తిలాపాపం తలాపిడికెడు
గోదావరి మహా పుష్కరాల ప్రారంభం నాడు నిన్న రాజ మండ్రిలో జరిగిన తొక్కిసలాటలో జనమరణం నివార్యమైనదే కాని అందరి అలసత్వం వలన అనివార్యమైంది .ఇందులో అందరి తప్పూ ఉంది .ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానిది ,ప్రచారం చేసిన పత్రికలది ,చానెల్స్ ది చానెళ్ళలో మాటలు అమ్ముకొంటున్న మతాదిపతులది ,ప్రవచన సమ్రాట్టులది చివరికి వారిని నమ్మే అమాయక ప్రజలది .ఈ ప్రజలు నమ్మి బలైపోతారు .మిగిలిన పై వారందరూ ఆకుకు అందకుండా పోకకుకందకుండా జారిపోతారు .అసలే గోదావరి .మహోధృత ప్రవాహం తో రాజమండ్రి నిపరవశింప జేస్తుంది .కనుక సహజం గా అంత జల సంద్రం లాంటి గోదావరీ స్నానం అందరూ కోరుకోనేదే .అక్కడి రేవులూ అతి పవిత్రమైనవే .గోష్పాద క్షేత్రం లోఏది చేసినా విశేష ఫలితమే .అఖండ గోదావరిని చూసి పులకించటం అందరికి సహజం .పుష్కర ఘాట్లను పకడ్బందీ గా నిర్మించారు కనుక అక్కడ స్నానిస్తే ఇబ్బంది ఉండదని చెప్పటం మామూలే .పుణ్యం మూటకట్టుకోవచ్చునని ఆశి౦చటమూ సహజమే .ఇదేదో పీఠాదిపతుల, ప్రవచన కర్తల తప్పిదం అని తానూ ఆ గొంగట్లోనే తింటున్న గరికపాటి వారు అనటం వారికి తగిన మాట కాదు .కొంచెం సంయమనం అవసరం .అలాగే రాచకీయ మ్మన్యులు తామేదో పవిత్రులమని అవతలివాడికి మట్టి అంటిందని జబ్బలు చరుచుకోవటమూ ఆక్షేపణీయమే .జరిగిన ప్రమాదం తీవ్రమైనదే .మానవ తప్పిదమే .బాబు ఇంట్లో కూర్చుంటే అన్నీ అవే వాటంతటికి అవి జరి గిపోతాయన్న ‘’రఘుబీరా’’ తానూ ఇంట్లో కూర్చోకండా పార్టీలో ఎవరూ లేకపోయినా జెండా బుజానేసుకొని వీధుల వెంట వీరంగం దేనికి ?ఇంట్లో కూచుంటే పార్టీ వృద్ధి చెందదా”?చిరు పెను కోపం తో ప్రేలాపన సంస్కార రహితం .పవన్ ఇంకా గూడులో౦చి బయటికి రాలేని గుడ్డు .ఓదార్పు వస్తే బాగుండనికలవరించే ‘’ఫాన్ ఆయనా’’ అవాకులే ఇప్పుడూపేలాడు .సరే వీళ్ళు రాక్షసీయ రాచకీయగాళ్ళు .పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు వదిలేద్దాం .
నరసింహా వధాని గారు పుష్కరాలలో దేవతలు వచ్చి స్నానం చేస్తున్నట్లు ఎవరికైనా కనిపించారా ?వీడియో తీశారా ?అని ప్రశ్నించారు .ఇవి నమ్మకానికి సంబంధిన విషయం .ఇదే మాట ముస్లిం లను మక్కా వెళ్లి రాళ్ళు వేసి కొట్టద్దని చెప్పగలరా ?క్రైస్తవులు ప్రార్ధన చేసి జబ్బులు నయం చేస్తాని ప్రచారం చేస్తుంటే అడ్డగించాగలరా ఇవన్నీ నమ్మకానికి చెందినా విషయాలు .కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని మనవాళ్ళ నమ్మకం .అలా మోక్షానికి వెళ్ళిన వాళ్ళని చూపించండి అని గరికపాటి వారు అడగ గలరా ?ఎవరైనా చూడగలమా ?మక్కా ఎందుకు మన వూళ్ళో మసీదు లో అల్లా లేడాఅని ప్రశ్నించగలమా ?జెరూసలెం ఎందుకు ఊళ్ళో చర్చి లేదా అని అడగగాలమా ?ఎవరిమీదో బహుశా తన ఊరి వారైన ప్రవచన కర్త పైన ఉన్న ద్వేషాన్ని ఇలా వీధుల పాలు చేయరాదు .సాదువుల్లో కొందరు సర్కారీ సాధువు లున్న సంగతిమనకు తెలుసు .జియ్యర్ గారి నోటి వెంట శివ శబ్దం పలికించగలరా వీరు ?చానెళ్ళు దొరికాయి కదానని నమ్ముకొని మాటలు అమ్ముకొంటున్న వారు బేస్ ను మర్చిపోరాదు .మన అమ్మ మనకు ఎవరో చేబితెనేగా తెలిసేది .దాన్నే నమ్ముతున్నాముకదా.శాస్త్రం లో ఉన్న మృత్తిక విషయాన్ని చాగంటివారు చెప్పారు అది ఆయన విద్యుక్త ధర్మం .విని ఆచరిస్తారో లేదో అది ప్రజల కున్న బాధ్యత.దీన్ని అనవసర రాద్దాంత౦ చేయకండి ప్లీజ్ . గంగనీరు తెచ్చి రామేశ్వర లింగానికి అభిషేకం చేస్తున్నామా లేదా ?తద్దినాలు పెట్టట౦ పి౦డప్రదానాలు ,అర్ఘ్యాలు తిలోదాకాలు ఇవ్వటం నమ్మకానికి ,శాస్త్ర్రానికి సంబంధించిన విషయాలు .మాయాబజార్ లో వంగర చెప్పినట్లు ‘’శాస్రం నిష్కర్ష గా కర్కశం గా నే చెబుతుంది .మనం సౌమ్యం గా సారాంశాన్నే గ్రహించాలి ‘’.
ప్రమాదాలు ఇంత రద్దీలో జరగటం సహజం .కాని నివారించే వీలుకూడా ఉండాలి .కిందటి కృష్ణా పుష్కరాల్లో మొదటిరోజు తొక్కిస లాటలో జన నష్టం జరగటం మర్చిపోతే ఎలా .కుంభ మేళాలో ,కేదార్ బద్రినాద్ మానస సరోవర చార్ ధాం యాత్రలలో ఎంతమంది మరణించటం లేదు .కనుక అక్కడికి వెళ్ళద్దని చెబుతారా ?రోజూ భారత భాగవతాలలోని నీతులను జనాలకు వల్లే వేసి చెప్పేవారు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి మీడియాలో .పెర్ఫెక్ట్ గా చేయాలన్న చంద్రబాబు ఆలోచన ఆచరణ సాధ్యం చేయటానికే మానిటరింగ్ చేస్తున్నాడు .అది తప్పుకాదే. హూద్ హూద్ తుఫాన్ లో అహర్నిశం పాటుపడ్డవాడుకాదాఆయన ?
మహా పుష్కరాలు అన్న మాట తప్పా?కాదని ఆయన రుజువు చేయగలరా ?అసలు పుష్కరం ఎప్పుడు ప్రారంభామైనదీ అనే దానిలోనే అనేక సందేహాలు .ఎవరి లేక్కలువారివి .ఎవరు ఎలానమ్మితే అలా చేశారు .దీనికెవరూ రాద్ధాంతం చేయలేదే ?ఎవరిష్టం వారిది .ఎవరినమ్మకం వారిది అని సరిపుచ్చుకున్నారు .భారతం లో భీష్ముడు చెప్పాడనో విదురుడు చెప్పాడనో కృష్ణుడు చెప్పాడనో నీతులు చెరిగే ఈ పెద్దలు ఆవ్యక్తులున్నారని నమ్మబట్టేనా లేక పుక్కిటి పురాణాలని భావించా ?నీ నమ్మకం ఇంకోడికి నమ్మకం అనిపిస్తుందా .నీనమ్మకం మీద నీ కుండే అధారిటీనే నువ్వు చెప్పేది .అందులో మంచిని గ్రహించటం వినే వారి ప్రారబ్ధం .ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రవచనాలు చానళ్ళలో వస్తున్నా మనుషుల తీరు మారింది అని చెప్పటానికి రుజువు ఉందా ? చూపగలరా?దయచేసి జాతిపరువును బాజారుకు ఈడ్చకండి మహా ప్రభో అని బాధతో అంటూ సెలవ్ –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15 7-15-ఉయ్యూరు