బాహుబలి’- కనికట్టు! -పి.ఎస్.ఆర్.

కనికట్టు!

  • 26/07/2015
  • -పి.ఎస్.ఆర్.

‘అవతార్’లో పండోర గ్రహవాసుల్ని వీక్షించి, దర్శకుడు జేమ్స్ కేమరాన్‌కి ‘సలాం’ అన్నాం.. ‘జురాసిక్ పార్క్’లో రాకాసి బల్లుల్ని చూసి డైరెక్టర్ స్పీల్‌బర్గ్‌కి ‘దాసోహం’ అన్నాం.. ‘బ్యాట్‌మేన్’లో ఊహాజనితమైన సూపర్‌హీరో పాత్రను సృష్టించిన బాబ్‌కానే ప్రతిభకు నివ్వెరపోయాం.. ఇలా ఎనె్నన్నో ఆంగ్ల సినిమాలు చూస్తూ- ఆ కళాఖండాలను తీర్చిదిద్దిన సాంకేతిక నిపుణులకు ‘హాట్సాఫ్’ అంటున్నాం. హాలీవుడ్‌లో అయితే అద్భుత గ్రాఫిక్‌లు, అధునాతన కెమెరాలు, మిలియన్ డాలర్ల బడ్జెట్ ఉంటాయని, ఆ హంగులేవీ మనకు లేవని నిట్టూర్పులు విడుస్తాం. ‘హాలీవుడ్ స్థాయి మన సినిమాలకు సాధ్యమా?’-అని డీలా పడిపోతుంటాం.. సంకల్పబలం ఉండాలేగానీ మనమూ సంచలనాలు సృష్టించవచ్చని ఇపుడు ఓ తెలుగు సినిమా ప్రపంచానికి చాటి చెబుతోంది. ఆ మధ్య ‘అవతార్’ థియేటర్ నుంచి అప్పుడే బయటకు వచ్చిన ప్రేక్షకులను ‘సినిమా ఎలా ఉంది?’ అని ప్రశ్నిస్తే- ‘మేం సినిమా చూడలేదు.. మనసారా ఫీలయ్యాం..!’ అని సమాధానం చెప్పారట. అంత అద్భుతంగా దృశ్యాలను పండించాడు ‘అవతార్’ సృష్టికర్త జేమ్స్ కేమరాన్. ‘టైటానిక్’ లాంటి బాక్సాఫీస్ హిట్ ఇచ్చిన మెగా డైరెక్టర్ కేమరాన్ ‘అవతార్’ను త్రీడీలో తీయడానికి పదేళ్లు తీసుకున్నాడంటే- సాంకేతిక నైపుణ్యం కోసం అతను ఎంతగా పరితపించాడో అర్థమవుతుంది. ప్రపంచంలోనే సంచలనాత్మక చిత్రంగా ‘అవతార్’ నిలిచిందంటే అది కేవలం- ‘త్రీడీ’ దృశ్యాలు, గ్రాఫిక్ మాయాజాలం ఫలితమే. *** ఒక ‘చందమామ కథ’ రెండొందల కోట్ల భారీ వ్యయంతో దృశ్యరూపం దాల్చి.. తొలివారంలోనే విశ్వవ్యాప్తంగా సుమారు 250 కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం ఆషామాషీ కాదు.. ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి ఇపుడు మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా, బాక్సాఫీసు దద్దరిల్లిపోయేలా ‘వసూళ్ల సునామీల’ను ఓ తెలుగు సినిమా సృష్టిస్తోంది. అత్యద్భుత, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదాల్చిన ‘బాహుబలి’ గురించి నేడు సర్వత్రా జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఏళ్ల తరబడి పడ్డ శ్రమను విశ్వవ్యాప్తంగా సినీ ప్రియులు గుర్తించి కాసుల వర్షం కురిపిస్తున్నారు. *** ‘బాహుబలి’ కథ సంగతి పక్కనపెడితే- ఆ సినిమాను చూడాల్సిందేనని అంతర్జాతీయ మీడియా సైతం ప్రశంసలు కురిపిస్తోంది. ఇందులో కథనం, నటీనటుల భావోద్వేగాల కంటే ‘గ్రాఫిక్స్ మాయాజాలం’ ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. యుద్ధ సన్నివేశాల్లో కెమెరా పనితనం, విఎఫ్‌ఎక్స్ సాంకేతికతతో ‘క్లోజప్’ దృశ్యాలు వీక్షకుల్ని మంత్రముగ్ధం చేస్తాయి. నటన, కెమెరా, విఎఫ్‌ఎక్స్, శబ్దం, భారీ సెట్టింగులే ‘బాహుబలి’కి పంచప్రాణాలుగా నిలిచి సినీ ప్రియులను మంత్రనగరిలో విహరింపజేశాయి. ‘విజువల్ ఎఫెక్టుల’ను సృష్టించిన సాంకేతిక నిపుణులే ఈ చిత్రంలో అసలు సిసలు హీరోలు. మహిష్మతి రాజ్యాన్ని ఆవిష్కరించిన సాబూ సిరిల్ కళా నైపుణ్యం, సెంథిల్ ఛాయాగ్రహణం, శ్రీనివాస మోహన్ ‘విజువల్ ఎఫెక్టుల’ విన్యాసాలు, పీటర్ హెయిన్స్ తీసిన పోరాట దృశ్యాలు.. వీటి మేలుకలయికతో అంతర్జాతీయ స్థాయిలో సినిమా తీసే సత్తా టాలీవుడ్‌కు ఉందని నిరూపితమైంది. అందుకే- ‘కళ్లు చెదిరే’ అద్భుత గ్రాఫిక్ విన్యాసాలను వీక్షించేందుకైనా ‘బాహుబలి’ చూడాల్సిందేనని ప్రఖ్యాత సినీ విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు. రికార్డుల మోత.. ఇటీవలి కాలంలో మీడియాలో ఏ సినిమాకూ రానంత ‘హైప్’ను సృష్టించడంలో ‘బాహుబలి’ మార్కెటింగ్ టీమ్ వ్యూహాలు ఫలించడంతో ఆ సినిమా ఇపుడు వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తెలుగు సినిమా ఏభై కోట్ల వసూళ్లను దాటడం ఒకప్పుడు అసాధ్యమే. ‘రూ.వంద కోట్ల క్లబ్’లో తెలుగు సినిమా చేరుతుందా? అని ఎదురుచూసిన వారి కలలు ఇదివరకే ‘మగధీర’తో నెరవేరాయి. గత ఏడాది ‘అత్తారింటికి దారేది’తో ఆ కల మరోసారి సాకారమైంది. హిందీ సినిమాలు వంద, రెండొందలు, అయిదొందలు కోట్ల రూపాయలంటూ ఇప్పటికే రికార్డులు సృష్టించాయి. అంతటి ఘనత తెలుగు చిత్రానికి ఎప్పుడైనా దక్కుతుందా? అని ఎదురుచూస్తున్న వేళ.. ‘బాహుబలి’ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగిస్తోంది. టాలీవుడ్‌ను ‘రెండు వందల కోట్ల క్లబ్’లో చేర్చిన మేటి సినిమాగా ఇది నిలిచింది. ఓ దక్షిణాది సినిమా హిందీలో అనువాదమై రికార్డులు సృష్టించడం బాలీవుడ్‌ను విస్మయపరుస్తోంది. తొలిరోజే కాదు, తొలివారంలోనూ ఇది బాక్సాఫీసు వద్ద ప్రకంపనాలు సృష్టించింది. విడుదలైన మొదటిరోజే ఈ సినిమా అక్షరాలా అరవై ఎనిమిది కోట్ల రూపాయల ‘షేర్’ వసూలు చేయడంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు సాధ్యమైంది. తొలిరోజు వసూళ్లకు సంబంధించి షారుఖ్ ఖాన్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ (65 కోట్లు) రికార్డు ఇపుడు చరిత్రపుటల్లో కలిసిపోయింది. అలాగే, తొలి వారాంతంలో 105 కోట్ల రూపాయల ‘షేర్’ సాధించిన మొట్టమొదటి భారతీయ సినిమాగానూ ‘బాహుబలి’ ముందువరసలో నిలిచింది. గతంలో ‘్ధమ్’ (వంద కోట్లు), ‘హ్యాపీ న్యూ ఇయర్’ (99 కోట్లు) రికార్డులను ఈ తెలుగు సినిమా వెనక్కినెట్టేసింది. ఇక, దక్షిణాదికి సంబంధించి తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘రోబో’ (290 కోట్లు)ను మించిపోయే దిశగా ‘బాహుబలి’ కాసుల వర్షం కురిపించడం సినీ వాణిజ్య వర్గాలు విస్తుపోతున్నాయి. ఏ భాషలో సినిమా తీశారన్నది ముఖ్యం కాదని, అద్భుత సాంకేతిక నైపుణ్యాలకే ప్రేక్షకులు పట్టం కడతారని హిందీలో ‘బాహుబలి’ని సమర్పించిన ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లోనే కాదు, మొత్తం ఓవర్సీస్ మార్కెట్‌లోనే వసూళ్లపరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి 4,650 తెరలపై విడుదలైన ‘బాహుబలి’- వసూళ్ల పరంగానే కాదు, ‘అధికారిక బ్లాక్ రేట్ల’ విషయంలోనూ పాత రికార్డులను తిరగరాసింది. ఇంతటి ‘క్రేజ్’ ఎందుకంటే.. సహజంగా పురాణాలు, చారిత్రక నేపథ్యంతో తీసే సినిమాలంటే భారతీయ సినీ అభిమానులు వేలం వెర్రిగా చూస్తారు. ప్రేక్షకుడు ఆశించే వినోదాన్ని కేవలం కథనంతోనే కాదు, గ్రాఫిక్ మాయాజాలం, స్పెషల్ ఎఫెక్టులతో అందించేందుకు గత కొంతకాలంగా దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. రాజులు, రణతంత్రాలకు సంబంధించిన కథ అని విస్తృత ప్రచారం జరగడంతో ‘బాహుబలి’పై ప్రేక్షకులు ఎనె్నన్నో ఊహించుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఇది వెయ్యేళ్ల కాలం నాటి కథ అని చెప్పడమే కాదు.. అప్పటి జీవన పరిస్థితులు, సమాజ వాతావరణం, వేషభాషలు, వస్తధ్రారణ వంటివి ఎలా ఉంటాయో ఊహించి- ఆ దృశ్యాలను కళ్లముందు ఆవిష్కరించడంలో సాంకేతిక నిపుణులు కృతకృత్యులయ్యారు. ఇందుకోసం నెలల తరబడి వారు నిర్విరామంగా పనిచేశారు. షూటింగ్ కోసం ‘మహిష్మతి’ అనే రాజ్యాన్ని సృష్టించారు. భారీ కోటలు, ఎత్తయిన కట్టడాలు, యుద్ధ మైదానాలను తీర్చిదిద్దారు. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, దుస్తుల కోసం చాలా కసరత్తు చేశారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో దాదాపు 800 మంది పనిచేశారు. పోరాట దృశ్యాల కోసం రెండువేల మంది ఫైటర్లను రప్పించారు. ఎనిమిది వేల కిలోల బరువున్న 150 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటీనటులకు మార్షల్ ఆర్ట్సు, బాడీ బిల్డింగ్, గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పించారు. ఆయుధాలను వాడడంలో మెళకువలు నేర్పించారు. వియత్నాం నుంచి కొంతమంది నిపుణులైన ఫైట్ మాస్టర్లను రప్పించారు. పాత్రలకు తగ్గట్టు మంచి శరీర సౌష్టవం ఉండేలా బాగా తినడం, హుషారుగా నటించేందుకు జిమ్‌లో కసరత్తులు చేయడం వంటివి కీలక పాత్రల్లో నటించినవారికి అలవాటు చేశారు. మేకప్ కోసం గంటలకొద్దీ సమయం వెచ్చించడం, ఒక్క షాట్‌కు ఒక రోజంతా శ్రమించాల్సి రావడం వంటి పరిస్థితుల్లో ఈ సినిమా నిర్మాణం రెండేళ్లకుపైగా సాగింది. ‘బాహుబలి’ కోసం దర్శకుడు రాజవౌళి ఓ కొత్త భాషను సృష్టించడం మరో ఆసక్తికర అంశం. సెట్స్, విజువల్స్ విషయంలోనే కాదు.. ప్రతి అంశంలోనూ అంతర్జాతీయ స్థాయి సాంకేతికత కోసం పరితపించారు. ‘హే రామ్’, ‘అశోక’, ‘గురు’, ‘రా..వన్’, ‘రోబో’ లాంటి భారీ చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేసిన సాబూ సిరిల్ ఈ సినిమా కోసం నెలల తరబడి శ్రమించారు. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విశేషాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని.. * చిత్ర నిర్మాణానికి సుమారు 200 కోట్ల రూపాయల్ని, మూడేళ్ల కాలాన్ని వెచ్చించారు. * మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా సరికొత్త రికార్డు. * అమెరికాలో బాక్సాఫీసు వద్ద తొలి వారాంతంలో అత్యధిక వసూళ్లను సాధించిన తొలి భారతీయ సినిమా. * మూడు సార్లు జాతీయ అవార్డులు పొందిన వి.శ్రీనివాస మోహన్ పర్యవేక్షణలో విఎఫ్‌ఎక్స్ ఎఫెక్టులు రూపుదిద్దుకున్నాయి. భారత్‌తో పాటు అమెరికా, దక్షిణ కొరియాలకు చెందిన 17 విఎఫ్‌ఎక్స్ కంపెనీలు భాగస్వామ్యం వహించాయి. * రాజుల హయాంకు సంబంధించి ఊహాజనితమైన కథ ఇది. చరిత్ర పుస్తకాల్లో ఎలాంటి ప్రస్తావన లేని ‘బాహుబలి’ కోసం భారీ కట్టడాలతో ఓ రాజ్యాన్ని నిర్మించారు. * భారతీయ చలనచిత్ర రంగంలో తొలిసారిగా ఈ సినిమా కోసం ‘కిలికి’ పేరిట ఓ భాషను సృష్టించారు. 750 పదాలు, 40 వ్యాకరణ నిబంధనలతో దీన్ని సినిమాలో ‘కాలకేయ’ పాత్ర కోసం వాడారు. * షూటింగ్ సందర్భంగా వేసిన సెట్లు, ఆయుధాలు, కళాకృతులు, దుస్తులను భద్రపరిచేందుకు ఓ మ్యూజియంను ఏర్పాటు చేయడం మన దేశంలో ఓ రికార్డే. హైదరాబాద్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ మ్యూజియం దోహదపడుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. * తెలుగు భాషలో నిర్మించినా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ‘డబ్’ చేసి ఒకేసారి విడుదల చేశారు. * మీడియాలో ‘హైప్’ కోసం ప్రచార పర్వంలో భాగంగా 51వేల చదరపు అడుగుల పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రపంచంలో ఇంతటి భారీ పోస్టర్‌ను రూపొందించడం ‘గిన్నిస్ రికార్డు’ అని ప్రచారం చేస్తున్నారు. * హాలీవుడ్ స్థాయి స్పెషల్ ఎఫెక్టులు సినిమాలో ఆద్యంతం అలరిస్తాయి. ఎద్దులతో పోరాటాలు, కొండ శిఖరాలపైన, మంచు పర్వతాలపైన సైనికుల యుద్ధం వీక్షకులకు గగుర్పాటును కలిగిస్తాయి. సుమారు నలభై నిమిషాల సేపు సాగే పోరాట దృశ్యాలు సాంకేతిక నిపుణుల ప్రతిభను చాటి చెబుతాయి. * భారీ వ్యయంతో నిర్మించిన ‘బాహుబలి’ మొదటి భాగం వసూళ్లపరంగా రికార్డులు సృష్టిస్తుండగా, వచ్చే ఏడాది ప్రారంభంలో రెండో భాగాన్ని విడుదల చేస్తారు. * 3డి సౌండ్ ఎఫెక్టు, అద్భుత ఫొటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని, అందుకే ఇది ‘్భరతీయ బ్లాక్‌బ్లస్టర్’ అని సినీ విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ‘లోకల్’గా నిర్మించిన ‘గ్లోబల్’ సినిమా ఇది అని కీర్తిస్తున్నారు. * ‘బాహుబలి’ ట్రైలర్ విడుదలయ్యాక ‘యూ ట్యూబ్’లో 24 గంటల వ్యవధిలో రెండు మిలియన్ల మంది వీక్షించారు. * పాశ్చాత్య దేశాల్లో భారతీయ చలన చిత్రాలకు మార్కెట్ పెంచేందుకు ఈ సినిమా స్ఫూర్తినిస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. * అంతర్జాతీయ బాక్సాఫీసులో అగ్రభాగాన నిలిచిన తొలి పది సినిమాల్లో ‘బాహుబలి’కి స్థానం లభించిందని వాషింగ్టన్‌లోని ‘డెడ్‌లైన్ డాట్ కామ్’ వెబ్‌సైట్ ప్రకటించింది. అమెరికాలో 124.3 మిలియన్ డాలర్లు, ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ డాలర్ల వసూళ్లతో పీర్రే కొఫిన్స్ నిర్మించిన ‘మీనియన్స్’ ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచింది. పైరసీ భయం..! పైరసీ భూతాన్ని చూసి ‘బాహుబలి’ సైతం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ‘ఇది పెద్ద సినిమా.. దీన్ని పెద్ద తెరపైనే వీక్షించండి.. పైరసీ జోలికి వెళ్లకండి..’ అంటూ తెలుగు సినీ నిర్మాతలు వేడుకుంటున్నారు. చట్టపరంగా, సాంకేతిక పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పైరసీ ఆగడం లేదని, థియేటర్లను డిజిటలైజ్ చేయడం వల్ల అక్కడ పైరసీని గుర్తించడం సాధ్యమవుతున్నా, ఆన్‌లైన్‌లో దీన్ని ఆపడం కష్టమవుతోందని వారు అంటున్నారు. గ్రాఫిక్ మాయాజాలాన్ని ఆస్వాదించాలంటే థియేటర్‌లోనే సినిమా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ‘ప్రతి సినిమా ఓ కళారూపం.. కళను దొంగతనం చేయవద్దు..’ అని వారు మొత్తుకుంటున్నా- టిక్కెట్ రేట్ల దెబ్బకు హడలెత్తిపోతున్న సగటు ప్రేక్షకులు పైరసీని ఆశ్రయించక తప్పడం లేదు. సినీ తాంత్రికుడు.. విఠలాచార్య అధునాతన గ్రాఫిక్స్ లేవు.. హైటెక్ కెమెరాలు అంతకన్నా లేవు.. డోల్బీ సౌండ్ సిస్టం లేదు.. ‘విఎఫ్‌ఎక్స్’ వంటి స్పెషల్ ఎఫెక్టుల మాటే లేదు.. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లోనే- కేవలం ‘వైర్ వర్క్’ సాయంతో ఆ సినీ మాంత్రికుడు అద్భుతాలను సృష్టించి అందరిచేతా ‘ఔరా’ అన్పించాడు.. మాయలు, మంత్రాలు, పరకాయ ప్రవేశాలు, రాకాసి జంతువులు, వింత పక్షులు, కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, పుర్రెలు, అస్థిపంజరాలు, దెయ్యాలు,్భతాలతో ఆయన సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధం చేశాడు. జానపద చిత్రాలతో కొన్ని దశాబ్దాల పాటు అందరినీ ఉర్రూతలూగించిన సినీ తాంత్రికుడు విఠలాచార్య. ఇప్పటికీ టీవీలో వచ్చే ఆయన సినిమాలను చూస్తుంటే నేటి గ్రాఫిక్ సినిమాలు వాటి ముందు దిగదుడుపే అని సినీ విమర్శకులు చెబుతుంటారు. దేశంలో జానపద చిత్రాల బాణీని ఆయన కొత్తమార్గం పట్టించాడు. సాంకేతిక విజ్ఞానం విస్తరించిన ఈ కాలంలో ఆయన జీవించి ఉంటే కచ్చితంగా ఏడాదికో ‘ఆస్కార్’ దక్కించుకునే వాడేమో! ఆయన ఊహాశక్తి ఎవరి అంచనాలకు అందనిది, ఎలాంటి పరిమితులు లేనిది. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలకే కాదు.. భీతి పుట్టించే రాక్షసులు, భయం కలిగించే భారీ జంతువులు, ఉత్కంఠ రేపే పోరాట దృశ్యాలు, మాయలు, మంత్రాలతో ఆణిముత్యాల్లాంటి జానపద చిత్రాలు అందించాడు. సామాన్యుడు సముద్రాలను దాటడం, పాతాళ గృహాల్లో యుద్ధం చేయడం, ఆడదెయ్యాలు తమ కాళ్లు పొయ్యిలో పెట్టి వంట చేసుకోవడం, ఆకస్మికంగా మనుషులు కోతులు కావడం, జంతువులు, పాములు, పక్షులు మాట్లాడడం, పోట్లాడుకోవడం .. ఇలాంటి దృశ్యాలు ఆయన సినిమాల్లో కోకొల్లలు. లోయలో అగ్నిగోళాలు మండుతుండగా- పైన చెక్కబల్లపై విలన్‌తో హీరో వీరోచితంగా పోరాడడం.. హీరో లోయలోకి పడిపోతాడేమోనని- థియేటర్‌లో ప్రేక్షకులు కుర్చీల్లో కూర్చోలేక.. ఉత్కంఠ భరించలేక పోవడం.. ఇవన్నీ విఠలాచార్య సినిమాలకే సాధ్యం. పెద్ద పెద్ద సెట్టింగులు, భారీ బడ్జెట్ వంటి అంశాలకు బదులు ఆయన తన ఊహాశక్తినే ఎక్కువగా నమ్ముకుని ఘన విజయాలు సాధించారు. తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో సుమారు 60 సినిమాలకు దర్శకత్వం వహించి ‘జానపద బ్రహ్మ’గా చిరస్థాయిగా నిలిచిన ఆయన కర్నాటకలో జన్మించినా సినీరంగంపై మక్కువతో మద్రాసు చేరుకుని తన ప్రతిభను చాటుకున్నారు. ‘నటరత్న’ ఎన్టీఆర్‌కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చింది విఠలాచార్యే. ఈ ఇద్దరి కలయికలో 16 సినిమాలు వచ్చాయి. ఒకటీ అరా సాంఘిక చిత్రాలు చేసినా ‘జానపద జగన్మోహనుడి’గానే ఆయన కీర్తిపొందారు. బందిపోటు, అగ్గిపిడుగు, అగ్గిబరాటా, చిక్కడు దొరకడు, గండికోట రహస్యం, ఆలీబాబా 40 దొంగలు, జగన్మోహిని వంటి హిట్లు అందించారు. పెద్దగా చదువుకోకపోయినా హాలీవుడ్‌ను తలదనే్నలా వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించారు. తాత్కాలికంగా వైభవం తగ్గినా, జానపద సినిమాలకు మళ్లీ మంచిరోజులు ఖాయమని విఠలాచార్య నమ్మేవారు. ప్రయోగాలు కొత్తకాదు.. సరికొత్త సాంకేతిక విధానాలతో ప్రయోగాత్మకంగా సినిమాలు నిర్మించడం తెలుగు సినీరంగానికి కొత్తేమీ కాదు. దశాబ్దాల క్రితమే పలు పౌరాణిక, జానపద సినిమాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పౌరాణిక సినిమాల్లో దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధ సన్నివేశాలు, జానపద చిత్రాల్లో మాయలు, మంత్రాలు, పోరాట దృశ్యాలు సినీ ప్రియుల్ని కట్టిపడేశాయి. 1957లో విడుదలైన ‘మాయాబజార్’ ఎప్పటికీ ఒక సాంకేతిక అద్భుతమే. ఈ సినిమాలో మార్కస్ బార్ట్లే చేసిన ఫొటోగ్రఫీ విన్యాసాలు ఇప్పటికీ నిత్యనూతనమే. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించని ఆ రోజుల్లోనే బార్ట్లే అత్యద్భుత నైపుణ్యంతో ‘మాయాబజార్’ను ఓ కళాఖండంగా తీర్చిదిద్దారు. ‘విజువల్ ఎఫెక్టుల’కు సంబంధించి సరికొత్త దారులను తెరిచిన సినిమాగా ‘మాయాబజార్’ సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా ఎంతోమంది సాంకేతిక నిపుణులకు స్ఫూర్తినిచ్చింది. ‘మాయాబజార్’ తర్వాత అనేక పౌరాణిక, జానపద సినిమాల్లో- అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికను వినియోగించుకుని ఎంతోమంది తమ ఊహాశక్తికి పదును పెట్టారు. ‘పాతాళ భైరవి’లో రాజభవానాలు, దేవతామూర్తి భారీ విగ్రహం, మాయలు, మంత్రాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక, ‘డిజిటల్ యుగం’లో సాంకేతిక నైపుణ్యం విస్తరించడంతో అనేక సినిమాల్లో గ్రాఫిక్ మాయాజాలం చోటుచేసుకోవడం మొదలైంది. పౌరాణిక, జానపద చిత్రాలు నిర్మించడం తగ్గాక, ‘సోషియో ఫాంటసీ’ బాటలో సినిమాల జోరు ఊపందుకుంది. ‘సోషియా ఫాంటసీ’ అంటే కల్పిత గాథలే కావడంతో గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులకు ఎలాంటి సరిహద్దులు లేకుండా పోయాయి. సాంకేతిక నిపుణుల ఊహాశక్తి ఎంతగా విస్తరిస్తే జనం అంతగా మెచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో అమ్మోరు, అంజి, అరుంధతి, ఢమరుకం, ఈగ .. ఇలా పలు సినిమాలు గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టుల వల్లనే ప్రేక్షకజనాదరణకు నోచుకున్నాయి. ఆంగ్ల సినిమాలంటే మోజు ఒకప్పుడు ఉన్నత వర్గాలవారు, బాగా చదువుకున్న వారు మాత్రమే నగరాల్లో ఇంగ్లీష్ సినిమాలు చూసేవారు. అశ్లీల దృశ్యాల కారణంగా ఇంగ్లీష్ సినిమాలు చూడడం మంచి అలవాటు కాదనే అభిప్రాయం గతంలో ఉండేది. కాలగతిలో హాలీవుడ్‌లోనూ ట్రెండ్ మారింది. సాహసాలు, వింతలు, విడ్డూరాలు వంటివి చోటు చేసుకోవడంతో ఇంగ్లీష్ సినిమాలంటే మన దేశంలోనూ క్రేజ్ పెరిగింది. గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులతో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హాలీవుడ్ చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులూ మోజు పెంచుకున్నారు. మెకనాస్ గోల్డ్, జురాసిక్ పార్క్, గాడ్జిల్లా, టైటానిక్, అవతార్, అనకొండ, స్పైడర్ మేన్, టెర్మినేటర్, మమీ వంటి సినిమాలను ఇక్కడా జనం ఎగబడి చూశారు. ఇంగ్లీష్‌లో విడుదలై కూడా తెలుగుసీమలో ఎన్నో సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. దృశ్యంతో పాటు సంభాషణలు కూడా సులువుగా అర్థమైతే మరింతగా దూసుకుపోవచ్చని ఇటీవల ఇంగ్లీష్ సినిమాలను తెలుగులోకి ‘డబ్’ చేస్తున్నారు. ఫలితంగా హాలీవుడ్ మార్కెట్ ఎన్నో రెట్లు విస్తరించింది. ‘2012 యుగాంతం’, ‘అవతార్’ వంటి సినిమాలు ఇంగ్లీష్‌లో కన్నా తెలుగు వెర్షన్‌లోనే ఇక్కడ అత్యధిక వసూళ్లను దక్కించుకున్నాయి. హాలీవుడ్ సినిమాలను నేరుగా విడుదల చేసినా, తెలుగులోకి ‘డబ్’ చేసినా యాక్షన్ సీన్లు, గ్రాఫిక్ విన్యాసాలు, త్రీడీ ఎఫెక్టులు ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలోనే కాదు, ‘బుల్లితెర’పైనా ఇపుడు ఇంగ్లీష్ సినిమాల జోరు పెరిగింది. అనేక టీవీ చానళ్లు ఇతర దేశాల సినిమాలకు తెలుగు సంభాషణలు జోడించి వీక్షకులకు అందిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో మనం చూస్తున్న ఛేజింగులు, ఫైటింగులు, సెట్టింగులు చాలావరకూ హాలీవుడ్‌ను అనుకరిస్తున్నవే. ఇపుడు ఇంగ్లీష్ సినిమాలే నేరుగా తెలుగు డబ్బింగ్‌తో వచ్చేస్తున్నందున- మన దర్శకులు సొంత ఆలోచనలతో, సరికొత్త సాంకేతిక నైపుణ్యంతో సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.