గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
163-పార్వతీ రుక్మిణీయ కవి-విద్యా మాధవుడు
శివ పార్వతి కల్యాణాన్ని ,శ్రీ కృష్ణ రుక్మిణీ కల్యాణాన్ని కలిపి ‘’పార్వతీ –రుక్మిణీయం ‘’అనే ద్వ్యర్ధి కావ్యం గా రాశాడు విద్యా మాధవుడు .చాళుక్య రాజు సోమదేవుని ఆస్థాన కవిగా ఈ కవి ఉండేవాడు .1126-1138 కాలం కళ్యాణ రాజు నాల్గవ సోమేశ్వరుడే ఈ సోమదేవుడు .మనకవిగారు గుణవతి దగ్గర నీలాలయం లో జన్మించాడు .వేదం,శాస్త్రాలన్నీ నేర్చాడు .కిరాతార్జునీయం మొదలైన వాటిపై పై వ్యాఖ్య రాశాడు .కవిరాజు తన తోకలిపి మహా కవులు ముగ్గురే అన్నాడు .మిగిలిన ఇద్దరు బాణుడు ,సుబందు .విద్యా మాధవుడు.ఇంకో అడుగు ముందుకు వెళ్లి బాణ ,సుబందు ,కవిరాజుల తర్వాతా నాలుగో వాడిని నేనే అని చెప్పుకొన్నాడు .కవిరాజుకన్నా చిన్నవాడేకాని సమకాలికుడు .
అంతకు ముందే రామాయణ భాగవత కధలను ‘’యాదవ రాఘవీయం ‘’గా రాశాడు వేంకటాధ్వరి .అతనిపదిహేడవ శతాబ్ది రచన ‘’విశ్వ గుణాదర్శం ‘’విశిష్టమైన రచనగా పేరొందింది .కఠిన పదాలతో యమకాను ప్రాసలతో సాగిన రచన అది .ఐతే కవిరాజు కావ్యానికి ఇది తీసికట్టు .దీనిపైనా వ్యాఖ్యానం వచ్చింది .బహుశా కవి రాసిన వ్యాఖ్యానమే అది అయి ఉండచ్చు .
164- రాఘవ యాదవీయ కవి-సోమేశ్వరుడు
వింజమూరి కుటుంబానికి చెందిన కృష్ణ సూరి కుమారుడే సోమేశ్వరుడు .గౌతమ గోత్రీకుడు .పది హీను కా౦ డాలున్న ‘’రాఘవ యాదవీయ౦ ‘’రాశాడు .ఇందులో శ్రీ రామ,శ్రీ కృష్ణ చరిత్రలను వర్ణించాడు .ఇది ద్వ్యర్దికావ్యం .కాళిదాస ,భారవి ల శబ్దాలానే ప్రయోగించి అమరకవి లాగా ఏకాక్షర పదాలనూ వాడాడు .ఇది కావ్యమే కాదు అలంకార గ్రంధం కూడా .విపులమైన వ్యాఖ్యానమూ ఉంది ..ఇదే పేరుతో రఘునాదా చార్యుడు ,శ్రీనివాసాచార్యుడు ,వాసుదేవుడు కూడా రాశారు .రామ చంద్రుని ‘’రసిక రంజనం ‘’అనేది శృంగార ,వైరాగ్య అర్ధ భావాలను తెలియ జేసే కవితల సంపుటి .1524 లో రాసిన రామ చంద్రుడు లక్ష్మణ భట్టు కుమారుడు .
165-త్ర్యర్దికావ్య రచనకు నాంది పలికిన ‘’చిదంబర కవి ‘’
ఇలా ద్వ్యర్దికావ్యాలు మూడు పూలు ఆరుకాయలులాగా వర్ధిల్లిన కాలం అది .మరో అడుగు ముందుకు వేసి త్ర్యర్ది కావ్య రచన చేశారు కవులు .మూడు రకాలైన కధలను ఒకే కావ్యం లో చెప్పటమే త్ర్యర్దికావ్యం .రాఘవ యాదవ పాండవీయం లో రామాయణ మహా భారత భాగవత కధలను ఒకే చోటమూడు కాండలలో చెప్పాడు’’చిదంబర కవి ‘’.ఇతడు అనంత నారాయణ వెంకటా లకుమారుడు .కౌశిక గోత్రానికి చెందిన సూర్య నారాయణ కు మనవడు .శ్రీనివాసుడు ఇతని తమ్ముడు .శివ సూర్య ఇతని మేనమామ .ఇతని ‘’భాగవత చంపు ‘’కృష్ణ కదామృతమే .డిండిమ కు చెందిన ముల్లనద్రం నివాసి .1586-1614ప్రాంతపు విజయ నగర రాజైన మొదటి వెంకట ఆస్థానం లో ఉండేవాడు .ఈ గ్రంధం పై వ్యాఖ్యానం ఉన్నది .తండ్రి అనంత నారాయణుడే రాశాడు .కావ్యం లోని మూడు అర్ధాలను చక్కగా విడమరచి విపులంగా అర్ధ మయెట్లు రాశాడు .ఈ కవి ఇంకాస్తముందుకు వెళ్లి ‘’పంచ కళ్యాణ చంపువు ‘’రాశాడు అందులో రామ ,కృష్ణ ,విష్ణు, శివ ,సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణాలను ఐదింటిని ఒకే సారి వర్ణించాడు .తానే విపుల వ్యాఖ్యానమూ రాసుకొన్నాడు .
మైసూరుసంస్థానం లో ఉదయేంద్ర పురానికి చెందిన అనంతా చార్యుడు ‘’యాదవ –రాఘవ –పాండవీయం ‘’రాశాడు .రాజాస్థాన కవ యిత్రి ‘’త్రివేణి ‘’కి ఈయన తండ్రి .కృష్ణ ,నల ,హరిశ్చంద్ర ,కధలను చతురర్ధ కావ్యం ‘’ఆబోదాకర ‘’గా ఘనశ్యామ కవి రాశాడు .ఇలా అనంతార్ధ కావ్య విజ్రు౦భణ జరిగింది .సాహిత్యం పరిపుష్టి చెందింది .కాని దాన్ని పగల కొట్టి విడమర్చి చెప్పాల్సిన వింత పరిస్తితి ఏర్పడింది .
166-మేఘ విజయ గని –
జైన సన్యాసి అయిన మేఘ విజయ గని క్రిపావిజయుని శిష్యుడు .హీరవిజయకు అయిదవ తరం వాడు .వ్యాకరణ,ఖగోళ ,మీమాంస ,శాస్త్రాలలో ఉద్దండుడు .వీటిపై విపులంగా గ్రంధాలు రాశాడు .అతడు రాసిన ‘’సప్త సంధాన కావ్యం ‘’లో తన కవితా ప్రతిభ ఏమిటో నిరూపించుకొన్నాడు .ఈ కావ్యం లో ఒకే సారి ఏడు రకాల కధలను అల్లాడు .మధుర భాషా సంపద దీనిలో కనిపిస్తుంది .’’దేవానందాభ్యుదయం ‘’కావ్యం లో ఏడు కాండాలలో ‘’విజయ దేవ సూరి ‘’జీవితాన్ని చిత్రించాడు .ఇది 1671లో రాసిన పుస్తకం .’’శాంతి నాద చరిత్ర ‘’లో శాంతినాధుని జీవితాన్ని వర్ణించాడు ఈరెండు కావ్యాలలో విజయగని శిశుపాల వధ ,నైషద కావ్యాలలోని పంక్తులను సమస్య కోసం గ్రహింఛి తన స్వంత కవిత్వం తో వాటి ఉత్ర్కుస్టతను చాటి చెప్పాడు.
మేఘ విజయ గని కవి తన ‘’సప్త సంధాన మహా కావ్యం ‘’లో ప్రతి శ్లోకం లోను ‘’వృషభ నాద ,శాంతి నాద ,పార్శ్వ నాద ,నేమినాద ,మహావీర ,కృష్ణ ,బలదేవ లను వర్ణించాడు .ఇందులో మొదటి అయిదుగురు ఇరవైనలుగురు జైన తీర్ధ౦కరులలో ఉన్నారు .తొమ్మిది కాండాలలో వీరిపై అనేక కధలు రాశాడు .అతి సరళంగా సుందరం గా కవిత్వాన్ని అలవోకగా జాలువారించాడు .అతని సంస్కృత పరిజ్ఞానానికి ముగ్దులయేట్లు చేస్తాడు .
హేమ చంద్ర సూరి కూడా’ సప్త సంధాన కావ్యం ‘’రాసినట్లు ఉందికాని కావ్యం అలభ్యం .ఆ లోపాన్ని మేఘ విజయ సూరి పూరించి గొప్ప మేలు చేశాడు .కాళిదాసమహాకవి మేఘ సందేశ కావ్యం లాగా గని ‘’మేఘ దూత సమస్య లేఖ ‘’రాశాడు ఇందులో కవి తన ప్రభువు గచ్చ విజయ ప్రభ సూరి ‘’కి రాసిన లేఖ ఉంది .విజయప్రభ సూరి జీవితం పై పదమూడు కాండల ‘’దిగ్విజయ మహాకావ్యం ‘’రాశాడు విజయ గని . ‘’ సమకాలీన వేదాంతుల సిద్ధాంతాలను ఖండిస్తూ దృష్టాంతం గా మేఘ విజయ గని రాసిన నాటకమే ‘’యుక్తి ప్రబోధం ‘’..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-15-ఉయ్యూరు