ఉదయ గిరి గుహలు ,బటే శ్వర్ ,దయ్యం కట్టిన వంతెన ,సింగపూర్ లో లిటిల్ ఇండియా -ఆంధ్ర భూమి

ఉదయగిరి గుహలు

 • 14/06/2015
 • |

 • -బి.మాన్‌సింగ్ నాయక్

జైన తీర్థంకరుల స్ఫూర్తితో ఒరిస్సాలోని ఉదయగిరిలో రూపుదిద్దుకున్న రాతి కట్టడాలు కాలక్రమంలో 20 హిందూ దేవాలయాలుగా మారిపోయాయి. గుప్తుల కాలంలో మహావిష్ణు దశావతారాలను ఉదయగిరి గుహల్లో చెక్కారు. దశావతారాలతోపాటు విఘ్నేశ్వరుడు, శివుడు, దుర్గామాత పది చేతులున్న విగ్రహాలు ఒకే భారీ రాతిపై మలిచారు.
అతిలోతైన చెరువు
అమెరికాలోని అతి లోతైన సరస్సు క్రేటర్ సరస్సు. ఓరెగాన్ రాష్ట్రంలోని ఈ సరస్సు లోతు 1,932 అడుగులు (589 మీటర్లు) అంటే ఈఫిల్ టవర్ లాంటి ఎతె్తైన నిర్మాణాలను రెండింటిని ఈ సరస్సులో నిలువునా ముంచవచ్చునన్నమాట.
ఎస్కిమోలు, ఇన్యూట్‌లు
రష్యా ఈశాన్యపు కొసన అలాస్కాలో ఎస్కిమోలు జీవిస్తున్నారు. ఇన్యూట్ తెగ ప్రజలు ఉత్తర కెనడా ప్రాంతమైన నునావుట్, గ్రీన్‌లాండ్‌లలో ఉంటారు. నునావుట్ అంటే వారి భాషలో ‘మా భూమి’ అని అర్థం.

 • బటేశ్వర్

  • 07/06/2015
  • |

  • -పి.వి.

  ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాకు 70 కి.మీ. దూరంలో యమునానదీ తీరానగల బటేశ్వర్‌లో దాదాపు 40 దేవాలయాలున్నాయి. ఇక్కడ ఏటా శీతాకాలంలో జరిగే క్యాటిల్ ఫెయిర్‌కు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 15వ శతాబ్దానికి చెందిన ఇవన్నీ శివాలయాలే. ఈ దేవాలయాల సముదాయం 1300 సంవత్సరాల కాలం నాటిది కావడం విశేషం.
  నలంద
  ఆనాడు ప్రపంచానికి విద్య, విజ్ఞానం అంటే ఏమిటో సరిగా తెలీని రోజుల్లోనే ఒక మహా విశ్వవిద్యాలయం ఉండేది. అదే నలంద. వందలాది మంది విద్యార్థులు వివిధ ప్రదేశాల నుండి వచ్చి అధ్యయనం చేసేవారు. ఇది పూర్తిగా గురుకుల తరహాగా ఉండేది. వేల సంవత్సరాల క్రితమే దాదాపు వంద రకాల విభిన్న శాస్త్రాలను అక్కడ బోధించేవారు. గౌతమ బుద్ధుడు పలు పర్యాయాలు నలందను సందర్శించాడు.
  వైశాలి
  గంగాతీరంలో ఉన్న బీహార్ సారవంతమైన భూమి. ఎటు చూసినా పచ్చని చెట్లు, తోటలు. ఇక్కడే గౌతముడు రత్నసూత్రాన్ని బోధించాడు. మహిళలకు సన్యాస దీక్షను తొలిసారిగా బుద్ధుడు ప్రసాదించింది ఇక్కడే. తన పెంపుడు తల్లి గౌతమిని తొలి సన్యాసినిగా, శిష్యురాలిగా స్వీకరించడం విశేషం.
  కపిలవస్తు
  ఇది నేటి ఉత్తరప్రదేశ్‌లో ఉంది. బుద్ధుడు తన జీవితంలోని మొదటి 30 సంవత్సరాలు గడిపింది ఇక్కడే. నాటి సిద్దార్థుని సౌధం, శిథిలాలు నేటికీ కనిపిస్తుంటాయి. ఆ శిథిల సౌందర్యాలనుబట్టి ఆనాడు ఆ రాజసౌధాలు ఎంతటి అందంగా ఉండేదో ఊహించుకోవచ్చు.
  కందిరీగ
  పెప్సిన్ అనే ఆడ కందిరీగ ఒకే ఒక గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టే ముందు అది ఒక సాలెపురుగును వెదుకుతూ వెళుతుంది. బాగా లావైన టరాంటురా సాలె పురుగు కనిపించగానే దాని మీద వాలి కాటేస్తుంది. ఆ విష కాటుకు సాలె పురుగు చనిపోగానే దానిని గొయ్యి తవ్వి పాతి పెడుతుంది. పాతిపెట్టిన చోట గుడ్డు పెడుతుంది. గుడ్డు నుండి పెరిగి వచ్చే లార్వా సాలెపురుగు అవశేషాలను భుజించి కందిరీగగా పరిణామం చెందుతుంది.
  టొబాగో ద్వీపం
  వెస్టిండీస్ ద్వీపాల్లో ఒకటైన టొబాగో ద్వీపం, బ్రిటీష్, స్పానిష్, ఫ్రెంచ్, డచ్ పరిపాలనలలో ఒకరి నుండి మరొకరికి 31సార్లు మారి రికార్డు సృష్టించింది. కరేబియన్ సముద్రంలో నౌకాదళానికి టొబాగో ద్వీపం ఒక కీలక స్థావరం కావడం మూలాన ఈ దేశాలు ఆ ద్వీపం మీద ఆధిపత్యం కోసం విపరీతంగా పోటీ పడ్డాయి. 1819లో బ్రిటన్ ఈ ద్వీపాన్ని ట్రినిడాడ్ ద్వీపంతోపాటు మత సామ్రాజ్యంలోకి చేర్చుకుంది. 1962 దాకా ఈ ద్వీపానికి స్వాతంత్య్రం లభించలేదు.

 • దెయ్యం కట్టిన వంతెన!

  • 17/05/2015
  • |

  • -దుర్గాప్రసాద్

  ఎంతో అందమైన స్విట్జర్లాండ్‌లోని మరింత అందమైన రియాస్ నది ప్రకృతి సంపదకు నిలయం. అంతేకాదు! ఇక్కడ గల ఒక విచిత్రమైన వంతెన గురించి వినిపించే కథలు భయాన్నీ, ఆసక్తినీ కలిగిస్తాయి.
  ఎందుకంటే ఈ ప్రాంతంలోని షాలొనెన్ జార్జ్ అనే చోట గల టిఫెల్స్‌బ్రక్ అనే వంతెన చూడడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి అక్కడి రియాస్ నది ఉన్న ప్రాంతాన్నీ, దగ్గరలోని సెయింట్ గోట్జర్డ్‌ను కలుపుతూ ఊళ్లోకి వెళుతుంది.
  రియాస్ నది దగ్గర నుండి ఊర్లోకి వెళ్లాలంటే ఈ బ్రిడ్జే ఆధారం. అక్కడ వంతెన నిర్మించాలని 1230లో అప్పటి అధికారులు భావించారు. నిర్మాణ పని వారిని పిలిచారు. వారు వచ్చి ఎంతో దిగువగా ఉన్న ఆ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించడం అసాధ్యం అని తేల్చేశారు.
  ఎందుకంటే రియాస్ నదిని ఆనుకుని ఉన్న కొండని తొలిచి రహదారి వేశారు. ఆ రహదారి కొనసాగింపుగా బ్రిడ్జి నిర్మించి, ఊర్లోకి వెళ్లేలా వంతెన ఉండాలని ప్లాన్. అయితే నిట్టనిలువునా ఉండే కొండని కలుపుతూ, నది మీదుగా బ్రిడ్జి నిర్మించడం అసాధ్యమని పెద్దగా సాంకేతిక సౌకర్యాలు లేని అప్పటి నిర్మాణరంగ పనివారు చెప్పారు.
  అక్కడ బ్రిడ్జి నిర్మించడం కేవలం దెయ్యాలకే సాధ్యమని వారు పెదవి విరిచారు. అది విని అధికారులకు ఏం చేయాలో బోధపడలేదు.
  సరిగ్గా అప్పుడే అక్కడొక దెయ్యం ప్రత్యక్షమయిందట. ‘మీకు కావలసిన వంతెనని నేను నిర్మించి ఇస్తాను. కానీ ఒక్క షరతు’ అని చెప్పిందట.
  జరిగిన సంఘటనతో అప్పటికే బిత్తరపోయిన అధికారులు కొంతసేపటికి తేరుకుని ‘ఏమిటా షరతు?’ అని ప్రశ్నించారు.
  దానికా దెయ్యం ‘నేను వంతెన నిర్మించిన తర్వాత దీనిపై నడిచే మొదటి జీవిని నేను ఆహారంగా స్వీకరిస్తాను’ అని చెప్పింది.
  దానికి సరేనన్నారు అధికారులు.
  అప్పుడు ఆ దెయ్యం అతి ప్రమాదకరమైన రియాస్ నదిపై అతి చాకచక్యంగా మూడు రోజుల్లో వంతెన నిర్మించి ఇచ్చిందట.
  ‘నేను వంతెన నిర్మించి ఇచ్చి ఇచ్చాను. మాటకు కట్టుబడి ఈ వంతెనపై నడిచే మొదటి జీవిని నాకు ఆహారంగా ఇవ్వండి’ అని చెప్పి బ్రిడ్జికి అటు చివరికి వెళ్లి కూర్చుందట.
  అప్పుడు బాగా ఆలోచించిన అధికారులు, అక్కడి పెద్దలు దెయ్యం అనుకున్నట్లు మనిషిని కాకుండా ఒక మేకపిల్లని ఆ వంతెన మీదికి వదిలారట.
  దానికి ఆగ్రహించిన దెయ్యం తాను కట్టిన వంతెనని తునాతునకలు చేయడానికి అక్కడున్న అతిపెద్ద బండరాయిని పైకెత్తి ఉగ్రంగా ముందుకొచ్చిందట.
  అధికారులు, గ్రామస్థులు భయంతో అక్కడి నుండి పరుగులు పెట్టారు. అయితే ఎంతసేపైనా అక్కడెలాంటి బీభత్సం జరుగుతున్న అలికిడి వినిపించకపోవడంతో వెనుదిరిగి చూశారట. అప్పుడు వారికొక విచిత్రమైన దృశ్యం కనిపించింది. అప్పుడే కట్టిన వంతెనని నాశనం చేయడానికి దెయ్యం బండరాయితో వస్తుండగా, ఒక వృద్ధురాలు చేతిలో శిలువ తీసుకుని ఆ దెయ్యానికి ఎదురుగా వెళుతూ కనిపించిందట.
  వృద్ధురాలి చేతిలోని శిలువని చూసిన దెయ్యం భయంతో అరుస్తూ వంతెనని నాశనం చేయడానికి పైకెత్తిన బండరాయిని పడేసి అక్కడ నుండి పారిపోయిందట.
  దెయ్యం వదిలేసి పోయిన బండరాయి ఆ తర్వాత చాలా సంవత్సరాలు టిఫెల్స్‌బ్రక్ వంతెన వద్ద కనిపించేది. ఆధునిక కాలంలో ఆ బండరాయిని పరీక్షించి చూస్తే దాని బరువు 220 టన్నులని తేలింది. ఆ బండరాయిని 1977లో అక్కడికి దగ్గరలో మోటారు వాహనాలు వెళ్లే దారి నిర్మాణం కోసం తరలించారు. 1230లో దెయ్యం కట్టినట్లు చెప్పబడుతున్న ఆ వంతెనను ఆధునీకరించారు. ఈ బ్రిడ్జి మీద నడిస్తే అవతలికి చేరుకోవడానికి అరగంట పడుతుంది. దీని మీదుగా నడుస్తూ కిందనున్న రియాస్ నదిని చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. దెయ్యం కట్టిన వంతెన గురించి తెలుసుకున్న ఎంతోమంది టూరిస్టులు ప్రతి ఏటా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.

 • సింగపూర్‌లో లిటిల్ ఇండియా

  • 10/05/2015
  • |

  • -పుట్టా సోమన్న చౌదరి

  సింగపూర్ రోడ్లపై అంతవరకు ప్రశాంతంగా పర్యటిస్తూంటే.. ఒక్కసారిగా హైదరాబాద్‌లోని కోఠి లేదా చెన్నైలోని పాండీబజార్‌కి వెళ్లినట్లు అనిపిస్తే కచ్చితంగా అది సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతమని చెప్పవచ్చు. ఢిల్లీ వాసులైతే ఇది చాందినీ చౌకా అనీ, ముంబై వారు ఝవేరీ బజారుకొచ్చామా? అని ఆశ్చర్యపోతారు.
  సింగపూర్ వెళ్లిన ఏ భారతీయుడైనా మెర్‌లైన్ (సగం సింహం సగం చేప బొమ్మ) పర్యాటక ప్రదేశాన్ని చూడటం ఎంత సహజమో ‘లిటిల్ ఇండియా’ ప్రాంతాన్ని చూడటం అంతే సహజం.
  ఒక విధంగా చెప్పాలంటే లిటిల్ ఇండియా ప్రాంతాన్ని ‘మోడల్ ఇండియా’ అని పిలిస్తే బాగుంటుందేమో. లిటిల్ ఇండియా బజార్‌కి వెళ్లగానే హిందీ, తమిళం, తెలుగు భాషలు గుప్పుమంటాయి. మన దేశంలోలాగే ఒకరినొకరు నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్లటం కనిపిస్తుంది. కార్ల హారన్లతోపాటు సైకిల్ గంటల శబ్దాలు వినిపిస్తాయి. ప్లాట్‌ఫారాలు రకరకాల వస్తువులతో నిండిపోయి ఉంటాయి. ఇంకా కొనుగోళ్ల కోసం రాతపూర్వక ఆహ్వాన బోర్డులే కాదు రండి – ఆవోబాయ్ అంటూ ప్రార్థనాపూర్వకమైన గొంతులు వినిపిస్తాయి.
  సింగపూర్‌లోని సెరంగూన్ ప్రాంతంలో లిటిల్ ఇండియా ఉంది. ఇది సింగపూర్‌లోని ఇతర ప్రాంతాలకంటే సందడిగా ఉండటమే కాదు సాంస్కృతిక వైవిధ్యం కూడా ఉట్టి పడుతుంది. షార్టులు, జీన్సులే కాదు లుంగీలు, ధోవతీలు, చీరలు ధరించిన వారు కనిపిస్తారు. ముఖ్యంగా ఇక్కడి వంటశాలల ఘుమఘుమలు ఆఘ్రాణించి తీరాల్సిందే. మల్లెలు, సంపెంగలు, అరటి ఆకులు, వేరుశెనగ గంపలు, కిళ్లీలు, అటుకుల మిక్చర్ తోపుడు బండ్లు, దినపత్రికలు అమ్మే కుర్రాళ్లు, రోడ్డు పక్కన చౌకరకం రెడీమేడ్ వస్త్రాలు అమ్మేవాళ్లు, చివరకు తాయత్తులు కట్టేవారు, వాచీలు, తాళాలు రిపేరు చేసేవారు కనిపిస్తారు. కూరగాయల్లో ములక్కాడలే కాదు ములగ ఆకు, కరివేపాకు, చింత చిగురు కూడా కనిపిస్తాయి. వెండి, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు, మసాలా దినుసులు అమ్మకం గురించి చెప్పనే అక్కర్లేదు. అగరబత్తులు, సెంట్లు సువాసనలు ముక్కులను తాకుతూ ఉంటాయి. ఖర్జూరం బళ్లు కూడా కనిపిస్తాయి. ఈ లిటిల్ ఇండియాలో అన్ని రకాల భారతీయ వస్తువులు దొరుకుతాయి. చౌక భోజనాలు, టిఫినే్ల కాదు కాస్త ఖరీదైన భారతీయ వంటకాలు లభించే ఇండియన్ రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయి. వాటి ముందు డిస్‌ప్లే బోర్డులు దర్శనమిస్తాయి. ఇక టేకా మార్కెట్ ఫుడ్ సెంటర్‌లోని తోపుడుబండ్లపై భారతీయ భోజనం, ముఖ్యంగా మటన్, చికెన్, రొయ్యల బిర్యానీలు దొరుకుతాయి. సింగపూర్‌లో పెద్ద సంఖ్యలో ఉండే అల్పాదాయ కార్మికులకు చౌక భోజనాలు దొరికేది ఇక్కడే. కాస్త ధర ఎక్కువైనా జోజీఆవో ఫుడ్ సెంటర్‌కి తప్పక వెళ్లాలి. అచ్చమైన భారతీయ సంప్రదాయ భోజనం కావాలంటే కోమలా విలాస్ రెస్టారెంట్‌కి వెళ్లాల్సిందే. లోయర్ సెరెంగూన్ రోడ్డు నుండి కిచనేర్ రోడ్డు వరకు ఎన్నో ఆలయాలు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. బఫైల్లో రోడ్, కెరంబూరోడ్, బలీలియా రోడ్, కరైకొడి సెంటర్, డన్‌లప్ స్ట్రీట్, క్యాంప్ బెల్ లైన్, హెండ్సన్ రోడ్, చందర్‌రోడ్, కాంసోగ్‌కాపూర్ రోడ్‌లలో షాపింగ్ చేయవచ్చు. 1950లో నెహ్రూ శంకుస్థాపన చేసిన గాంధీ మెమోరియల్ హాల్ కూడా ఇక్కడే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని శ్రీలక్ష్మి మందిరం, కలియమ్మన్ మందిరం, శ్రీనివాస్ పెరుమాళ్ అనే వేంకటేశ్వర స్వామి ఆలయాల వల్ల కూడా లిటిల్ ఇండియా రద్దీ ప్రాంతంగా మారిందని చెప్పవచ్చు. లిటిల్ ఇండియా ప్రాంతానికి అండర్‌గ్రౌండ్ రైలు మార్గం ఉంది. స్టేషన్ నుండి బయటికి రాగానే సెంటర్ కనిపిస్తుంది. ఇది చాలా రద్దీ ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక లిటిల్ ఇండియాకి అతి సమీపంలోని ముస్త్ఫా సెంటర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది 24 గంటలూ తెరిచి ఉండే అతి పెద్ద షాపింగ్ మాల్. సింగపూర్ టూర్‌లో గైడ్లు ఈ షాపింగ్ కోసమే పది పనె్నండు గంటలు కేటాయిస్తారు. ఇక్కడ గుండుసూది మొదలుకొని దొరకని వస్తువంటూ ఉండదు.
  సింగపూర్‌లో సుందరమైన భవనంగా కీర్తించే లినోంగ్‌సేన్ బౌద్ధ మందిరం లిటిల్ ఇండియా ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉంది. సింగపూర్ వెళితే మెరలైన్ సింహాన్ని, కేబుల్ కార్లనే కాదు ‘లిటిల్ ఇండియా’ను కూడా తప్పక చూడాలి.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.