ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -47
19- పందొమ్మిది ఇరవై శతాబ్దాల వారధి -థామస్ హార్డీ
నెల తక్కువ పిల్లాడు
19 20 శతాబ్దాలకు వారధి వంటి కవి థామస్ హార్డీ –అతనికవిత్వం లో సగం రొమాంటిక్ గా మిగిలిన సగం రియలిస్టిక్ గా ఉండటానికి ఇదే కారణం .ఇదే విక్టోరియా యుగపు ఆఖరి లక్షణం. హార్డీ రాసిన చురుకైన ,చిక్కని కవిత్వమే ఆధునిక కవిత్వానికి మార్గ దర్శనం చేసింది .2-6-1840లో ఇంగ్లాండ్ లోని డార్ చెస్టర్ లో పుట్టిన హార్డీ గ్రామం గొప్ప లాండ్ స్కేప్ లకు నిలయం .దీనికే తర్వాత వేస్సేక్స్ అనే పేరొచ్చింది .అతని కవిత్వానికి నేపధ్యం ఈ ప్రదేశమే .అతని కుటుంబ వృక్షపు వ్రేళ్ళు ఇక్కడే బలం గా పాతుకు పోయి ఉన్నాయి .తల్లి తరఫు వారిది వ్యవసాయ వ్రుత్తి .తండ్రిది రాతి పని చేసే తాపీ వ్రుత్తి .హార్డీకి తలి దండ్రుల నుండి మొరటు తనం అబ్బలేదు . నెలలల కంటే ముందే పుట్టటం తో ఒక నర్సు అతడిని బతికించింది. రోగిష్టి అవటం తో స్కూల్ కు పంపలేదు .ఇంటిదగ్గరే తల్లి రక్షణలో ఉండి ఆమె చెప్పిందే నేర్చాడు .ఈ ‘’నెల తక్కువ వాడు ‘’ఆరేళ్ళ కంటే బతకడు అని అందరూ ‘’దీవిస్తే ‘’ సుబ్భరం గా 88 ఏళ్ళు జీవించి అందరినీ ఆశ్చర్య పరచాడు . భూమ్మీద పడిన నాటి నుండి సంచలనమే సృష్టించాడు హార్డీ .
భవన నిర్మాణం-పెళ్లి
ఎనిమిదో ఏడు రాగానే అయిష్టంగానే బడికి పంపారు .ఏది నేర్చినా తల్లి దగ్గరే ఎక్కువ నేర్చుకొన్నాడు హార్డీ .16 ఏళ్ళకు మామూలు విద్య పూర్తీ చేశాడు .కొడుకును ఒక ఆర్కిటెక్ట్ దగ్గర తండ్రి పనిలో కుదిర్చాడు . ఆతర్వాత ఆర్కిటెక్చర్ లో నిపుణుడైన మరో వ్యక్తీ వద్ద చేర్చాడు .20 వ ఏట రాయల్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్స్ నుంచి ఒక అవార్డ్ వచ్చింది .ఇది అతని విద్య ను చూసి ఇచ్చిన్దేకాని ఆర్కిటెక్చర్ పనికి మెచ్చి ఇచ్చి౦ది కాదు . బిల్డింగ్ లు నిర్మించటం కన్నా బుక్స్ మీద ఆసక్తి ఉండేది కాని 27 వ ఏట ఆర్కిటెక్ట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు .30 వ ఏట కారన్ వాలిస్ వెళ్లి ఒక చర్చి ని పునర్నిర్మించాడు .అక్కడ వికార్ వదిన ఏమ్మా గిల్ ఫోర్డ్ తో ప్రేమలో పడి పెళ్ళాడాడు .
కవిత్వం నుంచి నవలకు జంప్
అప్పటికే హార్డీ కవిత్వం రాస్తున్నాడు .కాని పత్రికలూ మాత్రం ప్రచురించలేదు .రాళ్ళల్లో సూక్తుల సరస్వతీ కటాక్షం ఉన్నా కడుపుకు తిండి పెట్టె లక్ష్మీ కటాక్షం లేదని గ్రహించి. ఆర్కి టేక్చర్ కు గుడ్ బై చెప్పేశాడు .రచనలతోనే సంపాదన పొందాలని భావించాడు .కవిత్వం డబ్బేమీ చేపటం లేదని గ్రహించి ఫిక్షను కు ఫిక్స్ అయ్యాడు .’’ది పూర్ మాన్ అండ్ ది లేడి ‘’అనే మొదటి నవల రాశాడు .కాని ఇందులో ప్లాట్ ఏమీ లేదని పబ్లిషర్ ప్రచురించ లేదు .కోపం వచ్చి రాసిన దాన్ని తగల బెట్టి మరోనవల ‘’డేస్పెరేట్ రేమిడీస్ ‘’రాశాడు .ఇందులో వస్తువు పాత్రల్ని డామినేట్ చేసింది .స్వంత చిలుం వదిలించుకొని అచ్చేసి వదిలాడు .కాని వ్యతిరేకమైన సమీక్షలు మరీ నీరు గార్చాయి .లెక్కచేయకుండా ‘’అండర్ ది గ్రీన్ వుడ్ ట్రీ ‘’,’’ఏ పైర్ ఆఫ్ బ్లూ ఐస్ ‘’అనే రెండు నవలలలు రాసి వదిలాడు .దీనితో తాను ఒక రచయితను అనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఒక మేగజైన్ నవల రాయమని హార్దీని కోరింది .ఇప్పటికి తానేమిటో లోకం అర్ధం చేసుకోన్నదనుకొన్నాడు .దీని ఫలితమే ‘’ఫార్ ఫ్రం ది మాడేనింగ్ క్రౌడ్ ‘’నవల .ఈ నవల ఆర్ధికం గా విజయాన్నిచ్చి సాహిత్యం లోనూ పేరును నిల బెట్టింది .జార్జి ఇలియట్ కు ఘోస్ట్ రచయిత హార్డీ అని ఒకడు బాంబు పేల్చాడు .హార్డీ నవలలో వేస్సేక్స్ గ్రామీణ వాతావరణాన్ని మనుష్యుల తీరు తెన్నులను చాలా శక్తి వంతం గా ప్రదర్శించాడు .కాని సబ్జెక్ట్ మీదపూర్తీ అధారిటీ రాలేదు .
ముప్ఫై ఏళ్ళ వయసులో చూడటానికి పెద్దగా ఆకర్షణీయం గా ఉండేవాడు కాదు .సాధారణ పొడవుతో ,నీలి కళ్ళతో ,పల్లెటూరి రై(బై )తు లాగా కనిపించేవాడు . భార్య తో కొంతకాలం లండన్ లో కాపురమున్నాడు .నలభై లలో వరుసగా గుండె పోట్లు రావటం ప్రారంభించి బతుకే ప్రమాదం అనే స్థితికి వచ్చింది .అయినా మరో నవల చాలా తీవ్రంగా రాస్తూనే ఉన్నాడు .
బాక్ టు పెవిలియన్
. ఈ నవల తో ఆపేసి తాను మొదటి నుంచి మక్కువ పెంచుకొన్న కవిత్వం తోనే కాలం గడపాలని నిర్ణయానికి వచ్చాడు .రెండేళ్ళ తర్వాత లండన్ వదిలి తన స్వగ్రామం డార్చేస్టర్ చేరి మళ్ళీ ఆర్కిటెక్ట్ అవతారం ఎత్తి స్వంత ఇల్లు’’మాక్స్ గేట్’’ నిర్మించుకొన్నాడు . దీన్ని చూడటానికి ఎందరో సందర్శకులు వస్తూంటారు .కొంచెం సిగ్గూ ,ఒంటరితనం ఇష్టపడే హార్డీ లండన్ లోని పబ్లిక్ జీవితం కంటే ప్రైవేట్ జీవితం లోనే ఆనందం ఉందని భావించి డార్చేస్టార్ కు వచ్చానని చెప్పుకున్నాడు
బెడిసి కొట్టిన నవలలు .
1874-1890 మధ్య పదహారేళ్ళకాలం లో ఎనిమిది నవలలు 30 చిన్నకధలు రాశాడు .అన్నీ డబ్బును వర్షించాయి .యాభై వ ఏట ‘’టేస్స్ ఆఫ్ దిడి అర్బేర్ విల్లీస్ ‘’నవల రాసి ప్రచురించాడు .దీనిపై విమర్శకులు విరుచుకు పడ్డారు .మేగజైన్ లో ప్రచురణార్హం కాదన్నారు .దీనికి సమాధానం గా ‘’జూడే ది అబ్ స్క్యూర్ ‘’రాశాడు .ప్రకృతి ధర్మాలకు విరుద్ధం గా రాశాడని అనైతికతను ప్రోత్సహించాడని ఈస డించారు .మనిషి అంతర్ స౦ఘర్షణకు ,బాహ్య క్రూరత్వానికి బలై చనిపోవటం ఇందులోకద .దీన్నే అమెరికాలో’’ జూడే ది అబ్ సీన్ ‘’గా ప్రచురించినా విమర్శల జడివాన తప్పలేదు .దాన్ని నిరసించారు అవహేళన చేశారు .’’ఫిల్ది నావెల్ ‘’అన్నారు ఒకాయన ఆ నవలను తగల బెట్టి దాని బూడిద పార్సెల్ చేసి హార్డీకి పంపి కోపం తీర్చుకొన్నాడు .దీనితో ఇక నవలల జోలికి వెళ్ళ కూడదనే నిర్ణయానికొచ్చాడు .ఈ విషయాన్నే హార్డీ ‘’I have to give up verse for prose in order to make a living –in later life referred to my novels as’’ pot boilers ‘’ and ‘’wretched stuff ‘’and I returned with joy as well as relief to poetry ‘’అని చెప్పుకొన్నాడు .
బాక్ టు పెవిలియన్ –మహత్తర బృహన్నాటకం
సుమారు అరవైవ వసంతం లో హార్డీ మొదటి కవితా సంపుటి ‘’వేస్సేక్స్ పోయెమ్స్ ‘’ప్రచురించాడు .ఇందులో 30 ఏళ్ళుగా రాసిన లిరిక్కులు బాలడ్లూ కలిసి ఉన్నాయి .జనానికెవరికీ పట్టనే లేదు .నాలుగేళ్ల తర్వాత’’పోయెమ్స్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ప్రెసెంట్ ‘’సంపుటి వెలువరిస్తే కొంత మెరుగైన ప్రోత్సాహం లభించింది .ఇక ఈ ముసలాడి పని అయి అయిపొయింది ఇక రాసే దమ్ము లేదు అని అందరూ అను కొంటూ ఉండగా ఆశ్చర్య పరుస్తూ ‘’ది డైనాస్త్స్ ‘’అనే నాటకం మొదటి భాగాన్ని వదిలి , నాలుగేళ్ళ తర్వాతా దాన్నిమూడు భాగాలతో పూర్తీ చేశాడు .ఇందులో నెపోలియన్ యుద్ధాలకు సంబంధించిన విష యాలు పరమనాటకీయం గా ఉన్నాయి 19 అ౦కాలతో ,130 సీన్లతో బృహత్తరంగా ఉన్న నాటకం ఇది ..విమర్శకుల నోళ్ళు మూసుకు పోయాయి .అప్పటిదాకా హార్డీ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొన్నారు .లండన్ టైమ్స్‘’the dynasts combines ,as only a work of genius could combine ,a poetic philosophy with minute historical knowledge and a shrewd eye for the tragical and comical ways of men and women ‘’అని అభి వర్ణించింది .లాసేల్లెస్ ఆబెర్ క్రోమ్బీ అనే ప్రముఖ విమర్శకుడు ‘’the biggest and most consistent exhibition of fatalism in literature ‘’అని కీర్తించాడు ‘’ఫాటలిజం’’ అంటే జీవితం లో జరిగే సంఘటనలు ముందే దైవ నిర్ణయాలై ఉంటాయి వాటిని మనం మార్చలేము అని అర్ధం .ఫేట్ కు సంబంధించింది ఫాటలిజం మన భాషలో ‘’విధి లిఖితం ‘’.
దూషణలకు బదులు భూషణలు-పురస్కారాలు
ఇప్పటిదాకా అంటీ ముట్టనట్టు ఉన్న సమాజం ఒక్కసారి హార్డీ ని గుర్తించింది. కేర్తి కిరీటం పెట్టింది .విమర్శల జడివాన పోయి పొగడ్తల పూల వాన కురిపించారు. అభినందనల వెల్లువ సాగింది .సన్మాన పరంపర ,సత్కార హోరూ పెరిగాయి .లండన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ వారి స్వర్ణ తకం ,ఆర్డర్ ఆఫ్ మెరిట్ అందుకొన్నాడు హార్డీ .ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జ్ ,బ్రిస్టల్ యూని వర్సిటీలు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించి సత్కరించాయి .రాయల్ ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్స్ వారు హార్డీకి ఫెలో షిప్ అందజేశారు .తన డార్ చెస్టర్ స్వగ్రామం ఇంతటి ఘన విజయాలను సాధించి ఇచ్చింది అనుకొన్నాడు .72 ఏళ్ళ వయసులో భార్య చనిపోయింది .ఎంతోకాలం గా తన దగ్గర సేక్రటరిగా పని చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు హార్డీ .ప్రఖ్యాత రచయిత సోమర్ సెట్ మాం రాసిన ‘’కేక్స్ అండ్ ఏల్ ‘’నవల హార్డీ కుటుంబ జీవితమే అని విశ్లేషకుల భావన .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15 –ఉయ్యూరు