—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
- ద్వైతమత స్థాపకులు మధ్వాచార్య (1198 – 1278 )
ఆనందతీర్దులు అనే మధ్వాచార్య కర్ణాటకలోని ఉడిపి దగ్గర బెల్లె అనే గ్రామంలో 1198లో జన్మించాడు. నవరాత్రి చివరి రోజు నవమి నాడు జన్మించటం వలన అది మాధవ నవమి అయ్యింది. తల్లి వేదవల్లి. అసలు పేరు వాసుదేవుడు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక శక్తి ఏర్పడింది. ఇరవై ఐదేళ్లకు సర్వశాస్త్ర పారంగతుదయ్యాడు. కనుక ‘’పూర్వప్రజ్ఞావంతుడు’’అని పేరు. కుటుంబాన్ని త్యజించి సన్యాసం స్వీకరించి అచ్యుత ప్రకాశ గురువు వద్ద దీక్ష పొంది ఆనంద వర్తనుడయ్యాడు. ద్వైతమతాన్ని స్థాపించి భారతదేశామతటా పర్యటిస్తూ ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు . వ్యాస సూత్రాలకు గీతకు ద్వైత భాష్యం రాసాడు. చివరి రోజులు సూరి దంతారంలో నేత్రావతి కుమారా ధారనదుల మధ్య ద్వీపంలో గడిపారు. 79 ఏళ్ల ఆరు నెలల ఇరవై రోజులు జీవించి 1278 లో వైకుంఠం చేరారు. ఉడిపి లో శ్రీ కృష్ణ దేవాలయం నిర్మించాడు .దాన్ని ఎనిమిదిమంది శిష్యులకు బాధ్యత అప్పగించాడు .నడిచి బదరీ క్షేత్రం చేరి ఎన్నో ఏళ్ళుగా కళలు గన్న బదరీ నారాయణ దర్శనం చేసుకొన్నాడు అక్కడ నిత్యం గంగాస్నానం చేస్తూ48 రోజులు మౌన దీక్షలో ఉన్నాడు. అక్కడి నుండి వ్యాస బడరికి వెళ్లి చిరకాల కోర్కెను తీర్చుకొన్నాడు.రెండవ సారి బదరీ వెళ్లి గంగానది దాటుతుంటే అది ముస్లిం రాజ్యం కనుక దాటరాదని చెప్పి రాజు వద్దకు తీసుకొని వెళ్ళారు ‘’అందరికీ తండ్రి అయిన పరమాత్మ దర్శనానికి వెడుతున్నాను ‘’అనగానే ముస్లిం రాజు ఆశ్చర్యపడి ధర్యానికి మెచ్చుకొని అక్కడే ఉండిపొమ్మని ఎన్నో జాగీర్లు రాసిస్తానని అర్ధించాడు వాటికి ఆశపడని ఆచార్య బదరి వెళ్ళిపోయాడు . ఉత్తరాది మఠంతోసహా 22మఠాలను మధ్వా చార్య స్థాపించారు .మొత్తం పదహారు మహా గ్రంధాలు రాశారు .
మధ్వాచార్య 37 గ్రంథాలు రాసారు. ఇందులో వేదాంతపరమైనవే ఎక్కువ. ఆయన రాసిన’’ యమక భారతం’’లో మహాభారత కథను యమకంలో మహా గమకంగా చెప్పారు. ఆయన రాసిన ముఖ్య స్తోత్రాలు ‘’ఆర్యా స్తోత్రం, గురు స్తోత్రం కృష్ణ స్తుతి ద్వాదశ స్తోత్రాలు ముఖ్యమైనవి.’’ భాగవత తాత్పర్య నిర్ణయం’’ మరియు’’ భారత తాత్పర్య నిర్ణయం ‘’గ్రంథాలు భాగవత మహాభారతాలపై మహా వ్యాఖ్యానాలు.’’ కృష్ణ కర్ణామృత మహార్నవం, శంకర విజయం శంకరాచార్య అవతార కథ ‘’మధ్వాచార్య రాసారని అంటారు.
- వాయుస్తుతి రాసిన– త్రివిక్రమ
మధ్వాచార్య అనుంగు శిష్యులలో త్రివిక్రముడు ముఖ్యుడు. ఈయన’’ ఉషాహరణ కావ్యం’’, ‘’వాయుస్తుతి ‘’రాసాడు. త్రివిక్రముని కొడుకు నారాయణ ‘’మధవ విజయ కావ్యం’’ రాసాడు. అలాగే ‘’అనుభవ విజయం, మణి మంజరి, పారిజాత హరణం’’ అనే యమకం రాసాడు. ‘’శివ స్తుతి ,విష్ణు స్తుతి నృసింహ స్తోత్రం సంగ్రహ రామాయణ ‘’కర్త కూడా.
- 732 ఆంజనేయ విగ్రహాలు స్థాపించిన వ్యాస రాయలు 1447 -1539
వ్యాస రాయలు మధ్వాచార్య శిష్యులు 1447 -1539 కాలంలో జీవించారు. విజయనగర సామ్రాజ్య ఆస్థాన గురువు సాల్వ నరసింహ అచ్యుత దేవరాయ శ్రీకృష్ణ దేవరయలకు ముఖ్య సలహాదారు. భారతదేశమంతటా పర్యటించి 732 ఆంజనేయ విగ్రహాలను స్థాపించి దేవాలయాలను నిర్మించాడు. . న్యాయామృతం ,తర్క తాండవం ,తాత్పర్య చంద్రిక ,మాయావాద ఖండన మండనం ఉపాధి ఖండనమండన మంజరి ,తత్వ వివేకమందర మంజరి సత్తార్క విలాసం మొదలైన ఎన్నో గ్రంధాలు వ్యాస రాయ క్రుతాలు .
‘’వ్యాస యోగి చరిత’’ చంపూలో సోమనాధుడు వ్యాసరాయ జీవిత చరితను రాసాడు. శ్రీ విద్యారత్నాకర స్వామి’’ వ్యాసవిజయం’’లో ఆయన గురించి వివరించారు. సోమనాధుని రచనం భట్టబాణుని కాదంబరి నీ గుర్తు చేస్తుంది. ఈయన అనంతభట్టు సోదరి కుమారుడు. సోమనాదుడిని వ్యాసరయలకు అచ్యుత దేవరాయల ఆస్థానంలో పరిచయమయ్యాడు. ఇతని తాత భట్ట గాయముక్తి భాస్కరుడు ‘’కాల మాఘాధ్వరి’’గా ప్రసిద్ధుడైన కవి.
- – సరసభారతి విజయ కర్త -వాది రాజు
కన్నడ సంకీర్తనలు రాసిన పురందర దాసు వ్యాసరాయల శిష్యుడు. వాదిరాజు కూడా శిష్యుడే. వాది రాజు అచ్యుతదేవరాయల కాలంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడినప్పుడు గుప్తనిధిని బయటకు తీసి సాయపడ్డాడు. ఉడిపి క్రష్ణదేవాలయాన్ని నిర్మాణానికి సహకరించాడు . దాని బంగారు శిఖరాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో విజయనగర సామ్రాజ్యం తళ్ళికోట యుద్ధంలో ఓడిపోయింది. వాదిరాజు గొప్పకవి. ‘’రుక్మిణీశ విజయం ‘’సరసభారతి విలాసం’’ తీర్థ ప్రభంధం ‘’ఏకీభావ స్తోత్రం దశావతార స్తుతి ‘’రాసారు. వాదిరాజ వృత్త రత్న సంగ్రహం కావ్యంలో రఘునాధుడు ఈయన గురించి వర్ణించారు.
- పద్మపురాణం రాసిన రవిసేన ఆచార్య (650)
క్రీ.స. 678లో పద్మపురాణాన్ని రవిసేనాచార్యుడు రాసాడు. జినసేనుడు తన హరివంశ పురాణంలో రవిసేనుని గురించి వివరించాడు. పద్మపురాణం ప్రాచీన జైన విధానంలో రాయబడిన రామాయణ కథ అని చెప్పాడు. పద్మపురాణంలో జరిగిన సంఘటనలు 16 వ జైన తీర్తంకరుడైన సామ్తినాధుని కాలంలో జరిగాయని భావిస్తారు. ఇందులోని రామకథకు వాల్మీకి రామకథకు చాలా తేడాలున్నాయి. ఇందులో రామ రావణులు ఇద్దరూ జైనమతాన్ని అనుసరించారని లక్ష్మణుడు శత్రుఘ్నునికి పూర్తిగా తమ్ముడు కాదని దశరధుని నాల్గవ భార్య’’ సుప్రభ’’కు జన్మించాడని రాయబడింది. సీత సాధారణ స్త్రీగానే విదేహ రాణికి జన్మించిందని దశరధుడు రాముడిని అరణ్యవాసానికి పంపగా ఏర్పడిన శోకంతో చనిపోలేదని ప్రపంచంలోని పరిస్థితికి విసిగి వేసారి అరణ్యాలకు చేరి తపస్సు చేసుకున్నాడని చెప్పబడింది. వాలి సుగ్రీవ హనుమంతులు వానర జాతివారు కాదని అరణ్య దేశాల పరిపాలకులని ఉంది. రాముడు వాలిని చంపలేదు. వాలి తమ్ముడు సుగ్రీవుని కోసం రాజ్య త్యాగం చేసి సన్యాసిగా మారాడు. రావణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. రాముని చేతిలో మరణించలేదు. లక్ష్మణుని చేతిలో చనిపోయాడు. లక్ష్మణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి మూర్చ పోయి హనుమంతుడు తెచ్చిన సంజీవని వలన కాక’’ వైశాల్య ‘’ అనే స్త్రీ వలన మూర్చ నుండి తేరుకున్నాడు. ఆ తర్వాత ఈమె లక్ష్మణుని భార్య అయ్యింది.
- అక్బరుచే సన్మా నితుడైన- పద్మసుందరుడు (1541 )
తాప గచ్చకు చెందిన పద్మమేరుని శిష్యుడు పద్మ సుందరుడు. అక్బర్ ఆస్థానంలో సాహిత్య వివాదాలలో అందరినీ ఓడించి అక్బరు చక్రవర్తిచే సన్మానం పొంది అనేక అగ్రహారాలను దానంగా పొందాడు.’’ రాయమల్లాభ్యుదయం’’ అనే కావ్యాన్ని 1559 లో రచించాడు. ఇది 24 మంది జైన తీర్థంకరుల చరిత్ర. అగ్రితాక రోయమల్లుడితో పూర్తవుతుంది. తర్వాత’’ పార్శ్వనాధ కావ్యం’’ కూడా రాసాడు.
- సుదర్శన చరిత్ర రాసిన- సకల కీర్తి
జైన భాట్టారకుడు సకల కీర్తి. ఏడు అధికారాలలో ‘’ధన్య కుమార చరిత్ర కావ్యం’’ రాసాడు. ధన్య కుమారుడు ఉజ్జయినిలో వైశ్యుడైన ధనపాలుని కొడుకు. గొప్ప జైన మునిగా పేరుపొందాడు. ‘’సుదర్శన చరిత్ర’’ శ్రీపాల చరిత్ర, వృషభాను చరిత్ర మహా వీర పురాణం’’ ఇతర రచనలు.
- హరిచరిత కావ్య నిర్మాత చతుర్భుజుడు (14 70 )
చతుర్భుజుడు 1493 లో 13 కాండల హరిచరిత కావ్యాన్ని శ్రీకృష్ణునిపై రాసాడు. బెంగాల్ లోని గౌడ పట్టణం రామకేలి నివాసి. ఆనాటి రాజులు ఖోజులు, హబ్సీలు. కొడుకు పుట్టగానే తండ్రి నాలుకపై బీజాక్షరాలను బంగారు కలంతో తేనెలో ముంచి రాసాడు. దానితో కవిత్వం అబ్బింది. ఇతని కొడుకు కమలాకరుడు. లోలా౦బరాజు రాసిన హరివిలాస కావ్యానికి ఘటకర్పరానికి వ్యాఖ్యానాలు రాసాడు.
- కవిచంద్ర రాయ బిరుదున్న దివాకరుడు (1509 )
వైదీశ్వర ,ముక్తాంబల కుమారుడైన దివాకరుడు భరద్వాజ గోత్రీకుడు. కృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే వాడు. తాను రుద్ర భూపతి నుండి “కవి చంద్ర రాయ” బిరుదు పొందినట్లు చెప్పుకున్నాడు. ఇతని సోదరుడు మధుసూదనుడు’’ ‘’ధూర్త చరిత్ర భాణం’’ తో బాటు ‘’పారిజాత హరణం’’ అనే నాటకం, ‘’రస మంజరి ,దేవీ స్తుతి’’ రాసాడు. నలభై కాండలలో మహా భారత కథను’’ భారతామృతం’’గా రచించాడు.
27౦. వీరభద్ర విజయ కర్త ఏకామ్ర నాధుడు. (16౦౦- 17౦౦)
కొండవీడులో జన్మించిన ఏకామ్ర నాధుడు 16౦౦- 17౦౦ కాలపు రాజైన ఇమ్మడి అంకుశ మహారాజు ఆస్తానా నికి వచ్చాడు. తాను రాసిన ‘’జాంబవతీ పరిణయం, సత్యా పరిణయం’’ కావ్యాలలో అంకుశ రాజుల చరిత్రను తెలియ చేసాడు. ‘’వీరభద్ర విజయం ‘’రాసాడు. ప్రతి కావ్యంలోనూ మొదట తమ రాజుల చరిత్రను సుదీర్ఘంగా వర్ణించాడు. అంకుశ రాజ వంశం రాణ వంశం- శూద్ర వంశం.
- భిక్షాటన కావ్యం రాసిన ఉత్ప్రేక్ష వల్లభుడు (16౦౦)
అసలు పేరు గోకులుడైన ఉత్ప్రేక్ష వల్లభుడు మహా శివభక్తుడవటం చేత “శివభక్త దాసుని”గా ప్రసిద్ధుడు. 16 వ శతాబ్దపు మలబారు కవి. నలభై పద్ధతులలో’’ భిక్షాటన కావ్యం’’ అనే గొప్ప రచన చేసాడు. శివుడు రాజ రాజ చోళ మహారాజు దాన శీలాన్ని భక్తిని ఉదారతను పరీక్షించటానికి ఒక భిక్షకునిగా రావటం ఆ నగర మహిళలను ప్రభావితం చేయటం ఇందులోని కథ. ఇందులోని వర్ణనలు ఆకర్షణతో నిండి సందేశాత్మకంగా ఉన్న కావ్యం. రాజు మదనుడి కోరికపై ఈ కవి’’ సుందరీశ శతకం’’ రాసాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-15 –ఉయ్యూరు