గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655)

మైధిలీ బ్రాహ్మణ వంశం లో విల్వపంచ శాఖకు చెందిన వంశమణి రామచంద్రుని కొడుకు .నేపాల్ దేశ వాసి .ఖాట్మండు రాజు  ప్రతాప మల్ల దేవుడు  చేసిన తులాపురుష దాన సందర్భం గా ‘’గీతా దిగంబర ‘’నాటకం 1655లో  రాశాడు .తులాపురుష దానం జరిగే సందర్భం లో ఆహూతులైన రాణుల రాజుల పండితుల సమక్షం లో వారందరికీ వినోదం కలిగించటానికి చేసిన రచన ఇది .తులాపురుష దానం అంటే రాజు తన బరువుతో సమానమైన విలువైన ఆభరణాలు బ్రాహ్మణులకు దానం చేయటమే .ప్రతాపమల్ల రాజు స్వయంగా కవి, కవిపోషకుడు .ఆయన దేవతలమీద  రాసిన ‘’అష్టకాలు ‘’నేపాల్ అంతటా లభిస్తాయి అంత ప్రాచుర్యం పొందాయన్నమాట .ఇలాంటి పవిత్ర కార్యక్రమం లో సంస్కృత నాటకం ఆడించటం రాజుకు అలవాటు .

309-కమలా విజయ నాటక కర్త-వేంకటాచార్య

బెంగుళూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయిన వేంకటాచార్య అనేక గ్రంధ రచయిత .టెన్నిసన్ రెండు అ౦కాలలో రాసిన ‘’టీ కప్ ‘’నాటిక ఆధారం గా ‘’కమలావిజయం ‘’నాటకం రాశాడు .ప్రాకృతం వాడలేదు .చెడుపై మంచి విజయం సాధిస్తుంది అని సారాంశం .’’నవ గీతా కుసుమాంజలి ‘కావ్యం లో ’ ఉన్నది ఒకడే దైవం .ఆయనననే అనేక రూపాలలో ఆరాధిస్తున్నారు అని చెప్పాడు. పురాణ కధలను ఆధారంగా దీన్ని వివరించాడు .ఇందులో తొమ్మిది భాగాలు ,నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి .రామాయణ సారాన్ని ‘’రామ గీత ‘’లో,భాగవత కధను ‘’కృష్ణ గీత ‘’లో ,విష్ణు వివరాలను ‘’దశావతార గీత ‘’లో ,గణపతి సృష్టికి మూలం అని ఆయన వైభవం వర్ణనాతీతం అని ‘’గణేశ గీత ‘’లో ,అసలైన దివ్య జ్ఞానం కుదురైన బుద్ధి వలన సాధ్యం అని ‘’సద్గురు గీత ‘’లో ,త్రిమూర్తులకు భేదమే లేదని ‘’శివ గీత ‘’లో ,చెప్పాడుకవి .ఇతని’’ వాణీ గీత ‘’లక్ష్మీ గీత ‘’.’’గౌరీగీత ‘’స్త్రీ శక్తికి ఉన్న విలువను తెలియ జేస్తాయి .

310-భావ శతక కర్త -నాగరాజకవి

కార్పాటి గోత్రానికి చెందిన జల్లపుని కుమారుడు నాగరాజు.విద్యాధరుడు తాత .’’భావ శతకం ‘’లో తానూ రాజునని ‘’తాక వ౦శ మణి దీపాన్నని చెప్పుకొన్నాడు .వీరి వంశపు రాజులు చిన్న చిన్న రాజ్యాధిపతులు ధిల్లీకి ఉత్తరాన ‘’ యమునా నది ఒడ్డున ‘’కాష్ట’’దేశ పాలకులయి ఉండచ్చు .ఇతని భావ శతకం లో నూటొక్క శ్లోకాలున్నాయి .కొన్ని ప్రాకృతికం లోనూ రాశాడు . ఇందులో అనేక భావాలను వెదజల్లాడు .కవికర్ణ పూరుని ’’చమత్కార చంద్రిక ,నరోత్త్తమ దాస విశ్వేశ్వర ‘’,రచనలు త్రివిక్రముని వ్యాజోక్తి   శతకం ‘అన్నీ ఒకటిగానే కనిపిస్తాయి .

311-ఆశే చనక రామాయణ కర్త-సుబ్రహ్మణ్య సూరి (1850-1913)

శంకరనారాయణ కుమారుడైన సుబ్రహ్మణ్య సూరి 1850లో పుదుక్కొట దగ్గర కదయక్కూడి లో జన్మించాడు .ప్రసిద్ధ చొక్కనాద దీక్షితులకు ఏడవ తరం వాడు .పుదుక్కొట రాజా కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ చేశాడు .1913లో చనిపోయాడు .సకల కళా వల్లభుడు .ఏడు అంకాల ‘’వల్లీ బాహులేయం ‘’నాటకాన్ని రాశాడు .ఇది వల్లీ కుమారస్వాముల వివాహ కధ.’’మన్మధ మంధనం’’అనే భాణాన్ని,’’శంతను చరిత్ర ‘’వచనాన్ని రచించాడు .’’బుద్ధి సందేశం ,పద్య పంచ రత్నం ,హర తీర్దేశ్వర స్తుతి ,శుక సూక్తి సుధా రసాయనం ,కూడా రాశాడు రామాయణ కధలను సంగీతానికి అనుగుణంగా మలచాడు .అవే ‘’రామావతారం ,విశ్వామిత్ర యాగం సీతాకల్యాణం రుక్మిణీ కల్యాణం ‘’,విభూతి మహాత్మ్యం మొదలైనవి .’’డోలాగీతలు హల్లీశ మంజరిలు వివిధ దేవతలపై రాసిన పాటలు ‘’.అతని   మాణిక్య భాసమాన రచన ‘’ఆశేచనక  రామాయణం ‘’.నూట తొంభై తొమ్మిది ఆర్యా వృత్తాలలో రాశాడు .ప్రతి శ్లోకం లో మొదటి మూడు పాదాలలో కద ఉంటే ,నాల్గవ పాదం లో నీతి ఉండటం దీని ప్రత్యేకత .ప్రతి శ్లోకం మధురమే సూక్తి సుదారసమే .వాల్మీకి రామాయణ కధకు కొత్త సొగసులు కూర్చాడు కవి .

312-‘’శీఘ్ర కవి ‘’-శంకర్ లాల్ మహేశ్వర శాస్త్రి(1844-1916)

మహామహోపాధ్యాయ శంకర్ లాల్ మహేశ్వర శాస్త్రి ప్రాశ్నోర నగరం కు చెందిన వాడు .1844-1916కాలం వాడు .జాం నగరం  లో ఉండేవాడు .పదిహేనవ ఏట నుండే కవిత్వం అల్లాడు .జాం నగర్ మహారాజు ఇతని కవితా ప్రతిభకు మెచ్చి ‘’శీఘ్రకవి ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .కదియవాడలోని మొర్బి రావోజీ రాజా పాఠశాలలో పని చేశాడు ‘సావిత్రీ చరిత్ర ‘’,చంద్ర ప్రభ చరిత్ర ‘’,ద్రువాభ్యుదయ శతకం ‘’,గోపాల చింతామణి ‘’,అనసూయాభ్యుదయం ‘’మొదలైన రచనలు చేశాడు .

313-సూర్య గ్రహణం పై ‘’చిత్సూర్య లోకం ‘’రాసిన -ముడుంబై వెంకట రామ నరసింహ ఆచార్య (1842-1928)

1842-1928లో ఉన్న ముడుంబై నరసింహా చార్య వీర రాఘవ రంగాంబ ల కుమారుడు .శ్రీ వత్స గోత్రం .ఈ వంశం లో ఒకాయన సంగీత సాహిత్యాలలో మహా విద్వాంసుడు .అందుకని వీరికి ‘’సంగీతముడుంబై ‘’అనే పేరు ఏర్పడింది .వీరి మూల పురుషుడు ముడుమ్బైఆచన్ .ఈయన రామానుజుల వారి శ్రీ వైష్ణవ సంప్రదాయం లో 72వ ఆచార్యుడు ..మన నరసింహా చార్యనువిజయనగరం రాజు  విజయ రామ  గజపతి ఆహ్వానించి సత్కరించాడు ‘సాహిత్య విభాగాలన్నిటిలో 114 రచనలు చేశాడు .’’గజేంద్ర వ్యాయోగం ,రాజహంసీయ నాటకం ,వాసవీ పాశ న్యప్రకరణం ,మొదలైన నాటకాలు ,సూర్య గ్రహణం పై ‘’చిత్సూర్య లోకం ‘’రాశాడు .కావ్యాలలో ‘’రామ చంద్ర కదామృతం , భాగవతం ముఖ్యమైనవి .’’ఖాలావ హేళన ‘’,నీతి రహశ్యం ‘లఘుకావ్యాలు .’’ఉజ్వలానంద చంపు ‘’వచన రచన .’’కావ్యాలంకార సంగ్రహం ‘’’అనే అలంకార గ్రంధమూ రచించాడు .

314’’గీర్వాణ శఠగోప సహస్ర’’ కవి మేడేపల్లి వెంకట రామణాచార్య (1862

విజయనగరం జిల్లా అనకాపల్లిలో రమణాచార్య 1862లో జన్మించాడు .సమర్ధులైన గురువుల వద్ద శాస్త్రాభ్యాసం చేసి సమర్ధుడని పించుకొని విజయనగరం రాజావారి కళాశాలలో సంస్కృత ఆచార్యుడయ్యాడు .’’గీర్వాణ శఠ గోప సహస్రం ‘’తమిళ ప్రబంధాల కు సంస్కృత రచన .భక్తీ భావ లహరి .పదిహేనవ శతాబ్ది తర్వాతా సంస్కృతం లో ఇంత ప్రౌఢ రచన రాలేదని అంటారు .షేక్స్పియర్ .లాంబ్ కధలను సంస్క్రుతీకరించాడు .తెలుగులో అలంకార శాస్త్ర గ్రంధం రాశాడు .

315-సంస్కృత సర్వస్వం రాసిన -మధురానాధుడు (1890-

మంజునాధుడు అని పిలువ బడిన మధురా నాధుడు ద్వారా కంఠకుమారుడు జైపూర్ రాజాస్థాన పండిట్ .సుందరలాలా పెంచుకొన్నాడు .గౌతమ గోత్రం.1890లో పుట్టాడు .ఇతాని పూర్వీకుడు బావి దీక్షితులు తెలుగు బ్రాహ్మణుడే .కాశీలో నివాసం ఉన్నాడు మరో ఆయన మణుల దీక్షితులు ప్రయాగలో స్టిరపడ్డాడు .ఈ కుటుంబాన్ని ‘’దేవర్ష వాతంక ‘’గా పిలుస్తారు .వీరికి ఒక శిష్యుడు  దేవర్షి అనే గ్రామాన్ని కానుకగా  బహూకరించటం చేత ఈ పేరు వచ్చింది  .మధురానాధ పాండిత్యానికి రాజులు మెచ్చి బహు బహుమతులిచ్చి సత్కరించారు .జయపూర్ రాజ్య పండితుని చేశారు .’’ఈశ్వర విలాసం ‘’,పద్య ముక్తావళి ‘’త్రిపుర సుందరీ స్తవ రాజం అలంకార కళానిధి ‘’ఇతని రచనలు .జైపూర్ సంస్థాన సంస్కృత విద్యకు సూప రిం టెండెంట్ గా  ఉన్నాడు.’’మంజు కవితా నికుంజం ‘’,అనే సంకలనం తెచ్చాడు .’’సాహిత్య వల్లభ ‘’,సంస్కృత గాదా సప్త శతి ,సంస్కృత సర్వస్వం,  కావ్యాలంకార రహస్యం ‘’అతని ప్రతిభకు గీటు రాళ్ళు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-15-ఉయ్యూరు

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.