గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
148- శతాధిక గ్రంధ కర్త, హయగ్రీవోపాసకులు బెల్లం కొండ రామరాయ కవి
వైష్ణవ సంప్రదాయం లో జన్మించి అద్వైతాన్ని ఆలింగనం చేసుకొని దాని లోతులను తరచిన మహా కవి ,విమర్శకులు శ్రీ బెల్లం కొండ రామ రాయకవి .గుంటూరు జిల్లా నరసరావు పేట దగ్గర పమిడి పాడు లో నియోగికులం లో సంపన్న గృహస్తుఇంట రామరాయకవి 1876లో జన్మించారు .భారద్వాజ గోత్రీకులు .ఆశ్వలాయ సూత్రులు ,రుక్ శాఖకు చెందిన వారు .చిన్నతనం లో నే పితృ వియోగం కలిగింది .
స్వయం కృషితో విద్య –పిన్న వయసులోనే రచనా వ్యాసంగం
స్కూలు లో చేరి మొదట కొంతకాలం ఇంగ్లీష్ విద్య నేర్చుకొన్నారు .అది మానేసి సంస్కృతం అభ్యసించారు .హయగ్రీవ ఉపాసకులై విశిస్టాద్వైత మతానికి మారారు .చిన్నతనం నుండి సంస్కృతం లో కవిత్వం రాయటం అలవడింది .సంస్కృత పాండిత్యమూ అప్పటికి గోప్పదేమీకాదు . కాళిదాసు రాసిన రఘువంశం , కుమార సంభవం లలో రెండేసి సర్గలు మాత్రమె నేర్చుకొన్నారు .మేఘ దూతం చదవటం మొదలు పెట్టి పూర్తిగా చదవకుండా అంతా విన్నారు .సంస్కృత జ్ఞానం బాగా ఏర్పడింది .తర్వాత అన్నిటిని స్వయం గా అభ్యసించారు .14 వయేత ‘’రుక్మిణీ పరిణయం ‘’,రమా పరిణయం ‘’ అనే చంపూ కావ్యాలు రాశారు .నెల్లూరుకు చెందిన సింగరాజు వెంకట రమణయ్య ,గారి రెండవ కుమార్తె ఆడి లక్ష్మమ్మ గారిని రామ రాయకవి వివాహం చేసుకొన్నారు .
అంతర్ముఖత్వం –హయగ్రీవ ఉపాసన
కంఠం లోతు నీటిలో నిలబడి హయగ్రీవ మంత్రాన్ని అనుష్టానం చేసేవారు . చింత తోటలోకి చేరి అరుగుమీద కూర్చుని ఉపాసన చేసేవారు .ఇంటి లో హయగ్రీవార్చన నిత్య కృత్యం గా చేసేవారు .చదువుమీద శ్రద్ధ ఉన్న విద్యార్ధులకు తన ఇంట్లోనే ఆహార వసతులను కలిపించి సాహిత్యాలంకార శాస్త్రాలను బోధించేవారు .పురిఘళ్ళ రామ శాస్త్రి సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుల వద్ద తర్కాన్ని వ్యాకరణాన్ని నేర్చారు .వ్యాఖ్యా వ్యాకరణాలను స్వయం గా నేర్చారు .
ద్వైతి- శంకరాద్వైతిగా మారటం రామరాయ కవితా యశోభూషణం
‘సిద్ధాంత కౌముది పై ‘’శరద్రాత్రి ‘’అనే వ్యాఖ్యానం రాశారు .అనునిత్యం వేదాంత గ్రంధ పఠనం చేసి అద్విత వేదాంతాన్ని మొత్తం గా స్వయం గా ఆకళించుకొని నిష్ణాతులయ్యారు .అప్పటిదాకా ఉన్న విశిష్టాద్వైత మతాభిమానం తొలగించుకొని పూర్తిగా అద్వైతి అయ్యారు రామరాయకవి .వంశ పారంపర్యంగా వచ్చిన ద్వైతాన్ని విసర్జించి ఆ గురువులకు దూరమై పోయి అద్వైతానికి అంకితమయ్యారు .శంకర వేదాంత గ్రంధాలను బోధించారు .జీవితకాలం లో రామ రాయ కవి 143 గ్రంధాలు రచించిన బహు గ్రంధ కర్త .తానె స్వయం గా కొన్ని గ్రంధాలను ముద్రించారు ఇంత చిన్న వయసులో ఇన్నిఉద్గ్రంధాలు రాసిన వారెవ్వరూ లేరు .వీరికి వీరే సాటి గా నిలిచారు
. రామరాయ కవితా యశోభూషణం
రామరాయ కవి రాసిన వాటిలో స్తోత్ర గ్రంధాలు, శతకాలు అనేకం ఉన్నాయి .అందులో అష్టకాలు ,స్తోత్రాలు కలిసి 68 ఉన్నాయి .వీటన్నిటిలో శాంకరాద్వైతాన్నే ప్రతిపాదించారు కవిగారు ఇందులో ‘’హకారాది హయగ్రీవ సహస్ర నామావళి ‘’చాలా ప్రాచుర్యం పొందింది ..శంకర భగవత్పాదులు రాసిన ‘’గీతా భాష్యం ‘’కు వ్యాఖ్య రాశారు .శంకర భాష్య టీకా గా ‘’గీతా భాష్యార్ధ ప్రకాశిక ‘’,దశోపనిషత్తులకు ‘’వేదాంత ముక్తావళి ‘’,అద్వైతం పై ‘’శంకరా శంకర భాష్య విమర్శ ‘’ స్వామి మధుసూదన సరస్వతి రాసిన గ్రంధానికి ‘’సిద్ధాంత సింధువు ‘’వ్యాఖ్య , అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తూ ‘’వేదాంత కౌస్తుభము ‘’,రాశారు .’’అద్వైతాన్య మత ఖండనం ,,’’కౌముదికి వ్యాఖ్యగా ‘’శరద్రాత్రి ‘’,చంపూ భాగవత వ్యాఖ్య మురారి రాసిన అనర్ఘ రాఘవ నాటకానికి వ్యాఖ్య ,సముద్ర మధన చంపూ కావ్యం ,శ్రీ కృష్ణ లీలా తరంగిణి కావ్యం రాశారు .రామరాయ కవి గ్రంధ రచనను ఒక మహా తపస్సుగా చేశారు .అద్భుత ధారా శుద్ధి శబ్ద శుద్ధి రామరాయ కవి గారి ప్రత్యేకత .
అంతర్ముఖుడైన సమావిస్టూడైన యోగిగా రామ రాయ కవిని లోకం గుర్తించి కీర్తించింది .హయగ్రీవ ఉపాసకులకు అసాధ్యమేదీ లేదని నిరూపించిన సిద్ధ యోగి పుంగవులు శ్రీ బెల్లం కొండ రామ రాయ కవి కేవలం 39 సంవత్సరాలు మాత్రమె జీవించి శతాధిక గ్రంధ రచన చేసి 1914 లో ముక్తిని పొందారు .