గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 405’’-శ్రీ హర్ష నైషద దర్శన పరామర్శ’’కర్త శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

405’’-శ్రీ హర్ష నైషద దర్శన పరామర్శ’’కర్త శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు

శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి శ్రీమతి బాలా త్రిపుర సుందరి దంపతులకు 24-2-1945 న గుంటూరు జిల్లా రేపల్లె లో శ్రీ జయ సీతారామ శాస్త్రి గారు జన్మించారు .అక్కడే ప్రాధమిక ,ఉన్నత విద్య నేర్చి1966లో తెలుగు సంస్కృతాలలో భాషా ప్రవీణ పాసైనారు .గుంటూరు లో కొలచల కృష్ణ మూర్తి గారి కాలేజి లో సంస్కృత పండితులుగా పని చేశారు .విజయ వాడకు చెందినా శ్రీశొంఠిసూర్య నారాయణ శ్రీమతి లక్ష్మీ ప్రసూనాంబ దంపతుల కుమార్తె శ్రీమతి గాయత్రి ని 7-5-1966లో వివాహం చేసుకొన్నారు వీరికి ఒక ఆడపిల్ల ముగ్గురు కుమారులు జన్మించారు . .1970 నుండి రేపల్లె లో తండ్రిగారు స్థాపించిన సంస్కృత కళాశాలలో లెక్చరర్ గా పని చేశారు .తర్వాత జిల్లెళ్ళమూడి అమ్మ గారి సంస్కృత కళాశాలలో 1994వరకు సేవలందించి కృష్ణా జిల్లా గన్నవరం దగ్గరున్న బుద్దవరం కాలేజి లో ఉద్యోగించి 2003 లో రిటైర్ అయ్యారు .

నోరి నరసింహ శాస్త్రి గారి ప్రేరణతో ‘’క్షేత్రయ్య పద సాహిత్యం ‘’ను పరిష్కరించి ప్రచురించారు .వీరి సంస్కృత భాషా పాండిత్యం మేరలేనిది. తండ్రికి తగ్గ తనయులు .అందుకే వీరి ప్రతిభకు తగిన గుర్తింపు తీసుకు రావటానికి శ్రీ సన్నిధానం సుదర్శనం గారు తిరుపతి సంస్కృత కాలేజి కి తీసుకొని వెళ్ళారు .అక్కడ ప్రచురణ శాఖలో సూపరింటే౦ డెంట్ గా  ఉన్నారు .సంస్కృత గ్రంధాలను పరిశోదించటం  ముద్రణ లో తప్పులు సరి చూడటం చేస్తున్నారు  . ఇప్పటికి ఆ ప్రాజెక్ట్ కింద సుమారు 50 సంస్కృత గ్రంధాలను  ప్రచురించారు వీటి ప్రచురణలో శాస్త్రిగారి కృషి అద్వితీయం .ఇప్పుడు శైవానికి చెందిన ‘’నీల కంఠ భాష్యం ‘’ప్రచురణలో సహాయ పడుతున్నారు .

సీతారామ శాస్స్త్రి గారికి అమరకోశం ,రామాయణ పారాయణం ఉపదేశించిన తల్లి శ్రీమతి బాలమ్మగారు .కావ్య  శాస్త్రాలను లను సంప్రదాయ పద్ధతిలో పాఠం చెప్పి మంత్రోప దేశం చేసినవారు తండ్రిగారైన నారాయణ శాస్త్రి గారు .వీరిద్దరూ తమకు ఆది గురువులైనారని శాస్త్రిగారు వినమ్రంగా తలిదండ్రులకు కృతజ్ఞత తెలుపుకున్నారు .భాషా ప్రవీణ చదివే రోజుల్లో’’ ఉత్తర నైషద కావ్య కర్త’’  శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారి శిష్యరికం చేసి’’ జ్ఞానాన్జన శలాక తో చక్షురున్మీలనం ‘’పొందానని గురు భక్తీ చాటుకొన్నారు .తనను మంచి మనిషిగా ,మంచి ఉపాధ్యాయునిగా ,సద్విమర్శకునిగా తీర్చి దిద్దిన వారు రేపల్లె వాస్తవ్యులు మిత్రులు అయిన కవిసామ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు అని గర్వంగా చెప్పుకొన్నారు .

శ్రీ  బాలా త్రిపురసుందరీ ఉపాసకులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ‘’నైషద కావ్య ‘’రహస్యాలను వేలకొలది ఎరుక పరచారని ,జ్ఞాన జ్యోతిని వెలిగించారని ,చింతామణి మంత్రాన్ని ఉపదేశించి ఆశీర్వ దించారని ,దాని ఫలితమే ‘’శ్రీ  హర్ష నైషధం –దర్శన పరామర్శః ‘’అనే తన సంస్కృత పరిశోధన గ్రధం అని సీతా రామ శాస్త్రి గారు సెలవిచ్చారు .శ్రీ కంచి కామకోటి శారదా పీఠాది పతులు ,పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహ ఆశీర్వచనాలు వెన్నుదన్నుగా నిలిచాయి .శ్రీ వారు ‘’శ్రీహర్షుని తల్లిపేరు మామల్లదేవి ‘.మామల్ల తమిళపదం.మహా బలిపురానికి మామల్ల పురం అనే పేరుంది .ఈ దృష్టితో శ్రీ హర్షుని జీవిత విశేషాలను ఎవరైనా పరిశోధిస్తే బాగుంటుంది ‘’అని సెలవిచ్చిన మాట తనకు ఈ జన్మ అంతా పులకింతలు కలిగిస్తూనే ఉంటుంది అని పరవశం తో శాస్త్రి గారన్నారు .

ఇదికాక శాస్త్రిగారు సంస్కృతం లో ‘’శ్రీ మాత్రుస్తవః ‘’ రాశారు అమ్మవారి అనుగ్రహం తో .ఒక గంటలో ‘’శాలినీ వృత్తం’’ లో పది శ్లోకాలు రాశారు .ఇది దేవీకృప ,గురుదేవుల అనుగ్రహం అన్నారు .దీనికి  ఆర్ష విద్యా ప్రచారకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు తెలుగులో వివరణ రాశారు .మొదటి శ్లోకం లో

‘’శ్రీ విద్యాం చిన్ముద్ర యుక్తాం భవానీం –చిత్తోన్మాద ద్వంసినీం ,చిన్మయీం ,మాం

మొహాతీతాం ,ముగ్ధ హృద్యాం మ్రుడానీం-శ్రీం మంత్రార్ణోద్భవ  భాగ్యాం,ప్రణౌమి ‘’

ఎనిమిదవ శ్లోకంగా

‘’వాక్కూటస్తాం ,శారదాం మౌని పూజ్యా౦ –శ్రీదాం ,లక్ష్మీం ,మధ్య కూటే వసంతీం

జ్ఞాని జ్ఞేయాం ,శక్తి కూటేవిహర్త్రీం –శ్రీం మంత్రార్నో ద్భవ భాగ్యాం ప్రణౌమి ‘’

చివరిది అయిన పదవ శాలినీ శ్లోకం ‘’

‘ షట్చక్రో పర్యున్మ నీస్థా,మగమ్యాం-యోగీన్ద్రాణా,మాత్మ శుద్ధిం దిశంతీం –

సోహంభావో ద్భాస బుద్ధీడ్య మానాం-శ్రీ మంత్రార్నోద్బ ద్ద భాగ్యాం ప్రణౌమి ‘’అంటూ ఆశువుగా అమ్మవారి లీలావిలాసాన్ని అత్యంత భక్తితో వర్ణించారు. ఇందులో చివరిపాదం మకుటంగా ఉండటం విశేషం .దీనికి ‘’మాత్రు స్తవం ‘’ను అనుబంధంగా అయిదు శ్లోకాలు రాశారు .

దీనితోబాటు శాస్త్రిగారు ఇరవై అయిదు శ్లోకాల ‘’గాయత్రీ జయ రామం ‘’అనే చిన్న కావ్యాన్ని సంస్కృతం లో రచించారు .

సీతారామ శాస్స్త్రిగారు తమ అన్నగారు  రామ సుబ్రహ్మణ్య శాస్త్రి ,తమ్ముడు శ్రీ కృష్ణ ప్రసాద్ గారలతో కలిసి ‘’ముళ్ళపూడి సోదరులు ‘’పేరుతొ ‘’సీతాయాః చరితం మహాత్ ‘’ను శ్రీ గాయత్రీ జయ రామ కావ్య సహితంగా  రాశారు .

శ్రీ హర్ష నైషధీయ దర్శన పరామర్శ

శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు తాను  సంస్కృతం లో రాసిన నైషద పరామర్శ లోని ప్రధానాంశాలను తెలుగు లో అందరికి అర్ధమయేట్లు రాశారు .ఆ విషయాలనే మీ ముందు ఉంచుతున్నాను .శ్రీ హీరుడికి మామల్లదేవికి జన్మించిన కుమారుడే శ్రీహర్ష కవి .చింతామణి వర ప్రసాదుడు .నైషద కావ్యాన్ని సంస్కృతం లో రాసిన ప్రతిభా శాలి .ఈ కవి కాశ్మీర దేశపు వాడని శాస్త్రిగారు సోపత్తికంగా నిర్ణయించారు .ఆంద్ర నైషధం లో శ్రీనాధుడు తెలియ జేసిన అనేక  శాస్త్రీయ విషయాలపై ఒక వ్యాసం రాస్తే శ్రీ నోరి నరసింహ శాస్త్రి ఏంతో  మెచ్చారు .1980 లో తిరుపతి ఓరియెంటల్ కాన్ఫరెన్స్  లో ఈ వ్యాసం శాస్త్రి గారు చదివి అందరి ప్రశంసలను పొందారు .శ్రీ గాలి పార్ధ సారదిగారి వద్ద పి హెచ్ డి చేయటానికి’’ నైషధీయ దర్శన పరామర్శ ‘’ను ఎన్నుకొన్నారు .నైషధం లో ప్రబంధ ధ్వని ఉన్నట్లు గోచరించింది .కాని సారధి గారు లేనిపోని అర్దాలకోసం పాకులాడవద్దని నిరుత్సాహ పరచారు . .అప్పుడు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్దకు చేరి సంశయ నివృత్తి చేసుకొని కొత్త వెలుగులను దర్శించారు .శ్రీహర్షుడు మహా భారతం నుండి పూర్తీ నలచారిత్రను తీసుకోకుండా నలదమయంతుల వివాహం వరకే తీసుకొని 22సర్గల మహాకావ్యం రాశాడు .ఇందులో హంస పాత్ర ,భీమ నల పాత్రలలో ఉన్న సంకేతార్ధం ,ఇంద్రాదులుప్రవేశించటం లో అంతరార్ధం ,నలుడిని తమ దూతగా పంపి వెంటనే దమయంతి వద్దకు దూతికలను పంపటం లో ఉద్దేశ్యం ,భీమ నలులను సరస్వతి దేవి అనుగ్రహించటం ,కలిని ప్రవేశ పెట్టటం ,చంద్ర వర్ణన తో కావ్యాన్ని పూర్తీ చేయటం ,ప్రతి సర్గలో ‘’ఆనంద ‘’పదం ఉండటం ,చంద్ర ,అమృత ,శ్రీ శబ్దాలను ప్రయోగించిన తీరు అన్నీ వింతగా ఉన్నాయి .

బంగారు హంస ‘’బ్రహ్మ వాచకం ‘’.హంసను చెలులు పట్టుకోబోతుంటే దమయంతి ‘’నైవాశ కునీ భావేన్మే’’అంటే ఈ హంస నా విషయం లో పక్షికాదని అనటం ప్రత్యెక విషయాలు .’’పాఠం లాగా వేదాంత విషయాలను అభ్య సించి నప్పటికీ సమాధి స్తితికి వచ్చిన యోగికి మాత్రమె ఆనంద స్వరూపమైన బ్రహ్మ దొరుకుతాడు ‘’అని హంస అన్నమాటలు మామూలువి కావు .మానవ శరీరం లో హంస సంచారం అంటే ప్రాణ సంచారమే .ఆత్మ దర్శనం కోసం యోగి హంసను బంధిస్తాడు .అందుకే నలుడు ‘’దేన్నీ చూడటానికి నిన్ను పట్టానో ఆ రూపాన్ని చూశాను ‘’అనటం లో పరమార్ధం అదే .

రెండవ అధ్యాయం లో హంస నలునితో ‘’సరసీః పరి శీలితుం మయా ,గమి కర్మీకర్త నైకనీ వృతా ‘’అనే శ్లోకం లో గమి కర్మీకృత పదం వ్యాకరణ పాండిత్యం తో చెప్పిందికాదని వ విశిష్టా  ర్ధం తో చెప్పినదని శాస్త్రిగారు భావించారు .మన శరీరం లో మొత్తం 21,600 హంసలు ప్రయాణిస్తూ ఉంటాయి ..అందుకే శ్రీనాధుడు కూడా ఈ పదాన్ని అలాగే తెలుగు అనువాదం లో వాడాడు .శ్రీగుంటూరు శేషేంద్ర శర్మ కూడా ఇదే ఆలోచన చేశారు .దమయంతి దగ్గరకు వందమంది అప్సరసలు చెలికత్తెలుగా వచ్చారు. చాన్దోగ్యం ప్రకారం వందనాడులు మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రయాణం చేస్తాయి అని ఉంది దానికిది సంకేతం .ఇదే సుషుమ్నా నాడి .

దమయంతి ఒక రాజకుమారిమాత్రమే కాదు .విద్యా శక్తి జ్ఞాన విద్య .ఆమెను పొందిన జీవుడు పరమాత్మ అవుతాడు .ఈమె తండ్రి భీముడు .అంటే కామ క్రోదాదులకు భయంకరుడు .ఇంద్రియ నిగ్రహుడు అయిన దముడు అనే రుషి ప్రభావం తో భీమ రాజుకు దమింప జేసేడైన దమయంతి జన్మించింది .ఆమె సాక్షాత్తు శ్రీయే నంటారు శాస్త్రీజీ . ఏడవ సర్గలో శ్రీహర్షుడు దమయంతిని మూడు భాగాలుగా వర్ణించాడు .కేశాలనుండి చుబుకం వరకు ,మెడనుండి రోమాళి వరకు ,మూడవసారి కిందిభాగం వర్ణిస్తాడు .ఈ మూడు మూడు కూటాలు .అవి వాగ్భవ ,మధ్య ,శక్తి కూటాలు .కూట త్రయ కళేబరం లలితా దేవిది అలాంటిదే దమయంతి సౌందర్యం .ఆమెయే  తను మధ్యమం లో అణిమ ,శ్రోణి ,వక్షోజాలలో గరిమ ,చేతం లో వశిత్వం, నవ్వులో లఘిమ ,నలుని విషయం లో  ఈశిత్వం ,సూక్తి రమ్యత్వం లో ప్రాకామ్యం ,యశస్సులో ప్రాప్తి అనే అష్ట సిద్దులతో పరమాత్మ నిన్ను సృష్టించాడని నలుడు దమయంతిని 10 వ సర్గలో పొగడటం లో అంత రార్ధమిదే నంటారు శాస్త్రిగారు.

నలుడు అంటే సాధకుడైన జీవవుడు .పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాడు .’’రలయో రభేదః ‘’అంటే రా కి ల కి భేదం లేదు .నరుడే నలుడు అని భావం .

‘’నిషీయ యస్య క్షితి రక్షిణః .కదాః తదాద్రి యంతేన బుధా స్సుదామసి –నలస్షిత చ్చత్రిత కీర్తి మండలః నరాశిరా సీన్మ హసాం మహోజ్వలః ‘’అని కావ్య ప్రారంభం లో నలుడినికవి నిశీయ అనే అవ్యయం తో కావ్యాన్ని ప్రారంభించాడు .అంటే అవ్యయ పురుషుని వర్ణించాడని అంటారు శాస్త్రిగారు .ఈ కద వినే వారు అమృతాన్ని వద్దు అంటారట .క్షితి శబ్దం కూడా ప్రత్యేకమినదే .అంటే శరీరం అని ,దాన్ని రక్షించేవాడుపరమాత్మ అని లోని అర్ధం .అమృతత్వం లభిస్తుందని అర్ధం హర్షుడు ఇలాంటివి ఎన్నో నిక్షిప్తం చేశాడు .అన్నీ ఉపనిషద్వాక్యాలేనంటారు .జీవుడు విద్య కోసం ప్రయత్నిస్తాడు. దానికి కొన్ని అర్హతలుకావాలి .జ్ఞాన విద్య తనకు అనుకూలమా కాదా అని తెలుసుకోవాలి .అదే దేవతల ద్యూతం .’’భీమజ ‘’తో యోగం పొంది అద్వైతం పొందటమే నలపాత్ర .

పదిహేడవ సర్గలో ‘’కలి’’ప్రస్తావనలోను వేదాంతం ఉంది .చివరిదైన 22 వ సర్గలో చంద్రోదయ వర్ణన .అగ్ని ,సూర్య సోమ ఖండ  త్రయాత్మకమైన పంచ దశి మంత్రానికి శ్రీం చేరిస్తే నాల్గవ ఖండం అయి ‘’చంద్ర కళా ఖండం ‘’అవుతుంది .ఇది చంద్ర వర్ణన పరస్పరాను బద్ధాలు .శ్రీం శబ్దాన్ని సహస్రారం లో ధ్యానిస్తారు .ఇన్ని అర్ధాలు నైషద కావ్యం లో కవి నిక్షిప్తం చేశాడని ఇది కేవలం నల దమయంతుల కద కాదని జాగ్రత్తగా గురువుల దగ్గర చదివి అంతరార్ధాన్ని గ్రహించాలని శ్రీహర్ష కవి ఒక శ్లోకం లో ముందే చెప్పి హెచ్చరించాడు –

‘’గ్రంధ గ్రంధి రిహక్వచిత్ క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా –ప్రాజ్ఞాన్మన్యమనా హఠేన పఠితీ,మాస్మిన్ ఖల ఖేలతు

శ్రద్ధా రాద్ద్ధ గురుఃశ్లదీకృత దృఢ గ్రన్ధిః సమాసాదయ –త్వేతత్ కావ్య రసోర్మి మజ్జన సుఖ వ్యాసజ్జనం సజ్జనః ‘’అంటే ఈ గ్రంధం లో క్లిష్టమైన ముడి ని నేను అక్కడక్కడ కావాలనే ప్రయత్న పూర్వకం గా వేసి ఉంచాను .పండితుడినని ,ప్రాజ్నుడనని మూర్ఖుడు కావ్యములోకి మూర్ఖుడు ప్రవేశించ రాదు .గురువులను శ్రద్ధతో ఆరాధించి ,వారి అనుగ్రహం తో నేను వేసిన ‘’దృఢ గ్రంధి ‘’ని కొంత కొంత వదులు చేసుకొని ,విప్పుకో గలిగిన సజ్జనుడికి మాత్రమె ఈ కావ్యామృతములో సుఖం గా స్నానమాడు గాక ‘’అన్నాడు మహాకవి శ్రీ హర్షుడు .ఇవన్నీ వ్యంగ్య నిర్ధారణకు సాక్ష్యాలు అంటారు జయ సీతా రామ శాస్త్రి గారు .ఈ విధంగా ప్రబంధ ధ్వని నైషద కావ్యమంతా విస్తరించి ఉందని ఎన్నో వివరాలతో విపులమైన వ్యాఖ్యానం సంస్కృతం లో రాసి పి హెచ్ డి సాధించారు .సాధారణ పాఠకులకోసం తెలుగు ఇంగ్లీష్ లలో  లో వివరణ నిచ్చారు .శ్రీహర్షుని శ్లోకం తోనే తన పరిశోధనా వ్యాసాన్ని ముగించారు శాస్త్రిగారు –

‘’మదుక్తి  శ్చేదంతర్మదయితు సుదీ భూయ –కి మస్యా నామస్యాత్ అలస పురుషా నాద రభరైః ‘’

ఆధునిక సంకేతికతో శాస్త్రి గారు చాలా చక్కగా వేదాంత పరంగా విశ్లేషించారని ధిల్లీ యూని వర్సిటి సంస్కృత  శాఖాధిపతి మెచ్చారు .మొత్తం మీద అపూర్వ సిద్ధాంత గ్రంధం శాస్త్రిగారి ‘’నైషధీయ దర్శన పరామర్శ ‘’.వారి సర్వ శాస్త్ర పాండిత్యానికి ,గీర్వాణ భాషా ధిషణకు దర్పణం .

శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ఫోటో కింద జత చేశాను చూడండి .

మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం

సశేషం

శ్రీ వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-15 –ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.