గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
సాహితీ బంధువులకు నమస్కారాలు .’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’(3)మూడవ భాగం ఈ రోజే ప్రారంభంచాను .ఇందులో మన తెలుగు కవుల సంస్కృత రచనల గురించి వివరిస్తాను . ఈ వ్యాస పరంపరను ‘’ఉభయ భారతి ‘’బిరుదాంకితులు ,సంస్కృత శతావధానం చేసి అందరిని ‘’అచ్చెరువు’’లో ముంచిన డా .శ్రీ చెరువు సత్యనారాయణశాస్త్రి గారి తో ప్రారంభిస్తున్నాను .
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-1
జనన విద్యాభ్యాసాలు
శ్రీ చెరువు శేషయ్యశాస్త్రి ,శ్రీమతి లక్ష్మి దంపతులకు సత్యనారాయణ శాస్స్త్రి గారు 7-9-1943లో జన్మించారు .మాతామహులు ,సుప్రసిద్ధ కవి పండితులు ,రుషి కల్పులు మంత్ర వేత్త, వశ్యవాక్కు, కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీన్ద్రులవారికి అతి సన్నిహితులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ఇంటనే బాల్యం గడిచింది .ఆరవ ఏటనే సంస్కృ తపంచ కావ్య పఠనం ప్రారభమై ,పడవ ఏట నైషద కావ్యాన్ని అవపోశన పట్టారు .వ్యాకరణ సిద్ధాంత కౌముది ,వేదాంత పంచదశి ,నాటకాలంకార సాహిత్యాధ్యయనం పూర్తిచేశారు .మెట్రిక్ పరీక్ష లో ఉత్తీర్ణులై ,ప్రవేశ పరీక్ష రాసి ,వ్యాకరణ విద్యా ప్రవీణ ,సాహిత్య విద్యా ప్రవీణ ,భాషా ప్రవీణ సాధించి ,సంస్కృతం లో ఏం ఏ .పట్టా పొందారు .1989 మే నెలలో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ‘’సంస్కృత మాఘ కావ్యం –ఆంధ్రీక్రుతులు’’ –అను శీలనం పై సిద్ధాంత వ్యాసం రాసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ సాధించారు .
ఉద్యోగ సోపానం
తెనాలి హయ్యర్ సెకండరీ స్కూల్ ,లో సంస్కృత ఉపాధ్యాయులుగా ఉద్యోగం ప్రారంభించారు .తరువాత తాడికొండ సంస్కృత కళాశాల ప్రదానాచార్యులుగా , గుంటూరు సంస్కృత కళాశాల అధ్యాపకులుగా చేసి, ఒంగోలు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి చేశారు .తణుకు బాలసరస్వతీ సమాజ ప్రాచ్య కళాశాల ప్రదానాచార్యు లుగా పదవీ విరమణ చేశారు .శ్రీమతి లక్ష్మిని వివాహమాడారు .
వరించిన పదవులు
ఆంద్ర విశ్వ విద్యాలయం స్టడీస్ బోర్డ్,ఎక్సామినర్స్ బోర్డ్ ల చైర్మన్ గా ,ఇతర విశ్వ విద్యాలయ స్టడీస్ బోర్డ్ సభ్యులుగా ,ప్రశ్న పత్ర నిర్ణాయక సంఘ సభ్యులుగా శాస్త్రి గారి విద్వత్ కు తగిన పదవులు లభించాయి .ఆంద్ర ప్రదేశ్ ఓరియెంటల్ కళాశాల అధ్యాపక కార్య దర్శిగా ,కలకత్తాలోని నిఖిల భారత సంస్కృత సమితి కి అఖిలభారత కేంద్ర సంఘానికి ఉపాధ్యాధ్యక్షులుగా సేవలు అందించారు .చెరువు వారి సంస్కృత భాషా వైదు ష్యానికి అచ్చెరువు నొంది లక్నో భారతీయ సంస్కృత సమ్మేళనం కార్యవర్గ సభ్యులను చేసింది .ఆంద్ర ప్రదేశ ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ ,ఆలిండియా ఓరిఎంటల్ కాన్ఫరెస్స్ సభ్యులుగా కొనసాగారు .సజ్జాపురం లయన్స్ క్లబ్ సభ్యులై ,తణుకుపట్టణం లోని ‘’నన్నయ భట్టారక పీఠం ‘’కార్య దర్శి పదవిని అలంకరించారు .వీరి సాహిత్య వరివస్య (సేవ ఉపాసన ),అపారం .
కవితా సామర్ధ్యం
ఏడవ ఏట నుండే చెరువువారు సంస్కృతాంధ్రాలలో శ్లోకాలు ,పద్యాలు రాయటం ప్రారంభించారు .లెక్కకు మించి శ్లోకాలు ,పద్యాలు రాసిన పుంభావ సరస్వతులు శాస్త్రి గారు .వారి నల్లని గుబురు మీసం సంస్కృత ,తెలుగు కవిత్వానికి ప్రతీక .అనేక కావ్యాలు రాశారు వాటిలో మూడే ముద్రితమైన ఖండకావ్యాలు .
రాశారు వాటిలో మూడే ముద్రితమైన ఖండకావ్యాలు .అముద్రితాలు చాలా ఉన్నాయి .నండూరి వారి ఎంకి లాగా శాస్త్రిగారు గ్రామ్య భాష పరిమళాలనద్దుతూ ‘’సుబ్బ లచ్మి’’ శతకం రాశారు .సంస్కృతం లో ఎంతప్రతిభ చూపారో ఇందులోనూ తన జానపద కవితా వైదుష్యం చూపించారు శాస్త్రిగారు .చెరువువారి ఈ కృతీ అచ్చెరువే కలిగిస్తుంది .మచ్చుకొక పద్యం
‘’సల్లా సల్లని సూపు సూసి దయతో సాకేవు నా సామి ,ఈ
పిల్లే లచ్చిమి నాగ నున్నది ,ననున్ పెమించేనా సామి ,జ
న్మల్లా దానికి నీదు నామముతో నోరార బిలుస్తాను రా
సల్లా ఎంకటిసుబ్బ లచ్చి బతుకేలా నీవు లేకు౦డినన్’’
చెరువువారి ఈక్రుతికి ముచ్చటపడి రిటైర్డ్ సబ్ జడ్జి శ్రీ గాడేపల్లి సీతారామ శాస్త్రి గారు ‘’చెరువు వారి సత్తి బాబు పావు శతకం ‘’(నక్షత్రమాల )అదే బాణీలో రాసి తన గురుభక్తిని చాటుకున్నారు .గాడేపల్లివారి పద్యం లో పావువంతు రుచి చూపిస్తా చూడండి –
‘’గుంటా ఎల్దమెగడ్డి కంటివి ,బలేగున్నాది నీ ఎత్తు,ఏం
ఒంటో తిమ్మిరి గున్న దేంది?అరె ,మంచోడంటే ఊర్లోని వా
రెంటే తిర్గిరి నమ్మకంతొ చెయి మీదేశావొ దుల్పేస్త బా
గుంటే బాగనె ఉంట చెయ్యి పడితే ఊర్కొంటనా? రాను పో !
చెరువువారి కావ్య పరీమళం ఎన్నదగినది .పది ,పన్నెండేళ్ళ వయసులో ‘’గజేంద్ర మోక్షం ‘’రాశారు .అందులో పోతన గారి ‘’అల వైకుంఠపురంబు లో ‘’జోలికి పోలేదు .పదిహేనవ ఏట ‘’ఉమా కల్యాణం ‘’రాశారు అవధానులు కండగల కవిత్వం చెప్పలేరు అనే మాట లోకం లో ఉంది .ఇది నిజం కాదని శాస్త్రి గారు రుజువు చేశారు . దండిమహాకవి ‘’దశ కుమారచరిత్ర ‘’ను శాస్త్రిగారు ‘’శ్రీ రాజవాహన విజయ’’కావ్యం గా రాసి తన కవితా ప్రతిభను నిరూపించారు .కండగల కవిత్వం ఇందులో పొంగి ప్రవహించింది .1960లో ‘’విప్ర లబ్ధ ‘’అనే కల్పిత కదా కావ్యం రాశారు .ఇది జయ దేవమహాకవి’’ గీత గోవిందం ‘’కు తెలుగు పద్యమాల .రస భరితం కావ్య పరీమళ భరితంగా రాశారు .దీన్ని సుమారు పదిహేడవ ఏటనే రచించారు .19వ ఏట ‘’శ్రీ సుందరేశ్వర విలాసం ‘’రాసి బాణుని కాదంబరి ,సూరనార్యుని కళాపూర్ణోదయం లలో ఉన్నట్లు మూడు జన్మల వృత్తాంతాన్ని అతి శక్తి మంత౦గా ప్రబంధ శైలిలో ,నిర్ఝర కవితా ధారగా రాశారు .’’దేవీ మహాత్మ్యం ‘’ను శివ లీలా విలాసంగా దివ్య ప్రబంధంగా రచిస్తే ,,భక్తీ జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమం లా ‘’శృంగార కైవల్యం ‘’రచించారు. ఇది చెరువువారి అపూర్వ సృష్టి .ఇవికాక శాస్త్రిగారు ‘’పార్వతీ శతకం ,ప్రతికాదంబరి ,కళా మంజరి ,యాతనా శతకం ,సంస్కృత శ్లోకానువాదాలు ,మదన విజయం అనే సాహిత్య రూపకం ,,అనామిక ,సత్యం శివం సుందరం ,ప్రాస్తానిక పద్య సముదాయం ,పద్యమాలికలు రచింఛి శాస్త్రి గారు ‘’కవితా కాసారం (చెరువు ) అని అనిపించారు .
సంస్కృతాంధ్రాలలో అలవోకగా అష్టావధానాలు చేయగల నేర్పు ఉన్నవారు శాస్త్రిగారు .తెలుగులో 125అష్టావధానాలు ,సంస్కృతం లో 25అష్టావధానాలు చేసిన నేర్పరి .పూనా విశ్వ విద్యాలయ సంస్కృత విభాగం లో శాస్త్రి గారు చేసిన సంస్కృత అష్టావధానం అక్కడి పండితులను పరవశింప జేసింది . తణుకులో’’ శ్రీ నారాయణ భగవత్పాద సరస్వతీసాహిత్య సంస్థ ‘’అభ్యర్ధన మేరకు శాస్త్రిగారు 1996ఏప్రిల్ 5,6,7 తేదీలలో ‘’సంపూర్ణ సంస్కృత శతావధానం ‘’చేసి పండిత ప్రకాండుల, సాహిత్యాబిమానుల ప్రసంశలనందుకొన్నారు .ఇది ఆంద్ర దేశం లో రెండవ సంపూర్ణ సంస్కృత శతావధానం .’దీనిని శ్రీ నోరి భోగేశ్వర శర్మ గారి విశ్లేషణ వివరాలతో ‘’డా చెరువుసత్యనారాయణ శాస్త్రి సంస్కృత శతావధానం ‘’గా ముద్రించి అందజేశారు .’
అందజేశారు .’భువన విజయం ‘’లో వీరు ఎన్నో పాత్రలు పోషించి మెప్పు పొందారు .శాస్త్రి గారి ధారణా శక్తి అతి రాక్షసం .అబ్బురమనిపిస్తుంది .
విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం నుండి శాస్త్రిగారు ఎన్నో సారస్వత ప్రసంగాలు చేశారు ,కధానికలు వినిపించారు ‘’.ధాత ఉగాది’’ కవి సమ్మేళనలో ప్రధాన ఆకర్షణ గా నిలిచారు . .ప్రసిద్ధకవుల గ్రంధాలకు విలువైన పీఠికలను సంతరించారు. వర్దిష్ణులైన యువకవులను అమృతోపమానమైన ఆశీస్సులతో ప్రోత్స హించారు .
బిరుదులు –సన్మానాలు
సత్యనారాయణ శాస్త్రిగారి ఆంద్ర గీర్వాణ పాండిత్య కవిత్వాలకు తగిన గుర్తింపు లభించింది.విద్వత్ కు తగిన బిరుదాలను అందుకొన్నారు .చోడవరం ప్రసన్న భారతి వారు 26-1-81న’’అవధాన వాచస్పతి ‘’బిరుదునిచ్చి సత్కరించింది .మచిలీపట్నం లో గ్రంధాలయ వార్షికోత్సవ సందర్భం గా 16-11-86 న’’అవధాన శిరోమణి ‘’బిరుదుతో ప్రశంసించి సన్మానించింది .హైదరాబాద్ ఆంద్ర ప్రదేశ్ కళావేదిక ‘’విద్యా వాచస్పతి ‘’అందజేసి నిచ్చి ,ఘనంగా సత్కరించింది .’’ఉభయ భారతి ‘’గా శాస్త్రి గారు సుప్రసిద్ధులు .
ఆంద్ర విశ్వ విద్యాలయం సత్యనారాయణ శాస్త్రి గారికి ‘’డాక్టరేట్ ‘’ను ప్రసాదించిన సందర్భం గా సజ్జాపురం లయన్స్ క్లబ్ వారు ఘన సన్మానం చేశారు .24-5-89 న తణుకు రోటరీ క్లబ్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిచే అభినందన సత్కారాన్ని న భూతో గా నిర్వహించింది .శాస్త్రిగారు ఎన్నో సాహిత్య సభలకు అధ్యక్షులుగా ,నిర్వాహకులుగా ,అవధాన సంచాలకులుగా ,సమన్వయ కర్తగా ,వ్యాఖ్యాతగా వ్యవహరింఛి తమ సమర్ధతను చాటారు .
జీవితావదాన సమాప్తం
ఇంత లబ్ధ ప్రతిస్టులైన గీర్వాణాంధ్ర కవి పు౦గ వులైన డా. శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ‘’దివిజ కవి వరుల గుండియల్ దిగ్గురనగ యాభై మూడు ఏళ్ళకే ‘’14-11-1996 శ్రీధాతృ నామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్ధి గురువారం ఉదయం అశేష సాహితీ ప్రియులను బంధు మిత్రులను అనంత శోక సాగరాన ముంచి అమరపురికేగారు .
శాస్త్రి గారి తణుకు సంస్కృత శతావధానం ఒక గొప్ప అను భూతి ,ముచ్చట ..దానిని గురించి ప్రత్యేకం గా రాయాల్సిందే .రెండవ భాగం లో దాని వివరణలు రాస్తాను .
శ్రీ శాస్త్రి దంపతుల ఫోటో జత చేశాను చూడండి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-15-ఉయ్యూరు