గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 404-పుత్రసంజీవనం –కావ్య కర్త –బ్రహ్మశ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రిగారు –(1918-1990)

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3

404-పుత్రసంజీవనం –కావ్య కర్త –బ్రహ్మశ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రిగారు  –(1918-1990)

శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారు 10-12-1918సాధారణ నామ సంవత్సర మార్గ శిర శుద్ధ దశమి నాడు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద లంక గ్రామం లో జన్మించారు తలిదండ్రులు పార్ధ శారదమ్మ ,సుబ్బయ్య గార్లు .చిన్నతనం లోనే తండ్రి చనిపోతే తల్లి తానె అన్నీ అయి పెంచి పెద్దవానిని చేసి విద్యా బుద్ధులు నేర్పించి వివాహం చేసింది ఆమె రుణాన్ని తీర్చుకోలేను అన్నారు శాస్త్రి గారు .అన్నగారు రాజ శాస్త్రి గీర్వాణ భాషలో పండితుడిని చేశారు. శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రిగారి వద్ద శాస్త్రాలు అవలోడనం చేశారు .సాహిత్య మార్గ దర్శి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అనే చందవోలు శాస్త్రిగారు .తన సాహిత్య వృక్షానికి  జనస్వామి వెంకటేశ్వర శాస్త్రి గారు బీజారోపణం చేస్తే ,చిలుకూరి వరదయ్య శాస్త్రి గారు నీరుపోశారు .మూల్పూరు సుబ్రాహ్మణ్య  శాస్త్రిగారు మొలకింప జేస్తే ,మంగిపూడి వెంకట శాస్త్రిగారు పెంచారు .కంభం పాటి రామ మూర్తి గారు పూలు పూయిస్తే ,వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కాయలు కాయించారు .యతి రాజు సంపత్కుమారాచార్యులుగారు సొంపు చేస్తే  తాతా సుబ్బరాయ శాస్త్రి అనే రాయడు శాస్త్రీ గారు  పండజేశారు అని శాస్త్రి గారు ఈ ఎనిమిది మందికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు సీస పద్యం లో .వీరు అస్టమూర్త్యాత్మక దేవతలుగా భావించారు .తర్క శాస్త్రాన్ని వేమూరి రామ బ్రహ్మ శాస్త్రి గారి వద్ద నేర్చారు ..అగమా౦తాన్ని  దెందుకూరి నరసింహ శాస్త్రి గారి వద్ద చదివి పారీణుడయ్యారు  .

ఈ విధం గా నారాయణ శాస్త్రిగారు మహా మహోపాధ్యాయులైన గురువులవద్ధ కావ్య పాఠం,తర్క వేదాంత ,అలంకార ,వ్యాకరణ శాస్త్రాలను ఆసాంతం అభ్యసించి ఎదురు లేని వారి గురువులకు తగిన శిష్యుడు అనిపించుకొన్నారు .1929లో పోపూరి సీతారామయ్య ,పున్నమ్మగార్ల పుత్రిక శ్రీమతి బాలా త్రిపుర సుందరిని వివాహం చేసుకొని చిన్నక్క పున్నమ్మగారి అల్లుడైనారు .మేనల్లుడే అల్లుడైన శాస్త్రిగారి విద్యాదానానికి ఆమె అన్నదానం తో సహకరించారు .శాస్త్రి దంపతులకు నలుగురు కుమార్తెలు ముగ్గురు కుమారులు కలిగారు .

రేపల్లె చిట్టి వారి వీధిలో శాస్త్రిగారు శాస్త్ర పాఠ శాలను ఏర్పరచి ,శిష్యులకు విద్య నేర్పించారు .గ్రామంలోని ఉదారుల ఇంట వారాలు ఏర్పాటు చేసి ,తన ఇంటిలోనూ భోజన వసతి కలిపించి విద్యార్ధుల విద్యకు ఆటంకం లేకుండా విద్యాలయాన్ని నిర్వహించారు .ఇది క్రమంగా వృద్ధి చెంది రైలు పేటకు మారి 1940లో శ్రీ శంకర విద్యాలయం గా రూపు దిద్దుకొన్నది .జగద్గురువులు శ్రీ శంకర భాగవత్పాదులపై శాస్త్రిగారికి అపార భక్తీ తాత్పర్యాలు౦ డేవి ..భవన నిర్మాణం కోసం ఉన్నది అంతా ఖర్చు చేశారు .ఇది గమనించిన మహాదాత తిమ్మ సముద్రం వాసి శ్రీ గోరంట్ల వెంకన్న చౌదరి ధన సహాయం చేసి శాస్త్రి గారి సంకల్ప సిద్ధికి తోడ్పడ్డారు .వారికి  జీవితాంతం శాస్త్రి గారు కృతజ్ఞత చూపించేవారు .

శ్రీ శంకర విద్యాలయం తర్వాత ‘’వేదం శాస్త్ర పాఠ శాల ‘’గా మారింది .ఇప్పుడు శ్రీ శంకర సంస్కృత డిగ్రీ కళాశాలగా అభి వృద్ధి చెందింది .నిర్వహణకు,ఆర్దికానికి ఇబ్బందులేర్పడి  శ్రీ తూములూరి సుబ్బావదానిగారు మొదలైన వారిని ఏర్పాటు చేశారు .శాస్త్రిగారు పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు .1962-67 వరకు శ్రీ డాక్టర్ కే .వి కే. సంస్కృత కళాశాలలో అయిదేళ్ళు లెక్చరర్ గా ఉద్యోగించి ,తర్వాత రెండేళ్ళు తిమ్మ సముద్రం లో గోరంట్ల వారి పాఠ శాల నిర్వాహకులుగా ఉన్నారు .అక్కడి నుండి రేపల్లె చేరి తన విద్యాలయాన్ని సంస్కృత కళాశాలగా రూపాంతరం చెందించి 1969-75 వరకు ప్రిన్సిపాల్ పదవిని అలంకరించి కళాశాల అభివృద్ధికి తోడ్పడ్డారు .గర్వాహంకార, అసూయాదులు లేని శాస్త్రిగారు పదవీ విరమణ తర్వాత కూడా అక్కడే బోధనలు చేసి తన అపార జ్ఞాన సంపదను విద్యార్ధులకు అందజేసేవారు .

భారత,భాగవత ,రామాయణాలను పురాణాలుగా ఎన్నో సార్లు శాస్త్రిగారు ప్రవచనం చేశారు .1960లో శంకర విద్యాలయం లో శాస్త్రి గారు భాగవత ప్రవచనం చేయగా పులకించిన శిష్యులు ,రేపల్లె పురాజనులు ‘’సువర్ణ ఘంటా కంకణ ‘’పురస్కారాల౦దజేసి ధన్యులయ్యారు .గుంటూరులో ‘’వేద ప్రవర్ధక విద్వత్ సభ ‘’కార్యాలయం లో నాలుగేళ్ళు శాస్త్రి గారి చేత ఉపనిషత్ భాష్య ప్రవచనం చెప్పించారు .

కావ్య రచన

విద్యార్ధి దశలోనే  నారాయణ శాస్త్రిగారు సంస్కృతం లో ‘’సుబ్రహ్మణ్య విజయం ‘’అనే ఏకాంకిక నాటకం రాశారు .ఇందులో శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారి విద్యా విజయాన్ని కదా వస్తువును చేసి గురు ఋణం తీర్చుకొన్నారు .కాని ఇది అముద్రితం అవటం మన దుర దృష్టం .పొన్నూరులో ఉండగా కాళిదాసు’’అభిజ్ఞాన శాకుంతలం ‘’ను తెలుగులో రచించి ‘’కవి కులగురువు’’పై తమకున్న ఆరాధనా భావాన్ని తెలియ జెప్పుకున్నారు .ఇది ఇతర ఆంధ్రానువాదాల కంటే మేలు బంతి .అందుకే మూడు సార్లు ముద్రణ పొందింది .చాలా విశ్వ విద్యాలయాలలో పాఠ్యాంశమైంది .’’అంగద రాయ బారం ‘’అనే ఖండ కృతి తెలుగులో రాశారు. శ్రీ పరాశరం కృష్ణ మాచార్యుల గారితో కలిసి ‘’ఆపస్తంభ ‘’,లౌగాక్షి గృహ్య సూత్రాలు ‘’ను ఆంధ్రీకరించగా విఖనస గ్రంధ మండలి ప్రచురించారు .

పుత్ర సంజీవన కావ్యావిర్భావం

శాస్త్రి గారి మూడవ కుమారుడు శివరామ కృష్ణ మహా బాల మేధావి .తండ్రిగారుచెబుతూండగానే’’ అమరకోశం మొదటికాండ’’ నోటికి వచ్చేసింది .రెండవ కాండ మొదలు పెట్టాడు శ్రీ లంకా శ్రీమన్నారాయణ గారి వద్ద మొదటి తరగతి చదివి రెండవ తరగతిలో చేరి ఇరవై ఎక్కాలు బట్టీ పట్టాడు ఈ 5 ఏళ్ళ బాల కిశోరం .ఈ కుర్రాడు తనంత పండితుడవుతాడని శాస్త్రి గారు ఉప్పొంగిపోయేవారు .ఆతని తెలివి తేటలకు మిగిలిన శిష్యులు ఆశ్చర్య పోయేవారు .విధి వక్రించి ఈ  బాలుడు అయిదేళ్ళ రెండు నెలలకే తలిదండ్రులకు గర్భ శోకం మిగిల్చి మరణించాడు .

ఈ శోకాన్ని దాచుకోలేక శాస్త్రిగారు సంస్కృతం లో ‘’పుత్ర సంజీవనం ‘’అనే కావ్యాన్ని రాశారు .’’శోకం శ్లోకం ‘’గా మారి వారి శోకం ఉపశమించింది .శ్రీకృష్ణ బలరామ కుచేలురు సా౦దీపని మహర్షి శిష్యులు .సాందీపుని కుమారుడు చనిపోతే కృష్ణుడు గురు దక్షిణగా ఆకుమారుని బ్రతికించి తెచ్చి అప్పగించి గురు ఋణం తీర్చుకొన్న కద.ఈ కావ్యం రాసిన తర్వాత శాస్త్రి గారికి మళ్ళీ మగ పిల్లాడు పుట్టి ఆనందాన్ని కలిగించాడు .ఈ  కుర్రాడికి ‘’శ్రీ కృష్ణ ప్రసాద్ ‘’అనే పేరు పెట్టుకొని సంతృప్తి చెందారు .శాస్త్రిగారి మేనల్లుడు మూడేళ్ళ వయసులోను , ఆ  పిల్లాడు అయిదేళ్ళవయసులో చనిపోగా ,పెద్ద దౌహిత్రుడు తొమ్మిదేళ్ళకే మరణించి ఆకుటుంబం లో శోకం నింపారు .కావ్యాన్ని అంకితం ఇచ్చే  ‘’స్వస్రీయ పుత్ర దౌహిత్ర —‘’అనే శ్లోకం లో పాపక్షయార్ధంగా కావ్యాన్ని పరమాత్మకు అంకితమిస్తున్నట్లు తెలిపారు .

చతుర్దాశా పాదక గురు పూజోత్సవం ‘’

స్వంత కాలేజిలో పదవీ విరమణ తర్వాత శాస్త్రిగారు ఇంటి వద్దే విద్యా బోధనా చేయటం ప్రారంభించారు .1982లో ఆరోగ్యం దెబ్బ తిన్నది .అప్పటికి రిటైర్ అయి పదేళ్ళు అయినా పెన్షన్ శాంక్షన్ కాలేదు .కావ్యం ముద్రణ జరగలేదు .ఈ రెండూ మనోవ్యధకు గురి చేశాయి .ఈ పరిస్తితి గమనించిన  యాభై ఏళ్ళుగా శాస్త్రి గారి వద్ద విద్య నేర్చిన శిష్యబృందం అందరూ కలిసి ఒక సారి కలుసుకో వాలి అని భావించి ,శాస్త్రిగారికి ఆ సందర్భంగా సన్మానం చేయాలని నిర్ణయించారు ‘’దీనికి’’ విద్యా చతుర్దశా పాదక గురు పూజోత్సవ ‘’సన్మానం’’అని పేరుపెట్టి 10-8-86ఆదివారం రేపల్లె సంస్కృత కాలేజి లో జగన్మొహనం గా నిర్వహించారు .’’రుద్రాభిషేకం ‘’తో ప్రారంభించారు .మధ్యాహ్నం రెండుగంటలకు శిష్యులతో శ్రీ శాస్త్రి గారి ‘’వాత్సల్య గోష్టి ‘’నిర్వహించారు .సాయంత్రం అయిదుగంటలకు వేదపండితులచే శాస్త్రిగారికి మహదాశీర్వచనం చేయించారు .మంగళ వాద్యాలతో శాస్త్రిగారి దంపతులను స్వగృహం నుండి ఊరేగింపుగా కాలేజికి సగౌరవంగా తోడ్కొని వెళ్ళారు .రిటైర్డ్ హై కోర్ట్ న్యాయమూర్తి శ్రీ గొల్లపూడి వెంకటరామ శాస్త్రి గారు అధ్యక్షత వహించిన సభలో శాస్త్రిగారి వైదుష్యాన్ని వక్తలు బహువిధాల ప్రస్తుతించారు .బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు శాస్త్రి  గారి దంపతులకు శుభాశీస్సులు పలికి ‘’విద్యా చతుర్దశా పాదుక ‘’అనే ఇదివరకెన్నడూ ఎవరికీ ఇవ్వని కొత్త బిరుదును అందజేసి సత్కరించారు .శాసన సభ్యులు శ్రీ యడ్ల వెంకట్రావు శాస్త్రిగారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు .మచిలీపట్నం ఆంద్ర జాతీయ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు బ్రహ్మశ్రీ  భాగవతుల కుటుంబ రావు గారు ‘’పుత్రసంజీవనం ‘’కావ్యాన్ని ఆవిష్కరించారు .శిష్య బృందం శాస్త్రి గారిపై  ప్రశంసా  పద్య కుసుమాలు సమర్పించారు .

తర్క వేదాంత సామ్రాట్ ,దర్శనా చార్య బ్రహ్మశ్రీ  మద్ద్దుల పల్లి మాణిక్య శాస్త్రి ,అభినవ సరస్వతీ కంఠాభరణ,ఉపన్యాస కంఠీరవ శ్రీ ప్రభాకర శ్రీ కృష్ణ భగవాన్ గార్లు శాస్త్రిగారి సంస్కృత సాహిత్య వ్యాప్తిని బహుదా ప్రసంశించారు .’’శిష్య ప్రశస్తి ‘’అనే కార్యక్రమం లో శిష్యులు అభిమానులు పెద్దలు శాస్త్రి గారి దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించారు .

నారాయణ   శాస్త్రిగారు శ్రీ ప్రమోద నామ సంవత్సర  వైశాఖ బహుళ త్రయోదశినాడు  22-5-1990న 72 ఏళ్ళు సార్ధక జీవనం చేసి శ్రీకృష్ణ గోలోకం చేరుకున్నారు .  .

ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారి ‘’పుత్ర  సంజీవనం ‘’కావ్య విశేషాలు

శ్రీ కృష్ణునికి కావ్యాన్ని అంకితమిస్తూ శాస్త్రిగారు

‘’స్వస్రీయ –పుత్ర –దౌహిత్రైః-వియోక్తోహం యదేనసా –సమూల మేనస్తద్ధగ్ధుం –క్రుతిః కృష్ణాయ దీయతే ‘’అని శోక శ్లోకం చెప్పారు .శ్రీ కృష్ణుని పాదాబ్జాలను నమ్ముకొని భవ భ్రాంతి రహితంగా ఉంటానని రెండవ శ్లోకం చెప్పారు –‘’

శ్రీ భాగవతుల కుటుంబరావు గారు కావ్యాన్ని చక్కగా విశ్లేషించారు అందులోని విషయాలను మీకు తెలియ జేస్తున్నాను .

‘’నతి ర్భూయాస్తే స్తు శ్రుతి శిఖర సంభావ్య మహిమన్ –రతిస్వచ్చారిత్రే భవతు మధునో ప్యాహితరవే

క్రుతిర్మే హ్రుత్పద్మే తవ వసతు లక్ష్మీ సహచరీ –మతిస్త్వ త్పాదాబ్జే విహరతు భవ భ్రాంతి  రహితా ‘’

కాళిదాసుని కుమార సంభవం లోక సహజం అయితే శాస్త్రిగారి పుత్ర సంజీవనం అతిలోక అభి నందనీయం .వ్యాస భాగవతం లోని 32 శ్లోకాలు దీనికి ఆధారం .దీన్ని 426వృత్త శ్లోకాలుగా పెంచి రాశారు .మూలం లో కద మహా వేగం గా సాగితే శాస్త్రి గారు కళ్ళాలు బిగపట్టి దారిలోని దృశ్యాలను చూపించారు .సముద్ర వర్ణన సముద్ర యాత్ర స్నానం సముద్రుడు బల రామ  కృష్ణు లకు చేసిన పూజ,యమ మందిర వర్ణన చూపించారు బలరామ  కృష్ణు లకు గురువు సాందీపని మహర్షి ఇచ్చిన ఉపదేశాన్ని వివరంగా రాశారు .ఇది చదివితే మన ప్రాచీన విద్యా వైభవం ఏమిటో తెలుస్తుంది .ఆయన నేర్పిన విద్య పరాపరాలకు సంబంధించింది సమన్వయ విద్య .భాగవతం లోని క్రిష్ణలీలలను సంగ్రహం గా చెప్పారు .శ్రీ కృష్ణ లీలలను అరవై మూడు శ్లోకాలలో వర్ణించారు .పుత్ర సంజీవనం మానవ సాధ్యమైన విషయం .కాదు అతి మానుషం కనుక కృష్ణ మహిమలను అంతగా చెప్పాల్సి వచ్చింది .గురుపత్ని శ్రీ కృష్ణ బాల్య క్రీడలని గుర్తు  చేసుకొని తన మాత్రు వాత్సల్యాన్ని ప్రకటించింది .దీనివలన వారి పుత్ర శోకం కొంత మేరకు తగ్గింది .‘కావ్యం లో సముద్రుని ప్రసక్తి రెండు సార్లు వస్తుంది .అ౦దుకే బల రామ కృష్ణు లను చూసిన సముద్రుడు  తనకు ఆ అవతారాలకు గల సంబంధం గుర్తుకు వచ్చింది .సోదరులిద్దరు కనపడగానే అయాచితం గా భక్తితో సముద్రుడు నమస్కరిస్తాడు .ఇది లోక సహజ౦.వారొచ్చిన పని అడిగి తెలుసుకొన్నాడు

భాగవత కధలో యమ లోక వర్ణనం లేదు .శాస్త్రిగారు అతి లోక సహజంగా వర్ణించి యముడు బ్రహ్మ విద్యా చార్యుడని గుర్తు చేశారు .యముడి చేత షోడషోప  చార పూజలు చేయించారు .సా౦దీపుడు కాశిలో జన్మించటం చేత శాస్త్రిగారు కాశీ ,అవంతీ పుర(ఉజ్జయిని) వర్ణనలను తృప్తిగా చేశారు .సాందీపుని ఆశ్రమం ,శిష్యుల ప్రవ్రుత్తి ,ఆశ్రమ గురువులపై పురజనులకుండే గౌరవం శిష్యుల  భక్తి మొదలైనవి రమ్యంగా వర్ణించారు .మూలం లో కొద్ది శ్లోకాలో ఉన్న కుచేలోపాఖ్యానాన్ని పెంచి రాశారు .కనుక శాస్త్రి గారి కల్పనలన్నీ ఔచితీ యుతాలే అయ్యాయి .

‘’అస్త్యుత్త రస్యాం దిశి దేవతాత్మా ‘’అనే కాళిదాసు శ్లోక మొదటిపాదాన్ని తీసుకొని ‘’కాశీతి విశ్వేశ్వర రాజదానీ ‘’అని కాశి శ్రీ విశ్వేశ్వర రాజధాని అన్నారు .ప్రబంధ లక్షణం అయిన పురవర్ణన చేశారు .సాందీపుని వర్ణన పరమ రమణీయం .కృష్ణుడు యముడికి ఉపనిషద్విజ్ఞానం బోధించటం గొప్ప విషయం .ఉల్లేఖ ,పరికర ,కావ్య లింగాలంకారాలతో కావ్యానికి శోభ తెచ్చారు .అర్దా౦త రన్యాస వినియోగంలో భర్తృహరి గుర్తుకొస్తాడు .సాందీపని ఉదాత్తత గంభీరం .

శాస్త్రిగారి కవితా గీర్వాణం

పుత్ర శోకం

కుమారుడు సముద్రం లో మునిగి చనిపోయాడని తెలుసుకొన్న సాందీపని దంపతుల శోకం వర్ణ నాతీతం –‘’అధ మోహ వశం వాదా ఉభౌ –వివిధోపాయ విబోధతే  సుతం –అవధార్య నిమగ్న మర్ణ వే–పతితౌ తావపి శోక సాగరే ‘సముద్రం లో మునిగి చనిపోయాడని తెలుసుకొన్న ’మూర్చ పోయిన దంపతులు మళ్ళీ శోక సముద్రం లో మునిగిపోయారు .కొడుకు ఇల్లంతా తిరుగాడే దృశ్యం జ్ఞాపకానికి వచ్చి వారికి ఇల్లంతా అగ్ని ఆవహించినట్లని పిస్తోంది .శాస్త్రి గారు కుమారుని పోగొట్టుకొన్న దుఖం కూడా ఇలాగే ఉంది .అందుకే ఈకావ్యం రాసి ఊరడింపు చెందారు .

‘’తనయా నునయామి మాననీయే –ననుతే  యుక్తమభాషణం మయీత్దం –వితరామృత వాహినీం గిరం –పితరావద్య విచేత నానభూవ ‘’

‘’కొడుకా! మాతో మాట్లాడు .చైతన్య౦  లేని మాకు నీ మాటలు అమృతపు సోనలౌతాయి .’’అని దుఃఖ పడ్డారు .ఈ దుఖం గురువు  కు శాస్త్రిగారికీ సమానమే .అందుకే అంత గొప్పగా చెప్పగలిగారు .వ్యాసభగవానుడు ప్రత్యక్షమై ‘’శివుడు అనే పేరుగల నీ కొడుకును శివునిగా మనసులో భావించు .ఆ పరమాత్మ మీ ధ్యానానికి కనికరిస్తాడు ‘’అని ఓదార్చాడు .

ఆశ్రమ వాసం

బలరామ కృష్ణులు సాందీపని మహర్షి ఆశ్రమానికి చదువుకోవటానికి వచ్చారు. తమను తాము పరిచయం చేసుకొన్నారు ‘’నమోస్తు వాగంబుధి సాగరాయ-నమోస్తు విజ్ఞాన సమృద్ధి దయా –నమోస్తు విద్యార్ధి ద్యాఫ్లుతాయ –నమోస్తు సాందీపని సద్బుదాయ ‘’అని కీర్తించారు ..అక్కడి మునిబాలకుల నిత్య కృత్యాన్ని తెలుసుకొన్నారు .

ఇతర శిష్యులు లాగే అడవికి వెళ్లి దర్భలు, సమిధలు ఏరుకోస్తున్నారు కుచేలుడు, సోదరులు .ఒక రోజు అకస్మాత్తుగా ఆకాశం మేఘా వ్రుతమైంది ‘’ధారా దరైరావ్రుత మ౦త రిక్షం –గర్జద్భిరుచ్చై స్చపలా విలాసైః-తమస్సహాయై రపపాత్ర భావం –వర్షద్భి రాశా పరిపూర్ణ రూపై’’ –తాత్కాలిక సౌభాగ్యానికి గర్వించి గర్జిస్తూ తామసం తో యోగ్య భూమి అని తెలియ కుండా వ్యర్ధ దానానికి పూనుకొని మేఘాలు ఆకాశం కమ్మాయి .చక్కని భావం తో రాసిన శ్లోకం .తలల మీద దర్భల మోపులు ,పాదాల నిండా ముళ్ళు ,దారి కనపడక నడుస్తుంటే మెరుపులే దారి చూపిస్తున్నాయట.శిష్యులు రాకపోవటం తో కలత చెంది ,ముని వారిని వెదకటానికి వెళ్ళాడు .వారు కనిపించగా పరమానందం కలిగి ఒక కద జ్ఞాపకం చేసుకొన్నాడు .’’పూర్వం ఉపమన్యుడు అనే శిష్యుడు గురువు భిక్షాటనం చేయవద్దని నిషేధిస్తే జిల్లేడాకులు తిని గుడ్డి వాడై ,దారి తెలియక ఒక పాడు బడిన బావిలో పడి గురు దయకు పాత్రుడయ్యాడు .వీళ్ళను చూస్తె ఆ కద జ్ఞాపకం వచ్చిందట ఆయనకు .అంత దయాళువు సా౦దీపనిముని .

సమస్త శాస్త్ర బోధనం

గురు బోధ ఎలా ఉందొ చూద్దాం –‘’విశ్వ రూప మభవద్యదాత్మనో –వాజ్మయం ప్రణవతస్తదా ఖిలం –స ప్రతీక మమలస్య చాత్మనః –స ప్రసూతి రాఖిలాగమాధ్వనః ‘అని ఓంకార రహస్యం చెప్పాడు ముని ‘’పరమాత్మ నుంచి ప్రపంచం ఏర్పడినట్లు ,ఓంకారం నుండి సకల వాజ్మయం ఆవిర్భవించింది .ఇదే సగుణ ,నిర్గుణ బ్రహ్మాన్ని చేరటానికి ఆలంబనం .వేదమార్గానికి మూలం .చిన్న చిన్న మాటలతో గొప్ప అర్ధాన్ని పొదిగారు శాస్త్రి గారు .అలాగే నాలుగు వేదాల ఆవిర్భావం ,శిక్షా వ్యాకరణ ఛందస్సులు నిరుక్త జ్యోతిష కల్పాల గురించి బోధించాడు .పురాణ దర్శన యోగ ,సాంఖ్యాల వివరాలు ఎరుక పరచాడు .మీమాంసా దర్శన కామ గాంధర్వ ,ధనుర్వేద అర్ధ శాస్త్రాలను బోధించాడు .ఉదకవాద్యం గురించి ,ఉదకాఘాతం గూర్చి పూలమాలలను గుచ్చటం,వంటకళ మొదలైన సమస్తకళలు వారికి నేర్పాడు .’’సూత్ర క్రీడా’’ అనే తమాషా ఆటను నేర్పాడు ‘’నాళికా రచిత సూత్రా మంతరాః-చేద దాహ విధి మాచర న్నపి –నిర్వికార ముప దర్శయే ద్యది –క్రీడనాయ విహితా కళా హ్యసౌ ‘’గొట్టం మధ్య లోంచి దారాన్ని పోనిచ్చి ,ఆగోట్టాన్ని మధ్యలో తెంచినా కాల్చినా దారం చివరదాకా వచ్చే ఆట ను సూత్ర క్రీడా అంటారట. అది నేర్పాడు మహర్షి .పొడుపుకధలు ,అంటే ‘’ప్రహేళిక ‘’లను నేర్పారు .నోటికొచ్చిన పద్యాలను పరీక్షించుకొనే  ‘’ప్రతిమాలా ‘’కళ ను చెప్పాడు .అంటే మన అంత్యాక్షరి అన్నమాట .శబ్దం అర్ధం కష్టతరం గా ఉండి  ధారణ చేయటానికి అలవికాని పద్యాలను రాసే ‘’దుర్వాచక యోగ కళ’’బోధించాడు .సమస్యా పూరణం, నాటకం నేర్పాడు .దాతు వాదం ,వాస్తు విద్య ,వృక్షాయుర్వేదం ,శుక శారికా ప్రలాపం ,’’మేష కుక్కుట లావక యుద్ధ విధి ‘’అంటే గొర్రెలు ,కోళ్ళు ,పక్షులకు సంతోషం కలిగించే ద్యూత విద్య .అంటే మహర్షి నేర్పని విద్య లేనేలేదు .అది సా౦దీపమహర్షి విద్యా విధానం .ఆయన దగ్గర చదివితే విద్యార్ధి పరిపూర్ణుడు అవుతాడు .లోకజ్ఞానం అధ్యాత్మజ్ఞానం ,అన్నీ అబ్బి సర్వ సమర్దుడవుతాడు .శాస్త్రిగారి కున్న జ్ఞానం అపారం అని మనకు దీని వలన అర్ధమవుతుంది .

శ్రీ  కృష్ణ లీలలు

ముని పత్ని శ్రీ కృష్ణ లీలలు జ్ఞప్తికి తెచ్చుకొని చనిపోయిన తనకుమారుని బాల్య చేష్టలను నెమరు వేసుకొన్నది ‘’కృష్ణేన ద్రుష్ట విష పన్నాగభోగ పాశా-కృస్టేన.సాశ్రు నయనేః నిజ బంధు వర్గైః-ద్రుస్టేన ఫాద విధి ఘట్టన భగ్న భుగ్న –భ్రస్టాసృగాతత ఫణాసుకిమప్య వర్తి ‘’అంటూ క్లిస్టపదాలతో సమర్ధంగా శ్లోక రచన అతి సునాయాసంగా చేశారు .కృష్ణుడు కాళీయుని పడగలపై అద్భుతంగా నృత్యం చేశాడని భావం.గోపికా వస్త్రాపహరణాన్ని ,గోవార్ధనోద్ధరణాన్నిగుర్తు చేసుకొని రాసలీలా విలాసాన్ని ‘’కాంతా యుగాంతర గత ప్రిi క్రిష్ణి కాసు – కృష్ణ ద్వయాంతర  గత ప్రమదావృతాసు –ద్రుక్పాత శాసిత పరస్పర యష్టి పాత –పాద క్రమాసు విహ్రుతం కిల మదలీషు ‘’అనేక రూపాలతో కృష్ణుడు గోపికలతోరాస క్రీడలు చేశాడు .చాణూర,కంస వదలను స్మరించి కృష్ణుని అవక్రపరాక్రమాలను వెల్లడించింది .

గురు పుత్రుని వెదకటం

గురు పుత్రుని తీసుకు రావటానికి సోదరులు బయల్దేరి సముద్రం దగ్గరకొస్తే సముద్రుడు విష్ణు అవతారాలను గుర్తు తెచ్చుకొన్నాడు –‘’బలే రుపా హృత్య బలారయే శ్రియం –నినీషు రేష స్పుట ఖర్వా వేషయుక్  -నఖాగ్ర నిర్నేజన మాత్ర పాధసో –గాభీరతా గర్వ మపాహర నమ్మ ‘’బలి నుంచి సంపదలు హరించి దేవేంద్రునికి ఇవ్వాలనుకొని వామనావతారం దాల్చి విష్ణువు త్రివిక్రముడై ,నా లోని నీళ్ళను తన చేతి గోళ్ళను కడగ టానికి మాత్రమే సరి పోయేట్లు చేసి ,నా గాంభీర్యాన్ని పోగొట్టాడు’’ .అని సముద్రుడన్నాడు .తాను  వచ్చిన పని కృష్ణుడు చెప్పి సముద్ర  తరంగాల చేత భక్షింప బడిన గురు పుత్రుని తెచ్చిమ్మని ఆదేశించాడు .భయ పడ్డ సముద్రుడు తనలో దాగి ఉన్న’’ పంచ జనుడు ‘’అనే రాక్షసుడు భక్షించాడని చెప్పాడు .సముద్ర జలాన్ని కల్లోలపరిస్తే ఆ రాక్షసుడు బయటపడితే వాడితో యుద్ధం చేసి చంపేశాడు .వాడి శరీరం లోపల గురుపుత్రుడు కనిపించ లేదు .కాని’’ పాంచ జన్యం ‘’అనే శంఖం మాత్రం లభించింది .యమ నిరుతులవైపు సాగిపోయారుఆకాశమార్గాన రధం లో  బలరామ కృష్ణులు .

భూమికి 86 వేల ఆమడల దూరం లో సంయమనీ నగరానికి వెళ్లి యముని చూశారు .మహర్షులతో యముడు వైదిక ఉపాసనా ఫలితం మోక్షమా ,వేరేదైనా అని గోష్టి నిర్వహిస్తున్నాడు .ఆత్మ నిత్యానిత్యాలపై చర్చిస్తున్నాడు .ఇంతలో శ్రీకృష్ణ శంఖ ధ్వని విని భయ కంపితుడై ,స్వాగతం చెప్పి స్తోత్రాలు చేశాడు –

‘’జయ ప్రభో జామ్జహి జంతు సంతతే –ప్రతార యంతీ మసతీం యదా గుణైః-న శక్తి రేతాం వినిహంతుమంతరా-భావస్ప్రసాదాదితి వేదనిర్ణయం ‘’-ప్రభూ జయం .ప్రాణులను మోసగించే మాయను చంపు .నీ అనుగ్రహం లేకపోతె మేము దాన్ని చంపలేము అన్నాడు .’’తవ స్వరూపం నిగమాంత చు౦బి తం –హరుడా పరిశ్వక్తుముదార దర్మనా –ఉపాసతే త్వా ముదరే ప్యనాహతే –సహస్ర పత్రే నిగృహీత మానసాః’’-వేదాంత వేద్యమైన నీ రూపం మనసులో నింపుకొని సత్పురుషులు మణిపూరక అనాహతాలలో  సహస్రారం లో ఉపాసన చేస్తున్నారు .’’

ఈ ‘’సుత్తి ‘’ని విని సూటిగా ‘’మా గురుపుత్రుని అపహరించావు వెంటనే ప్రాణాలతో అతన్ని ఇచ్చెసెయ్యి ‘’అన్నాడు . వెంటనే  గురు పుత్రుడైన’’ శివ బాలుడి’’ని తెప్పించి కృష్ణునికి అప్పగించేశాడు యముడు .

‘’యమార్పితం ప్రాణ భ్రుతే ద పశ్యతాం –తపస్వినాం దేహ మకల్పయ ద్విభుః-చరాచరా కార సుక్ల్పనావిదః –కిమస్య మాయా మనుజస్య దుశ్శకం  ‘’ యముడిచ్చిన  ఆ జీవుడికి పూర్వం ఉన్న భౌతిక దేహాన్ని వచ్చేట్లు చేశాడు వాసుదేవుడు .సమస్తసృ ష్టి రూపకర్తకు అసాధ్యం ఉంటుందా ? సముద్రం లో మునిగితే యమలోకానికి ఎలావచ్చానని కుర్రాడు అడిగితె జరిగింది చెప్పాడు .శివ బాలుడు అడిగిన యోగి, మాయ మొదలైన వాటిని అర్ధమయ్యేట్లు చెప్పాడు .

గురు దక్షిణ గా పుత్ర సంజీవనం

భూమిమీదకు వచ్చి గురు ఆశ్రమం చేరారు .గురువుకు పుత్రుని ‘’సమర్ప మాయాస సుతం స దక్షిణా-మివ క్రతో స్సద్గురవే స దక్షిణః ‘’క్రతువు చివర మంచి దక్షిణతో ఇచ్చినట్లు గురువుకు సమర్పించాడు .శిష్యుడైన కృష్ణుని గురువు సాందీప ముని ‘’భో రామ కృష్ణ జగతీతల భాగ్య రాశీ –విద్యా విడంబన మయం మామ పుణ్య పాకః –యుష్మద్దయా రస విలాస భావశ్శివ శ్రీ –కృష్ణ ప్రసాద ఇతి సంవ్యవహార మేతు ‘’-నీకు నేనేదో విద్య నేర్పటం నా పూర్వ జన్మపుణ్య  ఫలం .నీ దయ వలన మళ్ళీ జన్మించిన శివుడనే ఈ పిల్లాడిని  ఈ రోజు నుండి ‘’కృష్ణ ప్రసాదు ‘’అనే పేరుతొ పిలుచుకొంటూ నా కృతజ్ఞతను తెలుపుకొంటాను ‘’అన్నాడు శాస్త్రి గారికి కూడా ఈ కావ్యం రాసిన తర్వాత పుట్టిన కుమారుడికి ‘’కృష్ణ ప్రసాద్ ‘’పేరే పెట్టారని ముందే చెప్పుకొన్నాం ఈ కావ్యానికి వారి జీవితానికి ఉన్న అవినా భావ సంబంధం మహోత్క్రుస్టం .

.

కావ్యం లో కరుణ రసానికి అధిక ప్రాధాన్యమిచ్చారు .వీర ,అద్భుత రసాలు అ౦గాలుగా అమరాయి .కావ్యనాయకుడు శ్రీ కృష్ణు నిలో శాంత రసం కనిపిస్తుంది .భక్తీ రసం పొంగింది కూడా .శిష్యులకు  గురు భక్తీ శుశ్రూష ఉండాలి .ఆసుర శక్తిని దైవీ శక్తి జయిస్తుంది అనే సందేశం .

కావ్యం చివర గురు దంపతులకు శ్రీకృష్ణుడు తన గోలోకాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు –‘

‘’కృష్ణో గురూక్త మనుమాన్య తదేతి సర్వం –సర్వోపరిస్తి త  మశాంత దియా మగమ్యం

రమ్యం ప్రశాంత ముపదర్మ యతి స్మదివ్యం –గోలోక మేక మనయోర్నయనోత్సవాయ ‘’గురువు కోరికపై కృష్ణభగవానుడు దివ్యమైన గోలోకాన్ని దర్శింప జేశాడు .మనసు ప్రశాంత మైనది  .కన్నుల పండువుగా దర్శించి పులకించారు .

‘’గోలోకాలోక నేన ప్రముదిత వదనశ్రీ –గురుభ్యాం గురుభ్యాం

ఆశీరర్భిః ప్రేష్య మాణౌ కృత జయ నినదై రుజ్జయిన్యా౦ జనౌఘైః-

తుస్టౌ శ్రీరామ కృష్ణావ ను కలముదయత్పుత్ర విశ్లేష  బాష్ప –స్థానా దేశం స్వ పిత్రో స్సపది విదధతుః లోచ నానాం ప్రహర్షం ‘’

గోలోక సందర్శనం చేత సంతసించిన గురు దేవుల ఆశీస్సులు పొంది ,ఉజ్జయిని జనులంతా జయ ధ్వానాలతో వీడ్కోలు పలుకగా ,తమ తలి దండ్రుల  పుత్ర వియోగ దుఖాన్ని  పోగొట్టి సంతోషం కలిగిస్తూ బలరామ కృష్ణులు ఇంటికి బయల్దేరి వెళ్ళారు .అని కద ను సమాప్తం చేశారు .ఈ చివరి అధ్యాయాన్ని ‘’విజయ విలాససర్గ  ‘’అన్నారు .అయిదవ దాన్ని ‘’లీలా విలాస సర్గ’’అని నాలుగవ దాన్ని ‘’కళా విలాస సర్గ ‘’అని మూడవ దానిని ‘’శుశ్రూష విలాస సర్గ ‘’అని రెండవదాన్ని ‘’విధి విలాస సర్గ ‘’అని మొదటి దానిని ‘’ఉదయ విలాస సర్గ ‘’అని సార్ధకం గా పేర్లు పెట్టారు .కావ్యం లో శాస్త్రిగారి భాషా ,శాస్త్ర పాండిత్యం ,అలంకార వైదుష్యం ,శాస్త్ర యోగ వేద వేద వేదాంగ రహస్య జ్ఞానం ,లోక వ్రుత్తి ,ప్రస్పుటంగా కనిపిస్తాయి శ్లోకాలు పరమ మనోహరంగా తీర్చిదిద్దారు .వారి అపూర్వ ప్రజ్ఞకు అంజలి.  .శాస్త్రిగారి కుమారులు శ్రీ జయ సీతా రామ శాస్త్రిగారు కూడా గొప్ప సంస్కృత విద్వాంసులు .నైషధం పై ‘’నైషధీయ పరామర్శ ‘’అనే సంస్కృత వ్యాఖ్యానం రాసి తండ్రి కి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు .

పుష్పగిరి పీఠాదిపతులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారు ఆశీస్సుల౦దజేస్తే   ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవి అవధాన శిరోమణి ,విద్యా వారధి ,మహా మహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణా చార్యులవారు –

‘’అక్షీణై ర్గురుశిక్షణై శ్శుభకరై ర్వాణీకటాక్షోత్కరై –ర్వైదుష్యం,యదనుత్తమం ,సుకవితా పుష్టం,త్వయా సాదితం

తస్యాన్త్యంత పవిత్రతా చతురతా గంభీరతా భూ,రహో –శ్రీ నారాయణ శాస్త్రి వర్య సుకవే తే’’పుత్ర సంజీవనం ‘’అని కవినీ, కవిత్వాన్ని, శేముషినీ  మెచ్చి ఆశీర్వదించారు .కావ్యానికి ‘’పుత్ర సంజీవనం ‘’అనే పేరు అన్నిరకాలా సమర్ధ నీయంగా ఔచిత్య వంతం గా ఉంది .

శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారి దంపతుల ఫోటో జత చేశాను చూడండి

మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం

సశేషం

శ్రీ వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.