శ్రీమతి ఇందిరాదేవి నట విశ్వ రూప ప్రదర్శనమే –ఇంటింటికో కద నాటిక
ఆకాశ వాణి విజయ వాడ కేంద్రం డైరెక్టర్ గారికి –
3-6-15 బుధవారం హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 9-30 గం లకు ప్రసారమైన ‘’ఇంటింటికో కద’’ అత్యద్భుతం .ఇల్లాలి పాత్రలో శ్రీమతి ఇందిరాదేవి భావ ప్రకటన అనితర సాధ్యం అనిపించింది .స్వచ్చమైన వాచకం తో నిష్టూరాలు, దెప్పి పొడుపులు ,ఆప్యాయత ,అనురాగం, కుటుంబ బంధం ,బాధ్యత ,అలకా, అనునయం ,మాటకు మాట అంటించటం ,అత్తగారిని దెప్పటం, అమ్మను అనునయంగా బతిమాలటం ,భర్తపై యెనలేని ప్రేమ ,ఉద్యోగ ధర్మం ,పిల్ల చదువు భవిష్యత్తుపై ఆరాటం ,భర్త కు దూరమై బదిలీ అయితే ఆ అర్భకుడు పడే ఆగ చాట్లను తట్టుకోలేక పోవటం అన్నీ ,ఇందిరా దేవి గొంతుకలో సహస్రదళపద్మం లా విర బూశాయి .నిజంగా చెప్పాలంటే మాటలు రావు .చాలవుకూడా .రేడియో నాటికకు ఆమె ఒక వరం .ఆమెది సుస్వరం .ఆమె నట విశ్వరూప ప్రదర్శనమే ఈ నాటిక .
ఎన్నేళ్ళయిందోయిందో ఇంత కమ్మని తెలుగు నాటికను విని .మొదటినుంచి చివర వరకు సంభాషణలే నాటికకు జీవం పోశాయి .గాత్ర ధారులైన పాత్ర దారులు నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చారు .రచయిత బహుదా ప్రశంసనీయులు .అరగంట నాటిక అయిదు నిమిషాల్లో అయిపోయి నట్లు అనిపించింది .ఇంత అనుభూతిని మిగిల్చిన నాటిక కర్త ,ప్రయోక్త ,నటీనట బృందానికి ,ప్రసారం చేసిన హైదరాబాద్ కేంద్రం వారికి అభినందన శతం .అయితే ముగింపు ట్రెడిషనల్ గా ఉండటం అంత బాగాలేదని పించింది .మారుతున్నకాలానికి తగిన ముగింపు కాదు .చప్పట్లు కొట్టి౦చు కోవటానికి చేసిన ముగి౦పే. ఏమైనా బుధవారం రాత్రి వీనులకు గొప్ప విందు అనుభవించాం .
ఆ తర్వాత విశాఖ నుండి ప్రసారమైన రాగం తానం పల్లవి లో శ్రీమతి మండ శ్రావ్యమైన స్వరం తో అమ్మవారిపై కీర్తనను గానం చేసి దివ్యాను భూతిని కలిగించారు వాద్య సహకారమూ ముచ్చటగా మెచ్చదగినదిగా ఉంది .
గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-15-ఉయ్యూరు