సూక్తి సుధ
క్రోధం
4
‘’తనకోపమె తన శత్రువు ,-తనశా౦తమే తనకు రక్ష ,దయ చుట్టంబౌ ‘’అన్నాడు సుమతీ శతక కర్త .అసలు మనుషులకు క్రోధం ఎందుకు వస్తుంది ?దానివల్ల జరిగే పరిణామం ఏమిటి ?అనే దాన్ని గురించి తెలుసు కొందాం .’’క్రోధాద్భవతి సంమోహః సమ్మోహాత్ స్మ్రుతి విభ్రమః స్మ్రుతి భ్రంశాత్ బుద్ధి నాశో –బుద్ధినాశాత్ ప్రణశ్యతి ‘’అని గీతా చార్యుడు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు .’’అను క్షణం విషయ సుఖాల గురించి ఆలోచిస్తే దానిమీదే ఆసక్తి పెరుగుతుంది .ఆసక్తి క్రమంగా కామం లేక కోరిక గా మారు తుంది .కోరిక తీరక పొతే కోపం లేక క్రోధం కలుగుతుంది .క్రోధం అవివేకానికి దారి చూపుతుంది .దీని వలన మరపు కలిగి ,బుద్ధి నశిస్తుంది .బుద్ధి నాశనమైతే ,అయోగ్యుడై మనిషి నశిస్తాడు .అంటే ‘’ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి ‘’లాగ క్రమంగా పతనమై జీవి నశి౦చి పోతాడు .మరి దీనికి విరుగుడు లేదా?ఉన్నది ‘’రాగ ద్వేషాలు లేకుండా ఇంద్రియాలనుస్వాదీనం లో ఉంచుకొని ,విషయ సుఖాలను అనుభ విస్తూ కూడా మానవుడు నిర్మలుడే అవుతాడని ఆ భగవద్గీతే చెప్పింది .
అందుకే భగవద్గీత ను ‘’మనస్తత్వ శాస్త్రం ‘’అన్నారు .మానవ మనో లీలలను పరమాద్భుతం గా వర్ణించింది .బందానికీ ,మోక్షానికీ కారణం మనసే .ఉద్ధరించినా అధోగతి పాలు చేసినా మనస్సే’’అదే బంధం శత్రువుకూడా .కనుక కోరిక పెరిగితే ,కామం పెరిగి మోక్షానికి అవరోధమవుతుంది .’’వీత రాగ భయ క్రోదో ,మన్మయా మా ముపాశ్రితాః-బహవో జనన తపసా పూతా మద్భావ మాగతాః’’అని పరమాత్మ తరుణోపాయమూ చెప్పాడు .అన్నిటికి కారణమైన కామాన్ని పిశాచం తో పోల్చింది ‘’యోగ వాసిస్టం ‘’’’తవనావహితం చిత్తం కామః కవల యిష్యతి –సావదానస్య బుద్ధస్స పిశాచః కిం కరిష్యతి ?అన్నది అంటే ‘’అజాగ్రత్తగా ఉంటె చిత్తాన్ని కామం మింగేస్తుంది .జాగ్రత్తగా ఉంటె కామ పిశాచి చిత్తాన్ని ఏమీ చేయలేదు ‘’అని భావం .కనుక సర్వ వేళల ,సర్వా వస్థలలో మెలకువగా అంటే జాగ్రత్తగా ఉండాలి .
పరశురాముని క్రోధం 14 సార్లుక్షత్రియ రాజ వంశాలపై దండెత్టించి,రాజ వంశ నిర్మూలనం చేసింది .మహా భారతం లో పరీక్షిత్తు మహారాజు తపస్సమాధిలో ఉన్న ‘’శమీక మహర్షి ‘’తనకు ఆతిధ్యం ఇవ్వలేదని ఆగ్రహించి ,చచ్చిన పామును తెచ్చి ముని మెడలో వేస్తె ఆ తర్వాత వచ్చి చూసిన కొడుకు ‘’శృంగి ‘’7 రోజుల్లో పరీక్షిత్తు మరణిస్తాడని శపించాడు .జరిగింది తెలుసుకొన్న మహర్షి కొడుకుతో ‘’క్రోధం తపస్సుకు భంగం .అణిమాద్యస్టసిద్ధి సాధనకు ఆవ రోధం .ధర్మ మార్గానికి అడ్డంకి .తపస్వికి క్రోధం పనికి రాదు .చేసే పని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తే క్రోధం తగ్గుతుంది ‘’అని హితవు చెప్పాడు .విశ్వామిత్రుడికి వసిష్ట మహర్షిపై ఉన్న కోపం బ్రహ్మర్షి పదవికి అడ్డంకి అయింది .కార్త వీర్యార్జునుని కోపం పతన హేతువైనది .దుర్యోధనుని క్రోధం కౌరవ వంశ నిర్మూలనం చేసింది .’’కామం ఆవహిస్తే క్రోధం నాట్యం చేస్తుంది ‘’అనే సామెత లోకం లో ఉంది .కామ ,క్రోధాలు పరమ మిత్రులు .లోకోపకారానికి అవతార పురుషులు ‘’ధర్మాగ్రహం ‘’చూపిస్తారు .శ్రీరాముడిది రావణాది రాక్షస సంహారం లో ధర్మాగ్రహమే .భారత స్వాతంత్ర్య సముపార్జనకు మహాత్మా గాంధి బ్రిటిష్ వారిని ఎదిరించింది ‘’సత్యాగ్రహం ‘’తోనే .
కామ క్రోదాలకు తోడు డంబం ,గర్వం ,అభిమానం అంటే దురహంకారం ,కాఠిన్యం,అవివేకం అసుర లక్షణాలుగా ఉపనిషత్తులు పేర్కొన్నాయి .అందుకే ‘’కామ క్రోధ స్తదా లోభాస్తస్మా దే త్రయం వ్యజేత్ ‘’అన్నారు నరక ద్వారాలైన కామ క్రోధ లోభాలను మూడింటిని విసర్జించాలి .అహంకారం బలం దర్పం ,కామం క్రోధపరిగ్రహం –విముచ్య నిర్మమస్శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే ‘’అని చెప్పి వీటిని విసర్జించి మన శ్శాంతి తో జీవించమని మహాత్ముల సందేశం .
శ్రీరాముడు తాను రాజ సూయ యాగం చేస్తానని తమ్ములతో చెప్పాడు .వివేకి అయిన తమ్ముడు లక్ష్మణుడు ‘’రాజ సూయ యాగం వలన రాజులతో అనవసర కలహాలేర్పడి ప్రశాంతతకు భంగం కలుగుతుంది .రాజ వంశ వినాశనం జరుగుతుంది .వసుంధరా వధ చేయ వద్దు ‘’అని చక్కని సలహా ఇచ్చాడు .ధర్మ సూక్ష్మం గ్రహించిన రాముడు ‘’శుభం పలికావు చిన్నవాడివైనా .వివేకి లోక పీడా చర్యలు చేయరాదు ‘’అని విరమించుకొన్నాడు .చనిపోయే ముందు మనిషి కామ క్రోధాదుల వేగం అరి కట్ట గలిగితే ,యోగి ,సుఖి అవుతాడు .కామ క్రోధాలు తొలగి పోవటం ‘’వాసనా క్షయం ‘’అంటారు .దీని వలన చిత్తం స్వాధీనమై ,ఆత్మ జ్ఞానం కలిగి మోక్షం లభిస్తుంది .
5(చివరి భాగం )
‘’కామం లేక కోరిక క్రోదానికి హేతువు .కామ౦ వల్ల ద్యూతం ,వేట ,స్త్రీవ్యసనం ,మద్యపానం నిరర్ధక ధన వ్యయం అనే అయిదు వ్యసనాలు కలుగుతాయి .వీటి వలలో పడి ,కోరికలు పెరిగి ,అవి తీరక పొతే క్రోధం విజ్రు౦భిస్తుంది .క్రోధం వల్ల వాక్పారుషత్వం ,దండ పారుష్యం అనే రెండు వ్యసనాలొస్తాయి .’’అని భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి ధర్మ రాజుకు ఉపదేశిం చాడు .’’ధర్మార్ధ కామాలు అనే వర్గ త్రయం ,ప్రభుత్వ మంత్రోత్సాహాలైన శక్తి త్రయం ,రాజు అధీనం లో ఉంటె ,సత్వ ర స్తమ గుణాల వివేచనతో రాజు ధర్మ పాలన చేస్తాడు .రాజు ప్రజలను జాగ్రత్తగా కాపాడుతూ ,ప్రజలు చేసే సత్కార్యాలను మెచ్చుకుంటూ ,కౌటిల్యం ఆత్మ స్తుతి ,దురహంకారం ,క్రోధం విడనాడాలి’’ అని భీష్మ ఉవాచ .ఇవి పరిపాలనలో ఉండే అందరికీ వర్తించే నిత్య సత్యాలు .పాలకులు ఈ మార్గం లో నడిస్తే ప్రజాశాంతి సాధన జరుగుతుంది .
కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను ‘’అరిషడ్వర్గం ‘’అంటారు .ఇవి ఎలాకలుగుతాయో ఏ విధం గా తొలగి పోతాయో కూడా చెప్పారు .’’సంకల్పం వల్ల కామం జనిస్తుంది .దేహాత్మ విభేద జ్ఞానం వలన నశిస్తుంది .పరుల దోషాల వల్లక్రోధం ఏర్పడుతుంది .ఓర్పుతో ఇది నశిస్తుంది .అస్తిర జ్ఞానం లోపిస్తే లోభం కలుగుతుంది .ఎరుక వలన తొలగి పోతుంది .అజ్ఞానం వలన మోహావేశం కలిగి ధర్మాచరణ తో దూరమౌతుంది .కులం విద్య ,ధనం మదాన్ని పెంచుతాయి .అవి అశాశ్వతం అని గ్రహిస్తే మదం నశిస్తుంది .సాత్విక గుణ సంపత్తి లేకపోతె మాత్సర్యం ఏర్పడి సత్పురుష సా౦గత్యం వలన నిర్మూలనమౌతుంది .ఈ ఆరు మనసులో చేరితే ధైర్యం కోల్పోతారు .అయితే దీమంతుడిని ఇవి ఏమీ చేయలేవు .బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొంటే వీటి వలన ప్రమాదం రాదు .
మన ఆలోచనా విధానం సక్రమ మార్గం లో ఉండాలి .మనసు నిర్మలం గా ఉంచుకోవాలి .ఈ ఆధునిక కాలం లో ఇది సాధ్యమేనా ?అంటే సాధ్యమే .వృత్తి ఉద్యోగాలలో అనుక్షణం టెన్షన్ లో ఉంటాం .సమాజం లో అసమానతలు ,చుట్ట్టూ దరిద్రం ,పరపీడన ,పురుషాహంకారం ,ప్రేమ పేరిట మృగాలవుతున్నమగాళ్ళు , ,అన్నిట్లో వివక్షత మనల్ని అశా౦తులను చేస్తున్నాయి .అందుకని ఉద్రేకపడి ఉపద్రవాలు తెచ్చుకోకూడదు .కనుకనే శారీరిక మానసిక ఆరోగ్యం కోసం యోగ సాధన చేయాలి ‘’యోగః కర్మ సుకౌశలం ‘’అన్నాడు యోగాచార్యుడు కృష్ణుడు .యోగిగా ఈ సమాజం లో జీవించు అని గీత చెప్పింది .చెప్పటం సులువే కాని ఆచరణ సాధ్యమా అనిసందేహం వస్తుంది . .అందుకే ‘’మనసులో సమత్వం ఉన్నవారంతా యోగులే ‘’అన్నారు కంచి పరమాచార్య .’’మన వేదనా స్వరూపానికి శాంతి ప్రకరణమే వేదం ‘’అని గ్రహించమన్నారు .ప్రపంచం లో ప్రజలకోసం చేసే సేవ పరమేశ్వరా రాధనం అవుతుంది .అందుకే ‘’సమాజ పరమేశ్వరుడు ‘’అన్నారు .దీని వలన ఆత్మ సంతుష్టి కలిగి సేవలో పడిన క్లేశ ,దుఖాలు ఆనందాన్ని ,సుఖాన్ని ఇస్తాయి .
సమాజం లో జరిగే వాటిని చూసి భయపడి పని చేయకుండా ఉండరాదు .భగవంతుని తో సహా అందరం కర్మ చేయాల్సిందే .కర్మ లేక పొతే లోక కార్యం జరగదు .కర్మ వలన చిత్త శుద్ధికలిగి ,దాని వలన నిష్కామ కర్మ తెలిసి ,దీనిద్వారా ధ్యానం ,యోగం కలిగి చివరికి ఆత్మాను సంధానం లభిస్తుందని గీతలో పరమాత్మ చెప్పాడు .మనం శ్రద్ధ తో చేసేపని భక్తీ అయి ముక్తిగా విలసిల్లు తుంది .’’ఉద్రేకాలు అణచుకొని ,సదాలోచనలు పెంచుకొని ,ఉద్వేగాలకు లోనుకాకుండా ,బ్రతికితేనే శాంతి .మనసులో నిర్మలత్వం ,ద్రుష్టి లో విశాలత్వం ,ఆలోచనలలో అనంతత్వం ఉంటేనే శాంతి లభిస్తుంది ‘’అని జ్ఞాన ,వయో వృద్ధులైన రచయిత శ్రీ పోతుకూచి సాంబశివ రావు గారు అన్నారు .
‘’మనసు కలయిక గా విద్య ఉండాలి .అంతరిక సమతుల్యత ,సామరస్యం ఉన్న వ్యక్తులను విద్య సమాజానికి అందించాలి .జీవితాన్ని ,మానవుడిని ,ప్రవర్తనను నిర్మించే విద్య నేర్పితే ,అరిషడ్వర్గాలను అధిగమించే స్థితి కలుగుతుంది ‘’అని స్వామి వివేకానంద ప్రవచనం .విజ్ఞాన ,ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేస్తూ ,వ్యక్తిత్వ వికాసాన్ని విద్య పెంపొందిస్తే ,సమాజం లో రుగ్మతలు ఉండవు .
అందర్నీ కలిపి ఉంచేది ప్రేమ తత్వమే .ప్రపంచాన్ని కామక్రోధాలు పాలించ కూడదు .ప్రేమ మాత్రమె ప్రపంచ పాలన సాగించాలి .అప్పుడే సుఖం శాంతి ,పురోగమనం లభిస్తాయి .ప్రేమ వికశించి ,సంకుచితత్వాన్ని త్రెంచి పారెయ్యాలి . ‘’ప్రేమ వికశించి మస్తిష్కం పునర్వ్యవ స్థీక రించ బడాలి .సమస్త జీవుల్లో ఊర్జవం, శక్తి ,మాధుర్యం ,తేజస్సులు చొచ్చుకు పోవాలి .ప్రేమలో శాంతి సుఖ సంతోషాలు సేవ ఉన్నాయి .ప్రేమ విశ్వం కన్నా విశాలమైనది యుగాలు కల్పాలకన్నా శాశ్వతమైనది .అనంతమైనది .ప్రేమ అంటే మీరే .నేనే ,మనమే ‘’అన్నారు అరవిందాశ్రమ మాత .
సంపూర్ణం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -12-9-15-ఉయ్యూరు