వహ్వా… నెహ్వాల్.

వహ్వా… నెహ్వాల్…

  • 30/08/2015
  • -విశ్వమిత్ర

సైనానెహ్వాల్… భారత బ్యాడ్మింటన్ కీర్తికిరీటంలో కలికితురాయి. ఒకప్పుడు.. విజయం ముఖం చాటేసినప్పుడు..అలసిసొలసి… ‘ఇకచాలు..ఈ ఆటను వదిలేద్దాం’…అనుకున్న ఆమె ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు స్ఫూర్తిమంత్రం. ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం సాధించి, ఇంతవరకూ భారత చరిత్రలో ఎవరూ సాధించని ఘనతను సొంతం చేసుకుంది. ఓ ఐడియా జీవితానే్న మార్చేస్తుందన్న తారకమంత్రం ఆమె జీవితంలోనూ నిజమైంది. స్వయంగా ఆమే ఆ విషయాన్ని చెబుతోంది. బ్యాడ్మింటన్‌లో ఓనమాలు దిద్దిన హైదరాబాద్‌ను, అక్కడే ఉన్న తల్లిదండ్రులను వదిలి బెంగళూరులో శిక్షణకు వెళ్లాలన్న కఠిన నిర్ణయం తన క్రీడాజీవితాన్ని మేలిమలుపు తిప్పిందని అంటున్నారామె. అది నిజంకూడా. ఇటీవలికాలంలో ఆమె సాధించిన అద్భుత విజయాలే అందుకు నిదర్శనం. సైనా నెహ్వాల్.. సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ క్రీడాకారిణి. భారత కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ క్రీడావేదికలపై రెపరెపలాడించిన హైదరాబాదీ. క్రీడాకారులు ఎవరైనా మ్యాచ్‌లు గెలిస్తే గంతులేస్తారు. తమకు తిరుగులేదని గర్వపడతారు. ఓడితే కుంగిపోతారు. పాతాళానికి పడిపోయామని బాధపడతారు. కానీ సైనా మాత్రం భిన్నంగా ఉంటుంది. గెలిచిన ప్రతిసారీ తన బాధ్యత పెరిగిందన్న భావనతో మరింతగా ఒదిగిపోతుంది. ఓడితే, గెలవాలన్న పట్టుదలతో శ్రమిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తుంది. ఈ విలక్షణ లక్షణమే సైనాను ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేర్చింది. కొందరిని తలచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. వారు సాధించిన విజయాలు మన సొంతం అన్నంతగా గర్వపడతాం. వారిని మార్గదర్శకులుగా ఎన్నుకుంటాం. లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్న బాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ ఇలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. స్వాప్నికులు ఊహల్లో బతుకుతారు. వారే కార్యదక్షులైతే కలలను సాకారం చేసుకుంటారు. సైనా లాంటి రెండో కోవకు చెందిన వారు వేసే వారు వేసే ప్రతి అడుగూ స్ఫూర్తిదాయకమవుతుంది. వెలుగుచుక్కలా మార్గదర్శకం చేస్తుంది. లక్ష్యాల దిశగా అడుగులు వేయిస్తుంది. చాలా మంది క్రీడాకారిణులు తమ ఆట కంటే అందంతోనే పేరుప్రఖ్యాతులు సంపాదిస్తారు. వారిని బ్యూటీలుగానే గుర్తిస్తారు. కొందరు మాత్రమే తమ ఆటతో, నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. సైనాది రెండో వర్గం. 2006లో 16 ఏళ్ల వయసులో సైనా బాడ్మింటన్ రంగంలోకి దూసుకొచ్చింది. అప్పటికే సానియా మీర్జా యువతరానికి ప్రతీకగా టెన్నిస్ రంగంలో సంచలనం సృష్టిస్తున్నది. డబ్ల్యుటిఎ నుంచి ఉత్తమ కొత్త క్రీడాకారిణిగా అవార్డును స్వీకరించింది. సానియాను పోలిన సైనా పేరును అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. పత్రికల్లో సైనాకు బదులు సానియా అని ప్రచురించిన సందర్భాలే ఎక్కువ. ఐదారేళ్లలో పరిస్థితి మారింది. సైనా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించింది. అంతర్జాతీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ఇప్పుడు మన దేశంలో బాడ్మింటన్‌కు పర్యాయపదంగా మారింది. అర్జున, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న వంటి అవార్డులు ఆమెకు అయాచితంగా లభించలేదు. ఆమె ఎదుగుదల వెనుక నిరంతర కృషి ఉంది. సాధించిన విజయాల వెనుక అంతులేని పరిశ్రమ ఉంది. చెమట చుక్కలు రాలిపడితేనే గెలుపు విత్తనం మొలకెత్తుతుందనే వాస్తవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. తొలినాళ్లలో సైనా అనామిక. నేడు భారత బాడ్మింటన్‌ను అంతా తానై నడిపిస్తున్నది. సచిన్ తెండూల్కర్ లేని క్రికెట్‌ను, సానియా లేని టెన్నిస్‌ను, విశ్వనాథన్ ఆనంద్ లేని చెస్‌ను, సైనా లేని బాడ్మింటన్‌ను ఊహించడం కూడా కష్టమే. హర్యానాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా బాల్యం అక్కడే గడిచింది. డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ సంస్థలో పని చేస్తున్న హర్వీర్ సింగ్ హైదరాబాద్ చేరాడు. సైనా క్రీడాజీవితం హైదరాబాద్‌లోనే మొదలైంది. 1998 డిసెంబర్‌లో, అప్పటి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)లో బాడ్మింటన్ కోచ్ పిఎస్‌ఎస్ నానీ ప్రసాదరావును హర్వీర్ కలిశారు. సైనాను బాడ్మింటన్ క్రీడాకారిణిగా చూడాలన్న తన కోరికను వెల్లడించాడు. హర్వీర్, అతని భార్య ఉషా రాణి స్వయంగా బాడ్మింటన్ క్రీడాకారులే. ఇద్దరూ తమతమ విభాగాల్లో హర్యానా రాష్ట్ర చాంపియనే్ల. వారి నుంచి వారసత్వంగా లభించిన నైపుణ్యాన్ని సైనాలో తొలుత గుర్తించిన వ్యక్తి ప్రసాదరావు. లాల్ బహదూర్ స్టేడియంలో ప్రాక్టీస్. నివాసానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని స్టేడియానికి రోజూ ఉదయం సైనా క్రమం తప్పకుండా వెళ్లేది. ప్రాక్టీస్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లి, హడావుడిగా తయారై స్కూలుకు వెళ్లేది. రోజుకు సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం. ప్రాక్టీస్ ఒకవైపు, చదువు మరోవైపు.. సైనాకు క్షణం కూడా తీరిక లభించేదికాదు. ప్రయాణానికే ఎక్కువ సమయం పట్టడంతో ఎల్‌బి స్టేడియానికి ఆరు కిలోమీటర్ల దూరంలో హర్వీర్ ఇల్లు తీసుకున్నాడు. దీనివల్ల ప్రయాణ భారం కొంత తగ్గిందే తప్ప ఆమె కష్టం ఏమాత్రం తగ్గలేదు. సైనా తొలి గురువు ఆరిఫ్ ఆమెలోని నైపుణ్యాన్ని, పోటీతత్వాన్ని గమనించి, సాయంత్రం కూడా శిక్షణకు హాజరుకావాలని సూచించాడు. సైనా ఉరుకులు పరుగులు రెట్టింపయ్యాయి. తండ్రి వాహనం నడుపుతుంటే, వెనుక కూర్చునే సైనా నిద్రలోకి జారిపోయేది. ఉదయం, సాయంత్రం శిక్షణకు హాజరయ్యేందుకు రోజుకు సుమారు 150 రూపాయలు ఖర్చయ్యేవి. వీటికి తోడు షటిల్స్, ర్యాకెట్లు, షూస్ కొనడానికి అదనపు ఖర్చు. మొత్తం మీద నెలలో సుమారు 12,000 రూపాయలు ఖర్చయ్యేవి. జీతం డబ్బు సరిపోకపోవడంతో భవిష్య నిధి నుంచి సుమారు లక్ష రూపాయల వరకూ తీశాడు హర్వీర్. 2002లో యూనెక్స్ సన్‌రైజ్ స్పాన్సర్‌షిప్ లభించే వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. సైనా సాధిస్తున్న విజయాలను చూసి, ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నమ్మిన బిపిసిఎల్ 2004లో స్పాన్సర్‌షిప్ అందచేసింది. 2005లో మిట్టల్ స్పోర్ట్స్ ట్రస్టు సైనాకు స్పాన్సరర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) నుంచి నెలకు 600 రూపాయల పారితోషికంతో మొదలైన సైనా ప్రస్థానం నేడు భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్న భారత క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించే స్థాయికి చేరింది. విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో, సాధారణ ఖర్చులకు అదనంగా టెలిఫోన్ బిల్లు, ఇరతత్రా ఖర్చులు కూడా చేరేవి. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ముందు నెలకు 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చయ్యేవని హర్వీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, ఆయన ఖర్చులకు ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. ఆర్థిక స్థితిగతుల గురించి సైనాకు చెప్పలేదు. కష్టనష్టాలను తానే భరించారు. సైనా కెరీర్ గ్రాఫ్‌ను తీర్చిదిద్దాడు. మూడు వందలతో మొదలు! సైనా 1999లో తిరుపతిలో జరిగిన రాష్టస్థ్రాయి బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు హాజరై, అండర్-10 విభాగంలో టైటిల్ సాధించింది. అప్పుడు ప్రైజ్‌మనీగా ఆమెకు అందిన మొత్తం మూడు వందల రూపాయలు. ఆ చిన్న మొత్తమే సైనాను ప్రోత్సహించింది. కామనె్వల్త్ యూత్ గేమ్స్‌లో ఒక రజతం (2004/వెండిగో/మిక్స్‌డ్ టీం ఈవెంట్), ఒక స్వర్ణం (2008/పుణే/మహిళల సింగిల్స్), ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో ఒక రజతం (2006/ఇంచియాన్/బాలికల సింగిల్స్), ఒక స్వర్ణం (2008/పుణే/బాలికల సింగిల్స్), కామనె్వల్త్ గేమ్స్‌లో ఒక కాంస్యం (2006/మెల్బోర్న్/ మిక్స్‌డ్ డబుల్స్), ఒక రజతం (2010/న్యూఢిల్లీ/ మిక్స్‌డ్ డబుల్స్), ఒక స్వర్ణం (2010/న్యూఢిల్లీ/మహిళల సింగిల్స్) పతకాలను కైవసం చేసుకుంది. 2014 ఆసియా క్రీడల్లో మహిళల టీం ఈవెంట్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. 2014 ఉబేర్ కప్ టీం ఈవెంట్‌లో కాంస్యాన్ని అందుకుంది. 2010లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో మూడో స్థానాన్ని సంపాదించింది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. తాజాగా జకార్తాలో జరిగిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ పతకాన్ని సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆ పోటీల్లో ఆమెకు కాంస్య పతకం లభించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న ఘనత భారతీయుల్లో ప్రకాష్ పదుకొనే తర్వాత సైనాదే. అంతేగాక, మహిళల విభాగంలో ఈ ఫీట్‌ను సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది. ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను, సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో గెల్చుకున్న తొలి భారతీయురాలుగానూ ఆమె రికార్డు నెలకొల్పింది. జకార్తా (ఇండోనేషియా)లో ఇటీవల జరిగిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో రజత పతకంతో సంచలనం సృష్టించింది. 1983లో ప్రకాష్ పదుకొనే తర్వాత ఈ మెగాటోర్నీలో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప (2011/మహిళల డబుల్స్), పివి సింధు (2013, 2014 సంవత్సరాల్లో మహిళల సింగిల్స్) కాంస్య పతకాలను సాధించారు. భారత్‌కు తొలిసారి రజత పతకాన్ని అందించిన కీర్తి సైనా దక్కించుకుంది. ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపీచంద్, సయ్యద్ మోడీ వంటి దిగ్గజాలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయిన ఫైనల్‌లో స్థానం సైనాను వరించింది. టైటిల్ పోరులో కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, రెండో సెట్‌లో సైనా జరిపిన పోరాటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మొదట్లో ఆమె ఎస్‌ఎం ఆరిఫ్ వద్ద శిష్యరికం చేసింది. పుల్లెల గోపీచంద్ వద్ద సెప్టెంబర్ 2014 వరకూ శిక్షణ తీసుకుంది. సాదాసీదాగా.. ఎన్ని టైటిళ్లు గెలిచినా, ప్రపంచ బాడ్మింటన్‌లో ఎన్ని శిఖరాలను అధిరోహించినా, సాదాసీదాగా ఉండేందుకే సైనా ఇష్టపడుతుంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని నమ్మడమేకాదు.. తు.చ తప్పకుండా పాటిస్తున్నది. ‘ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సాధారణ మధ్యతరగతికి చెందిన వ్యక్తిగా ఉండడమే నాకు ఇష్టం. మాటల కంటే చేతలు ముఖ్యమని నా అభిప్రాయం. హడావుడి చేస్తే తాత్కాలికంగా అందరి దృష్టినీ ఆకర్షించవచ్చేమో! కానీ, దీర్ఘకాలంలో నైపుణ్యమే మనల్ని అందలాలు ఎక్కిస్తుంది. గుర్తింపు తెస్తుంది’ అన్న సైనా మాటలు అక్షర సత్యాలు. స్నేహితులు తక్కువే.. సైనాకు స్నేహితులు చాలా తక్కువ. ఉదయం నుంచి రాత్రి వరకూ తీరికలేని షెడ్యూల్. మొదట పాఠశాల, తర్వాతి కాలంలో కాలేజీకి క్రమం తప్పకుండా వెళ్లే పరిస్థితి లేదు. శిక్షణ, పోటీలు, విదేశీ యాత్రలతో సైనా కాలంతో పరుగులు తీస్తున్నది. అందుకే ఆమె ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోలేకపోయింది. మిత్రులు లేని కొరత బాడ్మింటన్ తీర్చిందని సైనా అంటుంది. ‘నా చిన్నతనం హిస్సార్‌లో గడిచింది. టీనేజర్‌గా హైదరాబాద్ వచ్చాను. ఆ వెంటనే బాడ్మింటన్‌లో శిక్షణ మొదలైంది. బిజీ షెడ్యూల్ వల్ల ఎవరితోనూ స్నేహం చేసే అవకాశమే దక్కలేదు. అయితేనేం, బాడ్మింటన్ నాకు స్నేహితులు లేని లోటును తీర్చింది’ అన్న సైనా మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. విశ్రాంతి కరవు.. సైనా ఒకప్పుడు బాడ్మింటన్‌లో ప్రావీణ్యం కోసం శ్రమించేది. తీరిక లేకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనేది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు బాడ్మింటన్ కోర్టులోనే గడిపేది. వారంలో ఆరు రోజులు ఇలాగే గడిచిపోయేవి. అనుకున్నది సాధించిన తర్వాత, బాధ్యత పెరిగింది. ఒక్కో టైటిల్ ఖాతాలో చేరుతున్న కొద్దీ, దేశానికి ఇంకా ఎక్కువ టైటిళ్లు అందించాలన్న తపన పెరిగింది. ర్యాంకింగ్స్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పట్టుదల రెట్టింపైంది. గతంతో పోలిస్తే ఎక్కువ సేపు ప్రాక్టీస్‌లో గడుపుతున్నది. అభిమానుల అంచనాలకు తగినట్టు ఆడేందుకు కృషి చేసే క్రమంలో సౌకర్యాలను సైతం త్యాగం చేస్తున్నది. సినిమాలు లేవు. షికార్లు లేవు. పార్టీలు అసలే లేవు. మిత్రులతో కాలక్షేపమంటే ఏమిటో తెలియదు. టెన్నిస్ కోర్టు, ప్రాక్టీసు, మ్యాచ్‌లు, టోర్నీలు, పర్యటనలు ఆమె జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విశ్రాంతి కరవైంది. శారీరకంగా అలసిపోతున్నా, మానసికంగా రోజురోజుకూ ఉత్సాహం రెట్టింపవుతున్నది. నిర్మొహమాటం ఏ విషయాన్నయినా సైనా కుండబద్దలు కొట్టినట్టు నిర్మొహమాటంగా చెప్తుంది. చాలాకాలం తనకు కోచ్‌గా ఉన్న గోపీచంద్ ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్న విషయాన్ని గుర్తించిన మరుక్షణమే కోచ్‌ని మార్చేసింది. జాతీయ మాజీ చాంపియన్ విమల్ కుమార్‌ను గురువుగా ఎంచుకుంది. బెంగళూరులో సాధన కొనసాగిస్తున్నది. గోపీతో విభేదాలున్నాయా అని సైనాను ప్రశ్నించని వారులేరు. ఎక్కడికి వెళ్లినా, ఏ ఇంటర్వ్యూకు హాజరైనా పాత్రికేయుల నుంచి మొదట ఇదే ప్రశ్న దూసుకొచ్చేది. విభేదాలు లేవని, అయితే, జాతీయ కోచ్ హోదాలో మిగతా ఆటగాళ్లపైనా దృష్టి కేంద్రీకరించాల్సి రావడంతో, ఎక్కువ సమయాన్ని తనకు కేటాయించలేకపోతున్నాడని సైనా సమాధానం చెప్పింది. అందుకే విమల్ కుమార్‌ను కోచ్‌గా ఎంచుకున్నానని తెలిపింది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకొని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిప్పుడు గోపీ గురించే విలేఖరులు ప్రశ్నించారు. ‘గోపీ వద్దే ఉంటే నా ర్యాంక్ దిగజారిపోయి ఉండేది’ అని ప్రకటించిన తెగువ ఆమెది. గోపీ జాతీయ కోచ్. భారత బాడ్మింటన్ సమాఖ్యమై గట్టిపట్టు ఉంది. అతని ఆగ్రహానికి గురైతే కెరీర్ దెబ్బతింటుందన్న భయం ఎవరికైనా ఉంటుంది. కానీ, సైనా మాత్రం దేనికీ భయపడలేదు. గోపీని వద్దనుకొని, విమల్ కుమార్‌ను కోచ్‌గా ఎంచుకొని ప్రయోగం చేసింది. ఆమె చేసిన ప్రయత్నం ఫలించింది. వర్ధమాన క్రీడాకారులకు సైనానెహ్వాల్ చాలారకాలుగా మార్గదర్శిగా నిలుస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమెలాగో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. ఆటలో సాధించిన ఫలితాలను ఆస్వాదించడమే తప్ప, ప్రవర్తనలో అహంకార ధోరణి కన్పించనివ్వకపోవడం ఆమె ప్రత్యేకత. అనుకున్నది సాధించడంకోసం ప్రయత్నం, పట్టుదల అవసరమని, మానసికంగా దృఢంగా ఉండాలన్నది ఆమె నేర్చుకున్న పాఠం. మనం నేర్వాల్సిన విషయం. అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోగలగడం, వాటిని అమలుచేయగలగడం, ఆ నిర్ణయాల ఫలితాలను రాబట్టుకోవడం సైనా విజయానికి కారణాలు. బ్యాడ్మింటన్ రాకెట్ చేతపట్టిన తొలినాళ్లలో…తొలి పోటీలో కేవలం 300 రూపాయల బహుమతి పొందిన ఆ సైనా…ఇప్పుడు అత్యంత విశిష్టమైన రజతపతకంతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నెంబర్‌వన్ స్థానంలో ఉన్న ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటుందని ఆశిద్దాం. ఆమె గెలుపు తెలుగువారి గెలుపుకదా… ఆ నిర్ణయం జీవితాన్ని మార్చేసింది -సైనా నెహ్వాల్ ‘గెలుస్తాననుకున్న మ్యాచ్ ఓడినప్పుడల్లా కుంగిపోయేదాన్ని. ఇక ఆట మానేద్దాం అన్పించేది. ఒకటే ఆలోచన వేధించేది. గెలుపు సాధించడం ఎలా…ఇదే ప్రశ్న. నిష్ణాతుడైన గోపీచంద్ సారథ్యంలో శిక్షణలో రాటుదేలా…కానీ అసలు సిసలు విజయం దగ్గర విఫలమవడం బాధించేది. ఒకదశలో బ్యాడ్మింటన్‌కు బై చెబుదామనుకున్నా. ఈలోగా ఓ ఆలోచన వచ్చింది. బ్యాడ్మింటన్ దిగ్గజం, భారతజటు మాజీ కోచ్ విమల్‌కుమార్ దగ్గర శిక్షణ పొందాలని, బెంగళూరు మకాం మార్చాలని నిర్ణయించుకున్నా. ఎంతో ఇష్టమైన హైదరాబాద్‌కు, కుటుంబ సభ్యులకు దూరంగా బెంగళూరు వెళ్లడం కష్టమైంది. కానీ కఠిన నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయంలో రాజీపడకూడదని అనుకున్నా. ఇప్పుడనిపిస్తోంది..ఆ నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నదేనని, సరైనదేనని. ఇప్పుడెంతో గర్వంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్ కాలేకపోయానన్న దిగులు లేదు. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భారత్‌లో ఇంతవరకు ఎవ్వరూ సాధించని రజత పతకాన్ని సాధించా. బ్యాడ్మింటన్‌లో మళ్లీ నెంబర్‌వన్‌గా నిలిచా. చాలా గర్వంగా ఉంది. నా ఆటలో లోపమేమిటో విమల్ చెప్పారు. ఆ లోపాన్ని ఎలా సరిచేసుకోవాలో నేర్పారు. మానసికంగా బలంగా ఎలా తయారవ్వాలో సూచించారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, పోటీలో అప్పటికప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తర్ఫీదు ఇచ్చారు. శారీరకంగా దృఢంగా ఉండటమెలాగో శిక్షణ ఇచ్చారు. మొత్తమీద నా ఆటలో మెరుగుదలకోసం విమల్ ఎంతో సమయం వెచ్చించారు. ఇక ఫలితం సాధించడం నా వంతు. విమల్ శిక్షణ తరువాత నేను సాధించిన ఫలితాలు అత్యుత్తమమైనవే. ఇక ఒలింపిక్స్‌లో ఉత్తమ ఆటతీరు ప్రదర్శించడంపై దృష్టిపెట్టా. అంతకముందు ఓటమి ఎదురైనప్పుడల్లా కన్నీరుపెట్టేదాన్ని. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అని ఆలోచించేదాన్ని. విమల్‌జీ దానికి పరిష్కారం చూపారు. ఇక నాకు తిరుగులేకుండాపోయింది. మానసికంగా, శారీరకంగా ఫిట్‌నెస్ ఈ ఆటలో కీలకం అని తెలిసొచ్చింది. ఆటే ఆమెకు సర్వస్వం హర్వీర్‌సింగ్, సైనా తండ్రి ‘సైనా నెహ్వాల్ నా రెండో కూతురు. పెద్దకూతురు పేరు చంద్రాన్షు. నేను, నా భార్య ఉషారాణి హర్యానాలో బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో చాంపియన్లమే. ఆ ఆటే సైనాకు వొంటబట్టింది. ఆమెకు బ్యాడ్మింటన్ అంటే ప్రాణం. నిద్రలేచినప్పటినుంచి పడుకునే వరకు అదే ఆలోచన. ప్రాక్టీస్…పడక…ప్రాక్టీస్…అదే పని. హర్యానా మా స్వస్థలం. ఆయిల్‌సీడ్స్ డైరక్టరేట్‌లో పనిచేసేవాడిని. 1998లో హైదరాబాద్ బదిలీపై వచ్చా. డిఒఆర్‌లో సెక్షన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసేవాడిని. స్థానిక క్వార్టర్స్‌లో నివాసం. అదే ఏడాది లాల్‌బహదూర్ స్టేడియం ఫతేమైదాన్ క్లబ్‌లో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకోసం నిర్వహించిన పరీక్షలో నెగ్గింది. సాయ్ తరపున రూ. 750 స్కాలర్‌షిప్ సాధించింది. ఆమె ఆట తీరు గమనించిన కోచ్‌లు ఎస్‌ఎం ఆరిఫ్, నాని ప్రసాద్, గోవర్దన్ రెడ్డి ఆమెకు ప్రత్యేకశ్రద్ధతో శిక్షణ ఇచ్చారు. 2004లో టెన్త్ పూర్తయింది. మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో సిఇసి చేసి పాసైంది. ఇక టోర్నమెంట్‌ల రద్దీతో చదువుకు బ్రేక్ పడింది. రోజూ ఆరేడు గంటలపాటు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేది. ఈత, జిమ్, సైక్లింగ్, పరుగు, ఫుట్‌బాల్‌వంటి ఆటలతో వ్యాయామం చేసేది. 2004లో గోపీచంద్‌వద్ద శిక్షణ ప్రారంభించింది. దాదాపు పదేళ్లపాటు అక్కడే శిక్షణ కొనసాగింది. ఉత్తమ ఫలితాలు సాధించింది. అప్పుడప్పుడు ఓటమి, తగిన గుర్తింపు రాకపోవడం బాధించేది. కానీ ఇప్పుడవన్నీ గతం. మా కుటుంబం ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. సైనా మా దగ్గర ఉండే సమయం తగ్గినా, ఆమె ఉన్నత శిఖరాలకు చేరడం ఆనందంగా ఉంది. ఆమె ఏ టోర్నీకి వెళ్లినా నా భార్య ఉషారాణి ఆమె వెంట ఉండాల్సిందే. నిజానికి శాకాహారం అంటే సైనాకు ఇష్టం. ఈ మధ్యే అప్పుడప్పుడు కోడిగుడ్లు, బిర్యానీ తింటోంది. ముఖ్యంగా 2006లో చైనా వెళ్లినపుడు అవి తినడం తప్పనిసరైంది. సైనా కెరీర్ ప్రారంభంలో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డా. కానీ అటు హర్యానా, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ఔదార్యంతో ఆదుకున్నాయి. కేంద్రప్రభుత్వమూ గౌరవించింది. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ 19 పతకాలను సైనా నెగ్గింది. ఉద్యోగంలో రిటైర్ అయ్యా. ఆర్థికంగా బలపడ్డాం. హైదరాబాద్ శివారులోని రాయదుర్గంలో సొంత ఇల్లుంది. అంతా హ్యాపీయే. -కాటపల్లి అశోక్‌కుమార్ ముగ్గురు స్టార్లు.. భారత బాడ్మింటన్ రంగంపై ముగ్గురు స్టార్లు తమదైన ముద్ర వేశారు. వారిలో ఆద్యుడు ప్రకాష్ పదుకొనే. అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా పేర్కొనే ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన పదుకొనే కారణంగానే బాడ్మింటన్‌కు మన దేశంలో గుర్తింపు లభించింది. ఈ క్రీడ పట్ల యువకులు ఆకర్షితులు కావడానికి ఆ రోజుల్లో పదుకొనేయే కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించిన తొలి భారతీయుడు కూడా అతనే. పదుకొనే వారసత్వాన్ని కొనసాగించిన ఆటగాడు పుల్లెల గోపీచంద్. తెలుగువాడైన గోపీ బాడ్మింటన్ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక అధ్యాయానే్న లిఖించుకున్నాడు. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను సాధించిన గోపీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా భారత బాడ్మింటన్ రంగానికి సేవలు అందిస్తున్నాడు. హైదరాబాద్‌లో అకాడెమీని నెలకొల్పాడు. చాలాకాలం సైనా అక్కడే శిక్షణ పొందింది. పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, పివి సింధు తదితరులు ఆ అకాడెమీ నుంచే అంతర్జాతీయ వేదికపైకి దూసుకొచ్చారు. అకాడెమీ నిర్వాహకుడిగానేగాక, జాతీయ బాడ్మింటన్ కోచ్‌గా గోపీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పదుకొనే, గోపీ నెలకొల్పిన ప్రమాణాలను సైనా ముందుకు తీసుకెళుతున్నది. ఇది కచ్చితంగా సైనా శకమే. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించిన సైనా, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనూ రన్నరప్ ట్రోఫీని సాధించి, భారత్ తరఫున కొత్త అధ్యాయానికి తెరతీసింది. ప్రపంచ నంబర్ వన్ స్థానానికి ఎదిగిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ర్యాంకింగ్ శాశ్వతం కాకపోవచ్చు. కొన్ని రోజుల తేడాలోనే మారిపోవచ్చు. కానీ, చైనా, ఇండోనేషియా, దక్షిణ కొరియా వంటి దేశాల ఆధిపత్యానికి గండి కొట్టడం సామాన్యమైన విషయం కాదు. ఈ ఘనతను సాధించిన సైనా ప్రతిభను వర్ణించడానికి సరైన మాటలు లేవు. ఎంత చెప్పినా, ఎన్ని విశేషణాలను జోడించినా తక్కువే అవుతుంది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.