ఉభయ కుశలోపరి
చెన్నై
27.06.2015
పూజ్యులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి,
నమస్సులు. తమరు దయతో పంపిన పుస్తకాలు అందాయి. ఎంత గొప్ప సాహితీ వరివస్య !ఒకవైపు ఆంగ్ల కవుల పరిచయాలు, మరో వైపు సంస్కృత కవుల పరిచయాలు. అటుపై మహిళా మాణిక్యాలు. ఇక దర్శనీయ దైవక్షేత్రాలు, దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు, శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం – ఎంత వైవిధ్యం, ఎంత వైదుష్యం!
‘పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు’ ద్వారా అనేక ఆంగ్ల కవుల గురించి తొలిసారి తెలుసుకొన్నాను. ముఖ్యంగా రాజకవి మొదటి జేమ్స్, జాన్ స్కెల్టన్, క్రిస్టఫర్ మార్లో, రిచర్డ్ క్రాషా ప్రభృతుల గురించి. ఇక చాసర్, షేక్స్పియర్, మిల్టన్, డ్రైడన్, అలెక్జాండర్ పోప్, బ్లేక్, వర్డ్స్ ప్రభృతుల గురించి తగినంత విపులంగా రాశారు. డిలాన్ థామస్ గురించి చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. మరికొంత కాలం బతికి ఉండి, ఇబ్బందులు లేని జీవితం గడిపి ఉంటే మరిన్ని మంచి రచనలు చేసే వాడేమో అనుకోకుండా ఉండలేక పోయాను.
ప్రాచీన, ఆధునిక సంస్కృత కవులందరినీ పరిచయం చేస్తూ సంతరించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణం అద్భుతమైన గ్రంథం. సరళంగా చెబుతూనే అవసరమైన అన్ని అంశాలనూ అందించారు. ముఖ్యంగా నైషధ కావ్య పరిచయం, మృచ్ఛకటిక పరిచయం, భారవి, భాసుడు, బాణుడు, మాఘుడు, భవభూతి, ఆనందవర్ధనుడు (ఆలంకారికుడు), మల్లినాథసూరి (వ్యాఖ్యాత), జగన్నాథ పండితరాయలు(ఆలంకారికుడు), మానవల్లి రామకృష్ణ కవి ప్రభృతుల పరిచయాలు చక్కగా వచ్చాయి. తెనాలి రాముని కథలను సంస్కృతీకరించిన సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి కృషి కొనియాడ దగినది. ఇతర భాషలలోకి మన సాహిత్యాన్ని తీసుకుపోయిన వారి పట్ల నాకు విశేష గౌరవం.కాగా, వాల్మీకి, వ్యాసుల పరిచయం కూడా ఇచ్చి ఉంటే సమగ్రత సిద్ధించి ఉండేదని భావిస్తున్నాను. విశ్వనాథ వారి సంస్కృత రచనల గురించి రేఖామాత్రంగా నైనా పరిచయం చేసి ఉండవచ్చుననుకొంటాను. అదలా ఉంచితే, సంస్కృత సాహిత్యాన్ని తెలుగులో ఇంత సరళ సుందరంగా పరిచయం చేసిన వారు ఇంకెవరూ లేరు. మీ కృషి దొడ్డది.
‘దర్శనీయ దైవక్షేత్రాలు’ తీర్థయాత్రలకు వెళ్ళే వారికి బాగా ఉపకరిస్తుంది. గుడిమల్లం గురించి మీరు పరిచయం చెయడం ముదావహం. నేనూ, మా అన్న (పెదనాన్నగారి అబ్బాయి) సత్యనారాయణా 1989లో ఆ గుడిని సందర్శించాము, చారిత్రక స్పృహతో. ఇన్నేళ్ళకు మళ్ళీ ఆ గుడి గురించి చదవడం ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపింది. ర్యాలి (జగన్మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు), సురుటుపల్లి (అనంతశయనంలో శివుడు), శ్రీ కూర్మం, అరసవిల్లి, శ్రీ ముఖలింగం, కాణిపాకం (చిత్తూరు జిల్లా – విఘ్నేశ్వర మందిరం), మంత్రాలయం (రాఘవేంద్ర స్వామి), విజయవాడ కనకదుర్గ మందిరం, మంగళగిరి, అహోబిలం, మహానంది ఇత్యాది దేవాలయాలను కూడా (మలి ముద్రణలో) కలుపుకొంటే మన రాష్టంలోని అన్ని ఆలయాలనూ పరిచయం చేసినట్టు అవుతుంది.
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు చదివి ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. ఇన్ని దేశాలలో ఆంజనేయ ఆలయాలు ఉన్నాయా అని ఆశ్చర్యం, తెలుసుకోగలిగినందుకు ఆనందం. శ్రద్ధాసక్తులతో ఎక్కడెక్కడి సమాచారాన్నో క్రోడీకరించినందుకు మీకు జోహారు.
శ్రీ ఆంజనేయస్వామి మాహాత్మ్యం మా నాన్న చదివిన తరువాత నేను చదువుతాను. కాగా, త్యాగి పేరడీలు మరింత పదును దేరవలసి ఉంది.
మహిళా మాణిక్యాలు ఎంతో ఉపయుక్తమైన గ్రంథం. ప్రజా
కవయిత్రి ఫీలిస్ మెక్ గిన్లీ గురించి మీ పుస్తకం ద్వారానే తెలుసుకొన్నాను. పెరెల్ ఎస్. బక్, డొక్కా సీతమ్మ, శకుంతలా దేవి, భానుమతి, కేథరిన్ మాన్స్ ఫీల్డ్, యశోధరా రెడ్డి, భండారు అచ్చమాంబ. జిల్లేళ్ళమూడి అమ్మ, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, సిల్వియా పాత్, అన్నే ఫ్రాంక్, అగతా క్రిస్టీ, జూడిత్ రైట్ మినహా తక్కిన వాళ్ళ గురించి ఇప్పుడే తెలుసుకొన్నాను. ధన్యవాదాలు. ఇంకా జెన్నీ మార్క్స్, సరోజినీ నాయుడు, డా. ముత్తులక్ష్మీ రెడ్డి, ఆంగ్ కాయ్ సూ (మయన్మార్ నేత), మేరీ క్యూరీ తదితరులను కూడా చేర్చుకోవచ్చు. మొత్తం మీద ఉత్తమ రచన అనడంలో ఎలాంటి సంశయమూ లేదు.
తమ కృషికి మరో మారు అభినందనలు.
ఉప్పలధడియం వెంకటేశ్వర