ఐరోపా ఆర్థిక దౌర్జన్యం

ఐరోపా ఆర్థిక దౌర్జన్యం

  • 31/07/2015
TAGS:

మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏడు వందల రకాల మందులను తమ దేశాలు దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య వారు నిర్ణయించడం వాణిజ్య దౌర్జన్యానికి మరో నిదర్శనం. వాణిజ్య ముద్ర-బ్రాండ్-లు లేని ఈ సహజ- జనరిక్ ఔషధాలను ఐరోపా సమాఖ్య నిషేధించడం వల్ల ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర మన మందుల ఎగుమతులు తగ్గిపోనున్నాయట! ఈ మందుల ప్రమణాలను నిర్ణయించడానికి వీలుగా ప్రయోగశాలలలో జరిపిన పరీక్షల-క్లినికల్ ట్రయల్స్-లో అవకతవకలు జరిగాయన్నది ఐరోపా సమాఖ్య పాలక మండలి-కమిషన్-వారు చెబుతున్న సాకు. కానీ ఇలా నిషేధించడం నిబంధనలకు విరుద్ధమన్నది మన ప్రభుత్వం వారి అభిప్రాయం. ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ-వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్-డబ్ల్యుటిఓ- తదితర మధ్యవర్తిత్వ సంస్థల నిబంధనావళిని సంపన్న దేశాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండడం రెండు దశాబ్దుల వైపరీత్యం! ఇలా సంపన్న దేశాలు ప్రధానంగా ఇరవై ఎనిమిది ఐరోపా సమా ఖ్య దేశాలు, అమెరికా చైనా వంటి ఆధిపత్య దేశాలు ప్రపంచీకరణ నియమావళిని ఉల్లంఘించిన సందర్భాలలో మనదేశం సుతిమెత్తగా నిరసనలను తెలిపి మిన్నకుండిపోతోంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ మండళ్లలో ఫిర్యాదులను దాఖలు చేసిన సందర్భాలు బహు తక్కువ! అమెరికా, ఐరోపా, చైనా వంటి సంపన్న వ్యవస్థలు తమకు తోచినప్పుడు మన దేశంనుండి దిగుమతులను నిషేధించగలుగుతున్నాయి. ఐరోపా వారు గతంలో మన మామిడి పళ్లను ఇతరేతర వ్యావసాయక ఉత్పత్తులను నిషేధించారు. అమెరికా సైతం అనేక ఏళ్లపాటు మన మామిడి పళ్లను తిరస్కరించింది! ఎరువులను రసాయనాలను క్రిమి సంహారాలను వాడి ఈ పళ్లను పండిస్తున్నారన్నది అమెరికా చెప్పిన సాకు. ఒక పెట్టెలోని ఒక పండు చెడిపోయి క్రిములు ఏర్పడ్డాయట. అందువల్ల దిగుమతి అయిన అన్ని పెట్టెలలోని పళ్లను తిరస్కరించడమే కాక ఏడాదికి పైగా మన రసాల ఫలాల దిగుమతిని కూడ ఐరోపా సమాఖ్య నిషేధించింది. ఆ తరువాత నిషేధం ఎత్తివేయడం వేరే సంగతి! అమెరికా 2007 వరకు ఆరేళ్లపాటు మన మామిడి పండ్లను తిరస్కరించింది. ఆ తరువాత మామిడి పండ్లకు బదులుగా మనకు అవసరం లేని మోటార్‌సైకిళ్లను అమెరికానుండి మనం దిగుమతి చేసుకొనడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంగీకారం ప్రకారం అమెరికా మన మమిడి పళ్ల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది! తమ దేశంలో అమ్ముడుపోని మోటారు సైకిళ్లను మనకు అంటగట్టడానికి వీలుగా మాత్రమే 2007లో అమెరికా మామిడి నిషేధాన్ని రద్దు చేసింది. రద్దు చేసినప్పుడు మాత్రం అమెరికాకు మన మామిటి చెట్లకు రసాయనాలను, క్రిమి సంహారాలను వాడిన సంగతి సమస్య కాలేదు…
కృత్రిమ రసాయనపు ఎరువులను, క్రిమి సంహారక విషాలను ఉత్పత్తి చేసి వర్ధమాన దేశాలలోని పంట పొలాలకు పండ్ల తోటలకు తరలిస్తున్నది అమెరికా వారే, ఐరోపా వారే! ఈ విషాలను వాడిన వర్ధమాన దేశాల వ్యవసాయదారులపై మళ్లీ ఆంక్షలను విధిస్తున్నది కూడ వారే! ప్రపంచీకరణ మారీచ మృగం వ్యాప్తి చేస్తున్న మాయాజాలంలో ఇది ఒక అంశం మాత్రమే! తమ దేశాలలోని ఖరీదైన మందులకు ప్రత్యామ్నాయంగా మన దేశంనుండి దిగుమతి అవుతున్న జెనరిక్ మందులు చెలామణి కావడం ఐరోపా వారికి గిట్టని అంశం! తక్కువ ధరలకు లభించే మన జెనరిక్ మందుల పోటీని ఐరోపాలో ఉత్పత్తి అవుతున్న అవే రకం ముద్రాంకిత-బ్రాండెడ్-ఔషధాలు తట్టుకోలేవు. అందువల్ల తమ దేశాలకు చెందిన ఔషధ ఉత్పాదక సంస్థల ఉత్పత్తులకు గిరాకీని పెంచడానికి వీలుగా మనదేశపు మందులను ఐరోపా సమాఖ్య వారు నిషేధిస్తున్నారు! హైదరాబాదు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ తయారు చేస్తున్న మందులను ఐరోపా నిషేధించడం వల్ల మన వాణిజ్యం లోటు పెరిగిపోతుంది. ఐరోపాకు మన దేశంనుండి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల ఔషధాలు ఎగుమతి అవుతున్నాయట…నిషేధం కారణంగా ఒకేసారి మూడవ వంతుకు పైగా ఎగుమతులు రద్దయిపోతాయ. ఇలా సంకుచిత-ప్రొటక్షనిస్ట్-ఆర్థిక వాణిజ్య విధానాలను పాటించరాదన్నది ప్రపంచీకరణ స్ఫూర్తి, పుడమిపల్లె-గ్లోబల్ విలేజ్-ఆదర్శం.కానీ రాజకీయ ఆర్థిక ఆధిపత్యం వహిస్తున్న సంపన్న దేశాలు మాత్రం నిబంధనలను నిర్లజ్జగా ఉల్లంఘిస్తున్నాయి. మన దేశం మాత్రం అమెరికా ఐరోపా దేశాలలో నిషిద్ధమయిన అనేక రకమైన మందులను, వ్యవసాయ ఉత్పత్తులను, ఉత్పత్తుల సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటునే ఉంది! జన్యుపరివర్తన ద్వారా తయారవుతున్న బాసిలస్ తురెంజెనిసిస్-బిటి- విష రసాయనం కలిగిన పత్తి విత్తనాల వ్యవహారం ఒక ఉదాహరణ మాత్రమే! ఈ బిటి పత్తిని అనేక ఐరోపా దేశాలలో నిషేధించినప్పటికీ అమెరికా వారి మొన్‌సాంటో సంస్థవారు ఈ విత్తనాలను మన దేశంలో అమ్మి వేలకోట్ల రూపాయలను దోచుకున్నారు, దోచుకుంటున్నారు. ఈ విషపు బిటి విత్తనాలను మన రైతులే పండిస్తున్నారు. పరిజ్ఞానం సమకూర్చిన మొన్‌సాంటో వారు కిలో విత్తనాలపై దాదాపు నాలుగు వందల రూపాయలకు పైగా రాజభత్యాన్ని-రాయల్టీని- వసూలు చేసుకుంటోంది. ఈ రాయల్టీని ప్రస్తుతం చెల్లించనవసరం లేదు. ప్రపంచీకరణ నిబంధనల ప్రకారం రాయల్టీ కాల వ్యవధి ముగిసిపోయింది. అయినప్పటికీ ఈ అమెరికా సంస్థవారు ఇలా కొల్లగొట్టడం ప్రపంచీకరణవల్ల మనకు దాపురించిన వైపరీత్యం! కానీ మన ప్రభుత్వాలు ఈ వైపరీత్యాన్ని నిరోధించడంలేదు! ఎందుకని? ఐరోపావారు అమెరికా వారు ఇలా ప్రపంచీకరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ ఆ దేశాల సంస్థల ఆర్థిక నేరాలు ధ్రువపడిన తరువాత కూడా మన ప్రభుత్వం నిబంధనల మేరకుచర్యలు తీసుకోలేకపోతోంది. విషపూరితమైన సేమ్యాలను తయారుచేసి అమ్మిన నెస్లే-నెజల్- సంస్థను దేశంనుండి వెళ్లగొట్టకపోవడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే! మాగీ సేమ్యాల అమ్మకాలు ఆగినప్పటికీ ఈ సంస్థ వారి చాక్లెట్లు, పాలపొడి తదితర రసాయన ఆహార పదార్ధాలు మన దేశంలో అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఒక డబ్బాలోని పండ్లలో క్రిములున్నందుకు మొత్తం పండ్లను కూరగాయలను గత ఏడాది ఐరోపా నిషేధించింది! తరువాత దయతో నిషేధం ఎత్తివేయడానికి కారణం కూరల కొరత ఏర్పడడం…మనపై దయ కాదు!
దిగుమతులపై మన ప్రభుత్వం విధిస్తున్న సుంకాలను తగ్గించవలసిందిగా సంపన్న దేశాలవారు మాత్రమే కాదు, వారి అదుపాజ్ఞలలో మసలుకుంటున్న ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్వాహకులు సైతం మన ప్రభుత్వంపై అనేక ఏళ్లుగా ఒత్తడి తెస్తుండడం ఆధిపత్య విధానాలకు నిదర్శనం. 2011వ సంవత్సం నాటి స్థాయి కంటె ప్రస్తుతం మన దిగుమతి సుంకాలు సగటున ఒక శాతం పెరిగినట్టు ప్రపంచ వాణిజ్యసంస్థ వారు కనిపెట్టారట! ఇలా కనిపెట్టడం వాస్తవ స్థితికి అనుగుణంగా లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం అనేక వస్తువుల దిగుమతిపై సుంకాలను ఈ నాలుగేళ్లలో క్రమంగా తగ్గించింది! ఎవరిని నమ్మాలి?

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.