గతి తప్పిన రుతురాగం

గతి తప్పిన రుతురాగం

  • 07/06/2015
  • -సుధామ, కృష్ణతేజ

వాన రాకడ… ప్రాణం పోకడ… -అని మనవాళ్లు ఊరికే అనలేదు. ఈ రెండూ ముందుగా గుర్తించడం అసంభవం. ఎంత శాస్త్ర సాంకేతికాభివృద్ధి జరిగినా, అంచనాలు వేయడమంటూ జరిగినా, అనుకున్నట్టుగానే జరుగుతుందని అస్సలు చెప్పలేం! అయితే ‘అతివృష్టి’ – లేకుంటే ‘అనావృష్టి’ అన్నట్లు పరిస్థితులుంటూంటాయి. ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా – ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా’ అని వర్షం పాటలు ఎన్ని పాడుకున్నా, అది రాదలచుకుంటే వస్తుంది. లేదంటే లేదు. వచ్చినా ఎంత శాతంగా తన ‘పాతం’ నమోదు చేసుకుంటుందో, జరిగాక కానీ చెప్పలేం! వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో – ఆ వ్యవసాయం కూడా ప్రధానంగా వర్షాధారితం కనుకనే, ‘వాన రాకడ’ పట్ల మనకంత నిరీక్షణలూ, మమకారాలూ! కానీ, రోజులు మారిపోతున్నాయి. మేధోమథనాలు, మేఘ మథనాలు వచ్చాక ‘దృక్పథాలూ’ మారిపోతున్నాయి. ఒకప్పుడు వానతో ముడివడిన అనుభూతులు క్రమంగా అంతరించి పోతున్నాయేమోనన్న బెంగా కలుగుతోంది. ‘వానల్లు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా’ ‘వానావానా వల్లప్పా’ అని పాడుకునే పిల్లలు ఇప్పుడు – ‘రెయిన్ రెయిన్ గో ఎవే’ అని పాడుతున్నారు. వరుణుడికి కోపం వస్తే రావచ్చు మరి. ‘ఎల్.కె.జి. రైమ్‌కీ, ‘ఎల్‌నినో’కు సంబంధం ఉంటుందా? అంటే ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ అయిపోవచ్చు. మెయిల్ కాదు గానీ, ‘మొయిలు’ అంటే మేఘం అనే. ‘బ్లాక్‌మెయిల్’ అనగా నల్లని మేఘం అంటే వర్షవాహికగా భావిస్తాం మరి! ‘మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకుంటామా’ – అలా చేస్తే ఇప్పటికే తాగునీరు సమస్య పెరిగిపోతోంది. అది మరీ గుక్కెడు నీరు అందని విపత్కర పరిస్థితి తెచ్చేయవచ్చు. గుంపులు గుంపులుగా కనపడ్డ మబ్బులు గుప్పెడు నీళ్లయినా చల్లకుండా తేలిపోవచ్చు. ‘కుంభవృష్టి’ అనగా కుండపోత నీరు పడడం పోయి వాన వాటర్‌బాటిల్ ఒంపినట్లుగా పడి ముగిసిపోనూ వచ్చు. అసలు ‘వానాకాలం’ అనే దానికి గొప్ప ప్రాధాన్యం. సకాలంలో పంటలు పండాలంటే సకాలంలో వర్షాలు కురవాలి. వర్షం కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అంటూ బిందు వ్యవసాయంలోకి దిగితే ‘డిప్రెషన్’ రావచ్చు. రైతు ఆత్మహత్యలకు వర్షాభావ పరిస్థితులూ హేతువులవుతున్నాయనే మాట ఉంది. పర్యావరణ సమతుల్యతను చేజేతులా మనమే దెబ్బతీసి అడవులు, చెట్లు నరికివేస్తుంటే ఇక సహజ వర్షాలను చేజేతులా అడ్డుకున్నట్లే అని శాస్తవ్రేత్తలు ఘోషిస్తూన్నారు. ‘వానలో తడవనివాడు’ మనిషే కాడు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సహజసిద్ధంగా జీవనం గడపవలసిన మనిషి ఆ సహజాతాలకు దూరంగా ఆ కాలానికి తగినట్లుగా కాక ప్రతికూలతలను సౌకర్యాలుగా సంభావించి అనుభవించడం నేర్చుకుంటున్నాడు. వానలో తడిస్తే మొక్క మొలిచి పోతానన్నట్లు భయపడుతున్నాడు. వివేకం బదులు విలువలు నశించి బుర్రలో మట్టి పెరుగుతున్నప్పుడు సదరు భయాలు సహజమే అనిపిస్తోంది కూడాను. మునుపు ‘వానాకాలం చదువులు’ అనేవారు. వర్షపురోజుల్లో బడులు, బోధనలు సెలవులెక్కువ పుచ్చుకునేవి అప్పుడు. కానీ, వానాకాలం చదువు అంటే నిజమైన వ్యవసాయ విద్య అనే భావనా వుండేది. చెట్లు చేమలతో, పొలాలతో ప్రకృతితో ప్రతి మనిషికీ అవినాభావ సంబంధం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటి పిల్లలు కొందరు బియ్యం చెట్లకు కాస్తాయనుకుంటున్నారంటేనూ, ఏది ఏ పొలమో, ఏది ఏ చెట్టో మొక్కో చాలామంది గుర్తించలేని స్థితిలోనే వున్నారంటేనూ వానతో, ప్రకృతితో వారికి అనుబంధం ఎడమై పోవడమే. సన్నగా వర్షం పడుతూంటే రేడియోలో వివిధభారతిలో ఏ హిందీ పాటనో వింటూ, వేడివేడి పకోడీలో, మిరపకాయ బజ్జీలో తినడంలోని అనుభూతి- ఆ మజా అనుభవిస్తే గానీ తెలియదు కదా! ఇప్పుడు రేడియో ఔట్ ఆఫ్ డేటెడ్ కదా పాపం! ‘బర్సాత్ కీ ఏక్ రాత్’, ‘వర్షం కురిసిన రాత్రి’ లాంటి కథలు సాహిత్యంలో హృదయదఘ్నంగా చేరువైన రోజులూ వెళ్లిపోతున్నాయి. ‘కొమ్మచాటు పువ్వు తడిసె – ఆకుచాటు పిందె తడిసె’ అని వర్షపు గీతాలు, సినిమాల్లో వర్షపు సన్నివేశాలు ఎంతగా ఎందరి అనుభూతి ప్రపంచాన్ని చుట్టుకున్నాయో మాటల్లో చెప్పడం కష్టమే! వర్షంతో ముడిపడిన కథలెన్నో! కావ్యాలెన్నో! ‘నగరంలో వాన’ అని కుందుర్తి సుదీర్ఘ వచన కవిత రాశారు. అలాగే, వర్షం గురించి వంగపల్లి విశ్వనాథం అనుభూతి వీచికలు కవితాత్మకం చేశారు. సినిమాల్లో వాన పాటలు, వాన దృశ్యాలకు కొదవే లేదు. మబ్బు మరణించి వానగా మారిపోవు విత్తు మరణించి మొక్కగా మారిపోవు అంటూ మృత్యుకేదారముననె జీవి సుమించుట చూస్తాం- అని తాత్త్విక కవిత నల్లిన వారున్నారు. వానలు ముంచెత్తితే వరదలే! గాలివాన ఒక బీభత్స దృశ్యమే. పాలగుమ్మి పద్మరాజుగారి ‘గాలివాన’ కథకే అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇప్పుడు తుపానులు కూడా కొత్తకొత్త పేర్లు పెట్టుకుని వస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘హుద్‌హుద్’ తుఫాను అందాల విశాఖను ఊడ్చిపారేసింది. ఇప్పుడిప్పుడే విశాఖ మళ్లీ ప్రకృతి అందాల చిగుళ్లు తొడుక్కుంటోంది. వరద బీభత్సాలు పంటలను, గ్రామాలను పాడుచేస్తే వర్షాభావ పరిస్థితులు కరువు కాటకాలు తెస్తాయి. వానలు పడక పోవడమంత దురదృష్టం మరొకటి లేదు! వర్షాల గురించి అధ్యయనాలు ఇవాళ ప్రపంచమంతటా సాగుతున్నాయి. వాతావరణ శాఖ వాన రాకడ అంచనాలకు అహర్నిశలూ కృషి చేస్తూ ఉంది. డైనమిక్ థియరీ, జెట్ స్టీమ్ థియరీ వంటి కొత్తకొత్త పరిశోధనలు వచ్చాయి. ఎల్‌నినో ఏర్పడితే వర్షాభావ పరిస్థితులెదురై కరువు కాటకాలకు దారి తీస్తుందంటున్నారు శాస్తజ్ఞ్రులు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో వచ్చే ఉష్ణోగ్రతల్లోని పెనుమార్పులే ఎల్‌నినోకు కారణం సాధారణ ఉష్ణోగ్రతలకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు మధ్య తూర్పు పసిఫిక్ జలాల్లో సంభవించి మిగిలిన సముద్ర ప్రాంతాలకు విస్తరించడమూ జరుగుతోందిట! వేడి నీటి ప్రవాహాలు సముద్రంపైన గాలిలో నీరు చేరేందుకు అడ్డుపడి వర్షాభావంతో కరువులకు నెలవులు అవుతూంటాయి. సముద్రపు నీటి ప్రవాహాల్లో వేగం తగ్గడం కూడా ఎల్‌నినో ఏర్పడడానికి సంకేతం అంటున్నారు శాస్తజ్ఞ్రులు. నీటి ఉష్ణోగ్రత సామాన్య స్థితికన్నా బాగా తగ్గిపోవడంవల్ల ‘లానినా’ సంభవిస్తుంది. ‘ఎల్‌నినో’ అయినా, ‘లానినా’ అయినా ఉష్ణోగ్రతల్లో తారతమ్యాల వల్ల ప్రమాద సూచికలయ్యే వీలుంది మరి! భూగర్భ జలాలు కూడా క్రమేపీ తగ్గిపోతున్నాయి. చెరువులు, కుంటలు కూడా కబ్జాలకు గురై, కాంక్రీటు భవనాలు లేచిపోతుంటే పర్యావరణం దెబ్బతినక ఏమవుతుంది? దారికి ఇరుపక్కలా మొక్కలు నాటించిన, బావులు తవ్వించిన అశోకుడు వంటివారు ఇవాళ చరిత్ర పుటలకే పరిమితమై పోయారు. వ్యక్తి స్వార్థంతో ప్రకృతి వనరులు కూడా దోపిడీకి గురవుతున్నాయి. మొక్కలు నాటడం కన్నా నరకడం పరిశుభ్రత అనుకునే దుస్థితి వచ్చింది. ‘వన మహోత్సవం చేద్దాం మొక్క నాటడానికి చోటు చూడండి’ అని అధికారులు ఆదేశిస్తే, ‘గత సంవత్సరం నాటిన చోటు బానే వుందండీ! అక్కడే నాటేద్దురుగాని’ అని సమాధానమిచ్చే సహాయకులు, స్వచ్ఛ భారత్ చేయాలంటే చీపుర్లు పట్టడం కోసం ఆ నేతలకు సమీపంలోనే చెత్త చేర్చేవారు రూపొందుతున్నారు. ‘వాన నీటిని వృథా కాకుండా కాపాడాలి’ అన్నది నినాదంగా మిగిలిపోకూడదు. వానలు అరుదై పోతే వాననీరు మరీ అరుదై పోతుంది. కృత్రిమ వర్షాలు కృత్రిమ వర్షాలే అవుతాయ గానీ రుతుపవనాలతో సహజసిద్ధంగా వర్షించినవి కాజాలవు కదా! నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నుండి జూన్ మొదటి వారంలో ప్రవేశించడం మన దేశంలో సహజంగా జరుగుతూ ఉంటుంది. వీటి కారణంగా సెప్టెంబర్ వరకు వానలు పడే వీలుంటుంది. అయితే, వర్షపాతం ఎక్కువ, తక్కువలు అనేది సముద్ర జలాల ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. మబ్బులు ఏర్పడటంతో సరిపోదు. అవి సరియైన దిశగా పయనించి కొండలను తాకి తాము ధరించిన నీటిని వర్షించడం ముఖ్యం. ఈ పరిణామం సహజంగా ఎంత చక్కగా జరిగితే వర్షపు పరిమాణం అంత హర్షదాయకం అవుతుంది. నీరే ప్రాణాధారం అన్నారు. భూమినైనా మూర్ఛ నుంచి తేర్చేది వర్షపు నీరే. వర్షం రైతు నేస్తం మాత్రమే కాదు. సర్వ జీవరాశి జీవన నేస్తం కూడాను. వానల కోసం భారత విరాట పర్వ పారాయణాలు చేయడం, కప్పలకు పెండ్లి చేయడం ఈ భరత భూమిలో ఇప్పటికే జరుగుతూనే ఉంది. వానాకాలం అంటే ప్రాణకోటి జీవనకాలం ప్రకృతితో మమేకమై విలువల జీవధార నింపువడం ఎప్పటికీ అవిస్మరణీయ అంశం. * కాలం మారింది! సంగీతంలో శ్రుతి బాగుంటేనే శ్రావ్యంగా ఉంటుంది. అది మనసుకు హాయినిస్తుంది. రుతురాగం బాగుంటేనే మనిషి బతుకు బాగుంటుంది. శ్రుతి, లయ తప్పితే విలయమే. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా భారతీయుల జీవితానికి రుతురాగమే చుక్కాని. తొలకరితో మొదలయ్యే వారి జీవనరాగం, మధురిమలొలకాలంటే ఏ కాలానికి ఆ కాలం తన పని తాను చేసుకుపోవాలి. ఆ పనికి మనిషి ఆటంకాలు కల్పిస్తే వచ్చే విలయానికి బలయ్యేది అతడే. అది ఇప్పటికే అనుభవంలోకి వచ్చేసింది. రోహిణి కార్తెలో రోళ్లు పగలడం మామూలే అయినా ఇప్పటిలా పిట్టల్లా మనుషులు రాలిపోవడం ఇటీవలి కాలంలో ఎదురైన విషాదకర పరిణామం. నీడను, తిండిని, చక్కటి గాలిని ఇచ్చే చెట్టూచేమను తెగనరికిన ఫలితం ఇది. సముద్రాలు వేడెక్కి ఏర్పడిన మేఘాలు చల్లబడటానికి కావలసిన చల్లని గాలిని ఇచ్చే చెట్లు లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పటికే మానవాళికి అనుభవంలోకి వచ్చింది. పచ్చనిచెట్టు నరకొద్దని పూర్వం ఎందుకు చెప్పేవారో ఇప్పటి తరానికి అర్థం కాదు. వసంతం వచ్చినా కోకిల గొంతుల్లో అప్పటి మాధుర్యం విన్పిస్తోందా? మేమున్నామంటూ అక్కడో, ఇక్కడో ఓ కోకిలగొంతు సవరించుకుంటున్నదే తప్ప అప్పటిలా కుహుకుహుల వింజామర ఏదీ! ఎండమావి ఎలా ఉంటుందో వేసవి చెబుతుంది. తీరని కోర్కెలు, లేదా అలవికాని హామీలను ఎండమావితో పోల్చేవారు. ఇప్పటి తరానికి ఈ రెండు అనుభవమే. అలాగే బతికేస్తున్నాం. వేసవికాలం పెరిగిపోయి, వర్ష రుతువు చిన్నబోతోంది. తొలకరి కోసం దేశం యావత్తూ ఎదురుచూస్తుంది. ఎందుకు. మిగతా ఏడంతా పనీపాట, పాడిపంటా, డబ్బూదస్కం దండిగా రావాలంటే తొలకరితోనే సాధ్యం. అందుకే ఆశగా ఆకాశం వైపు, కరిమేఘాల కోసం, వానచినుకు కోసం పరితపిస్తాడు రైతు. మన చేతినిండా పంట, పశువు కడుపు నిండా గ్రాసం కావాలంటే తొలకరి సకాలంలో పలకరించాల్సిందే. తొలి చినుకులతో తడిసిముద్దవ్వడం ఓ తరహా ఆనందం. తొలకరి వానలో చిన్నాపెద్దా తడిసిముద్దవ్వడం అలనాటి మురిపెం. చూరుకింద బొట్లు, బొట్లుగా జారే ముసురువాన నీటిచుక్కలతో వచ్చే బుడగలు అలా లేచి టప్పున పేలిపోవడం ఓ ముచ్చట. జీవితం కూడా అలాంటిదేనని, ఎప్పుడు ఎలా ముగుస్తుందో చెప్పలేమనడానికి ఆ బుద్బుధం ఓ సంకేతం. అలా మరీ ప్రవాహం కాని చూరునీటిలో కాగితపు పడవులు వేయడం ఓ ఆనందక్రీడ. పనికిరాని కాగితాలతో పడవలు చేయడం పెద్దవారికి, వాటిని నీటిలో విడవడం, ఆడటం చిన్నవారికి వానాకాలం వినోదం. ఇప్పుడు వానలు తగ్గిపోయాయి కనుక ఆ ఆటలు దూరమయ్యాయి. పడవ చేసే ఓపిక, ఆసక్తి ఇప్పటి జనంలో పూర్తిగా కనుమరుగవ్వలేదుకానీ, తగ్గిందనే చెప్పాలి. జీవనశైలిలో వచ్చిన మార్పులకు, వాతావరణంలో వచ్చిన మార్పు జోడెద్దుల్లా తయారై జీవనగమనాన్ని మార్చేస్తున్నాయి. రొంప చేస్తుందని తెలిసినా అప్పటి జనం వానల్లో తడిసిముద్దయ్యేవారు. రైతులకైతే వానలోనే పొలాల్లోకి చేరి నారుకట్టడం, నాట్లువేయడం తప్పనిసరి చర్య. ఎండలు తగ్గి, వానలు పెరిగితే ఆ ప్రభావం ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపేమాట నిజమే అయినా అందుకుతగ్గ జాగ్రత్తలు తీసుకోవడం పూర్వీకులు ఎప్పుడో నేర్చారు. అయితే, కాలచక్రంలో అనూహ్య మార్పులు రావడంవల్ల, అజాగ్రత్తవల్ల పైప్రాణాలు పైనే పోతున్నాయి. వర్షాలొస్తే తడవకుండా ఉండటానికి పడే తాపత్రయం ఓ సరదా సన్నివేశమే. ఇళ్ల పైకప్పులు సరిగా లేకపోతే వాననీరు గదుల్లో ఉరవడం, అవి ఇల్లంతా పాకిపోకుండా చూసేందుకు గినె్నలు ఆ నీటిధార పడేచోట పెట్టడం ఓ జాగ్రత్త. రోజుల తరబడి ఉండే ముసురు- ఇప్పుడు మురిపానికి కూడా ఎదురవడం లేదు. వస్తే కుండపోత లేదా ఒకటీ అరా చినుకే దక్కుతోంది. ఇక ఆ తరువాత శిశిరం. వేసవికాలం పెరిగిపోవడం, వర్షాకాలం చిక్కిపోవడంతో పెద్దగా ఎవరినీ వణికించడం లేదు. చల్లని చిరుగాలుల్లో తిరుగుతూ మొక్కజొన్న కండె, పక్కన చెలికత్తె ఉంటే ఆ చలి బలాదూర్. కానీ, ఈ ఆనందం అనుభవించేలోగా శీతాకాలం శీతకన్ను వేస్తోంది. వేసవిలో మల్లెపూల పరిమళం, సంపెంగల సువాసనలు ఆస్వాదించడంలో ఆనందం ఉంది గానీ, కోస్తా తీరంలో వేడిగాలులు, స్వేదధారలు దానిని కడిగేస్తాయి. వర్షాకాలంలో పుష్పవిలాసం తక్కువేగానీ శిశిరంలో బంతీచామంతులు కాంతలకు ఇష్టమే. అద్భుతమైన పరిమళం మాటకాదు గానీ, ఇంటికి, ఇంతికి అవి తెచ్చే అందం అంతాఇంతాకాదు. వర్షం పడుతున్నప్పుడు ఒకే గొడుగు కింద దూరి, వాటి చూరులోంచి ఓ మాదిరి ధారలు పడీపడకుండా, తడిసీతడవకుండా తప్పించుకుంటూ ఒకరినొకరు రాసుకుంటూ,పూసుకుంటూ సిగ్గులొలికే జంట ఆనందం ఆ గొడుగుమాటున మనకు కన్పించదు కానీ అదంతా వర్షం పుణ్యమే కదా. ఇప్పుడొచ్చే వర్షాలు ఆ గొడుగులను ఎగరేసుకుపోయే స్థాయిలో లేదా గొడుగులు అవసరమే రాని స్థాయిలో పడుతున్నాయే తప్ప అప్పటిలా సాధారణ స్థాయిలో ఉండటం లేదు. సప్త సముద్రాల మాటేమోగానీ మనదేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాలపై గాలులు, ఆ పక్కనే ఉండే పసిఫిక్ సముద్రగాలులు, మేఘాలకు హిమాలయాల అడ్డంకులు కలసి కురిసే వర్షమే భారతావనికి ప్రాణం. రైతుకు ఆయువు. పంటకు ఆధారం. ప్రపంచంలో కేవలం ఋతుపవనాలపైనే ఆధారపడి, వ్యవసాయానికి అవసరమైన నీటిలో దాదాపు 80శాతం ఇస్తున్న ఆ గాలుల దిశ, దశ ఇప్పుడు పూర్వంలా స్థిరంగా లేదు. దీంతో భారతీయుల జీవనమార్గం లయ తప్పుతోంది. దాంతో ఆనందం ఆవిరైపోతోంది. భారత ఆర్థికరంగంలో 80శాతం వ్యవసాయం ద్వారానే వస్తోంది. ప్రజల్లో 70శాతం మంది దీనిపైనే బతుకు వెళ్లదీస్తున్నారు. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో 20శాతం దీనిద్వారానే సమకూరుతోంది. ఒక్క ఏడాది రుతుపవనాల గమనం లయ తప్పితే అది దేశ ఆర్థిక, జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే అటు రైతైనా, ఇటు ప్రభుత్వమైనా తొలకరి కోసం పరితపిస్తాయి. ఆ పవనాలు తమకు అనుకూలంగా వీయాలని ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన వరుణుడు విని కరుణిస్తే చాలు. అదే పదివేలు. * నైరుతి, ఈశాన్య రుతుపవనాలు భారతదేశ వ్యవసాయ అవసరాలను తీరుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణభారత దేశం యావత్తూ ఈ రుతుపవనాల వల్ల లబ్ధి పొందుతున్నాయి. ఉత్తర భారతదేశానికి లాభం ఉన్నా ఇబ్బందులూ వీటివల్ల ఎక్కువే. ప్రపంచంలో అత్యంత నాటకీయంగా, క్రమం తప్పకుండా వచ్చే ఈ తరహా రుతుపవనాలు భూగోళంపై మరెక్కడా కానరావు. ఈ మధ్య ఎదురౌతున్న ‘ఎల్‌నినో’ ప్రమాదం వల్ల రుతుపవనాల గమనంలో మార్పు కన్పిస్తోంది. భారతదేశంలో కేవలం రుతుపవనాలపై ఆధారపడి 60 కోట్లమంది జనాభా బతుకుతున్నారు. వీటి గమనంలో తేడాలొస్తే వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. పంటలు పండకపోతే ధరలు పెరిగి, పనులు లేక వారు ఇబ్బందులు పాలవుతారు. అందుకే అందరి దృష్టి రుతుపవనాల రాకపైనే ఉంటుంది. మనదేశంలోకి వచ్చే నైరుతి రుతుపవనాలు రెండుగా చీలిపోయి అడుగుపెడతాయి. ఒకభాగం మలబారు తీరంలోని కేరళను తాకి దేశంలోకి వస్తాయి. మరోభాగం అండమాన్ నికోబార్ దీవుల్లోని ప్రాంతాలను తాకి మరోవైపునుండి చుట్టబెడతాయి. ఇక ఆ పవనాలు నెమ్మదిగా దేశమంతటా వ్యాపించి నెమ్మదిగా బలహీనపడతాయి. ఇక ఈశాన్య రుతుపవనాలు ఉత్తరాదికి కొంత లాభకరంగా ఉంటాయి. దక్షిణాదికి నైరుతి రుతుపవనాలతో పోలిస్తే వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు. * అక్కడ వర్షపాతం అధికం.. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మనదేశంలోనే ఉందంటారు. అస్సోంలోని చిరపుంజి మనదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా చాలామంది భావిస్తారు. అందులో కొంత నిజం ఉంది. అయితే గత పది పదిహేను సంవత్సరాల వర్షపాత నమోదు వివరాలు పరిశీలిస్తే చిరపుంజి కాస్త వెనకబడిందనే చెప్పాలి. మేఘాలయలోని హిమాలయాల పర్వత సానువుల్లో ఉండే ‘మాసిన్‌రామ్’ గ్రామంలో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. ఇది షిల్లాంగ్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలాకాలంగా చిరపుంజి కన్నా ఇక్కడ ఎక్కువే వర్షం పడుతోంది. ప్రపంచంలో అత్యంత చిత్తడి ప్రదేశంగా దీనికి గుర్తింపువస్తోంది. ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం 11,872 మిల్లీమీటర్లు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాధారణం కంటే 3 నుంచి 8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో జనం తల్లడిల్లిపోయారు. వేసవిలో ఉత్తర వాయవ్య దిశల నుంచి వేడి గాలులు కొనసాగడం సాధారణమే. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వేడిగాలులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసారి అధిక ప్రభావం చూపాయి. సాధారణ ఉష్ణోగ్రత (సగటున 40 డిగ్రీలు) కంటే 5 నుంచి 6 డిగ్రీల అధికంగా ఉష్ణోత్రలు నమోదైతే ‘హీట్‌వేవ్ కండిషన్స్’గా పేర్కొంటాము. అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదైతే ‘సివియర్ హీట్‌వేవ్ కండిషన్స్’గా పరిగణిస్తాము. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో మే 20 నుంచి 27 వరకూ సివియర్ హీట్‌వేవ్ కండిషన్స్ నెలకొన్నాయి. విజయనగరం, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ‘మోడరేట్ హీట్‌వేవ్ కండిషన్స్’ నెలకొన్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ నెల 24న- దాదాపు 68 ఏళ్లతర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ అసాధారణ పరిస్థితులకు మరికొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ వేసవిలో కొనసాగే అల్పపీడన ద్రోణి ప్రభావం కూడా వేడిగాలుల తీవ్రతకు కారణమయ్యాయి. అల్పపీడన ద్రోణికి భూ ఉపరితలం మీదుగా ఎడమ వైపు ఉన్న ప్రాంతాల్లో ఈ సారి వేడిగాలుల తీవ్రత అధికంగా కన్పించింది. సముద్ర తీరం వెంబడి కుడి ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అంతగా ప్రభావం చూపలేదు. రుతుపవనాలు మన దేశాన్ని తాకే వరకూ పగటి ఉష్ణోగ్రతల్లో ఈ తీవ్రత కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి రుతుపవనాలు నిర్ణీత సమయంలోనే ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రొఫెసర్ పివి రామారావు, విశ్రాంత డైరెక్టర్, వాతావరణ శాఖ, విశాఖ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.