్యం-హాలాహలం- భయంకరమైన వేడిని వ్యాపింపజేయడం చరిత్ర…ఆ విషాన్ని పరమశివుడు మిం గడం వల్ల బయట వేడి తగ్గినప్పటికీ లోపలి వేడి పెరిగింది. ఆ వేడిని చల్లార్చడం కోసమే ఆకాశంలోని గంగ భువికి దిగింది. గంగ నీటికి ప్రతీక. నీరు కాలుష్యాన్ని కడిగివేస్తుంది. కడిగివేయాలన్నదే భారతీయుల తరతరాల ఆకాంక్ష. ‘ఆపఃపునస్తు పృథివీ, పృథివీ పూతాపునాతుమామ్’’- నీరు భూమిని శుభ్రం చేయుగాక, శుభ్ర పడిన భూమి మమ్ములను పరిశుభ్రం చేయుగాక- అన్నది మన జాతీయ సమష్టి జీవన సంప్రదాయం. నీరు పరిశుభ్రంగా విస్తరించిన కొద్దీ మొక్కలు తీగెలు చెట్లు వనాలు బతికి పచ్చదనాన్ని పంచుతాయి. మనదేశం అంతటా బావులు చెరువులు, గుడులు, మడుగులు, కోనేళ్లు, కొండవాగులు, బుగ్గలు, విస్తరించడం పచ్చదనపు చరిత్ర…బ్రిటిష్ వారు మనదేశంలోకి చొరబడిన తరువాతనే అటవీ సంపద హరించుకొని పోయింది. ప్రతి దేశంలోను మొత్తం భూమిలో కనీసం ముప్పయిమూడు శాతం అటవీ ప్రాంతం ఉండాలన్నది ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం వారు 1950వ దశకం నుండి చెబుతున్న మాట. మొదట ప్రపంచ యుద్ధానికి పూర్వం మనదేశం యాబయిశాతానికి పైగా భూభాగంలో అడవులు ఉండేవి. ఆవులు, పశువులు, మేయడానికి వీలైన పచ్చిక బయళ్లు ఉండేవి. కాని ఇప్పుడు మన అటవీ ప్రాంతం పరిమాణం ఇరవై నాలుగు శాతం కంటె తక్కువ.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోను, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోను బ్రిటిష్ వారు భారీగా మన అడవులను నరికి కలపను తమ దేశానికి, ఇతర దేశాలకు తరలించారు. చల్లని నీడను కొల్లగొట్టడానికి అది ఆరంభం. మొక్కలు, చెట్లు తగ్గిపోతున్న కొద్దీ వేసవి అగ్నిగుండంగా విస్తరించడం ఆరంభమైంది. ఈ వాస్తవ ధ్యాస ఉన్నప్పటికీ 1947నుండీ కూడ మన ప్రభుత్వాలు అటవీ విధ్వంసాన్ని ఆపకపోవడం మొదటి వైపరీత్యం. 1990వ దశకంలో ప్రపంచీకరణ వ్యవస్థీకృతం కావడంతో పచ్చదనపు వాటికలు పాడుబడి సిమెంటు రహదారులు విస్తరించడం మొదలైంది. ఇది రెండవ వైపరీత్యం. ప్రపంచీకరణలో భాగం గా బహుళజాతీయ వాణిజ్య సంస్థలు చొరబడిపోయాయి. దేశమంతటా వెలసిన ప్రత్యేక ఆర్థిక మండలాలు లక్షలాది ఎకరాల అటవీ వ్యవసాయ భూమిని దిగమింగుతుండడం గ్రీష్మతాపం భయంకరంగా పెరుగుతుండడానికి దోహదం చేసింది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు పారిశ్రామిక ప్రగతిలో భాగంగా కొండలను ఇసుక పర్రలను తవ్వేశాయి. ఫలితంగా కొండవాగులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఇంకిపోయాయి. చెట్లు ఎలా పెరుగుతాయి? సతతహరిత ప్రాంతాలయిన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు మోడు వారడం ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణం. అటవీ ప్రాంతం కనీసం ముప్పయిశాతానికి చేరేవరకు ఒక్క ఎకరం భూమిని కూడ పరిశ్రమలకు కేటాయించరాదన్న ధ్యాస ప్రభుత్వాలకు కలిగే వరకు ప్రతి ఏడాది మరింతగా ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుంది. వేసవి మరణాల సంఖ్య మరింత పెరగకుండా నిరోధించడానికి ఈ ధ్యాస అనివార్యం…
కానీ పచ్చదనం పాలిట కరకు కసాయి గొడ్డలిలా తయారైన ప్రపంచీకరణ మరింత బలపడుతోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలన్న పట్టుదల వల్ల పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతుందన్నది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2011 ఫిబ్రవరి మూడవ తేదీన ఢిల్లీలో చేసిన చారిత్రక ప్రకటన. అంటే అడవులను పచ్చదనాన్ని కాపాడడం కంటె కృత్రిమమైన పారిశ్రామిక కాలుష్య వాటికలు ఏర్పడడం ప్రధానమన్నమాట. ఈ కాలుష్య వాటికలు ప్రత్యేక అర్థిక మండలులు..ఉష్ణోగ్రత పెరగకుండా ఎలా నిరోధించగలరు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా పచ్చదనానికి విఘాతకరమైన పారిశ్రామిక విధానాన్ని కొనసాగిస్తోంది. భూమి సేకరణ సవరణ ఇందుకు సరికొత్త సాక్ష్యం…‘దీపం తేరా దిగనేతాము..’ అన్న చందంగా ఒకవైపున గంగ ప్రక్షాళన జరుగుతోంది..మరోవైపున ప్రపంచీకరణ విస్తరించిపోతోంది.