గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
283-శ్రీశైల దీక్షితులు అనే తిరుమలాచార్య (1809-1877)
భాస్కరాచార్య ,తిరు వెంగదాంబ ల కుమారుడే తిరుమలాచార్య .తమిళనాడు లోని చెంగల్పట్టు జిల్లా చిన్నం పట్టు లో 1809మే లో జన్మించాడు .శ్రీ వైష్ణవ సంప్రదాయం లో సప్తగోత్ర శాఖకు చెందిన వాడు .వీరి పూర్వీకులు తంజావూర్ జిల్లా తిరుకండియార్ కు చెందినవారు గా గుర్తింప బడ్డారు .నెలల పిల్లాడుగా ఉండగానే తండ్రి చనిపోతే మాతామహుడు స్వంత కొడుకులా పెంచాడు .ట్రిప్లికేన్ లో చదివి సాహిత్యం ,వేదాంతాలలో నిష్ణాతుడయ్యాడు .రామానుజుల శ్రీభాష్యం పై తిరుమలాచార్య విశ్లేషణం అనితర సాధ్యం గా ఉండేది .అందుకనే ఆయనను ‘’శ్రీ భాష్యం తిరుమలాచార్య ‘’అని గౌరవం గా పేర్కొనేవారు .ఇరవై నాలుగవ ఏట ఒక్క గానొక్క కొడుకు భాష్యకాచార్య పుట్టాడు .మద్రాస్ లోని కోలా సోదరులైన కృష్ణ నాయుడు ,విజయ రంగం నాయుడు లకు చదువు చెప్పాడు .వారితో బాటు బెంగుళూర్ లో స్తిరపడ్డాడు .అక్కడే కన్నడ పత్రిక ‘’కర్నాటకా ప్రకాశిక ‘’ను మైసూరు మహారాజు కృష్ణ రాజ ఒడియార్ ఆధ్వర్యం లో నిర్వహించాడు .23-2-1877మరణించాడు .
తిరుమలాచార్య గొప్ప సంగీత విద్వాంసుడు .’’అమర శతకానికి’’ స్వరాలు సమకూర్చాడు .బాణుని కాదంబరిపై వీరాభిమానం ఉండటం వలన ‘’కాదంబరీ తిరుమలాచార్య ‘’అనే గౌరవ బిరుదం వచ్చింది .కవిత్వం లోనూ దిట్ట .’’హనుమన్నక్షత్రమాల ‘’,వీరాంజనేయ శతకం ‘’,గోపాలార్య ‘’మున్నగు సంస్కృత రచనలు చేశాడు .’’భారతి విలాసం ‘’,అనే వచన రచన ను షేక్స్పియర్ ‘’కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ‘’ఆధారంగా రాశాడు .కూర్గు జిల్లాలో ఉన్న తలకావేరి యాత్రను ‘’కావేరి గద్య ‘’గా రాశాడు .ఆయన రచనలలో మాణిక్యం ‘’శ్రీ క్రిష్ణాభ్యుదయం ‘’అనే వచన కావ్యం .అందులోని వచనం పలు భంగులలో కదను తొక్కుతుంది .ఆయన కృష్ణ భక్తికి చిరస్థాయి గా నిలిచింది .కదా ,కధనం అనితర సాధ్యమని పిస్తాయి .దానికి మించిన సంస్కృత వచన రచన లేదేమో నని పిస్తుంది .కృష్ణ భక్తికి పరాకాష్ట గా నిలిచిన సద్గ్రంధం ఇది .దీనికి సాటి లేదు అంటారు .
284-తిమ్మకవి
కూచిమంచి వంశానికి చెందిన తిమ్మకవి కౌండిన్య గోత్రీకుడు ఆంద్ర ప్రదేశ్ లో పిఠాపురం దగ్గర చంద్రం పాలెం నివాసి కుక్కుటేశ్వర స్వామి అనుగ్రహం తో గొప్ప కవిత్వం,సకల శాస్త్ర పరిచయం అబ్బింది .అతని ‘’సుజన మనమనస్కుముద చంద్రిక ‘’ముత్తాత తిమ్మకవి రాసిన ‘’రసిక జన మనోభిరామం ‘’కు సంస్క్రుతీకరణం .ఇందులో కధను ఇంద్రుడు కేరళకు చెందిన మహా భాగుడికి చెబుతాడు .కరాళ వక్త్రుడు అనే కేరళ రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకొని వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు .ఆమె పెంపుడు చిలుకను వెంబడిస్తూ ఒక శివాలయం లోకి ప్రవేశిస్తాడు .అక్కడ కిందపడి శివనామం జపిస్తూ మరణించి కైలాసంచేరుకొంటాడు .
285-అభినవ కాదంబరి కర్త-అహోబిల నృసింహ కవి(1700)
రామ కృష్ణాధ్వరి కుమారుడు ,నారాయణ సూరి మనవడు అయిన నృసింహకవి తెలుగు వేగినాటి కాశ్యప గోత్రీకుడు .కవి వంశమే వీరిది. మైసూరు రాజుల ప్రాపకం లోని కవులే వీరు .1795వాడిన మూడవ కృష్ణ రాజ ఒడియార్ రాజు కాలం లో నారాయణ పండితునితో స్పర్ధ వచ్చి కాదంబరి తో సరిసమాన మైన కావ్యం రాస్తానని ప్రతిజ్ఞా చేసి ‘’అభినవ కాదంబరి ‘’రాసి అందరినీ ఆశ్చర్య పరచాడు .దీనికే ‘’త్రిమూర్తి కల్యాణం ‘’అనే పేరు కూడా ఉంది .ఇది రెండుభాగాలు .కృష్ణ రాజు వంశ చరిత్ర, సాహసాలు వగైరాలుంటాయి .అభినవ కాదంబరి అనే మాటకు కావ్యం లో అర్ధమే కనిపించదు .బాణకవిని మించిపోదామనే అత్యాశ కనిపిస్తుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-15- ఉయ్యూరు