చీనీతో మైత్రీ చిత్రం!
- 24/07/2015
- -పోలిశెట్టి

యే మేరే వతన్‌కి లోగో -పాట విన్న ఎవరికైనా భారత్- చైనాల మధ్య జరిగిన 60వ దశకం తొలినాటి యుద్ధం గుర్తుకొస్తుంది. భారత సైనికుల త్యాగాలు కళ్లకుకడతాయి. దోస్తీ అంటూ చేయి అందించి దుష్మనీగా మారిన చైనా విషయంలో మొదటినుంచీ భారత్ సంబంధాలు ఎగుడు దిగుడులమయమే. అంతర్జాతీయంగా తనకు పోటీ అయిన భారత్‌ను నిలువరించాలన్నది చైనా తపన. అందుకోసమే సరిహద్దు సమస్యను రగిలిస్తోంది. ఇది దేశాల మధ్య సమస్యే అయినప్పటికీ -బాలీవుడ్ దీన్నీ అందిపుచ్చుకుంది. చైనా దుర్నీతిని అనేక సినిమాల్లో ఎండగట్టింది. మిత్ర దేశమైన పాక్‌ను కాపాడేందుకు చైనా అనుసరిస్తున్న ప్రతికూల వైఖరిని దునుమాడింది. అయితే, సినిమా అన్నది కథను బట్టి, ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఉంటుంది. కథలో ఎవరు ఎవరికైనా మిత్రులు కావొచ్చు. ఎవరు ఎవరికైనా శుత్రువు కావొచ్చు. అందుకే దేశాల మధ్య సంబంధాలకు అతీతంగా -మిగతా దేశాల మాదిరిగానే చైనాలోనూ భారతీయ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. కథలో కొత్తదనం.. చిత్రీకరణలో నవ్యత.. పాత్రలపరంగా వినూత్నత… -ఇవన్నీ చైనీయులనూ ఆకట్టుకుంటున్నాయి. చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న భారతీయ సినిమాలతో -హిందీ చీనీ భాయ్భాయ్ అన్న ‘మైత్రి’కి అద్దం పడుతున్నాయి. ఇది సినిమా స్ఫూర్తి. హద్దుల్లేని కళాత్మకత, సృజనకు లభిస్తున్న కీర్తి. భారతీయ చలనచిత్ర పరిశ్రమ చిన్నదేమీ కాదు. ప్రాంతీయ భాషల్లో నిర్మితవౌతున్న వందలాది సినిమాలు.. పరాయి ప్రాంతాలకు డబ్బింగ్‌ల రూపంలో వెళ్ళి కలెక్షన్ల వాన కురిపిస్తున్నాయి. ప్రాంతమేదైనా, భాష ఏదైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సమాంతర తేదీల్లో విడుదలై ప్రపంచ ప్రేక్షకులనూ మెప్పిస్తుంది. ఇండియన్ హీరోలకు.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు… సాంకేతిక నిపుణులకూ ‘్ఫ్యన్స్’ ఏర్పడేంత గుర్తింపు లభిస్తుంది. భారతీయ సినిమాకు ఇదేమీ కొత్త కాకపోవచ్చు. కానీ -్ధరణి ఊపందుకోవడం.. మెరుగవుతోన్న మైత్రీ సంబంధాల కోణంలో గమనార్హం. నాటి ‘నర్తనశాల’ నుంచి నేటి ‘ఐ’ వరకు ప్రాంతీయ సినిమాలు సైతం హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చూస్తే త్వరలోనే దేశాల మధ్య సరిహద్దులుదాటి స్నేహభావంతో సినీ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పందాలు జరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఇటీవలి చైనా పర్యటనలో భాగంగా త్వరలో ఇండో-చైనా భాగస్వామ్యంలో నాలుగు సినిమాలు తెరకెక్కుతాయన్న వార్తలు తెరపైకొచ్చాయి. వీటిలో -జాకీఛాన్, అమీర్‌ఖాన్ కాంబోలో ‘కుంగ్‌ఫూ యోగా’ చిత్రం ఒకటి ఉండొచ్చన్న కథనమూ ప్రచారంలోకి వచ్చింది. భౌద్ధ మత అధ్యయనానికి వచ్చిన చైనా యాత్రికుడు ‘ఝంగ్’ జీవితం ఆధారంగా మరో చిత్రం రాబోతుందన్న వార్తలూ వింటున్నాం. ఈ వార్తలకు బలం చేకూరడానికి ప్రధాన కారణం -చైనా బాక్సాఫీస్‌ను కుదిపేసిన పికె. అమీర్ చిత్రం అత్యధిక థియేటర్లలో విడుదలై.. కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. బహుశ.. ఓవర్సీస్లో దుమ్మురేపి రికార్డులు సృష్టించిన భారతీయ సినిమా పికెకు ఇప్పట్లో పోటీ వచ్చే సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. పికె ఒక్కటే కాదు, చైనాలో అంతకుముందు దుమ్మురేపిన బాలీవుడ్ సినిమాలూ ఎన్నో ఉన్నాయి. చైనా థియేటర్లలో 3 ఇడియట్స్ విడుదలైనపుడు -ఒకింత సంచలనం క్రియేట్ చేసింది. తరువాత ధూమ్-3 చైనా బాక్సాఫీస్‌ను ఊపేసింది. ప్రపంచస్థాయి సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్లో నిర్మాణమైన బాహుబలి సైతం చైనా మార్కెట్లో బలంగానే నిలబడిందంటే -్భరతీయ చిత్రాలు ఎలా దూసుకుపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే, ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకోవాలి. తన సంస్కృతిని ప్రభావితం చేసే విదేశీ వ్యవహారాలపై చైనా ఎప్పుడూ కచ్చితమైన నియంత్రణలతోనే ఉంది. విదేశీ భాషలకు సంబంధించి ఏటా 34 చిత్రాల కంటే ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేందుకు వీలులేకుండా అక్కడ చట్టాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గత ఏడాది భారతీయ భాషలకు సంబంధించిన ఐదు చిత్రాలు చైనాలో ప్రదర్శితమయ్యాయంటే -అక్కడి ప్రేక్షకుడికి మనం ఎంత దగ్గరవుతున్నామో అంచనా వేసుకోవచ్చు. దేశాల మధ్య సంబంధాల మెరుగులో భాగంగా -గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించిన చైనా ఫిల్మ్ గ్రూప్ కార్పొరేషన్ చైర్మన్‌కు కొన్ని బాలీవుడ్ చిత్రాలు చూపించడం జరిగింది. చూసిన వాటిలో కనీసం మూడింట రెండొంతుల సినిమాలను సిఎఫ్జిసి కొనుగోలు చేసే అవకాశం ఉందని భారతీయ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ** ఇప్పటికే చైనా టెలివిజన్ రంగంలో భారతీయ సీరియళ్లు, థియేటర్లలో భారతీయ సినిమాలు భారీఎత్తున ప్రదర్శితమవుతున్నాయి. జనాభాపరంగా.. అభివృద్ధిపరంగా భారత్‌కు ఏమాత్రం తీసిపోని దేశంగా చైనా ఉండటం ఈ పరిణామాలకు కారణం కావొచ్చు. ఈ కోణం నుంచి పరిశీలిస్తే -వివిధ రంగాల్లో పెట్టుబడులతోపాటు ఎంటర్టైన్మెంట్ రంగంపైనా చైనా కనే్నసిందనే అనుకోవాలి. ఈ మాధ్యమం నుంచి రెండు దేశాల మధ్య మైత్రి సైతం బలోపేతమవుతోంది. ఇప్పటికే హాలీవుడ్ నిర్మాణ సంస్థలైన -ట్వెంటీయత్ సెంచురీ ఫాక్స్, డిస్నీలాంటి సంస్థలు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి -టాలీవుడ్ వరకూ వచ్చేశాయి. ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే -ఇప్పుడు దేశాలమధ్య సినీ వ్యాపారం బలపడుతోందన్న మాట. ** భారతీయ సినిమా ఇలా పెట్టుబడులను ఆకర్షించడానికి కొన్ని కారణాలను ప్రస్తావించుకోవచ్చు. నేడు ప్రాంతీయ భాషా చిత్రం సైతం వివిధ దేశాల లొకేషన్లలో పాటలనే కాదు స్టోరీలనూ నడిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్.. స్టోరీ సిట్టింగ్‌లను కూడా అక్కడే జరుపుతున్నాయి. ఇటీవల ‘ఐ’ ఆడియో ఫంక్షన్‌కి హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ రావడం పెద్ద సంచలనమైతే, అతడు శంకర్ పనితీరును ప్రశంసించడం మరో విశేషం! ప్రస్తుతం ప్రాంతీయ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటుతుంటే, బాలీవుడ్ ప్రాజెక్టుల బడ్జెట్ 300 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల కోసం నిర్మాతలు -ప్రపంచ ప్రొడక్షన్ కంపెనీలతో కలవక తప్పడం లేదు. ఈ పరిస్థితులు దేశ భాగస్వామ్యానికి దారినిస్తాయనడంలో సందేహం లేదు. పైగా టెక్నాలజీ కోసం ఇండియన్ ఫిల్మ్ మేకర్లు హాలీవుడ్‌కి పరిగెట్టడం కూడా మన సినిమాల పట్ల వారిలోనూ ఎక్కువ ఆసక్తి పెంచుతోంది. పాక్‌లో సైతం ఇప్పుడిప్పుడే ఇతర దేశాల చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ పడుతుంది. భారతీయ చిత్రాలకు అమెరికాలో ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంటే, జపాన్‌లో ‘రజనీకాంత్’ స్టయిల్స్‌కి పెద్ద ఫ్యానే్స ఉన్నారు. కృష్ణారెడ్డి ‘ఆహ్వానం’ సినిమాను ఇంగ్లీషులో నిర్మిస్తే.. ‘క్విక్ మురగన్’ చిత్రంతో రాజేంద్రప్రసాద్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇటీవల రిలీజైన హాలీవుడ్ ట్రైలర్లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకచోప్రా పెద్ద సంచలనమే సృష్టిస్తుంది. ట్రైనీ ఎఫ్బిఐ ఆఫీసర్‌గా హాలీవుడ్ స్థాయి నటనను కనబర్చి ఆసక్తి రేపుతుంది. సీక్వెల్స్‌తో కలెక్షన్ల హోరెత్తించే హాలీవుడ్లో భారతీయ దర్శకులు చాలామంది ఇప్పటికీ టెక్నీషియన్లతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ సంబంధాలన్నీ అనుకూలిస్తే దేశాలమధ్య సినిమా వ్యాపారానికి పెద్దపీట వేస్తాయనడంలో సందేహమే లేదు. ‘ఆస్కార్’ లాంటి అత్యున్నత పురస్కారాన్ని భారతీయులు సైతం ఇప్పటికే గెలుచుకున్నా, ఇకముందు తరచూ గెలుచుకునే అవకాశాలూ రావొచ్చు. హారర్, యాక్షన్ చిత్రాలనే ప్రెజెంట్ చేసే హాలీవుడ్ -్భరతీయ భాగస్వామ్యంతో స్టోరీ ఫిలిమ్స్నీ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల పేరుతో దేశాల మధ్య చలనచిత్ర సంబంధాలు ఉన్నా రాబోయేకాలంలో భాగస్వామ్య చిత్ర పరిశ్రమ వలన యూనివర్సల్ చిత్ర పరిశ్రమగా వెలిగే అవకాశం లేకపోలేదు. కథ.. కథాంశం.. నటీనటుల నటన.. టెక్నీషియన్ల పనితీరు బాగుంటే సినిమాకు హద్దులులేవన్న సత్యం ఎన్నో సినిమాలు బోర్డర్లుదాటి ప్రదర్శించడంతో రుజువైంది. ఈ కోవలో దేశ ఆర్థిక వ్యవస్థ బలానికి దేశాల మధ్య చిత్ర పరిశ్రమకు చెందిన ఒప్పందాలు ఎంతో ఉపయోగపడే అవకాశం లేకపోలేదు. దేశాల మధ్య మైత్రికి చిత్ర పరిశ్రమ పంచే వినోదం కూడా ఒక భాగమై నిలుస్తుందంటే అంతకంటే ఆనందం వేరే ఏం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అనుకోవడం సహజం.