గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 161- కలికాల సర్వజ్ఞుడు – ఆచార్య హేమ చంద్రసూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

161-  కలికాల  సర్వజ్ఞుడు – ఆచార్య  హేమ చంద్రసూరి

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి

జైన సంస్కృత ప్రాకృత  కవి ,పండితుడు ,వ్యాకరణ వేత్త ,సర్వ శాస్త్ర విశారదుడు  ,ఆలంకారికుడు ,గణిత మేధావి  ,జీవశాస్త్ర విజ్ఞాని మహా కావ్యాలతోబాటు అనేక నిఘంటువుల నిర్మాత అయిన హేమచంద్రకవి   1088లో ధందూక లో జన్మించాడు . చాచిగ శ్రేష్టి ,పాహిని దంపతుల పుత్రుడు .ఒకరోజు తండ్రి దూర దేశాలకు వెళ్ళినప్పుడు వజ్ర శాఖకు చెందిన దేవేంద్ర సూరి అనే  ముని వచ్చి అతని తల్లిని అయిదేళ్ళ ఆమె కొడుకును తనకిమ్మని అడిగాడు .ఆమె ఇచ్చేసింది .ఆయన తనతో తీసుకొని వెళ్లి సన్యాసాశ్రమ  వాతావరణం లో పెంచాడు .తల్లి తో సంబంధం లేని ఆ కుర్రాడికి ‘’చాంగ దేవుడు ‘’అనే పేరు పెట్టాడు .

హేమచంద్ర నామం

ఊరినుంచి తిరిగి వచ్చిన తండ్రికి కొడుకు విషయం తెలిసి వెదకటం మొదలు పెట్టాడు .అప్పటికే ఆలస్యమై  పోయింది .కొడుకు సన్యాసాశ్రమం లో అనేక సిద్ధులు సాధించాడు .ఒక సారి తన మహిమ చూపించటానికి మండే అగ్నిలో తన చెయ్యి పెట్టి కాల్చుకొన్నాడు. అది బంగారం అయి పోయింది .అప్పటి నుంచి అతని పేరు ‘’హేమచంద్ర ‘’అయింది .

ఆచార్య హేమ చంద్ర సూరి

హేమ చంద్రుడు  పురాణ తల్లి యాగచ్చ కు చెందిన దేవ చంద్ర చంద్ర సూరి శిష్యుడై శాస్త్రాలు నేర్చాడు .1154లో పండితుడై సూరి బిరుదాన్ని పొందాడు .గుజరాత్ లోని అన్హిల్విద్ పఠాన్  వంశ రాజాస్థానం లో జయసింహ సిద్ధ రాజ ,ఆ తర్వాత వచ్చిన కుమారపాల ల ఆస్థానకవిగా ఉన్నాడు .నిజానికి హేమ చంద్రుడు రాజ దర్బారులో మంత్రి .అతని జైన మత అభిమానం వలన రాజ్యం లో జైన ధర్మానికి గొప్ప ఆదరణ లభించి,రాజ్య  మతం కూడా అయింది .1400 జైన విహారాలు స్థాపించ బడ్డాయి .అహింసను అమలు చసి జంతువధ  మాన్పించి  మాంసాహారాన్ని నిషేధించారు .21ఏళ్ళ వయసులో హేమ చంద్ర సూరి శ్వేతాంబర జైన మతాన్ని రాజస్థాన్ లోని నాగూర్ లో స్వీకరించి’’ఆచార్య హేమ చంద్ర సూరి ‘’అయ్యాడు .

సోలంకీ    సిద్ద రాజు ఆస్థానం లో

హేమ చంద్రుడు జైన మతావలంబి అయినా పూర్వాశ్రమ బ్రాహ్మణ ధర్మాలను  వదిలి పెట్టలేదు  .జైన మతానికి చెందినవే కాక ఇతర మత గ్రంధాలనూ విపరీతంగా అధ్యయనం చేశాడు .మహా మేధావిగా గుర్తింపు పొందాడు .అతని వివేకం ,పాండిత్యం బహు గొప్పవి .సాహిత్యం లో ఆణిముత్యమని పించాడు .ఎన్నో వైవిధ్య రచనలు ప్రాకృత ,సంస్కృత భాషల్లో  చేశాడు .వ్యాకరణం లో కొత్త దారి తొక్కాడు .  ఆ సమయం లో అన్హిల్వద్ పఠాన్ ను  సోలంకీ వంశ రాజులు గుజరాత్ ను స్వాధీనం చేసుకొని పాలించారు . చాతుర్మాస్య దీక్షతో నాల్గు నెలలు  ఇక్కడే గడిపాడు . అతని రచనలలో ఎక్కువ భాగం ఇక్కడే ఉండి  రాశాడు .1125 లో సోలంకి ప్రభువు సిద్ధ రాజ సింహకు పరిచయమై 1135లో రాజదర్బారులో విశిష్ట వ్యక్తీ అయ్యాడు .

పాణినికి దీటుగా వ్యాకరణం

సిద్ధరాజు మాల్వాను జయించాడు . అన్నిటితో బాటు భోజ రాజ రచనలను ధారా నగరం నుండి తనతోబాటు తీసుకొని వెళ్ళాడు .ఒక రోజు సంస్కృత  వ్యాకరణం  అయిన ‘’లక్షణ ప్రకాశ ‘’అనే ,’’సరస్వతీ కంఠా భరణం  ‘’ను సిద్ధ రాజు చూశాడు. అది ఎంతో ప్రభావం కలిగించి రాజాస్థాన పండితులకు అలాంటి దే సులభ ,పటిష్ట వ్యాకరణం  తయారు చేమని కోరాడు .హేమ చంద్రుడు రాజును  కాశ్మీర దేశం లోని ఎనిమిది గొప్ప వ్యాకరణాలను తెప్పించమన్నాడు వాటిని చదివి అధ్యయనం చేసి పాణిని రాసిన ‘’ఆస్టాధ్యాయి ‘’తో సరి తూగగల వ్యాకరణాన్ని రాశాడు .దీనికి ‘’సిద్ధ హేమ శబ్డాను శాసనం ‘’అని రాజు పేరు, తన పేరుకలిసి  వచ్చేట్లు గా పేరుపెట్టాడు .రాజు కవిగారి కృషికి ఎంతో సంతోషించి ఆ వ్యాకరణ గ్రంధాన్ని ఏనుగు పై అన్హిల్వద్ పఠాన్  పురవీధుల్లో ఊరేగించాడు .హేమ చంద్రుడు సోలంకి రాజ వంశ చరిత్ర ‘’ద్వాశ్రయ కావ్యం ‘’రాసి అందులోనుంచి తన వ్యాకరణానికి  ఉదాహరణలు ఇచ్చాడు .

కుమార పాలుని ఆస్థానం లో

సిద్ధరాజు తన మేనల్లుడు కుమార పాలను చంపే ప్రయత్నం చేస్తే హేమ చంద్రుడు  అతన్ని అనేక పుస్తకాల కుప్పలో  కనపడకుండా దాచేసి ప్రాణం కాపాడాడని ఒక కధనం ఉంది .కుమారపాలుని వలన తనకు ,తన రాజ్యానికి ప్రమాదం సంభవించి ,రాజ్యం పతనం చెందుతుందని భావించి ఈ హత్యా ప్రయత్నం చేశాడు సిద్ధ రాజు .సిద్ధరాజు ఆస్థానం లో నుంచి కుమార పాలుని ఆస్థానానికి చేరాడు హేమ చంద్రుడు .

కుమార పాలుని కాలం లో అంటే 1143-1173 లో హేమచంద్రుడు కుమారపాలునికి ముఖ్య సలహాదారుడుగా వ్యవహరించాడు .అప్పుడు గుజరాత్ రాజ్యం సాంస్కృతిక కేంద్రం గా వర్ధిల్లింది .జైన మతం లోని ‘’అనేకాంత వాదం’’ను బాగా నేర్చినవాడుకనుక హేమచంద్రుడు చాలా విశాల దృక్పధం అలవరచుకొని ,రాజు అభిమానాన్ని పొంది మరీ సన్నిహితుడయ్యాడు శైవుడైన కుమారపాలుడు పాఠాన్ లోని సోమనాధ  దేవాలయాన్ని పునర్నిర్మించాలని  భావించాడు   .హేమచంద్రుని ప్రాపకం ప్రాభవం చూసి అసూయ చెందిన కొందరు అతడు సోమనాధ శివునికి నమస్కారం కూడా చేయడని, పొగరు బోతు,గర్విష్టి  అని చాడీలు చెప్పారు .సోమనాధ  ఆలయ  ప్రారంభోత్సవం రోజున రాజు ఆహ్వానం పై హేమ చంద్రుడు రాజు వెంట ఆలయానికి వెళ్లి సోమనాధ లింగానికి సాగిల పడిమ్రొక్కి ‘’మనిషి జీవితం లో మనిషిలోని సహజాతాలైన అసూయ ,అనుబంధాలను నాశనం చేసే బ్రహ్మ అయిన,  విష్ణువైన, జినుడైన వాడికి నమస్కరిస్తున్నాను ‘’అని ప్రార్ధించాడు .

కుమారపాలుడు  జైనమతం లోకి

ఆ తర్వాత కుమార పాలుడు హేమ చంద్రునికి మరీ సన్నిహితుడై జైన మతావలంబి అయ్యాడు .

1121లో’’తరంగ ‘’లో ప్రారంభమైన జైన దేవాలయ నిర్మాణం లో హేమ చంద్రుడు పూర్తి బాధ్యత తీసుకొన్నాడు . .హేమ చంద్రుని ప్రభావం వలన రాజ్యం లో జైనమత వ్యాప్తి జరిగింది .అహింస కు ప్రజలు అలవాటు పడ్డారు . జంతువధ నిషేధింప బడింది .  గుజరాత్ లో .యజ్న యాగాలలో పశువద జరగ కుండా  కుమారపాల ,హేమ చంద్రులు కట్టడి  చేశారు    .హేమ చంద్రుడు చనిపోయి 900 ఏళ్ళు దాటినా ఇప్పటికీ గుజరాత్ అహింసా వ్రతాన్ని అవలంబిస్తోంది .

హేమ చంద్రునిమహా నిర్వాణం

.తన మరణాన్ని ఆరు నెలలు ముందే ప్రకటించి , ‘’సల్లేఖన ‘’అనే మత దీక్ష పూని నిరాహార దీక్షతో ఆచార్య  హేమ చంద్ర సూరి 1173 లోఅన్హిల్వద్  పఠాన్ లోమహా నిర్వాణం పొందాడు ..

కలికాల సర్వజ్ఞుడు

హేమచంద్రుని  రచనల మొత్తం 35,000,000 పంక్తులు ఉంటుంది .అందుకే హేమ చంద్రుని ‘’కలికాల  సర్వజ్ఞుడు ‘’(omniscient) అన్నారు .మహాత్ముడు అన్నారు . ఇరవై ఎనిమిది కాండల  ‘’కుమార పాల చరిత ‘’ను హేమచంద్ర సూరి రచించాడు .ఇది  అనిహిల్వద్ రాజ  వంశ  చరిత్ర .ముఖ్యం గాకుమారపాల రాజ చరిత్ర .మొదటి ఇరవై కాండాలు సంస్కృతం లోను , చివరి ఎనిమిది ప్రాకృత భాషలో రాశాడు .అందుకే దీనికి ‘’ద్వాశ్రయ కావ్యం ‘’అనే పేరొచ్చింది .చివరిభాగాలు ప్రాకృతం లో రాయటానికి కారణం తన కున్న ప్రాకృత భాషాభిమానమే కాకుండా అందులోని వ్యాకరణం లో  తన కున్న ప్రతిభను తెలియ జెప్పటం ,దానితో బాటు ప్రాకృతం లో ఉన్న మహారాష్ట్ర ప్రాకృతి ,సౌరసేని మాగధి ,పైశాచిలేక చూలికా పైశాచి  అపభ్రంశ ,మొదలైన ఆరు రకాల మాండలీకాలను పరిచయం చేయటం .గుజరాతీ మాండలికాన్ని సుసంపన్నం చేశాడు ..ఆప భ్రంశ భాషలకు ఇదొక్కటే చింతామణి లాంటి వ్యాకరణ ఔషధం .ఈ కావ్యాన్ని 1160లో ప్రారంభించి చనిపోయే వరకు రాశాడు .అసంపూర్తి కావ్యాన్ని అభయ తిలక గణి 1255లో పూర్తీ చేశాడని అంటారు .కాని తన పాత్ర అతి స్వల్పం అన్నాడు మణి కవి .

‘’  త్రిశష్టి శలాక పురుష  చరిత్ర ‘’ అనే దీర్ఘ కావ్యం లో హేమచంద్రుడు ఇరవై నలుగురు జైన తీర్ధంకరుల తో బాటు ,63 జైన మహా మునుల జీవిత చరిత్ర రాశాడు .వారి పుట్టుక ,పునర్జన్మ మొదలైన వివరాలను ,జైనమత నిర్మాణానికి, వ్యాప్తికి వారి సేవలను వివరించాడు . దీనికి అనుబంధం గా ‘’స్థవిర వాలి చరిత్ర ‘లేక ‘’పరిశిష్ట పర్వం ‘’రాసి   జైన సన్యాసుల జీవితాలను వర్ణించాడు  .ఇది ఆంగ్లం లో ‘’ది లైవ్స్ ఆఫ్ ది జైన్ ఎల్దెర్స్ ‘’గా అనువాదంపొందింది .  కాశ్మీర ఆలంకారికుడు మమ్మటుడు రాసిన పద్ధతినే అనుసరించి హేమ చంద్రుడు ‘’కావ్యాను ప్రకాశ ‘’రాశాడు .ఇందులో అభినవ గుప్త ,ఆనంద వర్ధనుల రచనలను పేర్కొన్నాడు . . .’’చందాను శాసనం ‘’అనే ఛందో గ్రందాన్నీ హేమ చంద్రుడు రాశాడు .’’కావ్యానుశాసనం’’తో బాటు  ,దానికి వ్యాఖ్యానం కూడా రాశాడు .అదే ‘’అలంకార చూడామణి ‘’.ఎనిమిది  అధ్యాయాల  ఈ గ్రంధం సాహిత్య చరిత్రలోనే చాలావిలువైనది అపూర్వమైనది .భరత ,లొల్లట దండి , .శంఖ మమ్మట , భట్టనాయక రచనలను ఇందులో సమీక్షించాడు .ఇవికాక మరెన్నిటినో  స్పృశించాడు .ఇదొక విస్తృత రచన .

నిఘంటు రచన –స్తోత్ర రచన

హేమ చంద్రుడు కూర్చిన  నిఘంటువులలో ‘’దేశి నామ మాల ‘,లేక’’ దేశి శబ్ద సంగ్రహం’’,  ‘’అభిదాన చింతామణి’’ ,’’అనేకార్ధ కోశం ‘’ముఖ్యంగా పేర్కొన దగినవి . ., ,’’నిఘంటు శేషం’’అనేది జీవ శాస్త్ర నిఘంటువు . . ‘’శ్యాద వాద మంజరి’’ ,’’జినేంద్ర స్తోత్రం ‘’మొదలైనవి వర్ధమాన మహా వీరునిపై స్తోత్రాలు .’’వీత రాగ స్తోత్రం ‘’అనే ఆధ్యాత్మిక స్తోత్రం కూర్చాడు .’’యోగ శాస్త్రం తో బాటు ‘’,ప్రమాణ మీమాంస ‘’గ్రంధమూ రాశాడు. సంస్కృత ‘’ వ్యాకరణం గా ‘’శబ్డాను శాసనం ‘’రాశాడు .ఇందులో ఎనిమిదవ  అధ్యాయం లో ప్రాకృత వ్యాకరణమూ చేర్చాడు ;జైన మత కరదీపికగా ‘’యోగ శాస్త్రాన్ని’’ ,లింగనిర్దారణకు  ‘’లింగాను శాసనా’’న్ని హేమ చంద్రుడు రాశాడు .

గణిత మేధావి

గణితం లో కూడా హేమ చంద్రుడు తన ప్రతిభను చూపాడు .అంతకు పూర్వం గోపాలుడు రాసిన ఆధారంగా  హేమ చంద్రుడు ఆధునికకాలం లో పిలువ బడిన ‘’ఫైబోనాసి సీక్వెన్స్ ‘’ను తయారు చేసి చెప్పాడు .’’ఫైబో నాసి ‘’అనే గణిత శాస్త్రజ్ఞుడు 1202లో చెప్పిన ఈ సూత్రాన్ని యాభై ఏళ్ళకు ముందేఅంటే  1150 లోనే హేమచంద్రుడు తయారు చేసి చూపించిన మేధావి .దీన్ని F(n)=F(n-1)+F(n-2)నిర్వచనంద్వారా చెప్పాడు ఫైబోనాసి .

సోమ ప్రభాచార్యుడు ప్రాకృతభాషలో ‘’కుమార పాల ప్రతిబోద మహాకావ్యం ‘’రాసి కుమార పాల చరిత్రను బోధ పరచాడు .సోమప్రభుడు విజయ  సింహుని శిష్యుడు .ముని చంద్రునికి అయిదవ తరం  వాడు .అతని తండ్రి సిద్ధ పాలుని సహచరుడు ,కవిహేమచంద్రుని  స్నేహితుడుఅయిన శ్రీపాలుడు .అనిల్హివిద్ రాజాస్థానం లో ఉన్నాడు .ఈచరిత్రలో కుమారపాలుడు జైనం లోకి పరి వర్తన చెందినవిధానం వర్ణించ బడింది .హేమచంద్రుని ప్రబోధం వలననే కుమారపాలుడు జైనం స్వీకరించాడని తెలియ జేశాడు. అందులో కావ్యం చివర సంస్కృత భాషలో ‘’ ప్రశస్తి ‘’రాశాడు .హేమ చంద్రుని  ఇతర గ్రంధాలు  ‘’హేమ కుమార చరిత్ర ‘’,సోమతినాద చరిత్ర,సాలాంత కావ్యం మొదలైనవి .

మహా మేధావి ,సర్వ శాస్త్ర పారంగతుడు ,సంస్కృత ప్రాకృత కవి ,కలికాల సర్వజ్ఞ బిరుదాంకితుడు జైనాచార్యుడు హేమచంద్ర సూరి ని మనవాళ్ళు అంతగా గుర్తించినట్లు కనిపించదు .అందుకే ఈతరానికి హేమ చంద్రుని పరిచయం చేశాను .

Inline image 1

–గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-15-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.