దాశరథి నిర్దేశించిన కర్తవ్యం (23-Aug-2015)

దాశరథి నిర్దేశించిన కర్తవ్యం (23-Aug-2015)
డాక్టర్‌ దాశరథి రంగాచార్య ఒక మహా రచయిత. సామాజిక చరిత్రను నవలలుగా మలచిన దాశరథి బహు గ్రంథకర్త. నవలలతోపాటు రామాయణం, మహాభారతాలను, నాలుగు వేదాలను, ఉపనిషత్తులను తెలుగులో అందించారు. 1928 ఆగస్టు 24న జన్మించిన దాశరథి 2015 జూన్‌ 8న పరమపదించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొని ఆ చరిత్రను అనేక నవలల్లో చిత్రించారు. 1964లో రాసిన ‘చిల్లర దేవుళ్ళు’ నవల మొదలుకొని ‘మోదుగుపూలు’, ‘జనపదం’, ‘మాయజలతారూ’ ‘శరతల్పం’, ‘నల్లనాగు’ ‘అమృతంగమయ’ ‘రానున్నది ఏది నిజం’ దాకా కాలు, చేయి ఆడినంత కాలం రాస్తూనే వచ్చారు. సోషలిజాన్ని స్వప్నించిన రంగాచార్య సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిపోవడంతో ఆవేదన చెందారు. అయినా సోషలిజం పట్ల ఒక సుమధుర స్వప్నం దాశరథి రంగాచార్య జీవితాన్ని ముందుకు నడిపించింది.
దాశరథి రంగాచార్య మనిషిని, మానవత్వాన్ని మానవీయ విలువలను, సంస్కృతిని గౌరవించి ఆచరించిన మహనీయుడు. దాశరథి గారి రచనలతో 1970 నుంచి నాకు అనుబంధం ఉంది. మా మధ్య వాత్సల్యపూరిత గురుశిష్య, స్నేహ, ప్రేమానుబంధాలు ఉన్నాయి. 1993 ఆగస్టు 24న జరిగిన దాశరథి పురస్కార సభ, వారి జన్మదిన ఆత్మీయ కలయిక నేను మర్చిపోలేని సుమధుర జ్ఞాపకం. సాహిత్యంలో అనేక ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న నాకు, ఒక కొత్త కర్తవ్యం గుర్తు చేసింది దాశరథి పురస్కారం. మనం యువతరం రచయితలను ప్రోత్సహించాలి. పురస్కారాలు అందజేయాలి. తద్వారా వారిలో నూతన ఉత్తేజం కలుగుతుంది. ఉత్సాహంగా మరిన్ని రచనలు చేస్తారు. మరింత ఎదుగుతారు. అని అనిపించింది. అలా ఆలోచిస్తూ 1998లో నా 50వ జన్మదిన స్వర్ణోత్స సందర్భంగా మా అమ్మ బీడీ కార్మికురాలు, మిట్టపల్లి లక్ష్మిరాజు పేరిట విశాల సాహిత్య అకాడెమీ ద్వారా పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించాను. వందలాదిమందికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందజేయడం జరిగింది. ఎంతోమంది ఉత్సాహంగా ఎదుగుతూ వచ్చారు. ఈ ఆలోచన, ఆచరణకు నాంది దాశరథి నాకు అందజేసిన పురస్కారం, ఇచ్చిన ఉత్తేజం.
1995 నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మళ్లీ ఉద్యమం ఎక్కడికక్కడ రగులుకుంటున్న కాలంలో అనేక సభల్లో సదస్సుల్లో కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము. కాళోజీ, దాశరథి రంగాచార్య, డాక్టర్‌ జయంశంకర్‌, బియ్యాల జనార్దనరావు, నాళం కృష్ణారావు, వి. ప్రకాష్‌, గాదె ఇన్నయ్య మొదలైనవారు ఆనాటి తెలంగాణ స్వరాష్ట్ర భావనలో ఎంతో కృషి చేశారు. రాపోలు ఆనందభాస్కర్‌ తెలంగాణ ప్రగతి వేదిక పేరిట రెండు రోజులపాటు జరిపిన సదస్సులో అనేక ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. సిపిఐ ఎంఎల్‌ జనశక్తి నుంచి విడివడి ప్రత్యేకంగా ఉద్యమం నడుపుతున్న మారోజు వీరన్న తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో సదస్సులు నిర్వహించారు. వీలైన చోటికల్లా దాశరథి రంగాచార్య వచ్చి ప్రసంగించేవారు. భూస్వామ్య వ్యతిరేక నైజాం వ్యతిరేక తెలంగాణ రైతాగ సాయుధ పోరాటాన్ని గొప్పగా ప్రశంసించేవారు. మనం ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఎలా మోసపోయామో చెప్పేవారు. తెలంగాణది పోరాట సంప్రదాయమే తప్ప, అధికారం అందుకోవడం కాదని అనేవారు. పోరాటం ఎలా సాగితే బావుంటుందో అనేక సూచనలు చేశారు. దాశరథి చేసిన సూచనలు సాహిత్య సాంస్కృతిక, సామాదశాబ్దాలుగా కలలుగన్న ప్రత్యేక తెలంగాణ రాషా్ట్రన్ని చూడగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాక ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తూ వచ్చారు. తాననుకున్న విధంగా కాకుండా, అనేక మలుపులు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తీరు పట్ల చాలా అసంతృప్తిగా ఉండేవారు.
ముందు తరాలకు మార్గదర్శిగా నిలిచిన దాశరథి వంటి చారిత్రక వ్యక్తులు అరుదుగా జన్మిస్తుంటారు. దాశరథి రంగాచార్య కేవలం ఒక వ్యక్తి కాదు. ఎనిమిది దశాబ్దాల సామాజిక, సాంస్కృతిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న మహాశక్తి. మహా రచయిత. తెలంగాణ భాష, తెలంగాణ ప్రజలు ఉన్నంతకాలం దాశరథి రంగాచార్య జీవితం, రచనలు నిరంతరం స్ఫూర్తిని, ఉత్తేజాన్ని ఇస్తూనే ఉంటాయి. అనేక కోణాలలో నా జీవితాన్ని పరిశీలించిన దాశరథి స్వీయచరిత్ర రాయమని నిరంతరం కోరేవారు. మన స్వీయ చరిత్ర మనకోసం కాదని, మనం జీవించిన సమాజాన్ని చిత్రించడానికి మనం ఒక సందర్భమని అందువల్ల సమకాలిక సమాజం, దాని పరిణామాలు చిత్రించడానికి మన స్వీయ చరిత్ర ఒక సాకుగా సాధనంగా చిత్రించాలని కోరేవారు. నా స్వీయ చరిత్రను చూసి ఇలా రాయకూడదని హెచ్చరించారు. తాను రాసిన జీవనయానం ఒక కాలానికి సంబంధించినదని, నీవు నీ కాలానికి సంబంధించిన చరిత్రను మీ చేనేత కులాల జీవన పరిణామాలనుంచి చిత్రిస్తూ రాయాలని చెప్పారు. దాశరథి ఓ మూడు వందల పేజీల పెద్ద బౌండ్‌ గీతల పుస్తకం తీసుకుని అందులో రాయడం మొదలుపెడితే, అది పూర్తయ్యేది. కొట్టివేతలు, దిద్దుబాట్లు ఏవీ లేవు. రాయడం పూర్తి కాగానే ప్రచురణ కర్తకు అందించేవారు. ఆ రాతప్రతి చూస్తే ఆశ్చర్యమేసేది. అంత నిష్టగా ఆ రచనల్లో లీనమై ఆయా దృశ్యాలను కళ్లలోకి తెచ్చుకుని, కలం ద్వారా దృశ్యీకరించడం అనేది రచనలో ఉండే సాధికారితను తెలుపుతుంది. ఒక ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా రాయడం సాధ్యం. దాశరథి రంగాచార్య అనేక ప్రదేశాలను సందర్శించారు. నిరంతరం ధ్యానంలో జీవించేవారు.

ఇలా భావాన్ని, వాక్యాన్ని, దృశ్యాన్ని మనుసులోనే రూపొందించుకుని చేతిలోని కలం ద్వారా కాగితం మీదికి ఎక్కించడం ఏకకాలంలో సాగడం వల్లనే డాక్టర్‌ దాశరథి రంగాచార్య వేదాలను, ఉపనిషత్తులను, రామాయణ మహాభారాతాలను అనువదించగలిగారు. అనేక నవలలను రాయగలిగారు. దాశరథి రంగాచార్య జీవితం సార్థకమైనది. కారణజన్ముడు డాక్టర్‌ దాశరథి రంగాచార్య ఎందరో రచయితలకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. దాశరథి రాసిన నవలలు మా వంటి వారికి ఇప్పటికీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. రాయని మా పలాయనవాదాన్ని నిరంతరం హెచ్చరిస్తూనే ఉంటాయి. నాతో సహా తెలంగాణ రచయితలు ఒక్కొక్క ప్రేమ్‌చంద్‌లా, దాశరథిలా, టాగోర్‌లా శరత్‌బాబులా విస్తారంగా తెలంగాణ ప్రజల జీవితాలను, సంస్కృతిని, పరిణామాలను, ఉద్యమాలను కథలు, నవలలుగా రాసినపుడే అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యకు నిజమైన నివాళి. అప్పుడే మనం దాశరథికి నిజమైన వారసులుగా నిలుస్తాం.

బి.ఎస్‌.రాములు
(రేపు దాశరథి రంగాచార్య జయంతి) 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.