డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’-2-సమీక్ష (చివరి భాగం )
డా వెంకటేశ్వర –గారు కవితా సంపుటికి పెట్టిన పేరు ‘’పాఠం’’అని ముందే చెప్పుకొన్నాం .ఆ శీర్షిక తో ఉన్నకవిత ను చూద్దాం .చరిత్ర అంటే పిల్లలకు అసహ్యం. కారణాలు చాలా .హద్దుల్ని నిర్ణయిస్తూ ,ఆహవాలే (యుద్ధాలే )తప్ప ఆటలు లేక పోవటం ,తమ ప్రశ్నలకు చరిత్ర జవాబు చెప్పదనే సంశయం అన్ని పేజీలు ఒకే మూసలో ఉంటాయన్న విసుగు అందుకే వాళ్లకు చరిత్ర అంటే గతకాలపు పాత వాసన .అందుకని కవిగారు ‘’పిల్లలు ఇస్టపడేలా చరిత్ర మొత్తం తిరగ రాయాలి ‘’అని తమ అభిప్రాయం తేట తెల్లం చేశారు .తాగు బోతు సంసార జీవితం లో ‘’పాన సుఖ లాలసలో –కాలం మంచు ముక్క కరుగుతుంది –రోజు రోజుకీ ఇల్లాలిగాజులు పెద్దదవుతాయి –పగిలిన సీసా పెంకులు పిల్లల గుండెల్లో దిగబడతాయి .’’అంతేకాక ‘’ఊరవతలి కొంపల్లో –కాలం బరువుగా కన్నీటి బొట్లుగా కారిపోతుంది –‘’ఒక్కో చుక్కా యెంత విలువైనదో తెలిసినా ‘’ఆ చుక్కను’’ మాత్రం వదలలేని బలహీనత కొంపల్ని కొల్లేరు చేస్తుందనే బాధ చూపారు ‘’దృశ్య దృశ్యం ‘’లో వర్షం ఎలా కురుస్తోందో తెలుసా ?’’మొయిలేనుగు (మేఘం అనే ఏనుగు )చదలేట్లోంచి (ఆకాశం అనే ఏటి లో నుంచి ) నీల్లేత్తి కుమ్మరిస్తున్నట్లు .’’ఇంతకురిసీ ఆగిపోయినా ‘’యెదలోపల కురుస్తూనే ఉంది అలజడి వాన ‘’ఎందుకు ?’’పొద్దుననంగా బయటికెళ్ళిన ‘’ఆరోప్రాణం’’ కోసం ఎదురు చూస్తూ ‘’ అన్నారు ‘’వర్షం కురిసిన రాత్రి ‘’కవితలో .సాహితీ సభ ఆహ్వానం లోని అక్షరాలూ ‘’సుతిమెత్తని ఎద లాంటి కాగితంపై ప్రేమాభిమానాలు అక్షరాలై దీపిస్తూ ‘’అని ‘’అక్షర స్మ్రుతి ‘’ వీణను మీటుతారు .అన్నీ చెప్పగలం సలహాలూ ఇవ్వగలం కాని ‘’మనల్ని మనం పసిగట్టటం –నిజంగా ఎంత కష్టమో ?’’అని ‘’అంతర్వాహిని ‘’ని వెలువరిస్తారు .ప్రతి నగరం లోను సాధారణంగా కనిపిస్తాడు ‘’రోడ్డు చిత్రకారుడు ‘’’’మురికి చేతులతో తపో దీక్ష తో బొమ్మ గీసి కనక కిరీటాన్ని రూపొందిస్తాడు –కాలం మనుషులు కాసేపాగి మళ్ళీ పరుగో పరుగు .’’నాలుగు రాళ్ళు ఏరుకొని చీకట్లో కల్సిపోతాడు ‘’కాని అతడు వేసిన బొమ్మ మాత్రం సూదంటురాయిలా ఆకర్షిస్తూనే ఉంది’’ .ఇలాంటి రోడ్డు చిత్రకారుల గురించి ఇంకెవరైనా కవిత రాశారో లేదో నాకు తెలియదుకాని వెంకటేశ్వర మాత్రం అతనికి అక్షర శిల్పం చెక్కారు .నేను 1956-60 లో బెజవాడ లో ఇంటర్ డిగ్రీ చదివినప్పుడు ,ఒకప్పుడున్న అలంకార్ టాకీస్ వద్ద ఒక గుడ్డి అతను ఇలానే రోడ్డు మీద బొమ్మలేసి ప్రాణ ప్రతిష్ట చేసి డబ్బా మొగి౦చు కొంటూ అడుక్కునేవాడు .అతను దాదాపు పదేళ్ళ క్రితం వరకూ అలానే గడిపాడు .అది నాకిప్పుడు గుర్తొచ్చింది .
ఎన్నో ఊహించుకొని తన ఊరి బస్సెక్కి వెడుతుంటే ‘’కనుచూపు మేరా ప్లాట్లు అవుతున్న పొలాలు ‘’చూసి దారి తప్పానను కొన్నారు కవి .ఇన్నేళ్ళకు తిరిగొస్తే చిరు నగవు తో పలకరించే నేస్తమే కరువయ్యాడు .’’ముసలి పల్లె మూగగా రోదిస్తోంది –మూలాలనేవరో –కుదిపేస్తున్న భావన ‘’కలిగింది .తనకోసం విత్తనాలు చల్లే నేస్తాలను ‘’మీకోసం నేను –ఈ నేలమీద బీజాక్షరాలు రాస్తాను ‘’అని ఆహ్వానించారు .ఈ నాటి ప్రతి పల్లె సీమ దైన్య స్తితి ఇదేగా .’’నగరానికి ఎప్పుడోకానీ రెండు కాళ్ళూ ఒకే చోట నిలవవు –గడియారపు ముళ్ళల్లె’’-కుటుంబరావు గాఢ నిద్రలో మునిగినప్పుడు ఉన్నదికాస్తా దొంగలు ఊడ్చుకెళ్లితే ‘’తెల్లారని బతుకులు –తెల్లారి పతాక శీర్షికలు ‘’అవుతాయి పత్రికలలో ‘’ఒక రోజు ‘’.
‘’ప్రపంచం కుగ్రామం అవుతుంటే ఇళ్ళన్నీ చిన్న బోతాయా ?’’అనే మౌలిక ప్రశ్న సంధించారు ‘’ప్రక్షాళన ‘’లో .అలాగే ప్రణయ రంజిత రాత్రి ‘’రాగ మయి ‘’అయి అనురాగమయి అయి ‘’జయ భేరి ‘’మోగిస్తుంది .’’ఎన్ని అస్తిత్వ ప్రత్యేకతలున్నా –మానవతకు లేవు సరిహద్దులు ‘’అని విశ్వ విపంచిని మీటారు కవి ‘’సారం ‘’లో అసలు కవితా సారం ఆదేనంటూ .చరాచారాన్ని ఉత్తేజ పరుస్తుంటే ,సుప్రభాత గీతం పాడుతుంటే ‘’రాత్రంతా బహుశా –వేకువనే కలగందేమో భూమి ?’’అనే అనుమానమొచ్చింది .అసూయ ఈర్ష్య ద్వేషం కమ్ముకొన్న మానవాళి ‘’తననీడనే భరించలేక పోవడం –మనిషి తనమేనా ‘’అని ‘’నీడ ‘’ను చూసి ఝాడుసుకొనే జనాన్ని చూసి సంధించిన ప్రశ్న .మానవత్వమే కనుమరుగైపోతోందన్న ఆందోళన .,ఆవేదన .మాటల్లో నిర్లక్షంగా మంటలు పుట్టిస్తుంటే స్నేహ గంధం వేడెక్కి పోతుంది .ఆ పొగ పెనుపాములా చుట్టేస్తుంది .ఇది పద్ధతికాదు అని చెప్పటానికి గొంతు సవరించుకొంటు౦ టే –గొంతు కేదో అడ్డు పడుతోంది ‘’అన్నారు ‘’స్నేహ ధూపం ‘’లో .రోడ్డు మీద ఇస్త్రీ చేసే వాడిని ‘’చలువరి ‘’అన్నారు సాభిప్రాయం గా .అతడికి తెలియని చిరునామా ఉండదు .కాని అతని చిరునామా మాత్రం ‘’రంగు వెలిసిన చెక్క బండే’’అనటం మహాద్భుతం .’’మూటలు మూటలు బట్టలు చలువ చేస్తాడుకాని –అతడ్ని మాత్రం చలువ బట్టాల్లో –ఎవరైనా చూశారా ?’’లేదనే కదా సమాధానం .ఎప్పుడో తిలక్ ‘’పోస్ట్ బంట్రోతు ‘’గురించి కవిత రాసి మనః హృదయాలలో అతన్ని నిలబెట్టాడు .ఇప్పుడు ఉప్పలధడియం వారు మళ్ళీ అలా అక్షర చలువ పందిరి వేశారు చలువరి కి.
సూర్యుడు కబేళాకు వెళుతున్న మేక పిల్లలా పడమరకు వెడుతున్నాడని ,మారాం చేసే కొడుకును ఆపలేక చితక్కోట్టిన తల్లి ‘’చిరుగు చీరతో కళ్ళు ఒత్తుకుంటుంది మళ్ళీ ‘’.సత్య సాయి బాబా ‘’మనుషుల్ని ప్రేమ స్వరూపులుగా సంభావించిన జ్ఞాన శిఖరం –ఆత్మ సౌరభ స్పృహ కలిగించే సత్యం –సమస్త లోకానికి శాంతిగీతం ‘’అని పించి ‘’అక్షరాంజలి ఘటించారు .కవిత్వానికి ఏ నిర్వచనమూ సరిపోలేదు కవిగారికి .కార్పోరేట్ ఆస్పత్రులలో ఎరగా అస్పష్ట చిత్రాలు ఆక్వేరియం లు ఉంటాయి .కాని అక్కడ ప్రాణం ఖరీదు ఎంత ఎక్కువో ఎవరికి తెలుసు ?’’(’’అ )మూల్యం’’ .అని వ్యంగ్యం .ఇల్లాలికికి ‘’నిద్ర మోయ లేని భారం ‘’ఆమె రెండు చేతులూ ‘’శత సహస్ర బాహువులై విస్తరిస్తాయి .రెండు కాళ్ళూ విరామం లేకుండా సంచరిస్తాయి .ఇదంతా ఎప్పుడు ?తెల్లారగట్ల .భర్తకు అన్నీ అందించాలన్న ఆరాటం తో .మరి ఆమెకు ఎమివ్వగ లడు ‘’నన్ను తప్ప ‘’అంటారు ‘’తెల్లార గట్ల ‘’కవితలో .చివరి మాట ఒక్కటి చాలు ఆమె చేసే సేవకు ప్రతిఫలంగా .
‘’మల్లెకు ఆశ ఆమె లా నవ్వాలని –గులాబీకి ఆశ –ఆమెలా మెరవాలని –శతపత్రానికి ఆశ –ఆమెలా వికసించాలని ‘’అంటూ ‘’ఈ పూలకు ఎంత దురాశో ! అని ముక్తా యించారు .’’కలలకు ఆమె ఆసరా –అయినా –ఎంత నిష్టూరం గా మాట్లాడుతుందో !’’అదీ ‘’మూడు ముళ్ళ’’ బంధం లోని ప్రేమ ఆప్యాయత అనురాగం .’’ఆవిడకు ఓరోజంటే’’ఏమిటో తెలుసా ?’’నుదుటి బొట్టును తూర్పు గోడకు అంటించి దిగుతుంది ‘’బియ్యం లో వేళ్ళతో రాస్తుంటేనే పాకం కళే’’అని గ్రహించింది .ఇల్లు అంట్లు ధగ దగా మెరుస్తున్నాయంటే అది ఆమ్లాల శక్తికాదు ఆమె చెమట తో తడవటమే కారణం –అవసరాలు ఆకాంక్షలు కూర్చోనివ్వవు –ఇంటి పనికీ బయటిపనికీ –ద్విచక్రవాహనమై –తిరుగు తుంది ‘’’’ఆమె సిగ లో చేరలేని పూలన్నీ –ఆకాశం లో తారకలై –తృప్తి పడతాయి ‘’ఎంత గొప్ప భావాన్ని ఎంత కమ్మని భాషలో గుండె లోతుల్లోంచి చూసి చెప్పారు వెంకటేశ్వర గారూ!
‘’విష సంస్కృతీ ని విస్త రింప జేసే –వర్తమానాన్ని ప్రశ్నించ కుంటే –భవితవ్యమూ ప్రశ్నార్ధకమే –సహజీవన సౌరభం –గగన కుసుమమే ‘’అని హెచ్చరిస్తారు కర్తవ్య బోధ చేస్తూ .ఇదికవి దార్శనికత -చదరంగం ముందు కవిగారి అమ్మాయి కూచుని తండ్రిని ‘’రాయలు ‘’ను చేస్తుందట .నాన్న ను ఓడించేశానన్న సంతోషం తో ఆమె ఉంటె ‘’గెలుపును మించిన ఓటమి –మనసంతా చిత్తడి చిత్తడి ‘’పరమ వైభవ వర్ణన .పిల్లల చేతుల్లో ఓడిపోవటం లో ఉన్న మహాదానందానికి మచ్చు తునక ఈ కవిత. ‘’కవి’’ అంటే మనకవి గారు –‘’లోకం చుట్టూ తిరుగుతూంటా –అప్పుడప్పుడు –నాచుట్టూకూడా ‘’అని సహజ సుందర నిర్వచనం చేశారు .
ఇలా ఎన్నని ఉదహరించను ?ప్రతి కవితా ఆణి ముత్యమే –ప్రతి పంక్తి ‘’కోటబుల్ కోట్ ‘’ ఇవికాక ఇంకా ఎన్నో చెప్పాల్సినవి ఉన్నాయి .మచ్చుకు మాత్రమే నేను కొన్ని చెప్పాను .ఇష్టం ఉన్నవారికి ‘’హైకూ ‘’కూతలూ ఉన్నాయి .సుమారుగా 70 కవితలు .ప్రతిదీ చదివి ఆస్వాదించ దగినదే .చాలాకవితలు చెన్నై రేడియోలో ప్రసిద్ధ పత్రికలలో వచ్చినవే .బహుమతులూ అందుకొన్నవే .కవిగారి కృషికి జేజేలు –పలుకుతూ సెలవ్ –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-2-6-15- ఉయ్యూరు
ప్రతులు కావాల్సిన వారికీ చిరునామా
Smt –V.Usha – No 1-A-4th street –V.V.colony –Adambakkam –chennai -88 –phone -044 -42028010 –price rs -60 .