ఎందుకు పడినట్లా వెలుగు మరక?

ఎందుకు పడినట్లా వెలుగు మరక?
Updated :07-09-2015 00:39:49
బైరాగి సంశయాత్మకతే అతడిని ‘మాస్టర్స్‌ ఆఫ్‌ సస్పిషన్‌’ గా పిలువబడే ఫ్రాయిడ్‌, మార్క్స్‌, నీషేల త్రోవన నడిపించింది. ఇన్నేళ్ళు గడిచాక కూడా బైరాగి ఈ తరం పాఠకులలో కూడా ఆసక్తి కలిగించడానికి ఈ సంశయాత్మకతే కారణం. బైరాగి తాత్త్విక మూలాలు అస్తిత్వవాదం లో ఉన్నాయి. అది కూడా కీర్క్‌ గార్డ్‌, దోస్తయెవ్‌స్కీల అస్తిత్వవాదం. వేదన ద్వారా మాత్రమే ఒక దివ్యస్ఫురణకు పాత్రులం కాగలమనేది ఈ మార్గంలోని ముఖ్యాంశం. ఇది సార్ర్త్‌, హైడెగ్గర్‌, హుస్సెర్ల్‌ వంటి వారి అస్తిత్వవాదం కన్నా భిన్నమైనది.
‘ప్రేమను కనుగొనటం లాగా, సముద్రాన్ని కనుగొనటంలాగా దోస్తెయెవ్‌స్కిని కనుగొనటం జీవితంలో ఒక ముఖ్య ఘట్టం’ అని హోర్హె లూయీ బొర్హెస్‌ ఒక వ్యాసంలో అంటాడు. ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ నవలలో చిత్రితమైన రాస్కల్నికోవ్‌ అవస్థ మొత్తాన్నీ ‘త్రోవ ఎక్కడ సోనియా!’ అన్న ఒక్క కవితావాక్యంతో సూచించిన కవి బైరాగిని కనుగొనడం కూడా అటువంటి ముఖ్యఘట్టమే. అప్పటిదాకా అనుభవిస్తూ వచ్చిన ‘నీరస తథ్యాల’ సుఖాలు మనవి కాకుండా పోవచ్చు. బైరాగిని రెండు కోణాలనుంచి లోతుగా చర్చించవలసి ఉంది. ఒకటి- సాహిత్య చరిత్ర, రెండు- తాత్త్విక చింతన. సాహిత్య చరిత్ర కొన్ని అనుక్రమాల్ని తయారు చేసి పెట్టుకుంటుంది. తన పరిధికవతల ఉన్న అన్ని సవాళ్ళని, వైపరీత్యాల్ని చదును చేసివేస్తుంది. ప్రత్యేకించి, తెలుగు సాహిత్య చరిత్ర మనకు మన సాహిత్యాన్ని గురించి ఒక అతి సరళ కథనాన్ని వినిపిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు విస్మరణకు గురైన రాజకీయ-సామాజిక సమూహాలు దీన్ని విమర్శకు పెడుతూ కొత్త చేర్పులకు దోహదం చేస్తూనే ఉన్నాయి. ఈ సమూహాలకు చెందకుండా ‘విడిగా, పెడగా’ నిల్చున్న రచయితల్ని సాహిత్యచరిత్ర తను నిర్మించుకున్న చట్రాల్లోనే బలవంతంగా ఇరికిస్తుంది. ఆమేరకు, ఆయా రచయితల సాహిత్యకృషిని అర్థం చేసుకోవడానికి అవసరమైన విమర్శనా పద్ధతుల్ని అన్వేషించాల్సిన బాధ్యతనుండి తప్పించుకుంటుంది. పైగా, ఇటువంటి బాధ్యతను కనీసం గుర్తించనైనా గుర్తించదు.
ప్రస్తుత సమస్యని తులనాత్మక సాహిత్య దృక్పథం తో సమీపించవచ్చు. కన్నడ సాహిత్యం లో ‘నవోదయ’ ఉద్యమం మన భావకవిత్వంతో పోల్చదగిందే అయినా, ఆ తరువాత వచ్చిన ‘నవ్య’ సాహిత్యోద్యమం మన అభ్యుదయోద్యమం కన్నా భిన్నమైనది. ‘నవ్య’ సాహిత్యం అభ్యుదయ లక్షణాలు కలిగివుండటంతో పాటుగా అభ్యుదయాదర్శాల్ని, ఆధునికతనీ కూడా విమర్శించింది. హిందీలో కూడా ఛాయావాదం, ప్రగతివాదం రెంటినీ తిరస్కరిస్తూ నయీ కహాని (నవీన కథ), నయీ కవిత (నవీన కవిత) వచ్చాయి. గోపాలకృష్ణ అడిగ, ముక్తిబోధ్‌, బి.ఎ్‌స.మర్ధేకర్‌, అయ్యప్ప పణ్ణిక్కర్‌ల కవిత్వాన్ని గాని, రామచంద్ర శర్మ, యు.ఆర్‌.అనంతమూర్తి, నిర్మల్‌ వర్మ, ఓ.వి.విజయన్‌ ల కథల్ని గాని అభ్యుదయవాద/ప్రగతిశీల రచనలనలేము. అలాగే, శ్రీశ్రీ ’చరమ రాత్రి’ కథల్లో కూడా ఆధునిక అనుభవాల్ని వాస్తవికవాద పద్ధతిలోకాక కొత్త శైలీవిశేషాలతో (ఉదాహరణకి, ‘డ్రమాటిక్‌ మోనోలోగ్‌’, ‘మెటాఫిక్షన్‌’) వ్యాఖ్యానించడం కనిపిస్తుంది.
బైరాగిని అభ్యుదయ కవి అనడమూ, అభ్యుదయ వ్యతిరేక కవి అనడమూ రెండు తప్పే. ఆయనను సాహిత్య పరంపరలో స్థాపించడానికి ‘ఆధునికవాదం’ (మోడర్నిజం) అన్న చట్రం ఉపయుక్తమూ, ఉచితమూ కూడా. ఇది యురోపియన్‌ సాహిత్యచరిత్రలలో నుంచి తీసుకున్న మాటే అయినా కొన్ని మార్పులతో భారతీయ సాహిత్య సందర్భానికీ అన్వయిస్తుంది. ఆధునికవాదం మానవాత్మ ‘ఊసర క్షేత్రంగా’ మారడాన్ని చిత్రిస్తుంది. ఆధునిక జీవితం మనిషిని ఎన్ని విధాలుగా అమానవీకరణకు (డీహ్యుమనైజేషన్‌), పరాయీకరణ (ఏలియనేషన్‌)కు గురిచేస్తోందో గుర్తించడం స్థూలంగా ఆధునికవాద సాహిత్య ముఖ్యలక్షణం. ఆధునికత మీద విమర్శగా ఆధునికవాదాన్ని అర్థం చేసుకోవలసివుంటుంది. వీటితో పాటు, బైరాగి రచనల్లో మరికొన్ని ప్రత్యేక గుణాలున్నాయి.

బుద్ధికీ, హృదయానికి మధ్య కృత్రిమ వైరుధ్యాన్ని బైరాగి కవిత్వం నిరాకరిస్తుంది. ‘డిస్కర్సివిటి’ని శిల్పవిశేషంగా చేసుకుని కావ్యం నిర్మించడం, అది కావ్యత్వానికి భంగం కలిగించకపోవడం ‘నూతిలో గొంతుకలు’ లోని విశిష్టత. అందుకే, రాచమల్లు రామచంద్రారెడ్డి అంటారు- ‘నూతిలో గొంతుకలు తెలుగు కవిత్వంలోని ఏకైక తాత్త్విక కావ్యం. అందులోని సిద్ధాంతాలు, తాత్త్విక సూత్రాలు, మానవ హృదయాంతరాళంలోని గాఢమైన ఆరాటం నుండి, తపన నుండి ఉద్భవిస్తాయి. జిజ్ఞాసువు హృదయంలోని తపన, అన్వేషకుని గుండెలోని ఆర్తి -అవే తాత్త్విక చర్చల రూపం ధరిస్తాయి. అందుకే అది (సిద్ధాంతపు మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా) తెలుగు సాహిత్యంలో ఒక అపురూప కావ్యమయింది.’’ (సారస్వత వివేచన, 1976, పు.56) అలాగే బైరాగి ప్రేమకవితల్లో కూడా ‘ప్రణయం’ అనే భావన వెనుక దాగున్న అంతర్గత కల్పనల్ని విశ్లేషిస్తారు. ప్రేమ నెపంగా శాశ్వతం/నశ్వరం, యౌవనం/వృద్ధాప్యం, సౌందర్యం/విరూపం వంటి ద్వంద్వాల్ని అస్థిరం చేయడం ఈ ప్రేమకవితల వైశిష్ట్యం.

ఒక సాహిత్యకృతిని ఇతర సాహిత్యకృతుల స్ఫురణలతో, వాసనలతో ప్రయత్నపూర్వకంగా నిర్మించడాన్ని Intertextuality అని అంటారు. బైరాగి కవిత్వంలో ‘ఇంటర్టెక్స్టువాలిటి’ ఒక ప్రత్యేక, ప్రధాన నిర్మాణ వ్యూహం. అది ప్రస్ఫుటంగా ‘నూతిలో గొంతుకలు’ లోని మూడు ‘స్వగతాలలోనూ’, ప్రచ్ఛన్నంగా ‘ఆగమగీతి’లోని చాల కవితలలోనూ కనిపిస్తుంది. ‘దివ్యభవనం’ కథాసంపుటిలోని ‘ఒక గంట జీవితం’ కథనైతే బైరాగి వివిధ సాహిత్యకృతులనుంచి తీసుకున్న ఉటంకింపుల అల్లికగా (Roland Barthes అన్నట్టు tissue quotations గా) ‘క్యూరేట్‌’ చేసాడని చెప్పవచ్చు. హామ్లెట్‌ నాటకాన్ని, భగవద్గీతనీ, క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌ని ఎంచుకుని, కావ్యప్రణాళికలో ఒక క్రమంలో అమర్చడం, ఈ మూలకృతులను చదివే దృష్టికోణాల్లో సైతం మౌలికమైన మార్పుకు దోహదం చేసేదిగా ఉంది. సాహిత్యాన్ని సాహిత్య విమర్శగా, ప్రశంసగా సృజించిన కవి బైరాగి.
బైరాగి కావ్యజగత్తులో ప్రతి ఎత్తుగడలోనూ, ప్రతి చలనంలోనూ నీడల్లా వెన్నాడే భావనలు కొన్ని ఉన్నాయి. ఒకటి, అనిత్యత. ఈ అనిత్యతని సూచించేందుకు ‘పద్మపత్రమివాంభసా’, ‘స్మృతి పటలపు సౌదామిని’ వంటి పదచిత్రాలు వేరువేరు రూపాల్లో ‘వేరియేషన్స్‌ ఆన్‌ ఎ థీమ్‌’ లాగా అనేక కవితల్లో దర్శనమిస్తాయి. (దేశం,కాలం) గడచిపోవటం, మాసిపోవటం, అందకపోవటం, ఓడిపోవటం కవిత్వవిషయమవ్వడం అనే ఆధునికవాద లక్షణం బైరాగి కవితలన్నిటా కనిపిస్తుంది. ఆధునికవాదులైన వర్జీనియా వుల్ఫ్‌, జాయిస్‌, ఇలియట్‌ వారి రచనల్లో ‘క్షణాలకు’ ప్రాధాన్యతనిస్తారు. బైరాగి ‘త్రిశంకు స్వర్గం’ అనే దీర్ఘకవితలోని, ‘చావు పుట్టుకల బ్రతుకుల విషమబాహు త్రిభుజంలో/మధ్యనున్న ఒక అదృశ్యబిందువులా/ ఘనీభూత వాస్తవ కేంద్రీకరణం, ఒక్క క్షణం!’ వంటి పంక్తుల్లో ఇటువంటి సాక్షాత్కార క్షణాలు (‘ఎపిఫనిక్‌ మొమెంట్స్‌’) మాత్రమే ‘మనుష్యుని దేవతుల్యుణ్ణిగా’ చేయగలవనే విశ్వాసం కనిపిస్తుంది. ఇక మరొక భావన, మృత్యువు. బైరాగి కవితల్లో మృత్యువు కామరూపి. మృత్యువు (బైరాగి వాడే పదం ‘మిత్తవ’) మంత్రసానిగా, నర్తకిగా, మహాఫణి గా జీవితపు ప్రతి మలుపులో పొంచి ఉపహసిస్తుంది. ’పాప పోయింది’ నవలలో అధికభాగం మృత్యువు గురించిన సువిస్తారమైన తాత్త్విక వివేచనే.

వాడ్రేవు చినవీరభద్రుడు బైరాగి గురించిన ఒక విమర్శా వ్యాసంలో అన్నట్టుగా, ‘బైరాగిని మనకు దగ్గర చేసేది అతడి సందేహాలే’. ఆధునికత, ఆధునిక విజ్ఞానశాసా్త్రలు, హేతువు మనిషిని విముక్తుణ్ణి చేయగలవని వికాసయుగం నమ్మకం. వికాసయుగపు విలువలనే కాక, అన్ని విలువల్ని పునర్మూల్యాంకనం చేయవలసి ఉంటుందని నీషే ప్రతిపాదించాడు. అభ్యుదయ కవికి ఈ స్పృహ ఉండదు. అతడికి బైరాగే అన్నట్టుగా సౌందర్యంలో విరూపాన్ని, విరూపంలో సౌందర్యాన్ని చూడగలిగే సామర్థ్యం లేదు. బైరాగి సంశయాత్మకతే (దీన్ని బైరాగి వైయక్తిక స్వభావంగా కాక అతడి కావ్యస్వభావంగా చూడాలి) అతడిని ‘మాస్టర్స్‌ ఆఫ్‌ సస్పిషన్‌’ గా పిలువబడే ఫ్రాయిడ్‌, మార్క్స్‌, నీషేల త్రోవన నడిపించింది. ఇన్నేళ్ళు గడిచాక కూడా, బైరాగి ఈ తరం పాఠకులలో కూడా ఆసక్తి కలిగించడానికి ఈ సంశయాత్మకతే కారణం. ఇక, బైరాగి తాత్త్విక మూలాలు అస్తిత్వవాదం (ఎక్సిస్టెన్షలిజం) లో ఉన్నాయనవచ్చు. అది కూడా కీర్క్‌ గార్డ్‌, దోస్తయెవ్‌స్కీల అస్తిత్వవాదం. వేదన ద్వారా మాత్రమే ఒక దివ్యస్ఫురణకు పాత్రులం కాగలమనేది ఈ మార్గంలోని ముఖ్యాంశం. ఇది సార్ర్త్‌, హైడెగ్గర్‌, హుస్సెర్ల్‌ వంటి వారి అస్తిత్వవాదం కన్నా భిన్నమైనది. ‘ఎర్రక్రీస్తు’, ‘రెండు క్రిస్మస్‌ గీతాలు’, ‘కామ్రేడ్‌ రాయ్‌ స్మృత్యర్థం’ లాంటి ఆధ్యాత్మిక అనుభవాల గాఢతని చిత్రించే కవితల్లో విశ్వసనీయత, తాదాత్మ్యం బైరాగి లోని దివ్యశ్రద్ధ – సందేహాల కలయికవల్లే సాధ్యమయ్యాయనిపిస్తుంది. ‘నమ్మిక లేని తరంవారు’ అని ఆయన అంటున్నప్పుడు, అది ఏకకాలం లో ఆశనీ, నిస్పృహని సూచించే వాక్యం అని గమనించాల్సివుంటుంది.

బైరాగి సంభావ్యతల కవి. మన దృష్టి, పఠనం, అనుభవం విశాలమయ్యే కొలదీ కొత్త అర్థాలతో మనల్ని తిరిగి తన రంగుల తోటలోకి లాక్కుపోయే కవి. ‘అప్రసవిత ప్రసవాలను, అసంభవ నవలభవాలను పిలుస్తాను’ అన్న కవిని, ‘నేను వ్రాసిన కవితల కన్నా వ్రాయదలచి వ్రాయనివే అందమైనవి’ అన్న కవిని ఆయన వ్రాసిన కవితల ‘నైశ్శబ్ద్యాలలో’ దాగున్న సంభావ్య కావ్యాల్లోనే వెతుకవలసివుంటుంది. ఆయన ‘సూక్ష్మశ్రవణుడు’ (బిరుదురాజు రామరాజు గారి మాట). బైరాగి కవిత్వానికి మరింత చేరువవ్వడానికి మనం ‘జాగ్రత్తగా ఆలించే’ విద్యని సాధన చేయవలసి ఉంటుంది.
ఆదిత్య కొర్రపాటి
8978863234
(సెప్టెంబరు 5 ఆలూరి బైరాగి 90వ జయంతి. 9వ తేదీన వర్థంతి)
తస్మాత్‌ జాగ్రత్త
Updated :07-09-2015 00:43:29
ఒక అప్రకటిత నిషేధాజ్ఞ
ఇక ఎప్పుడూ నీ కనురెప్పల
నీడ కింద నీడలా మెదులుతుంది
అదృశ్య ఆంక్షల ఇనప వలల విసురు శబ్దాలు
ఎప్పుడూ నీ దేహం లోలోపలి చెవుల్లో అలజడి సృష్టిస్తాయి
నీ అక్షరాలమీద నీ కలమే
నిఘా కన్ను వేస్తుంది
కాళ్ళూ చేతులూ కళ్ళూ చెవులూ
కనపడని తాళాలు మోసుకుంటూ కదులుతాయి
అంతా ఎప్పట్లానే వుంటుంది కానీ
స్వేచ్ఛగా నీ గుండె ఊపిరి పీల్చుకునేప్పుడు మాత్రమే
శ్వాసనాళంలో ఓ చూపుడు వేలు అడ్డు తగులుతుంది
నీతికీ అవినీతికీ కొత్త నిర్వచనాల
నిఘంటువుల తయారీ మొదలవుతుంది
ఇక అంతా మోరల్‌ పోలీసింగ్‌
పద్మవ్యూహాల కత్తుల పంజరాలే
వేలాడదీయండి…
మీ కలలకైనా..
కనుచూపులు ముడిపడే మునిమాపులకైనా
తూర్పును చెక్కే వెలుగు ఉలులకైనా
రాత్రిని పాడే అక్షరాల అలలకైనా
ఎక్కడైనా సరే వేలాడాల్సింది
సంస్కృతీ సంప్రదాయాల శిలాఫలకాలు మాత్రమే
ఇక భయం కూడా
ఒకానొక అవ్యక్త సుషుప్త నిశీధి నిశ్శబ్దంలో
భయం భయంగా ముడుచుకుపోవాల్సిందే
ఉన్నట్టుండి నీలో దేశభక్తి లబ్‌ డబ్‌ శబ్దాలు
కనపడని నియంత్రణ రేఖల దగ్గర నెత్తురు కక్కుకుంటాయి
వస్త్రాలనే కాదు చర్మాలను చీల్చి కూడా
నీలో లౌకికత్వానికి డిఎన్‌ఏ పరీక్షలు సాగుతాయి
నీ చుట్టూ నీ ఆలోచనల కంచె నీచేతే వేయించి
చేను మేసిన నేరారోపణ నీమీదే మోపి
నిన్ను చూసి నువ్వే నవ్వుకునే ఏడ్చుకునే
నీ నుండి నువ్వే పారిపోయే పరిస్థితులు కల్పించి
నీ పక్కనుంచే ఓ గాలి దెయ్యం కదిలిపోతుంది
వాసన.. వాసన..
పురా సంస్కృతి సురావాసన
మిత్రులారా
ఇక జాగ్రత్త
ఇక్కడ దేశం ఉంది
దేశమంటే మనుషులు కాదోయ్‌ మతమోయ్‌!

ప్రసాదమూర్తి
8498004488
తెలంగాణ విమోచనోద్యమంలో కాళోజీ కవిత్వం
Updated :07-09-2015 00:31:46
‘పుటక చావులు మాత్రమే తనవి – బతుకంతా దేశానిది’గా బతికిన పద్మవిభూషణుడు కాళోజీ నారాయణరావు. తెలంగాణ విమోచనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని, జైలు శిక్షను అనుభవించి రాటుదేలిన ప్రజాకవి. గార్లపాటి రాఘవరెడ్డిగారి సాహచర్యం కాళోజీ కవితారచనకు తోడ్పడింది. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక నేపథ్యం ఇతని కవిత్వానికి పదును తెచ్చింది.

1939వ సంవత్సరం – పెల్లుబుకుతున్న ప్రజా వెల్లువను ఏదో ఒక మేరకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో నిజాం నిరంకుశ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఉర్దూలో ఈ ప్రక్రియను ‘ఇస్లహాత్‌’ అంటారు. దీని ప్రకారం హైదరాబాద్‌ సంస్థానంలో వృత్తుల ప్రాతిపదికన ఎన్నికలు జరిపి, మంత్రి వర్గాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అయితే ఈ మంత్రి వర్గం అసెంబ్లీకి బాధ్యత వహించదు. దాని ఏర్పాటు మొత్తం నిజాం నవాబు ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సంస్కరణలను స్టేట్‌ కాంగ్రెస్‌ బహిష్కరించింది. ప్రజాపక్షపాతియైన కాళోజీ ఈ ఇస్లహాత్‌ను వ్యతిరేకిస్తూ …
‘‘ఎందులకు? ఎందులకు? – ఇస్లహాత్‌ ఎందులకు?
అయ్యలు మెచ్చని మియ్యలు వొల్లని – ఇస్లహాత్‌ ఎందులకు?
…‘కాదు’ అనుచు చాటుగాను – కన్నుగీటుటెందులకు?
పలుకు పలుకునకు అనుజ్ఞ అయితే – ప్రతినిధులగుట ఎందులకు?
ఆధిపత్యమియ్యలేని – ఆయీన్‌ అది ఎందులకు?’’

అంటూ కేవలం అలంకార ప్రాయమైన మంత్రివర్గ ప్రాతినిధ్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంగిలి విస్తరికన్నా హేయమైన పదవులను పొందినవారిని మందలించారు. మరోవైపు నిజాం నవాబు మంత్రివర్గంలో చేరవలసిందిగా ఆహ్వానం రాగా, తిరస్కరించి స్వాభిమానాన్ని ప్రకటించిన బూర్గుల రామకృష్ణారావు గారిని అభినందిస్తూ …

‘‘రాజరికము మోజులేక – తేజరిల్లు నాయకుడా!…
కాలదన్నుమనుటె కాదు – కాలదన్న గల్గినావు’’

అంటూ తెలుగువారు తలెత్తి తిరుగునట్లు చేసిన త్యాగశీలతను ప్రశంసించారు. 1943 మే 26 నాడు హైదరాబాద్‌ ఆబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో జరిగిన దశమాంధ్ర మహాసభ సమావేశంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనోత్సవ సందర్భంగా …‘‘మాతృదేశము మాటముచ్చట – ముదముగూర్పదు మదికిననియెడి…/ అగ్గి కొండల అవనియైనను – మాతృదేశము మాతృదేశమే’’ అంటూ మాతృదేశ భక్తి ప్రబోధాత్మకమైన గేయాన్ని రచించారు. మాతృదేశాన్నీ, మాతృభాషనూ అమితంగా అభిమానించిన కాళోజీ, నిజాం రాష్ట్రంలోని తెలుగు ప్రజల్లో కొందరు తెలుగు భాష పట్ల చూపే నిరాదరణకు స్పందించి …

‘‘ఏ భాషరా నీది ఏమి వేషమురా –
…అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు –
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!!’’
అని సూటిగానే హెచ్చరించారు. భావదాస్యాన్ని ఎండగట్టారు. స్వాభిమానాన్ని తట్టిలేపారు. ఒకవైపు ప్రగతిశీల ప్రజాకవులు దుర్మార్గపు రాజరికాన్ని నిలదీస్తూ అరణ్య, అజ్ఞాత, కారాగార వాసాలు గడుపుతుంటే, మరోవైపు రాజరికానికి అమ్ముడుపోయిన ముగ్గురు ఆనాటి సాహితీవేత్తలను ’రాకాసీ’ అన్న సంకేతనామంతో ప్రజాస్వామ్యవాదులు గర్హించారు. వీరిలో ఒకరు రాయప్రోలు సుబ్బారావు, రెండవ వారు కాసింఖాన్‌, మూడవవారు కురుగంటి సీతారామాచార్యులు. 1943వ సంవత్సరం- వరంగల్లులోని ‘శబ్దానుశాసన గ్రంథాలయ’ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కవి సమ్మేళనానికి రాయప్రోలు అధ్యక్షులు. తెలంగాణా ప్రజల పోరాటానికి సంఘీభావం ప్రకటించని ఆనాటి ఉస్మానియా విశ్వ విద్యాలయ తెలుగు శాఖాధిపతి రాయప్రోలును అధిక్షేపిస్తూ, ఆనాటి కవి సమ్మేళనంలో కాళోజీ చదివిన కవితలో

‘‘లేమావిచిగురులను లెస్సగా మేసేవు – ఋతురాజువచ్చెనని అతి

సంభ్రమముతోడ/ మావి కొమ్మల మిద మైమరిచి పాడేవు/ తిన్న తిండెవ్వారిదే కోకిలా! – పాడు పాటెవ్వారిదే?’’ అని సూటిగానే నిలదీశారు.
1944లో వరంగల్లులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవం జరిగింది. రజాకార్లు ఈ ఉత్సవాలను భగ్నం చేయాలని, వరంగల్‌ కోటలోని ఏర్పాట్లనన్నింటినీ ధ్వంసం చేశారు. కాలి కూలిన పందిళ్ళలోనే కవి సమ్మేళనం నిర్వహించారు. దాదాపు అరవై మంది కవులు కావ్యగానం చేశారు.‘‘కూలిపోయిన కోటగోడలను జూపి/ శిథిలమైన గుళ్ళ శిల్పముల జూపి/…పూర్వ గాథలు జెప్పి పొంగేటి’’ మనస్తత్వాలను కాళోజీ విమర్శించారు. ప్రస్తుత దీనస్థితిని చూసి ప్రతిఘటించాల్సిందిగా ప్రబోధించారు.
కాళోజీ కవిత్వానికి పర్యాయ పదంగా పేర్కొన దగిన గీతం … ‘‘నల్లగొండలో నాజీ వృత్తుల – నగ్న నృత్యమింకెన్నాళ్లు?/ దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని – దొరలై వెలిగే దెన్నాళ్లు? / హింసను పాపమనెంచు దేశమున – హిట్లరత్వమింకెన్నాళ్లు?’’ అని ప్రశ్నించిన కాళోజీ … ‘‘ప్రజా శక్తికి పరీక్ష సమయము – ప్రతీక్ష మనకింకెన్నాళ్లు?’’అనడంలోనే ప్రతిఘటన పోరాటాలకు సమయం ఆసన్నమైందని ధ్వనింపచేశారు. అలాగే 1946వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినప్పుడు … ‘‘…బేజారైన బీదలవోపిక – పెద్దలపై పిడుగయిరాలున్‌/ ‘అయ్య! బానిస’ను అనిన పౌరుడే-అయ్య గొంతుక నట్టేఅదుమున్‌’’ అనే ప్రజా తీర్పును క్రాంతదర్శిగా ప్రకటించారు. నిజాం సైనికులు, రజాకార్లు కలిసి జనగామ తాలూకాలోని మాచిరెడ్డి పల్లె, ఆకునూరు గ్రామాలపైబడి స్త్రీలపై అత్యాచారాలు జరిపారు. ఈ దుశ్చర్యను నిరసించిన కాళోజీ …‘రక్కసి తనముకు పిశాచవృత్తికి -దొరికిన రక్షణ చాలింక/ మాచిరెడ్డిలో ఆకునూరులో – దోచిన మానము చాలింక/ రక్షణకై ఏర్పడ్డ బలగమే – చేసే భక్షణ చాలింక’’ అంటూ అధికార వర్గము ఆడే ఆటలు ఇక సాగడానికి వీలులేదని హెచ్చరించారు. ఈ గేయం అప్పటి ‘తెలుగు స్వతంత్ర’లో ప్రచురించబడింది.
రజాకార్ల హత్యాకాండకు పరాకాష్ఠ జనగాం తాలూకాలోని బైరాన్‌పల్లి గ్రామ ప్రజలపై జరిగిన మూకుమ్మడి దాడి. స్త్రీలపై అత్యాచారాలు, పురుషులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం వంటి ఘటనలతో సంస్థానమంతా అట్టుడికిపోయింది. గుల్బర్గా జైల్లో నిర్బంధంలో వున్న ప్రజాకవి కాళోజీ ఈ వార్తలను చదివి ఆగ్రహోదగ్రులయ్యారు. ‘‘మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన/ మన పిల్లలను చంపి మనల బంధించిన/ మానవాధములను మండలాధీశులను/ మరచి పోకుండగ గురుతుంచుకోవాలె/ కసి ఆరిపోకుండ బుసకొట్టు చుండాలె/ కాలంబు రాగానే కాటేసి తీరాలె/ తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె/ కొంగు లాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలె/ కన్నుగీటిన కళ్ల కారాలు చల్లాలె..’’ అనే కసిగీతాన్ని రచించారు. సత్యం, అహింస, దయ, ధర్మం, క్షమ అన్న పదాలను కట్టిపెట్టి చాణక్యనీతిని ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. ‘‘సాగిపోవుటే బ్రతుకు – ఆగిపోవుటే చావు..’’ అంటూ తెలుగు ప్రజలను ఆగకుండా సాగిపొమ్మని ప్రబోధించారు.

ఆ మహామనీషితో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొనడం, వారి ఉపన్యాస ధోరణిని మంత్ర ముగ్ధులమై వినడం, వారి ధిక్కార స్వరంతో ప్రేరణ పొందడం, వారు బ్రతికిన కాలంలో బ్రతకడం ఒక మధురమైన స్మృతి. మాటలను కత్తులుగా, కొడవళ్లుగా మలచినవారు. పాటలను ఈటెలుగా ప్రయోగించినవారు. కవితాపంక్తులను సూక్తులుగా, సామెతలుగా, నుడులుగా, నానుడులుగా వాడుకునే వెసులుబాటు కల్పించినవారు. నిరంతరం పోరాటాలతో త్రికరణ శుద్ధిగా మమేకమైన పరిపూర్ణ మానవుడు కాళోజీ.
(సెప్టెంబరు 9న కాళోజీ 101వ జన్మదినోత్సవం)

ఎస్వీ సత్యనారాయణ
9618032390

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.