గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 216-కృష్ణ గీతి రాసిన –రాజా మనవేద

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

216-కృష్ణ  గీతి రాసిన –రాజా మనవేద

కాలికట్ రాజు జమోరిన్ మన వేద లేక ఎరాల్పట్టి రాజా నారాయణ కవిపై గొప్ప అభిమానం కలవాడు .. కవి రచనలన్నీ చదివి అర్థం చేసుకున్నాడు. 17 వ శతాబ్ది వాడు. మానవేద రాజు “కృష్ణ గీతి” లేదా “కృష్ణ శతకం” రాసాడు. దీనితో పాటు “మన వేద చంపూ భారతం” కూడా రచించాడు. చంపూ రామాయణంపై వ్యాఖ్యానమూ రచించాడు. మనవేద రాజుకు, చంద్రలేఖకూ జరిగిన వివాహాన్ని రుద్ర దాస కవి తన “సత్తాక చంద్రలేఖ” లేక “మనవేద చరిత”లో వర్ణించాడు.

217- విష్ణు విలాసం రాసిన రామపాణి నందుడు

రామకవిని కుంజున్ని నంబియార్ అంటారు. కొచ్చిన్ రాష్ట్రంలో కున్నాకులం లో వారియర్ కులంలో జన్మించాడు. నారాయణ భట్టుకు శిష్యుడు. 18 వ శతాబ్ది మధ్య భాగం వాడు. మలబార్ ప్రాంతంలో సంస్కృత ప్రాక్రుతాలలో గొప్ప కవి. కొంతకాలం జమోరిన్ సంస్థానంలో ఉన్నాడు. అక్కడి దేవాలయాలలో మృదంగం వాయించేవాడు. ఎనిమిది కాండలలో “విష్ణు విలాస కావ్యం” రాసి ఆయన తొమ్మిది అవతారాలనూ వర్ణించాడు. శ్రీకంఠ కుటుంబానికి చెందిన రాజా రామవర్మ ఆదేశంపై “ముకున్దస్తవం” రాసాడు. సెంద మంగలంలో ఉంటుండగా పూర్వ, ఉత్తర భాగాలుగా 20 కాండలలో రామాయణం మొత్తాన్ని “రాఘవీయం”గా రచించాడు. ఈ కవి “లలిత రాఘవీయం” మరియు “పాదుకా పట్టాభిషేకం” నాటకాలు రాసాడు. “చండిక” అనే దాన్ని “వీధి”గా రచించి తిరువనంతపురంలో ప్రదర్శించారు. రాజా వంశీ మార్తాండ కాలంలో  మదనకేతు చరిత్ర ప్రహసనం  రాసాడు. అనేక శాస్త్ర రచనలతో పాటు ప్రాకృతంలో “ఉషానిరుద్ధ’’, కంస వధ” రాసాడు.   సుకుమారుని “కృష్ణ విలాసం”,” కృష్ణ లీలా సుఖం”, “గోవిన్దాభిషేకం ” ల పైనా నారాయణ కవి రాసిన ధాతు కావ్యాలపై గొప్ప వ్యాఖ్యానాలు రాసాడు.

క్రంగనూరు యువరాజు రామవర్మ 1800 కాలం వాడు. 12 కాండలలో “రామ చరిత”నూ, “రసానంద భాణం” రచించాడు.

218- కేరళ కాళిదాసు – కేరళ వర్మ

వాలియకోవిల్ పామ్బిరాన్ అని పిలవబడే కేరళ వర్మ తిరువాన్కూర్ మహారాణి   లక్ష్మీ బాయి సహవాసి. ఆధునిక కవులలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. 1847 – 1910 కాలంలో ఉన్నాడు. కేరళ కాళిదాసుగా బిరుదు పొందాడు. సంస్కృతంలో “విశాఖ రాజ మహా కావ్యం”, “కంస వధ చంపూ”, “శృంగార మంజరీ”, “గురువాయూర్ పురేశ స్తోత్రం”,  “వ్యాఘ్ర లయశ  శతకం”, “సోనాద్రిశతకం” , “క్షమాపణ శతకం” మొదలైనవి రాసాడు.

219- ఇతర మలబారు కవులు

మన విక్రమ  ఎత్తాన్ తాంబిరాన్ అనే జమోరిన్ రాజు 1920 లో చనిపోయాడు. ఆశుకవిగా సుప్రసిద్ధుడు. వందలకొద్దీ చిన్నకవితలు రాసాడు.

రాజరాజవర్మ తిరువాన్కూర్ సంస్కృత అధ్యయన కేంద్రానికి పర్యవేక్షకుడుగా ఉండేవాడు. స్వయంగా పాణినిపై బృహత్ వ్యాఖ్యానాన్ని రాసాడు. దీంతోపాటు “ఆంగ్ల సామ్రాజ్య మహాకావ్యం”, “విటా  విభావరి” కావ్యాలు రాసాడు. 1863-1918 కాలానికి చెందినవాడు.

తొల నంబూద్రి కవి’’ తొల కావ్యాన్ని’’ చందనపల్లి కి చెందిన ఎడయాత్ “రామ చరిత కావ్యాన్ని” కుంజు కొతాన్ తంబిరాన్ “యాదవ విజయాన్ని” , ఎదవతి కోడమన కు చెందిన నంబూద్రి పాద్ “రుక్మిణీ స్వయంవర ప్రభంధం”, కున్హుకుత్తాన్ తంబిరాన్ “కిరాత వ్యాయోగం”, “భాభ్రువాహన చంపూ”, కుచున్ని తాంబిరాన్ “గోశ్రీ చరిత్ర’’,బాణాయుధ చంపూ, విప్రసందేశం”తో పాటు “అనంగ విజయం, ‘’విరాట జయ విజయం’’ అనే రెండు భాణాలను  రచించారు. రామ వారియర్ కవి “ఆర్యా సప్త శతి” రాస్తే ఉన్ని నంబూద్రి మహిష మంగళ నంబూద్రి భానణాలను రాసారు. ఒకతోల్ నారాయణ మీనన్ (1890),” తపతీ సంవరణ మహా కావ్యాన్ని”, “ దేవీ స్తవం”, “కృష్ణ శతకం” రాసాడు.

220- కేరళ స్త్రీ కవులు

కేరళ కవుల్లో మనోరమ అనే స్త్రీకవి సుమారు 100 ఏళ్ల క్రితం చనిపోయింది. కదతనాట్ ఎదవలత ఆస్థానానికి చెందిన లక్ష్మీ రాజ్ఞి అనే రాణి “సంతాన గోపాల శతకం” రాసింది. కొచ్చిన్ రాణి సుభద్ర “సుభాద్రాస్తవం” రాసింది. ఈమె 1921లో మరణించింది.

దీనితో కేరళ  కవుల చరిత్ర సమాప్తం.

221 –ఉపనిషత్తులపై వ్యాఖ్యానం రాసిన శ్రీనివాస శాస్త్రి

కౌండిన్య గోత్రానికి చెందిన శ్రీనివాస శాస్త్రి గొప్ప విద్వాంసుడు. ఇతని సోదరుడు నారాయణ శాస్త్రి మహా రచయిత. శ్రీనివాస శాస్త్రి మహామహోపాధ్యాయ బిరుదు పొందిన రాజు శాస్త్రి అనబడే త్యాగరాయ శాస్త్రి వద్ద విద్య నేర్చాడు. ఈయన తంజావూరు జిల్లా మన్నార్గుడి నివాసి. అప్పయ్య దీక్షితుల శివాద్వైతాన్ని బాగా ప్రచారం చేసాడు. ఉపనిషత్తులపై వ్యాఖ్యానం రాసాడు. అనేక శాస్త్రాలలో అపార పాండిత్యం ఉన్నవాడు. ‘’బ్రహ్మ విద్య’’ అనే పత్రికను నడిపాడు. బహు గ్రంథకర్తగా ప్రసిద్ధుడు. అనేక బిరుదులు సత్కారాలు పొందాడు. “విజ్ఞానాప్తి శతకం”, “యోగి భోగి సంవాద శతకం”, “శారదా శతకం”, “మహా భైరవ శతకం”, “హేతిరాజ శతకం”, “శ్రీ గురు సౌందర్య సాగర ససాష్టిక” మొదలైనవి ప్రసిద్ధమైనవి. “ సౌమ్య సోమం”  మొదలైన నాటకాలు రాసాడు. చాలా రచనలు  అలబ్దాలు. 19౦౦లో చనిపోయాడు.

222- అద్వైత సభాధ్యక్షుడు- గణపతి శాస్త్రి

సుబ్రమణ్య, సీతాలక్ష్మీ ల కుమారుడు ఎన్ గణపతి శాస్త్రి. తంజావూరు జిల్లలోని పైనగనాడు గ్రామ నివాసి. మౌద్గల్య గోత్రం. 1871-1913లో జీవించాడు. కుంభ కోణంలోని అద్వైత సభకు అధ్యక్షుడు. ఇది ఇప్పుడు శంకర మఠం ఆధ్వర్యంలో నడుస్తున్నది. “మహా మహోపాధ్యాయ” బిరుదాంకితుడు. ఈయన శిష్యులు కూడా గొప్ప ప్రసిద్ధి చెందిన వారు. అందులో సంస్కృత సాహిత్యానికి అపార సేవ చేసిన కదలన్ గూడి   నటేశ శాస్త్రి ఉన్నారు. అనేక విషయాలపై చాలా గ్రంధాలు రాశాడు. ఈయన రాసిన “కటాక్ష శతకం”, “అన్యాపదేశం”, “తాట తాటక పరిణయం”, “ధ్రువ చరిత్ర”, “రసిక భూషణం”, “గురు రాజ సప్తతి” ప్రసిద్ధాలు. వివిధ దేవతలపై అనేక స్తోత్రాలు రచించాడు. “వృత్త మణిమాల “అనే   ఛందస్ శాస్త్రాన్ని  రచించాడు.

223- భారతీయ ఇతివృత్తం రాసిన రామావతార శర్మ

దేవనారాణ పాండ్య, గోవింద దేవిల కుమారుడు రామావతార శర్మ ఉత్తరప్రదేశ్ లోని చాప్రాలో 1878  లో జన్మించి 51 ఏళ్లకే 1929లో చనిపోయారు. పదిహేనేళ్ళ వాయసులోన్నే ‘’కావ్య తీర్ధ ‘’పరీక్ష ఉత్తీర్ణులయ్యాడు .అప్పుడే ‘’ధీర నైషధం ‘’రాశాడు .భారద్వాజస గోత్రం. బెనారస్ లో చదివిసాహిత్యాచార్య పూర్తీ చేశాడు  అక్కడి హిందూ కాలేజి లో ప్రొఫెసర్ అయ్యాడు. తర్వాత పాట్నా కాలేజిలో ప్రొఫెసర్ గా పని చేసాడు. సంస్కృత సాహిత్యంలో అపార అనుభవమున్నవాడు. సాహిత్య, చారిత్రకామ్శాలపై అనేక అపురూప గ్రంధాలను రచించాడు.   దర్శనాలపై మహా భాష్యాలు రాసాడు. “మారుతీ దండకం ”, “ముద్గర గీత”, “హర్ష నైషధం ”అనే నాటకాలు రాసాడు. ఆయన రాసిన’ బారతీయ ఇతివృత్తం’’ అనుస్టుప్  ఛందస్సులో రాసిన భారత దేశ చరిత్ర. ఇదివరకేవ్వరూ రాయనిది. ఇది “కాశ్మీర్ రాజతరంగిణిని “  గుర్తు చేస్తుంది. ప్రపంచ చరిత్రలో ఇది  చాల చిన్నదైనప్పటికీ ప్రఖ్యాత మైనది. ఆయన ఇది ప్రచురించి  ఉంటే మహా భారతమంత గొప్ప గ్రంథం అయ్యి ఉండేది. ‘’విశ్వకోశం’’ అనే  బృహత్తర నిఘంటువును శర్మ నిర్మించారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రామావతార శార్మశిష్యుడు .శర్మ మరణ౦  తర్వాత రాజేంద్రప్రసాద్ చొరవ తీసుకోనిగురువు గారి గ్రంధాలను ముద్రించే ఏర్పాటు చేశాడు .

ఒక సారి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బెనారస్ విశ్వ విద్యాలయానికి వస్తే అధ్యాపకు లందరూ డ్రెస్ బంధనలను పాటించాలని మాలవ్యా హెచ్చరించాడు. శర్మగారు మామూలు పంచ లాల్చీ తో వరండాలో నిలబడ్డాడు .మాలవ్యా చూసి తిట్టాడు .మర్నాడు వస్తే సంజాయిషీ కోరాడు .తన డ్రెస్ అక్కడ పడేసి ‘’మీరు జీతం ఇచ్చేది నా బోధనకు కాని డ్రెస్ కు కాదు ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .తప్పు తెలుసుకొన్న మాలవ్యా సారీ చెప్పాడు శర్మకు .

శర్మ సాస్కృత ,పాళీ భాషలలో గ్రంధాలు రచించాడు ఎనిమిది ఉద్గ్రంధాలు సంస్కృత పాళీ భాషలలోను  అయిదు గ్రంధాలు ఇంగ్లీష్ లోను ,ఏడు గ్రంధాలు హిందీలో రాసిన మహా రచయిత కవి రామావతార్ శర్మ .

24- కావ్య తత్వ వల్లి రాసి మహేశ చంద్ర తారా చూడామణి

పశ్చిమ బెంగాల్లో దీనజాపురం జిల్లా లో రాజారామపురంలో మహేష్ చంద్ర తారా చూడామణి జన్మించాడు. ఆధునిక కవులలో, ఆలంకారికులలో సుప్రసిద్ధుడు. చిన్న చిన్న కావ్యాలు రాసాడు.  “కావ్య పేటిక”లో అనేక విషయాలపై వ్యాసాలూ రాసాడు. “దినాజపురం రాజవంశం” అనే 17 కాండల కావ్యాన్ని రచించాడు. దర్భంగా మహారాజు స్మృతి కావ్యంగా 24 కాండలలో’’ భూదేవ చరిత్ర’’ రాసాడు. కావ్య తత్వావళి అనే కావ్య విమర్శన గ్రంధాన్ని రచించాడు.

225- గానామృత తరంగిణి రచించిన- శ్రీ కల్కి సింహా

శ్రీ కల్కి లేక నరసింహ అయ్యంగార్ అని పిలవబడే ఈయన ప్రదివాది భయంకర తొందనూర్ సిన్గాలాచార్య కుమారుడు. శ్రీ వత్స గోత్రీకుడు. 1867 లో మెల్ కోటే లో జన్మించాడు. బెంగళూరు సెంట్రల్ కాలేజిలో సంస్కృత ఆచార్యుడుగా పని చేసాడు. అంతర్వాణి వల్ల ప్రభావితుడై ధ్యానంలో దివ్యానుభూతిని పొందాడు. గీర్వాణ సాహిత్యానికి అన్కితమైనాడు. అన్ని శాస్త్రాలలో నిష్ణాతుడు. చాలా గ్రంధాలు రాసినా అచ్చు కావలసి ఉన్నాయి. శాస్త్రీయ సంగీతంపై ‘’జ్ఞానామ్రుత తరంగిణి ‘’గ్రంథం రచించాడు. ఆయన శిష్యులు గురువు గారిని కల్కి అవతారంగా భావిస్తారు. 1835 లో చనిపోయారు.

సశేషం

మీ—గబ్బిట  దుర్గా ప్రసాద్ -3-8-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.