వ్యాపం’.. అవినీతి కూపం

వ్యాపం’.. అవినీతి కూపం

  • 19/07/2015
  • -వాధూలస

తెలుగునాట ఆ మధ్య వచ్చిన ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’ చిత్రం చూసిన వారికి ఓ సన్నివేశంలో డైలాగ్ బాగానే గుర్తుండిపోయింది… డాక్టర్ పాత్రలో ఉన్న చిరంజీవి ఓ రోగిని పరిశీలించాక.. అతడికి వచ్చిన రోగాన్ని గూర్చి వివరిస్తూ… ‘సర్క్‌మ్ లోకో ఆఫ్ ది ఇంటెన్‌స్టైన్’ వ్యాధితో బాధపడుతున్నావని చెబుతాడు. దానికి అర్థం ఏమిటని రోగి ఎదురు ప్రశ్నిస్తే…తనని కన్ఫ్యూజ్ చేయవద్దని హీరో అంటాడు. నకిలీ డాక్టర్‌గా నటిస్తున్న చిరంజీవి రోగి ప్రశ్నకు గందరగోళంలో పడిపోతాడు. ఆ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. అది సినిమా కనుక అందరూ ఎంజాయ్ చేశారు. తేలికగా తీసుకున్నారు. తల్లిదండ్రులను మోసగించి, నకిలీ ఆస్పత్రిని సృష్టించి, దొంగ సిబ్బందిని పెట్టి, డాక్టర్‌గా నమ్మించిన ఆ నటుడు ఆ సినిమాలో అదుర్స్ అనిపించాడు. ఇప్పుడు అలాంటి వందలమంది నిజమైన ‘శంకర్‌దాదాలు’ మధ్యప్రదేశ్‌లో పట్టుబడుతున్నారు. ఇది సినిమా కాదు… పచ్చినిజం. ఆ సినిమాలో శంకర్‌దాదా వల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ మధ్యప్రదేశ్‌లో పట్టుబడుతున్న ఈ నకిలీ డాక్టర్ల బాగోతం చూస్తే వ్యవస్థకు పట్టిన రోగమేంటో, అది ఎంత ప్రమాదకరంగా మారిందో తెలిసి దేశం అవాక్కవుతోంది. రాజకీయ నాయకులు, దళారులు, అధికారులు, చివరకు సాధారణ పౌరులు కూడా ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న రీతిలో అవీనితికి పాల్పడ్డారు. అదికాస్తా బయటపడ్డాక నేరాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. నిందితులు, సాక్షులు, ఈ బాగోతాన్ని వెలికి తెచ్చినవారు, దర్యాప్తు చేస్తున్నవారు, చివరకు ఈ వ్యవహారంపై వార్తలు రాస్తున్నవారు కూడా అసహజంగా మరణిస్తున్నారు. వేలకోట్ల రూపాయల ఈ కుంభకోణం వెనుక మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ‘వ్యాపం’ వేదికగా నిలిచింది. మెడికల్ సీట్లు, ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో అవకతవకలకు పాల్పడి, అనర్హులకు అవకాశం కల్పించి డబ్బులు దండుకునే వ్యవహారం ఎంత విచ్చలవిడిగా, విశృంఖలంగా సాగిపోయిందో తెలుసుకుని దేశ ప్రజలు నివ్వెరపోతున్నారు. అధికారంలో ఉన్న నేతలు, వారి ఛత్రఛాయలో పనిచేస్తున్న అధికారులు, దళారులు కలిసి ఆడిన అవినీతి నాటకంలో ఆశావహులు, సంపన్నులు పాలుపంచుకున్నారు. దీనివల్ల అన్ని అర్హతులు ఉండి, నిజాయితీగా పరీక్షలు రాసిన తెలివైన ఉద్యోగార్థులు, విద్యార్థులు నష్టపోయారు. విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా దోపిడీ జరిగిపోయింది. కానీ, పాపం పండినట్లు ‘వ్యాపం’ బాగోతం ఎట్టకేలకు బయటకు పొక్కింది. భారతీయ సమాజంలో ఇంకా నిజాయితీపరులు, అందుకోసం పోరాడేవారు ఉన్నారని తేలింది. ప్రాణాలకు తెగించి కొందరు చేసిన పోరాటం వల్ల ఇప్పుడు ‘వ్యాపం’ అవినీతి కూపం అంతు చూసే పని మొదలైంది. వివాదం ఏమిటి? 1990 నుంచి పిఎంటి, ఇతర పరీక్షల నిర్వహణ ద్వారా వైద్య, ఇతర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అప్పుడుకూడా అవినీతి జరిగేది. కాకపోతే ఒకటీ అరా ఫిర్యాదులే అందేవి. అనర్హులకు అవకాశం కల్పించారంటూ 1995లో తొలిసారిగా ఫిర్యాదు అందింది. 2004లో మరో ఏడు కేసులు నమోదయ్యాయి. అప్పట్లో కేవలం విద్యాసంబంధ పరీక్షలను మాత్రమే వ్యాపం నిర్వహించేది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు కొన్ని మార్పులు జరిగాయి. గ్రూప్-1 మినహా మిగతా అన్ని ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించే బాధ్యతను వ్యాపంకు కట్టబెట్టారు. అంతకు ముందు ఏ శాఖకు సంబంధించిన ఖాళీల భర్తీ ఆ శాఖే నిర్వహించేది. అవినీతికి అవకాశం తక్కువగా ఉండేది. ఎప్పుడైతే అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ బాధ్యత వ్యాపంకు దక్కిందో దళారుల పాత్ర ఎక్కువైంది. అంతకుముందు అక్కడక్కడ ప్రత్యక్షమయ్యే దళారులు ఆ తరువాత ఒక పటిష్ట వ్యవస్థగా రూపొందారు. ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులకు, వారికింద పనిచేసే కీలక వ్యక్తులకు ఎరవేసి, అనర్హులైన అభ్యర్థులకు అటు వైద్యవిద్యలో ప్రవేశం, ఆశావహులకు ఉద్యోగాల అందేలా చక్రం తిప్పా రు. ఇక్కడ కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలన్న తేడాలేకుండా దళారులు పనులు చక్కబెట్టారు. ఈ దందాలో పది లక్షల రూపాయల నుండి 85 లక్షల రూపాయల మేరకు ఒక్కొక్క లబ్దిదారునుండి రాబట్టిన దళారులు తమకు సహకరించిన అందరికీ సొమ్ము పంచారు. అసలు వివాదం… వైద్యవిద్యలో ప్రవేశానికి 2009లో నిర్వహించిన పిఎంటి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమాచారహక్కు కోసం ఉద్యమిస్తున్న కొందరు కోర్టుకెక్కారు. దీంతో వివాదం వెలుగులోకి వచ్చింది. ఎస్‌టిఎఫ్, సిట్ ఏర్పాటయ్యాయి. దర్యాప్తు ముమ్మరమయింది. ఈ విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దీనికి రాజకీయాలు తోడయ్యాయి. వాతావరణం వేడెక్కింది. ఈలోగా కేసులో కీలక వ్యక్తులు వరుసగా, అనుమానాస్పద స్థితిలో మరణిస్తూండటంతో దేశం దృష్టి ఈ కేసుపై పడింది. నేతలపై ఒత్తిడి పెరిగింది. ఈలోగా సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ రంగంలోకి దిగింది. అక్రమాలు ఇలా… ఇప్పుడు వివాదం అంతా పిఎంటి పరీక్షల్లో అక్రమాల గురించి రేగింది. నిజానికి మరెన్నో పరీక్షల్లోకూడా ఈ తరహా అవినీతే జరిగింది. వైద్యవిద్యలో అక్రమంగా సీట్లుపొందినవారి సంఖ్య దాదాపు 318. ఇది ఒక్కఏడాదిలో జరిగినది. ఇలా అనర్హులై, వైద్యవిద్యలో అవకాశాలు పొందినవారి సంఖ్య 800వరకు ఉంటుందని అం చనా. అనుమానితుల జాబితాలో దాదాపు వెయ్యి పేర్లున్నాయి. వారిలో కొందరిని వైద్యకళాశాలల నుండి బహిష్కరించారుకూడా. మరికొందరిని, వారి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. సరే, వీరంతా ఎలా అవకాశాలు చేజిక్కించుకున్నారో తెలిస్తే-దళారుల రాజ్యం ఎంత విస్తరించిందో, వారికి ఎవరెవరి అండదండలున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. అనర్హులకు మెడికల్ సీటు దక్కేందుకు నాలుగు మార్గాలను ఎంచుకున్నారు. వైద్యసీటు కోరుకుని, దళారులకు డబ్బిచ్చిన విద్యార్థి అసలు పరీక్షకు హాజరుకాకుండా, వారి బదులు తెలివైన మరో అభ్యర్థి హాజరై రాస్తాడు. అలా అవకాశం కల్పించడం, అతడు పరీక్ష రాసినపుడు ఎవరూ అభ్యంతరం పెట్టకుండా చూడటం దళారుల వంతు. అంతా డబ్బు పంపకంతో జరిగిపోతుంది. ఒక్కోసారి గతం లో ఈ పరీక్షరాసి వైద్యవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులే బినామీలుగా వచ్చి పరీక్షలు రూస్తూంటారు. ఇలాంటి 15మంది (టాపర్స్) విద్యార్థులను దర్యాప్తు సంస్థలు అరెస్టుచేశాయి కూడా. ఇక రెండో మార్గం మరీ గమ్మత్తుగా ఉంటుంది. దీనిని ఇంజన్-బోగీ వ్యవస్థగా చెబుతారు. అంటే వైద్యవిద్యలో సీటు ఆశించే విద్యార్థి పరీక్షకు హాజరైనపుడు అతడికి అందుబాటులో ఓ తెలివైన విద్యార్థి ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తారు. అతడికి సహకరించేందుకు మరికొందరు విద్యార్థులు చుట్టూ ఉండేలా సీటింగ్ ఉంటుంది. వారంతా కూడబలుక్కుని, బాగా పరీక్ష రాస్తారన్నమాట. ఇక మూడోమార్గం మరీ ఖరీదైన వ్యవహారం. ఇది ఓఎంఆర్ షీటుతో చేసే మోసం. కాస్త తైలం ఖర్చు ఎక్కువన్నమాట. తమకు కావలసిన అభ్యర్థి పరీక్షకు హాజరై ఖాళీ ఓఎంఆర్ షీట్ ఇచ్చేస్తాడు. జవాబు పత్రాలు దిద్దేటప్పుడు తమకు కావలసిన అభ్యర్థికి ఎన్నిమార్కులు వేస్తే సీటొస్తుందో చూసి నిర్ణయిస్తారు. అన్ని ప్రశ్నల జవాబులు ఓఎంఆర్ షీటులో గుర్తించి వాల్యుయేషన్ సమయానికి సిద్ధం చేస్తారు. స్ట్రాంగ్‌రూమ్ నుండి ఓఎంఆర్ షీట్లు బయటకు రావడం, మళ్లీ లోపలికి వెళ్లడం అంతా సాఫీగా సాగిపోతుంది. ఇదికాకుండా, జవాబుల ‘కీ’ని ముందుగానే అభ్యర్థికి ఇచ్చి పని సులభం అయ్యేలా సహకరించడం నాలుగో పద్ధతి. ఇలా 2009 పిఎంటిలో జరగడంతో దాదాపు 300మంది అనర్హులకు వైద్యవిద్యలో ప్రవేశం దక్కింది. ఈ తతంగానికి మూలబిందువు ఒకప్పటి బిజెపి నేత జగదీష్ సాగర్. మధ్యప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మీకాంత్ శర్మకు అనుంగు శిష్యుడైన జగదీష్ ఇలాంటి అక్రమాలను ఓ వృత్తిగా చేసుకుని నిపుణుడిగా ఎదిగాడు. చివరకు అధికారులను కూడా శాసించే స్థితికి వచ్చాడు. ఈ బురదలో గవర్నర్, ముఖ్యమంత్రికూడా అడుగేశారన్నది ఆరోపణ. ఎస్‌టిఎఫ్ ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారులు జగదీష్ శర్మను 2013లో అరెస్టుచేసి అన్ని విషయాలను రాబట్టారు. ఇదొక్కటే కాదు… వ్యాపం పాపంలో ఇదొక అంకం మాత్రమే. ఖరీదైన వ్యవహారం, బాగా డబ్బు పంపకాలు ఉన్నాయి కనుక ఇది వెలుగులోకి వచ్చింది. వ్యాపం సారథ్యంలో జరిగిన మరికొన్ని పరీక్షల్లోకూడా అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. 2009 పిఎంటితోపాటు అంతకుముందు, ఆ తరువాత జరిగిన ఐదు సంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని దర్యాప్తులో తేలింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సెలక్షన్ టెస్ట్, మిల్క్ ఫెడరేషన్ సెలక్షన్ టెస్ట్, సుబేదార్ ఎస్‌ఐ సెలక్షన్ టెస్ట్, ప్లటూన్ కమాండర్ సెలక్షన్ టెస్ట్‌తోపాటి మరికొన్ని పరీక్షల్లోకూడా పిఎంటి మాదిరిగానే అక్రమాలు జరిగాయి. మొత్తమీద 153మందిపై ఎఫ్‌ఐర్ నమోదైంది. 127మందిని అరెస్టు చేశారు. పిఎంటి ద్వారా అక్రమంగా సీటుపొందినవారిని గుర్తించారు. 2014లో ఇలా వందిమంది ఎంపికైనారు. 2011లో 286మంది ఇలా జొరబడ్డారు. ప్రఖ్యాత ఎంజిఎం మెడికల్ కళాశాలలో ఇలా చేరిన 27మందిని కళాశాల నుండి సస్పెండ్ చేశారు. ఇలా అక్రమంగా వైద్యవిద్యలో అవకాశం పొంది, చదువు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రాక్టీస్ చేస్తున్నవారు ఉన్నారు. ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌కు చెందిన సంపన్నులు ఇలా అక్రమాలకు పాల్పడినవారిలో ఉన్నారని తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఎంపి గవర్నర్ పాత్ర ఇందులో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయానికి ప్రాధాన్యత చోటుచేసుకుంది. ప్రముఖుల అరెస్టు.. కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం విషయంలో కూడా ఇలా అక్రమాలు జరిగాయని, ఇందులో అప్పటి విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ హస్తముందని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత కేసు నమోదవడం, అరెస్టు చేయడం మామూలే. తానేమీ తప్పుచేయలేదని, తన పేరుతో తన ఒఎస్‌డి ఒ.పి.శుక్లా అంతా చేశారని ఆయన అంటారు. కాగా, ఒపిశర్మను కూడా ఎస్‌టిఎఫ్ అరెస్టు చేసింది. ఒక్కొక్కరి నుంచి ఆయన 85 లక్షలు వసూలు చేశారన్నది ఆరోపణ. 2012 ఉద్యోగాలు, 2013 పిఎంటి పరీక్షల్లో అక్రమాలకు తెరతీసిన సుధీర్‌వర్మ అనే వ్యాపారవేత్తనుకూడా అరెస్టు చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చెందిన అనేకమంది నాయకులు, అధికారులు, దళారులకు ఆయన భారీగా ముడుపులు ముట్టచెప్పారన్నది అభియో గం. ఐపీఎస్ అధికారి ఆర్.కె.శివ్హరె, రెవిన్యూ ఉద్యోగి రవికాంత్ ద్వివేది కూడా ఇందులో కీలకపాత్ర వహించారు. ఎసిబి దాడుల్లో ఇతడికి 60కోట్ల అక్రమ ఆస్తి ఉందని తేలింది. ఇక ఈ బాగోతానికి నాయకత్వం వహించిన దళారులు డాక్టర్లు జగదీష్ సాగర్, సంజీవ్ శిల్పాకర్ దాదాపు 400మంది విద్యార్థులకు అవకాశం కట్టబెట్టారు. మొత్తమీద నాలుగైదు బృందాలు విడివిడిగా ఈ బాగోతాన్ని నడుపుతున్నాయి. రాయ్‌గుప్తా బృందం కూడా ఇందులో పాలుపంచుకుంది. ఇక కీలకమైన వ్యవహారం నడిపిందిమాత్రం వ్యాపం అధికారి, ఎగ్జామ్స్ కంట్రోలర్ పంకజ్ త్రివేది. ఈయన ము ఖ్యంగా జగదీష్‌సాగర్‌కు సహకరించారు. వీరిద్దరూ కలసి దాదాపు 300 పైచిలుకు విద్యార్థులకు సహకరించారు. జగదీష్ శర్మ బాగోతం బయటపడిన తరువాత కూడా అతడు సిఫారసు చేసినవారికి మెడకిల్ సీట్లు దక్కేలా పంకజ్ సహకరించారన్నది ఆరోపణ. వ్యాపం అధికారి సికె మిశ్రా కూడా వీరికి చేదోడువాదోడుగా నిలిచారు. ఇదే సంస్థలో కీలకమైన పదవిలో ఉన్న సిస్టమ్స్ ఎనలిస్ట్ నితిన్ మహేంద్ర, అజయ్‌సేన్, ప్రోగ్రామర్ యశ్వత్ పర్నేకర్ వీరికి సహకరించారు. ఇక బయటివారి పాత్ర తక్కువేమీ కాదు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బంధువులు, గవర్నర్ రామ్‌నరేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు రాష్టస్థ్రాయిలో జరిగిన దర్యాప్తులో వాస్తవాలు బయటికొచ్చాయి. కానీ, దానిని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా కీలక వ్యక్తులు అసహజంగా మరణిస్తున్నారని, ఇవి హత్యలని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఇప్పుడు ఈ కేసులన్నీ సిబిఐ చేతిలోకి వెళ్లాయి. ము న్ముందు ఏం జరుగుతుందో చూడాలి. కానీ, ఇప్పటివరకు జరిగినవన్నీ చూస్తే వ్యవస్థ ఎంత పాడైందో, అర్హులకు ఎంత అన్యాయం జరుగుతోందో తేటతెల్లమవుతోంది. ‘వ్యాపం’ అంటే… మధ్యప్రదేశ్‌లో 1970లో ఈ సంస్థ ఏర్పడింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపిపిఇబి) అని ఇంగ్లీషులో పిలిచే ఈ సంస్థను హిందీలో ‘వ్యావసాయక్ పరీక్షామండల్’ అని పిలుస్తారు. దీనిని సంక్షిప్తంగా ‘వ్యాపం’ అని సంబోధిస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతంతో దీని అందరి నోళ్లలో నానుతోంది. దీనికి సాంకేతిక విద్యాశాఖ మంత్రి సారథ్యం వహిస్తారు. పరీక్షల నిర్వహణకు ఓ అధికారి కంట్రోలర్‌గా వ్యవహరిస్తారు. తొలి మరణం.. నమ్రత మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న నమ్రత ఆకస్మిక మరణం- వ్యాపం కుంభకోణంలో తొలి అనుమానాస్పద మరణంగా చెబుతారు. మూడేళ్లక్రితం ఆమె- తాను చదువుతున్న కళాశాలకు దూరంగా ఉజ్జయినిలో రైల్వేట్రాక్‌పై శవమై కన్పించింది. అప్పట్లో కేసు దర్యాప్తు చేశారు. ఆ తరువాత కేసు మూసేశారు. కాగా, ఈ మధ్య వ్యాపం కేసులో కీలకవ్యక్తుల మరణాలు ఎక్కువకావడంతో మళ్లీ నమ్రత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ కేసును మళ్లీ తెరిచి దర్యాప్తు మొదలెట్టారు. ఆమె తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన జర్నలిస్టు కూడా మరణించడం అనుమానాలను మరింతగా పెంచింది. ‘ప్రాణాంతక’ కుంభకోణం..! భారీగా ప్రభుత్వ నిధుల్ని స్వాహా చేయడం, అంచనాలకు అందని అవినీతి వ్యవహారాలు.. అధికార దుర్వినియోగం, అక్రమ పద్ధతులు, ఆశ్రీత పక్షపాతం.. ఇలాంటి మాటలన్నీ ఏదైనా ‘కుంభకోణం’ జరిగినపుడు వాడే సాదాసీదా మాటలు.. అయితే- మన దేశ చరిత్రలోనే ఇది ‘ప్రాణాలు తీసే’ భయంకర కుంభకోణం.. వృత్తి విద్య కోర్సులకు ఎంట్రన్స్‌లను, ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహించే సంస్థలో నడిచిన అక్రమాలు ప్రాణాలను బలితీసుకోవడం యావత్ దేశానే్న హడలెత్తిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఉన్నత చదువుల్లో ప్రవేశాలకు, ఉద్యోగ నియామకాలకు పరీక్షలను నిర్వహించే ‘వ్యాపం’ (వ్యావసాయిక్ పరీక్ష మండల్) సంస్థలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే అసహజ మరణాల సంఖ్య నానాటికీ పెరగడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతుల్లో దళారులు, పరీక్షలు రాసిన నకిలీ విద్యార్థులు, అక్రమ పద్ధతుల్లో కశాశాలల్లో సీట్లు పొందినవారు, అక్రమంగా ఉద్యోగుల్లో చేరినవారూ ఉన్నారు. అసహజ మరణాలతో పాటు ‘వ్యాపం’ కుంభకోణంలో వాస్తవాలను వెలికితీసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయగా, ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించిన మరణాలపై దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ‘వ్యాపం’ నేర చరిత్ర… 1982: డిమాండ్ ఉన్న వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌లను నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘వ్యాపం’ను ఏర్పాటు చేసింది. 1995: ఎంట్రన్స్‌ల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలకు బీజం పడింది. 2008: ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు రాత పరీక్షలు నిర్వహించే బాధ్యత ఈ సంస్థకే అప్పగించారు. 2009: ఉద్యోగ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు పలు ఉదంతాలు వెలుగు చూశాయి. 2009: మెడికల్ ఎంట్రన్స్ ప్రశ్నపత్రం ‘లీక్’ కావడంతో తొలి కేసు నమోదు. డిసెంబర్, 2009: మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీక్‌పై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం. జూలై 7, 2013: పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 20 మంది నిందితులను అరెస్టు చేశారు. జూలై 16, 2013: అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన మధ్యవర్తి జగదీష్ సాగర్ అరెస్టు. ఆగస్టు 26, 2013: ప్రత్యేక టాస్క్ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) విచారణ బాధ్యతలు చేపట్టి 55 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. అక్టోబర్ 9, 2013: వృత్తి విద్య కోర్సుల్లో చేరిన 345 మంది విద్యార్థుల ప్రవేశంపై అనర్హత. డిసెంబర్ 18, 2013: మాజీ సాంకేతిక విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మపై కేసు నమోదు. నవంబర్ 5, 2014: ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందం (ఎస్‌టిఎఫ్) పనితీరుపై పర్యవేక్షణకు మాజీ న్యాయమూర్తి చంద్రేశ్ భూషణ్‌లో నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు. జూన్ 29, 2015: ‘వ్యాపం’ కుంభకోణానికి సంబంధించి 23 అసహజ మరణాలు చోటుచేసుకున్నట్లు ‘సిట్’ ప్రకటించింది. అయితే, మృతుల సంఖ్య 46 దాటిందని అనధికార వర్గాల ఆరోపణ. జూలై 7, 2015: కుంభకోణంపై సిబిఐ విచారణకు సిద్ధమేనని ముఖ్యమంత్రి ప్రకటన. జూలై 9, 2015: సిబిఐ విచారణకు ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు. మరణాల ‘మిస్టరీ’..! ‘వ్యాపం’ కుంభకోణంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నవారిలో కొందరు అనూహ్య పరిస్థితుల్లో మరణించడం అంతుచిక్కని చిక్కుముడిగా మా రింది. మధ్యవర్తులు, పరీక్షలు రాసిన నకిలీ విద్యార్థులు, అక్రమంగా సీటు సంపాదించిన విద్యార్థులు, నియామకాలు పొందిన ఉద్యోగులు, కీలక బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులు, కొందరు అధ్యాపకులు సైతం మృతుల జాబితాలో ఉన్నారు. గవర్నర్ రామ్‌నరేష్ యాదవ్ తనయుడు శైలేష్‌యాదవ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈయన కనీసం పదిమందికి సిఫార్సు చేశారన్నది అభియోగం. ‘టాస్క్ ఫోర్స్’కు సహకరిస్తున్న ఓ వైద్య కళాశాల డీన్ అరుణ్ శర్మ, పాత్రికేయుడు అక్షయ్ సింగ్, శిక్షణ పొందుతున్న సబ్ ఇన్స్‌పెక్టర్ అనామిక, కానిస్టేబుల్ రమాకాంత్ పాండే, వైద్య విద్యార్థిని నమ్రత.. ఇలా మృతుల సంఖ్య 46కు పైమాటేనని అనధికార అంచనా. కాగా, విపక్ష కాంగ్రెస్ నాయకులు మాత్రం ‘వ్యాపం’ కుంభకోణంలో 150కి పైగా అసహజ మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎక్సెల్ షీట్లలో రహస్యం వ్యాపం కుంభకోణంలో లబ్ధిదారులు, అందులో పాలుపంచుకున్న వారి వివరాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమార్కులు తమ తమ కంప్యూటర్లలో నిక్షిప్తం చేశారు. వారిలో కొందరు ఎక్సెల్ షీట్లలో వారి వివరాలు పొందుపరిచారు. ఆ షీట్ల ఫైల్‌నేమ్స్ మాత్రం ఆసక్తిరేపేవిగా ఉన్నాయి. ఒక నిందితుడు మంత్రిణి అని ఎక్సెల్ ఫైల్‌కు పేరు పెట్టారు. అందులో చాలామంది లబ్ధిదారుల పేర్లున్నాయి. మంత్రిణి అన్న పదానికి అర్థాన్ని ఇప్పుడు దర్యాప్తు సంస్థలు శోధిస్తున్నాయి. ఈ బాగోతంలో ఓ మహిళ కీలకపాత్ర వహించి ఉండవచ్చని లేదా మంత్రులు, గవర్నర్, సిఎంలకు చెందిన వర్గాల్లో మహిళలు ఎవరైనా అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఈ కేసులో దర్యాపు చేస్తున్న సిబ్బందివద్ద ఉన్న ఎక్స్‌ఎల్‌లో అన్ని వివరాలు ఉన్నాయని, వాటిని దాచిపుచ్చుతున్నారని, ఆ దర్యాప్తు సంస్థతో పనిచేసి, ఆ తరువాత దూరమైన ఐటీ నిపుణుడు పాండే ఆరోపించారు. మొత్మమీద ఎక్సెల్ షీట్లలో రహస్యాలు బయటికొస్తే ఈ కేసు త్వరగా పరిష్కారమవుతుందని భావించవచ్చు. చీకటి కోణాన్ని ఛేదించినది వీరే.. ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా ముగ్గురు వ్యక్తులు సాహసోపేతంగా వ్యవహరించడంతో ‘వ్యాపం’ కుంభకోణం గుట్టురట్టయ్యింది. ఇండోర్‌కు చెందిన సమాచారహక్కు చట్టం కార్యకర్త ఆనంద్ రాయ్ ‘వ్యాపం’ బాగోతంపై న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేయడంతో డొంకంతా కదిలింది. ఆయన కేసు వేశాకే ఈ కుంభకోణంపై మొదట దర్యాప్తు మొదలైంది. తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ ఆనంద్ రాయ్ 2013లో కోర్టును ఆశ్రయించడంతో ఆయనకు భద్రత కల్పించారు. గ్వాలియర్‌కు చెందిన 26 ఏళ్ల సామాజిక కార్యకర్త ఆశిష్ చతుర్వేది ‘వ్యాపం’ వ్యవహారంలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బంధువుతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రమేయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై మూడు సార్లు హత్యాయత్నం, ఒకసారి కిడ్నాప్‌కు ప్రయత్నాలు జరిగాయి. 2003-2013 మధ్య వైద్యవిద్యలో సుమారు 5వేల మంది అక్రమంగా ప్రవేశాలు పొందారని ఆయన ఆరోపిస్తూ కోర్టుకెక్కారు. అక్రమార్కుల నుంచి బెదిరింపులు రావడంతో ఆశిష్‌కు ప్రాణహాని కలగకుండా భద్రతను ఏర్పాటు చేస్తూ న్యాయస్థానం గన్‌మెన్లను నియమించింది. గ్వాలియర్ వీధుల్లో ఆశిష్ సైకిల్‌పై తిరుగుతుంటాడని, ఎకె-47 రైఫిల్స్‌ను పట్టుకుని ఆయన వెంట పరుగెత్తడం తమకు ఇబ్బందికరంగా మారిందని ఆ గన్‌మెన్లు కోర్టుకు తెలియజేశారు. ఈ కేసు దర్యాప్తులో టాస్క్ఫోర్స్ నియమించిన ఐటి నిపుణుడు ప్రశాంత్ పాండే ‘వ్యాపం’లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చౌహాన్ హస్తం ఉందని పేర్కొన్నారు. తొలుత- టాస్క్ఫోర్స్ సేకరించిన ఆధారాలను చూపెడుతూ కొంతమంది నిందితులను బెదిరించాడన్న ఆరోపణలపై పాండేను గత ఏడాది అరెస్టు చేశారు. విచారణాధికారులు సాక్ష్యాలను తారుమారు చేసి, ముఖ్యమంత్రి చౌహాన్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆ తర్వాత పాండే ఆరోపించం సంచలనం సృష్టించింది. ‘ఎక్సెల్ షీట్’కు సంబంధించి సమాచారాన్ని బహిర్గతం చేశాడన్న అభియోగంపై ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలన్న ఆయన అభ్యర్థనను దిల్లీ హైకోర్టు మన్నించి అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, ‘వ్యాపం’ కుంభకోణంలో ఇంతవరకూ అయిదు శాతం దర్యాప్తు మాత్రమే జరిగిందని పాండే చెబుతుండడం గమనార్హం. ఈత వచ్చిన మహిళా ఎస్‌ఐ ఎలా మునిగింది? సబ్ ఇన్స్‌పెక్టర్‌గా శిక్షణ పొందుతున్న అనామిక సికర్వార్ మృతదేహం సాగర్ జిల్లాలోని ఓ చెరువులో లభించడం అనేక అనుమానాలకు దారితీసింది. ‘వ్యాపం’ ద్వారా గత ఏడాది ఎస్‌ఐ పోస్టుకు ఎంపికైన అనామిక జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అని, ఈత బాగా తెలుసునని, ఆమె చెరువులో పడి ఎలా మరణిస్తుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంలో అర్థం లేదని వారు వాదిస్తున్నారు. ఈ నెల 20న తొలి వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలని చెప్పిన అనామిక అర్ధంతరంగా ఎందుకు ప్రాణాలు తీసుకుంటుందని ఆమె భర్త రవి ప్రశ్నిస్తున్నారు. పైగా ఈమె ఎంపికలో ఎలాంటి అవకతవకలకు లేకుండా మెరిట్ ప్రకారమే జరిగింది. అలాగే, పోలీసు క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రమాకాంత్ పండా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు ప్రకటించడాన్ని కూడా ఆయన కుటుంబీకులు విశ్వసించడం లేదు. ‘వ్యాపం’ కుంభకోణానికి సంబంధించి టాస్క్ఫోర్స్ బృందం ప్రశ్నించిన తర్వాత పండా మరణం చోటుచేసుకోవడంతో అనుమానాల సెగలు చెలరేగాయి. *

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.