పల్లె క్రీడకు మళ్లీ శోభ
- 02/08/2015
- -విశ్వమిత్ర

కబడ్డీ… మన దేశంలో శతాబ్దాలుగా అందరికీ పరిచయం ఉన్న ఆట. దీనికి పెద్దపెద్ద మైదానాలు అవసరం లేదు. భారీ హంగులు అక్కర్లేదు. క్రీడా సామాగ్రితో పనిలేదు. నయాపైసా ఖర్చు లేకుండా ఎవరైనా, ఎక్కడైనా ఆడుకోవచ్చు. అత్యుత్తమ అథ్లెట్‌కు ఉండే ఫిట్నెస్తోపాటు- చురుకుదనం, వేగం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలుంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే కాదు… భారీగా సంపాదించుకోవచ్చు. చాలా సాధారణంగా కనిపించే అసాధారణ క్రీడ కాబట్టే ప్రపంచ దేశాలన్నీ ఇపుడు కబడ్డీపై ఆసక్తి చూపుతున్నాయి. రోజురోజుకూ ఆదరణ పెరగడంతో, ఒకప్పుడు పల్లెల్లో సరదాగా ఆడుకునే కబడ్డీ నేడు ప్రొఫెషనల్ క్రీడగా మారింది. వరల్డ్ కప్, ప్రో కబడ్డీ వంటి టోర్నీలతో విశేష గుర్తింపు సంపాదించుకుంది. ఉజ్వల భవిష్యత్తు ఉండటంతో ఎంతో మంది కబడ్డీని ఒక వృత్తిగా స్వీకరిస్తున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్ శాసిస్తున్న ఏకైక ఆట కబడ్డీ. ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకూ భారత్‌కు ఒక్కసారి కూడా ఓటమి ఎదురుకాలేదు. హాకీలో ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినప్పటికీ ఇప్పుడు ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడమే మహాభాగ్యం అనుకునే దుస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. భుజాలపై మోస్తున్న క్రికెట్లో ఎప్పుడు చెలరేగుతామో, ఎప్పుడు డీలాపడతామో తెలియని పరిస్థితి. అన్ని క్రీడల్లోనూ తిరోగమనాన్ని పాటిస్తున్న భారత్ కబడ్డీలో మాత్రం విశ్వవిజేతగా కొనసాగుతోంది. 2004 నుంచి ఇప్పటి వరకూ పురుషుల విభాగంలో 7, మహిళల విభాగంలో ఒకసారి వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ జరిగితే, అన్నింటిలోనూ భారత్‌కే టైటిల్స్ లభించాయ. మన దేశం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కబడ్డీకి గత ఏడాది ప్రో కబడ్డీ టోర్నమెంట్ రంగ ప్రవేశంతో మళ్లీ స్వర్ణ యుగం ఆరంభమైంది. మన దేశంలో కబడ్డీని 4000 సంవత్సరాలకు పూర్వం నుంచే ఆడేవారనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. ఎప్పుడు, ఎలా ఆరంభమైందో తెలియకపోయినా, కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అభిమన్యుడు మొట్టమొదటిసారి కబడ్డీని పోలిన క్రీడను కనిపెట్టాడన్న నమ్మకం వ్యాప్తిలో ఉంది. కబడ్డీ అనే పదం ‘కాయ్-పిడి’ అన్న తమిళ పదం నుంచి వచ్చిందని అంటారు. ‘కాయ్-పిడి’ అంటే గొలుసుకట్టులా చేతులు పట్టుకోవడమని అర్థం. భారత ఉపఖండంలో ఎంతో ప్రచారంలో ఉంది. భారత్‌కు గట్టిపోటీనిచ్చే దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముందు వరుసలో ఉండడమే ఇందుకు తార్కాణం. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో కబడ్డీ జాతీయ క్రీడగా వెలుగుతోంది. మన దేశం ఎంతోకాలంగా కబడ్డీని విశ్వవ్యాప్తం చేయడానికి విశేషంగా శ్రమిస్తున్నది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శించిన కబడ్డీ మ్యాచ్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, బ్రిటన్ తన వలస దేశాలన్నిటిలోనూ క్రికెట్‌ను పెంచి పోషించడంతో కబడ్డీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. క్రికెట్ మాయలో దేశం కొట్టుకుపోతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఆదరణ తగ్గలేదు. ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రమం తప్పకుండా పోటీలు, టోర్నీలు జరుగుతునే ఉన్నాయి. పురుషులకు మాత్రమే ఈ ఆట పరిమితం అనుకునే రోజులకు తెరపడగా, 1995లో మొదటిసారి మన దేశంలో మహిళల విభాగంలోనూ పోటీలు మొదలయ్యాయి. ఈ స్ఫూర్తితోనే 2010లో జరిగిన గాంగ్జూ ఏషియాడ్‌లో మహిళల కబడ్డీకి ఒక క్రీడాంశంగా గుర్తింపు లభించింది. గత ఏడాది మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. ప్రో కబడ్డీ లీగ్ ప్రపంచ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 టోర్నమెంట్ పెనుమార్పులకు కారణమైంది. టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడలు అదే పంథాను అనుసరిస్తున్నాయ. ఆ ఒరవడిలోనే గత ఏడాది ప్రో కబడ్డీ మొదలైంది. దేశ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది టీవీల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లను వీక్షించారు. మొదటి సీజన్లోనే ప్రో కబడ్డీ 435 మిలియన్ల మందిని ఆకర్షించింది. ఈ ఏడాది ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను 635 మిలియన్ల మంది చూశారని అంచనా. దాని తర్వాతి స్థానం ప్రో కబడ్డీకే దక్కడం విశేషం. 34 దేశాలకు చెందిన క్రీడాకారులు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడుతున్నారు. విదేశాల్లోనూ కబడ్డీ ఆదరణ పొందడానికి ఇది ఒక కారణం. కొంచెం ఖాళీ స్థలం.. ఒక విజిల్ ఉంటే చాలు కబడ్డీ ఆడుకోవచ్చు. ఇంత సులభంగా ఆడుకునే క్రీడ మరొకటి లేదు. జన్మస్థానం మన దేశమే అయినా, ఆసియాలో చాలా దేశాల్లో కబడ్డీకి ప్రా చుర్యం ఉంది. ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా, డెన్మార్క్, అమెరికా, బెల్జియం దేశాల్లోనూ కబడ్డీ ప్రొఫెషనల్ క్రీడగా ఎదుగుతున్నది. 1985లో శాఫ్ క్రీడలకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఢాకాలో కబడ్డీని ఒక ప్రదర్శనాంశంగా చేర్చడంతో ప్రపంచ దేశాల దృష్టి పడింది. 1990 (బీజింగ్)లో తొలిసారి ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసింది. 1997లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లోనూ కబడ్డీ స్థానం సంపాదించింది. మరుసటి సంవత్సరమే ఆసియా బీచ్ గేమ్స్‌లో భాగమైంది. ఈ విధంగా ఆసియా, ఆసియా ఇండోర్, ఆసియా బీచ్ గేమ్స్‌లో చోటు దక్కించుకున్న ఏకైక క్రీడ కబడ్డీ. 2010 ఆసియా క్రీడల్లో మహిళల విభాగంలోనూ కబడ్డీ ఒక ప్రధాన క్రీడాంశంగా చేరింది. వరల్డ్ కప్‌లో భారత్ కబడ్డీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ వరల్డ్ కప్‌ను వరుసగా ఏడు పర్యాయాలు గెల్చుకుంది. 2004లో ఇరాన్‌ను ఓడించి టైటిల్ సాధించింది. 2007లో మరోసారి అదే జట్టుపై గెలిచింది. 2010లో పాకిస్తాన్‌ను, 2011లో కెనడాను చిత్తుచేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2012, 2013, 2014 సంవత్సరాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పైనే విజయాలను నమోదు చేసి, తనకు ఎదురులేదని నిరూపించుకుంది. గత ఏడాది మహిళల విభాగంలో మొదలైన వరల్డ్ కప్ కూడా మన దేశానికే లభించింది. కబడ్డీల్లో ఎన్నో విధానాలు.. దీనికి ఎన్నో పేర్లు.. కానీ, మూలసూత్రాలు మాత్రం ఒకటే. పురుషుల విభాగంలో 10న13 మీటర్లు, మహిళల విభాగంలో 8న12 మీటర్ల విస్తీర్ణం ఉండే కోర్టులో ఇరు జట్లు తలపడతాయి. ఒక్కో జట్టులో ఏడుగురు సభ్యులుంటారు. ప్రత్యామ్నాయం కోసం ముగ్గురు క్రీడాకారులను రిజర్వ్‌లో ఉంచుతారు. మధ్యలో ఊపిరి తీసుకోకుండా ‘కబడ్డీ.. కబడ్డీ’ అని కూతపెడుతూ వెళ్లే రైడర్ ప్రత్యర్థులకు చిక్కకుండా విజయవంతంగా వెనక్కు రావాలి. తిరిగి తమ కోర్టుకు చేరే క్రమంలో ఎంతమందిని అతను ముట్టుకుంటాడో అంతమంది తాత్కాలికంగా అవుటవుతారు. తమ జట్టుకు పాయింట్లు లభించినప్పుడు వారికి మళ్లీ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. మొత్తం 45 నిమిషాల మ్యాచ్ ప్రథమార్ధంలో 20, ద్వితీయార్ధంలో 20 నిమిషాల ఆట కొనసాగుతుంది. మధ్యలో ఐదు నిమిషాల విరామాన్ని ఇస్తారు. ఏ జట్టు ఆటగాళ్లంతా అవుటవుతారో లేదా నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ విధానంలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. శతాబ్దాలుగా కబడ్డీ అనుసరిస్తూ వస్తున్న మూల సూత్రాలు కూడా ఇవే. అయితే, కొన్నికొన్ని మార్పులతో ప్రాంతీయ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతుంటారు. సంజీవని, జెమినీ, అమర్, పంజాబీ వంటివి విధానాలు మన దేశంలో అమల్లో ఉన్నాయి. హదుదు (బంగ్లాదేశ్), బైబాలా (మాల్దీవ్స్), చెడుగుడు (ఆంధ్రప్రదేశ్), సడుగుడు (తమిళనాడు) హుతుతు (మహారాష్ట్ర) తదితర పేర్లు వాడుకలో ఉన్నప్పటికీ, నియమ నిబంధనలను మాత్రం దాదాపు ఒకటే. బాలీవుడ్ స్టార్లుసహా ఎంతో మంది ప్రముఖులు కబడ్డీ జట్లను కొన్నారు.. కొనేందుకు ఉత్సాహపడుతున్నారు. అక్షయ్ కుమార్‌కు ఖల్సా వారియర్స్, రజత్ బేడీ, మోండీ సిక్కాకు పంజాబ్ థండర్స్, సోనాక్షి సిన్హాకు యునైటెడ్ సింగ్స్, యోయో హనీ సింగ్‌కు యోయో టైగర్స్ జట్లు ఉన్నాయి. ప్రో కబడ్డీలో బెంగాల్ వారియర్స్ (కోల్‌కతా/ యజమాని ఫ్యూచర్ గ్రూప్), బెంగళూరు బుల్స్ (బెంగళూరు/ కాస్మిక్ గ్లోబల్ మీడియా), దబాంగ్ ఢిల్లీ (్ఢల్లీ/ డూ ఇట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్), జైపూర్ పింగ్ పాంథర్స్ (జైపూర్/ అభిషేక్ బచ్చన్), పాట్నా పైరేట్స్ (పాట్నా/ రాజేష్ సింగ్), తెలుగు టైటాన్స్ (వీరా స్పోర్ట్స్), యు ముంబా (ముంబయి/ యూనీ లేజర్ స్పోర్ట్స్), పునేరీ పల్టన్ (పుణే/ ఇన్సుర్కోట్ స్పోర్ట్స్) ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ప్రో కబడ్డీ ఆవిర్భావం క్రీడలు మానసికోల్లాసాన్నివ్వాలి. ప్రేరణ రగిలించాలి. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ అందించాలి. అన్నిటినీ మించి అందరికీ అందుబాటులో ఉండాలి. మన దేశంలో గ్రామీణ క్రీడలన్నీ దాదాపు ఇలాంటివే. వౌలిక సదుపాయాలకే లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చయ్యే క్రీడలను దిగుమతి చేసుకొని, వాటినే భుజాలకెత్తుకొని ఊరేగుతూ సమస్యలను కొనితెచ్చుకున్నాం. ఆ ఊబి నుంచి బయటపడే అవకాశం చాలా దశాబ్దాల తర్వాత లభించింది. ఐపిఎల్ వల్ల ఎన్ని నష్టాలున్నా ఒక విషయంలో మాత్రం మంచే జరిగింది. క్రీడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, వాటిని అద్భుతమైన వ్యాపార వస్తువుగా ముస్తాబు చేయడాన్ని ఐపిఎల్ నేర్పింది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్, యూరోపియన్ సాకర్ చాంపియన్‌షిప్‌లోని అంశాలను చేర్చి క్రికెట్‌కు కొత్త రూపాన్నిచ్చింది. బడా పారిశ్రామిక వేత్తల నుంచి బాలీవుడ్ స్టార్ల వరకూ అందరినీ భాగస్వాములను చేసి క్రేజ్‌ని పెంచింది. విదేశీ క్రికెటర్లను కూడా ఆహ్వానించి అభిమానులకు కనువిందు చేసింది. ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో కళకళలాడే ఐపిఎల్‌కు- చీర్ లీడర్ల నృత్యాలు, అట్టహాసంగా జరిగే ప్రారంభ, ముగింపు ఉత్సవాలు, టోర్నీ మధ్యలో నిర్వహించే పార్టీలు అదనపు ఆకర్షణలు. అప్పటి వరకూ ఎవరూ చూడని కొత్త కోణంలో ఆవిష్కృతమైంది కాబట్టే ఐపిఎల్ తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. క్రికెట్ చరిత్రగతిని మార్చిన ఐపిఎల్ నుంచి స్ఫూర్తిని పొందిన ఇతర క్రీడా సమాఖ్యలు కూడా అదే తరహా ప్రయత్నాలు చేశాయి. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పేరుతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఆరంభించిన సాకర్ టోర్నీ విజయవంతమైంది. ఇండియన్ బాడ్మింటన్ లీగ్, హకీ ఇండియా లీగ్ కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాయి. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్) పేరుతో వెటరన్ ఆటగాడు మహేష్ భూపతి ప్రారంభించిన టోర్నీ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోయినా మన దేశంలో టెన్నిస్‌కు కొత్త ఊపునిచ్చింది. ఈ పరిణామాలే మషాల్ స్పోర్ట్స్ కంపెనీ ఆవిర్భావానికి కారణమయ్యాయి. ప్రముఖ కామెంటేటర్, ప్రెజెంటర్ చారు శర్మ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం ప్రో కబడ్డీ విస్తృత స్థాయి ప్రచారానికి అవసరమైన వేదిక ఏర్పడింది. స్టార్ స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు అభిమానులను ఆకర్షించాయి. ఒకే సీజన్‌తోనే ప్రో కబడ్డీ మేజర్ టోర్నీగా అవతరించింది. ఇది ప్రైవేట్ టోర్నీ కాబట్టి కబడ్డీకి కలిగే ప్రయోజమేమీ ఉండదన్న వాదన ఉంది. కానీ, ప్రో కబడ్డీకి లభిస్తున్న విశేష ప్రచారం- ఆ క్రీడ విస్తృతం కావడానికి దోహదపడుతుందనే కోణం నుంచి టోర్నీని చూడాలి. కబడ్డీని వృత్తిగా తీసుకోవడానికి ఇప్పుడు వందలాదిగా క్రీడాకారులు ముందుకొస్తున్నారు. అంతర్జాతీయ క్రీడగా విదేశీయులను ఆకర్షిస్తున్నది. ఆసియా క్రీడల్లో ఒక క్రీడాంశంగా చేరినా, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నా రాని ప్రచారం ప్రో కబడ్డీతో వస్తున్నది. ప్రభుత్వాలు చేయలేని పని ప్రో కబడ్డీ నిర్వాహకులు చేస్తున్నందుకు సంతోషించాలి. ‘కింగ్ ఆఫ్ కబడ్డీ’ కబడ్డీ ప్రపంచానికి రారాజు ఎవరన్న ప్రశ్నకు ఎవరైనా ఇట్టే సమాధానం చెప్తారు. భారత జట్టు కెప్టెన్ రాకేష్‌కే పట్టం కడతారు. నిజాంపూర్‌లో 1982 ఏప్రిల్ 15న జన్మించిన రాకేష్ అసాధారణ రైడర్. అతను ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లాడంటే పాయింట్లు రావాల్సిందే. ఇండియన్ రైల్వేస్, నార్తన్ రైల్వేస్, చిల్లార్ క్లబ్ తరఫున ఆడిన అతను ప్రో కబడ్డీలో పాట్నా పైరేట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. భారత జాతీయ కబడ్డీ జట్టుకు కూడా అతనే సారథి. 2004, 2007 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌ను, 2006, 2010 సంవత్సరాల్లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను సాధించాడు. కబడ్డీ రంగానికి, ప్రత్యేకించి భారత జట్టుకు విశేష సేవలు అందిస్తున్న అత్యుత్తమ క్రీడాకారుడు రాకేష్‌కు అభిమానులు జేజేలు పలుకుతున్నారు. కబడ్డీని వృత్తిగా స్వీకరిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నిరూపించిన అతను యువ ఆటగాళ్లకు స్ఫూర్తిప్రదాత. ‘కబడ్డీ రాజధాని’ దేశ రాజధాని న్యూఢిల్లీ శివార్లలోనే మరో రాజధాని ఉంది. అది ‘కబడ్డీ రాజధాని’- నిజాంపూర్. పట్టణం పోకడలను సంతరించుకున్న పెద్ద గ్రామం. కబడ్డీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే జనం. ఎన్నో దశాబ్దాలుగా అక్కడ కబడ్డీ ఒక మతం. సమయం దొరికితే చాలు చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అంతా జట్లుజట్లుగా విడిపోయి కబడ్డీ ఆడేస్తుంటారు. అంత పిచ్చి ఉంది కాబట్టే ఆ గ్రామం కబడ్డీకి రాజధానైంది. భారత కెప్టెన్ రాకేష్ కుమార్ వంటి ఎంతో మంది మేటి క్రీడాకారులను ప్రపంచానికి అందించింది. ఈ గ్రామానికి చెందిన ఏడుగురు ఆటగాళ్లు తాజా ప్రో కబడ్డీలో ఆడుతున్నారు. చాలా మందికి తాము ఉద్యోగాలు చేస్తున్న సంస్థల నుంచి అనుమతి లభించలేదు. లేకపోతే ఈ సంఖ్య రెట్టింపయ్యేది. కారణం ఏమిటి? నిజాంపూర్‌లో అందరికీ కబడ్డీ పిచ్చి ఉండడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తాయి. అక్కడి మట్టిలోనే ఏదో ప్రత్యేకత ఉందని, అందుకే అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికీ కబడ్డీ అంటే ప్రాణమని కొందరి నమ్మకం. ఆ గ్రామంలో లభించే కల్తీలేని పాలు, నెయ్యి, పౌష్టికాహారమే కారణమని మరి కొందరి అభిప్రాయం. ఈ వాదనల్లో నిజానిజాలు ఎలావున్నా, ఎంతో ఆకర్షణీయంగా ఉండే క్రికెట్ వంటి క్రీడల మాయలో పడకపోవడమే నిజాంపూర్ ప్రత్యేకత అన్నది ముమ్మాటికీ నిజం. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు కూడా నిజాంపూర్ వెళ్లి ప్రాక్టీస్ చేయడం అనవాయితీగా వస్తోంది. వారిలో కొంత మంది ఆటపై ఇష్టంతో వస్తే, చాలా మంది ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో వస్తారు. నిజాంపూర్ ఆటగాళ్లలో అద్భుతమైన ఫుట్‌వర్క్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. వారి కదలికల్లో- వేటాడబోయే పులి, శత్రువుపై దాడి చేసే చిరుత లక్షణాలు ఉంటాయని అంటారు. ఈ మాటలు నిజం కాకపోతే, అక్కడ నుంచి వచ్చిన ఆటగాళ్లు అంతర్జాతీయ ఖ్యాతిని ఎలా ఆర్జిస్తారు? సమస్యలు కోకొల్లలు.. ‘కబడ్డీకి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తున్నది. చాలా మంది ఈ క్రీడను ఒక వృత్తిగా తీసుకుంటున్నారు. పేరుప్రఖ్యాతులు ఆర్జిస్తున్నారు. సంపాదన కూడా బాగానే ఉంది’. ప్రస్తుతం ఈ క్రీడ పట్ల చాలా మందికి ఉన్న ఈ అభిప్రాయంలో నిజం లేకపోలేదు. అయితే, ఇది కొద్ది మందికి మాత్రమే వర్తిస్తుంది. చాలా మంది ఔత్సాహికులు సరైన సౌకర్యాలు లేక, ఎదిగేందుకు అవకాశాలు రాక కష్టపడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలు ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపై జరుగుతాయి. ఎలాంటి సౌకర్యాలు లేని సాధారణ గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వారు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. శిక్షణకు సరైన వసతులు లేవు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉండవు. పౌష్టికాహారం లభించదు. ఇప్పటికీ క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడలతో పోలిస్తే కబడ్డీ ఆటగాళ్లకు లభించే ఆదరణ తక్కువే. ఆదాయం నామమాత్రమే. చాలా మంది సరైన ఉపాధి దొరక్క రోజు కూలీలుగా మారిపోతున్నారు. సమస్యలను పరిష్కరించడంతోపాటు కబడ్డీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మహిళలకు ఆదరణ కరవు.. మన దేశంలో కబడ్డీ క్రీడాకారిణులకు ఆదరణ కరవైంది. ఇంటి నుంచి మొదలయ్యే కష్టాలు ప్రాక్టీస్ సమయంలో, చివరికి జీవితంలో స్థిరపడే విషయంలోనూ వెంటాడుతునే ఉంటాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉంటుంది. వారిని ఒప్పించి ప్రాక్టీస్‌కు వెళ్లినా అక్కడ సౌకర్యాల లేమి వెక్కిరిస్తుంది. అడుగడుగునా వివక్ష వేధిస్తుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించి, అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగినా ప్రభుత్వం నుంచి సాయం అందదు. ప్రోత్సహించేవారు లేక, ఆదరణ లభించక కబడ్డీ క్రీడాకారిణులు గత్యంతరం లేక చాలా తక్కువ సమయంలోనే ఆటకు వీడ్కోలు పలికి ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. మలేషియాలో జరిగిన ఆసియా జూనియర్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులోని సభ్యురాలు పింకీ అంబావత్త ఉదంతాన్ని మహిళల పట్ల ప్రభుత్వాలకు ఉన్న వివక్షకు ఉదాహరణగా పేర్కొనాలి. పోటీలు ముగిసిన వెంటనే నాలుగు లక్షల రూపాయల నజరానాను ప్రకటించిన హర్యానా ప్రభుత్వం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఉద్యోగం ఇస్తామంటూ హామీలు గుప్పించిన అధికారులు పత్తాలేరు. దాదాపు ఇలాంటి పరిస్థితులనే చాలా మంది క్రీడాకారిణులు ఎదుర్కొంటున్నారు. మహిళకూ ప్రో కబడ్డీ వంటి టోర్నీ ఉంటే తప్ప సమస్యలు తీరవని అభిప్రాయపడుతున్నారు. సూపర్‌స్టార్ రాకేష్ భారత కబడ్డీ జట్టు కెప్టెన్ రాకేష్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రో కబడ్డీతో ఒక్కసారి సూపర్ స్టార్‌గా మారిపోయాడు. ప్రో కబడ్డీలో పాట్నా పైరేట్స్‌కు నాయకత్వం వహిస్తున్న రాకేష్ అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాడు. ‘కబడ్డీ కింగ్’గా పేరు సంపాదించిన అతను ఢిల్లీ శివార్లలోని నిజాంపూర్ గ్రామానికి చెందినవాడు. రాకేష్‌కు చిన్నతనం నుంచి జాతీయ జట్టుకు ఆడాలన్న కోరిక ఉండేది. అనుకున్నది సాధించడమేకాదు, ప్రో కబడ్డీలో అత్యధికంగా 12,80,000 రూపాయలకు జట్టులో చేరాడు. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల వారికీ, కొద్దిమంది క్రీడాకారులకు మాత్రమే తన పేరు తెలుసని, కబడ్డీ కారణంగా ఇప్పుడు చాలామంది తనను చూసి గుర్తుపడుతున్నారని అతను సంతోషపడుతున్నాడు. తనతో కరచాలనం చేయడానికి, సెల్ఫీలు దిగడానికి ఎంతోమంది పోటీపడుతున్నారని, ఆటోగ్రాఫ్‌లు కోరుతున్నారని, ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని అంటున్నాడు. ఇలాంటి అనుభవాలు రాకేష్‌కు మాత్రమే కాదు… ఇంకా చాలా మందికి ఈ అదృష్టం దక్కింది. అమిత్ సింగ్ చిల్లార్, హోషియార్ సింగ్, కృష్ణ కుమార్, స్వరాజ్ చిల్లార్, మన్జిత్ చిల్లార్, నీలేష్ షిండే, జస్మీర్ సింగ్, నవ్‌నీత్ గౌతం, వజీర్ సింగ్, రాహుల్ చౌదరి, అనూప్ కుమార్ వంటి చాలా మంది ప్లేయర్లకు కబడ్డీ గొప్ప హోదాను కల్పించింది. ఇది మన ఆట.. – ‘తెలుగు టైటాన్స్’ ప్రచారకర్త అల్లు అర్జున్ ‘కబడ్డీ మన ఆట.. ఇదే అసలైన భారతీయ క్రీడ.. విశ్వవ్యాప్తంగా దీనికి ఎంతగా ప్రచారం లభిస్తే మన సంస్కృతీ సాంప్రదాయాలకు అంత ఎక్కువగా గుర్తింపు దక్కినట్లు భావించాలి.. ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్) విజయవంతం కావడానికి నా వంతు సహకారం అందిస్తా.. ఫిట్నెస్ కోసం తాపత్రయపడే నేటి కుర్రకారు తప్పనిసరిగా కబడ్డీ ఆడాలి..’- అని సినీ నటుడు అల్లు అర్జున్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ‘తెలుగు టైటాన్స్’ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆయన పికెఎల్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆగస్టు 4 నుంచి 7 వరకూ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కబడ్డీ అభిమానులకు అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శతాబ్దాల తరబడి గ్రామీణ ఆటగా అలరిస్తున్న కబడ్డీ ఇపుడు ప్రొఫెషనల్ క్రీడగా మారడంతో ఎంతోమంది దీనిపై ఆసక్తి చూపుతున్నారని ఆయన అంటున్నాడు. పాఠశాల స్థాయిలో తాను కబడ్డీ ఆడేవాడినని, ఫిట్నెస్ కోసమైనా కుర్రాళ్లంతా దీన్ని ప్రాక్టీస్ చేయాలని అర్జున్ సూచిస్తున్నాడు. 8 జట్లు.. 60 మ్యాచ్‌లు.. ‘ప్రో కబడ్డీ లీగ్-2015’ (పికెఎల్) కోలాహలం ఇప్పటికే దేశంలో ప్రారంభమైంది. జూలై 18న ప్రారంభమైన పికెఎల్ మ్యాచ్‌లు ఆగస్టు 23న ముగుస్తాయి. ఎనిమిది జట్ల మధ్య మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ప్రారంభ మ్యాచ్‌లను జూలై 18న ముంబయిలోని నేషనల్ స్పోర్ట్సు క్లబ్లో నిర్వహించగా, ఆగస్టు 23న జరిగే తుది పోటీ కూడా అక్కడే జరుగుతుంది. ముంబయి, కోల్‌కత, జైపూర్, పాట్నా, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పూణె నగరాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు.