గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
363- సంగీత సుధాకరం రాసిన హరిపాల రాజు (1312-1318)
హరిపాలుని తండ్రి కుమారి ,తాత సోమనాధుడు .బహుశా ఈయన యాదవ రాజు1312-1318మధ్య దేవగిరి పాలకుడు అయిన రాజా హరిపాలుడు అయి ఉండవచ్చు .చాళుక్య ప్రభువు అన్హిల్విద్ పాలకుడైన హరిపాలుడు కాదు .’’విచార చతుర్ముఖుడు ‘’’’వినాటంకవిశారదుడు ‘’అని తనను గూర్చి చెప్పుకొన్నాడు .వందదాకా గ్రంధాలు రాసి నట్లూ చెప్పాడు .తన పాండిత్య గరిమ గురించి చెప్పుకొన్న శ్లోకం –
‘’బహుభాషా రచయితా స్పదా రస గుణా౦క్కారిణీ నిస్తూత –వృత్తీ యస్య పరం విహార రాసికా జాత గిరో దేవతా’’
ఒకసారి హరిపాల రాజు శ్రీరంగం వెళ్లి అక్కడి నాటక నృత్య సంగీతకారుల అభ్యర్ధనపై కొన్ని రోజులుఉండి ‘’సంగీత సుధాకరం ‘’రాశాడు .ఆరు అధ్యాయాలున్న దీనిలో నాట్య తాళ ,వాద్య ,రస ప్రబంధాలపై చర్చించాడు .దీనికి ‘’గాయక లక్షణం ‘’అనే అనుబంధాన్నీ రాశాడు .సంగీత సుధాకరం లో ఆధునికులైన సారంగదేవమొదలైన వారి తోటి వాడిని అన్నాడు.’’అభినయ శాస్త్రం ‘’ఇతని గురించి ఆచూకీ ఉంది –
‘’ఆదా వంతే దోదిగాదా మధ్యే పాఠాక్షరైర్యుతం –మోహ నారే దిసంత్రీ కదియే హరి భూభుజా ‘’
364-సంగీత శృంగార హారం కర్త .-హమ్మీరుడు (1340-1394)
మేవార్ రాజే హమ్మీరుడు కావచ్చు .సంగీత రత్నాకరానికి వ్యాఖ్య రాసిన కుంభకర్ణ రాజుకు పైన అయిదవ తరం వాడు . 1394లో హమ్మీరుడు చనిపోయాడు .’’సంగీత శృంగార హారం ‘’రాశాడు .ఇందులో పూర్వపు రాజు జైత్ర సింహ ను పేర్కొన్నాడు
365-. త్రిలోచనాదిత్యుడు (1370)
‘’నాట్య లోచనం ‘’రాసిన త్రిలోచనాదిత్యుడిని వ్యాఖ్యాతలందరూ ఉదాహరించారు .పద్నాలుగవ శతాబ్ది వాడు .’’లోచనా వ్యాఖ్యా౦జనం ‘’కూడా రాశాడు .
366-‘’స్వరరాగ సుధారసం ‘’రచించిన అష్టావధాని సోమనార్యుడు (1344)
‘’స్వర రాగ సుధారసం ‘’కర్త సోమనార్యుడు ఏడు అధ్యాయాలలో సంగీత నృత్య విశేషాలను వర్ణించాడు అందులో సృజనకారుడు రావణుడు అన్నాడు .నారద సిద్ధాంతాన్ని పాటించాడు .భరతమునితో తరచుగా విభేదించాడు .సోమనార్యుడు అంటేతెలుగు కవి, ఉత్తర హరివంశ కర్త నాచన సోముడు కావచ్చు .విజయ నగర రాజు మొదటి బుక్క రాయల కాలం 1344కాలం వాడు .
367-భక్త మీరాబాయి భర్త ,సంగీత మీమాంస కర్త-రాజా కుంభ కర్ణ
కుంభ రాణా లేక కుంభ కర్ణ రాజు విజయ గోత్రీకుడైన మోకలుని కుమారుడు .ఈ వంశం వారు గూహిలులు అనే బ్రాహ్మణ రాజులు .మేవార్ లేక మేడపేట రాజులు .ఇతనిభార్య అపూర్వ దేవి .కొడుకు రాజమల్లుడు .కర్ణుడు 1433-1468కాలం లో చిత్రకూట రాజు .ఈయన భార్యయే ప్రముఖ కృష్ణ భక్తురాలు మీరాబాయి .యితడు భవానీ దేవికి, ఏక లింగ దేవునికి పరమ భక్తుడు .మాళవ ,యవన గుజరాతు రాజులపై తన యుద్ధ విజయాలను సారంగ ధరనగర విధ్వంసాన్ని పాటలుగా పాడుతూ ఉండేవాడు .అందువలన అనేక బిరుదులు పొందాడు .మంచి సంగీత రసికుడు .గొప్ప కళాభిమాని .గీతాగోవిందం పై ‘’రసిక ప్రియ ‘’వ్యాఖ్యానం రాశాడు .అందులో తన ‘’సంగీత రాజం ‘’ గురించి చెప్పుకొన్నాడు .సంగీత రాజం కే ‘’సంగీతమీమాంస ‘’అనే పేరు కూడా ఉంది .ఇందులోని అధ్యాయాలను రత్న కోశాలు అన్నాడు .మొత్తం16000శ్లోకాలున్న గ్రంధం .మొదటి అధ్యాయం నాటక కళగురించి ,రెండవది సంగీతం గరించి ,మూడవది సంగీత వాద్యాల గురించి నాల్గవది ఆహార్యం నృత్యం హావభావాల గూర్చి అయిదవది నాయక నాయిక లగురించి భావాల గురించి వివరించాడు .
368-స్వర మేళ తాళానిది కర్త -రామామాత్యుడు (1560)
తిమ్మామాత్యుని కొడుకు రామామాత్యుడు రాజా తోడర్ మల్ వంశం వాడు .ఇతని ‘’స్వర మేళ తాళానిది ‘’అయిదధ్యాయల గ్రంధం .కర్నాటక రాగాల గురించి వివరమైన వర్ణన చేశాడు .72మేళకర్తలలో అవి విస్తరించిన విధానం తెలియ జేశాడు .విజయనగర రాజు అళియ రామ రాజు ఆస్థానం లో ఉన్నాడు .రామరాజు తల్లికోటయుద్ధం లో1565లో చంపబడ్డాడు .రామామాత్యుడు చతురకల్లినాధుని కూతురుకొడుకు .
క్షేమకర్నుడు ‘’రాగ మాల ‘’ను జాతవ భూపాలుని కోరికపై 1570లో సంతరించాడు .జీవరాజు కూడా ‘’రాగమాల ‘’పేరుతొ మరో గ్రంధం రాశాడు .
369-ఉత్తరదేశ సంగీతాన్ని సంస్కరించిన -పాండు రంగ విఠలుడు (1560)
జమదగ్ని గోత్రీకుడు ,కర్నాటక లో ఖాందేశ్ లో శాతనూర్వ గ్రామ వాసి .ఫారట వంశ పాలకుడు బుర్హాఖాన్ కోరికపై ఉత్తర హిందూ స్థానం సంగీతాన్ని సంస్కరించి కుదించి ‘’విత్తాలయ ‘’రాగమాల ,నర్తన నిర్ణయం రాగ మంజరి ,సద్రాగ చంద్రోదయం రాశాడు .అక్బర్ ఖాందేశ్ ను1599లో స్వాధీన పరచుకొన్న తర్వాత ధిల్లీ వెళ్లి అక్బర్ కొలువులో ఉన్నాడు .అక్కడ ‘’రాగ నారాయణ’ను సైనికాధికారి మాధవ సి౦హుని ’కోరికపై రచించాడు .విఠలునికి దాక్షిణాత్య ఉత్తరాది సంగీత రీతులపై పరి పూర్ణ జ్ఞానం ఉంది .ఈ విఠలుడే ‘’సంగీత వృత్త రత్నాకరం ‘’రాసి ఉండవచ్చు .
370- సంగీత దామోదరం రాసిన -శుభంకరుడు (1590)
‘’సంగీత దామోదరం’’కర్త శుభంకరుడు ఏడు అధ్యాయాలలో సంగీత నృత్య రీతులను సంబందాలను ,నాయక నాయికా లక్షణాలను ,భావాలను వివరించాడు .పదిహేడవ శతాబ్దికి ముందు రచన .దామోదర రాజుకు అ౦కి తమిచ్చాడు .అందుకే సంగీత దామోదరం అనే పేరు .’’నారదీయ శిక్ష ‘’కు శుభంకరుడు వ్యాఖ్యానం కూడా రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-15- ఉయ్యూరు