మా తండ్రి మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి
- 10/07/2015
మోదీకి లాల్‌బహదూర్ కుమారుడి వినతి
వారణాసి, జూలై 9: దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మృతికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన కుమారుడు సునిల్ శాస్ర్తీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తన తండ్రి మృతిపై అనేక అనుమానాలున్నందున కేంద్రం జోక్యం చేసుకుని వాటిని నివృత్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘మా తండ్రి మరణానికి సంబంధించిన అన్ని పత్రాలు వెల్లడించాలని ప్రధాని మోదీని వినమ్రంగా కోరుకుంటున్నాం. నిజానిజాలేమిటో తెలుసుకోవాలని మేం ఆశిస్తున్నాం’ అని బిజెపి నేత సునిల్ శాస్ర్తీ స్పష్టం చేశారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ (61) 1966 జనవరి 11న తాష్కెంట్లో చనిపోయారు. తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత ఆయన మృతి చెందారు. గుండెపోటుతో శాస్ర్తీ చనిపోయారని వార్తలొచ్చినా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దీని వెనకు కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తాష్కెంట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ భారత ముద్దుబిడ్డ అంటూ శ్లాఘించారు. ఆయన నిజమైన దైశభక్తుడని, అలాంటి నేత భారత్‌లో ఉండడం నిజంగా గర్వకారణమని మోదీ స్పష్టం చేశారు. ‘మాతో ఎవరు మాట్లాడినా లాల్‌బహదూర్ మరణం గురించే ప్రస్తావిస్తుంటారు. మా తండ్రి ఎలా చనిపోయారని ఇప్పటికీ అడుగుతున్నారు’ అని సునిల్ శాస్ర్తీ తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రెండు మూడు పర్యాయాలు తమ తండ్రి మృతికి సంబంధించి పత్రాలు బహిర్గం చేయాలని కోరినా ఫలితం లేకపోయిందని రాజ్యసభ మాజీ సభ్యుడు సునిల్ చెప్పారు. తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే ప్రధాని చనిపోవడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని యావత్ జాతి ఎదురుచూస్తోందని ఆయన పేర్కొన్నారు.
పుష్కరాల వేళాయే..
- 10/07/2015

రాజమహేంద్రిలో సాంస్కృతిక సౌరభం కనువిందుగా ఉత్సవ హేల
1000 మంది కళాకారులతో కూచిపూడి ఏకకాల ప్రదర్శన ఫుడ్ ఫెస్టివల్స్, ప్యాకేజీ టూర్లు
రాజమండ్రి, జూలై 9: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు చేసిన అనంతరం సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని, పర్యాటక సంబరాలు జరుపుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గోదావరి పుష్కరాలు 14 నుండి ప్రారంభమవుతున్నప్పటికీ, 13 సాయంత్రం నుండే సన్నాహక కార్యక్రమాలను ఏర్పాటుచేయటం ద్వారా గోదావరి తీరానికి పుష్కర శోభను తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. వివిధ ప్రాంతాల నుండి గురువారం రాజమండ్రికి బయలుదేరిన పుష్కర జ్యోతులు కూడా 13న సాయంత్రానికి రాజమండ్రి చేరుకుంటాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చే పుష్కర జ్యోతులకు రాజమండ్రిలో స్వాగతం పలకటం ద్వారా గోదావరి పుష్కర మహోత్సవ సన్నాహక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రి నగరానికి అన్ని వైపుల నుండి వచ్చిన పుష్కర జ్యోతులను పుష్కరఘాట్‌కు తీసుకెళ్లి, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అఖండ జ్యోతిని వెలిగించటం ద్వారా ఈ కార్యక్రమం ముగుస్తుంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా రోడ్కమ్రైలు వంతెన మీద నుండి ఆకాశ దీపాలను వదిలే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటుచేశారు. అనంతరం గోదావరి హారతి ఉత్సవంతో పాటు లేజర్‌షో, బాణసంచా కాల్పులు, రాత్రి 8గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో కీరవాణి సంగీత విభావరి కార్యక్రమాలు జరుగుతాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 11వేదికలపై సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. రాజమండ్రి నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానం, ఆనం కళాకేంద్రంలోను, ధవళేశ్వరం, ద్రాక్షారామం, కోటిపల్లి, ఆత్రేయపురం, వాడపల్లి, కొవ్వూరు, సిద్ధాంతం, పాలకొల్లు, నర్సాపురంలో సాంస్కృతిక వేదికలను ఏర్పాటుచేశారు. 13న సాయంత్రం 1000 మంది కళాకారులతో రాజమండ్రి నగరంలో ర్యాలీ నిర్వహించటం ద్వారా సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో తొలి రోజు కూచిపూడి కళాకారిణి స్వప్న సుందరి బృందంతో ప్రదర్శనలు ప్రారంభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కచేరితో పాటు, అనేక జాతీయ, రాష్టస్థ్రాయి కళాకారులతో ప్రదర్శనలు జరిగే విధంగా సాంస్కృతిక ఉత్సవాల కార్యాచరణను రూపొందించారు. చివరి రోజు 25న వెయ్యి మంది కూచిపూడి కళాకారులతో అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను కూడా ఏర్పాటుచేశారు.
పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్, నర్సాపురంలో సైకత శిల్పాల ఫెస్టివల్, తూర్పుగోదావరి జిల్లాలోని కె గంగవరంలో ప్రభల ఉత్సవం, రాజమండ్రిలోని ప్రభుత్వ కళాశాలలో ఫల పుష్ప ప్రదర్శనను ఏర్పాటుచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజి టూర్లను కూడా ఏర్పాటుచేయనున్నారు. రాజమండ్రి నుండి అన్నవరం, పిఠాపురం, సామర్లకోట ఒక ప్యాకేజి, ద్రాక్షారామం, కోటిపల్లి, అయినవిల్లి, అప్పనపల్లి మరో ప్యాకేజి, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, పిఠాపురం తదితర ప్యాకేజి టూర్లను పర్యాటక సంస్థ నడపాలని నిర్ణయించింది. పుష్కరాలు సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ నుండి కూడా ప్యాకేజి టూర్లను పర్యాటక శాఖ ఏర్పాటుచేయనుంది. (చిత్రం) తిరుమల నమూనా ఆలయం