గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 – ఆంద్ర ప్రదేశ్ కు చెందిన కవులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

410 నుండి రాస్తున్న కవులందరూ ఆంద్ర ప్రదేశ్ కు చెందినవారు ,స్వాతంత్ర్యానంతరం గత అరవై ఏళ్ళకు పైగా సంస్కృతం లో రచనలు చేసిన వారు, చేస్తున్నవారు .వీరందరి గురించి రాసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు అది నా అదృష్టంగా భావిస్తున్నాను . వీరందరి విషయాలను సేకరించటానికి యు. జి .సి. ఒక జాతీయ సదస్సును ‘’సంహూతి ‘’పేరిట విజయవాడ మేరీస్ స్టెల్లా  కాలేజి లో 2008ఆగస్ట్ 11,12 తేదీలలో నిర్వహించి, వివిధ జిల్లాలకు చెందిన కవులు, వారి సంస్కృత రచనపై పత్ర సమర్పణ చేయించింది .వీటిని ఒక పుస్తకం గా’సంహూతిః’’(అందరు కలిసి ఇచ్చిన పిలుపు )అనిపేరు పెట్టి  ప్రచురించింది .ఇది గొప్ప ముందడుగే .అయితే సమగ్రం  మాత్రం కాదు .కవుల రచనలగురించి మాత్రమె ఇందులో ఉందికాని వారి జీవిత చిత్రణ లేదు .దీనిని నేను కోరగానే నాకు పంపిన డా శ్రీ పాల పర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .మిగిలిన సోర్సులనుండి మరింత వివరాలు సేకరించి ఈ సీరియల్ ను సమగ్రం  చేసే ప్రయత్నం చేస్తాను .ఒక వేళ లభించక పొతే చేసేది లేక ఈ గ్రంధం లోని విషయాలే ఉటంకిస్తాను అని మనవి చేస్తున్నాను .ఈ సదస్సు నిర్వహణకు ,పుస్తక ప్రచురణకు మెరిస్ స్టెల్లా కాలేజి సంస్కృత శాఖ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ – డాక్టర్ ధూళిపాళ రామ కృష్ణగారు తోడ్పడ్డారు .రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ హరేకృష్ణ శతపతి ,శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శన శర్మ ,మద్రాస్ యూని వర్సిటిలో వైష్ణవిజం ప్రొఫెసర్ డా.ఏం నరసింహా చారి ,రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కే వి.రామ కృష్ణమాచార్యులు మొదలైన ఉద్దండులు అండగా నిలిచి విజయం చేకూర్చారు .

మొదటగా కృష్ణా జిల్లాకవులు ,వారి సంస్కృత రచనలతో ప్రారంభిస్తాను .సంహూతి లో దీనిపై పత్ర సమర్పణ చేసినవారు .అవధాన సరస్వతి డా శ్రీ పాల పర్తి శ్యామలానంద ప్రసాద్ .శ్యామలానంద విశ్వనాధ సంస్కృత రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన గీర్వాణ భిషక్కులు .సంస్క్రుతావధానం  చేసిన అవధాని .కాశీ విశ్వేశ్వరునిపై సంస్కృత  సుప్రభాతంరాసిన భక్త శిఖామణి . వీరిలో మొదటికవిగా శ్రీ విశ్వనాధ ను గురించి రాస్తున్నాను .

410-విశ్వం పట్టనికవి,సాహితీ కల్ప వృక్షం  శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు

జీవితం

విశ్వనాధ శోభనాద్రి ,పార్వతి దంపతులకు విశ్వనాధ సత్యనారాయణ 10-9-1895 కృష్ణా జిల్లా నందమూరు గ్రామం లో జన్మించారు .చిన్ననాతనుండే కవిత్వం చెప్పటం అలవాటై చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి శిష్యరికం లో రాటు దేలారు .బెజవాడ ఎస్.ఆర్ ఆర్ . కాలేజిలో తెలుగు లెక్చరర్ గా ఉద్యోగం ప్రారంభించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా రిటైర్ అయి ,కరీంనగర్ కాలేజిలో ప్రిన్సిపాల్ గా చేరి రెండేళ్ళు పని చేశారు .

కొడాలి ఆ౦జ నేయులుగారితో కలిసి అష్టావధానం చేశారు .తెలుగు సాహిత్యం లో దాదాపు అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేసినవాడు విశ్వనాధ .’’నవ్య సంప్రదాయాఉద్యమం ‘’కు  ఆద్యుడైనిలిచాడు .కవితా చతుర్ముఖుడు .జాతీయాభిమానం ,ధర్మ వీరం ,శాంత కరుణం ,భక్తీ భావం ఇవే చతుర్ముఖాలు .ఆంద్ర ప్రశస్తి తెలుగు ఋతువులు ఆంద్ర పౌరుషం కోకిలమ్మ పెళ్లి  లలోఆంద్ర  జాతీయాభిమానం ,ఝాన్సి రాణి శివార్పణం మున్నగు వానిలో జాతీయాభిమానం ,కుమారాభ్యుదయం ,ప్రద్యుమ్నోదయం ,రురు చరిత్రలలో ధర్మ వీరం ,శాంతం  అంతర్వాహినులై ప్రవహించాయి .కిన్నెర సానిపాటలు ,వరలక్ష్మీ త్రిశతి లలో కరుణ పొంగిప్రవహించింది .మాస్వామి ,విశ్వనాధ మధ్యాక్కరలు ,భ్రమర గీతంగోపికా గీతాలు ,శ్రీ కృష్ణ సంగీతం లలో భక్తీ పారవశ్యం ఉన్నాయి

మొదట్లోభావకవి గా గిరికుమారుని ప్రేమగీతాలు ,శాశిదూతం శృంగార వీధి రాసి ఉన్నత స్థానం పొందారు .వందలాది ఖండకావ్యాలు ,విమర్శనా వ్యాసాలూ రాశారు .అల్లసాని వారి అల్లిక జిగిబిగి , నన్నయ గారి ప్రసన్న కవితా కదా కలితార్ధ యుక్తి  ఒకడు నాచన సోమన ,చాల ప్రసిద్ధి చెందాయి .పురాణ వైర గ్రంధమాలగా అనేక నవలలు రాశారు .  విశ్వనాధ’’ మాగ్నం ఓపస్ కావ్యం’’ శ్రీమద్రామాయణ కల్ప వృక్షం .తన సకలోహ సారంగా రాశారు ఇది విశ్వనాధ జీవుని వేదన తండ్రిగారి కోరిక .రాయటానికి 35ఏళ్ళు పట్టింది .మిగిలినవన్నీ రోజుల్లో డిక్టేట్ చేసి రాయిన్చినవే అందుకే ఆయనను ‘’గ్రేట్ డిక్టేటర్ ‘’అన్నారు సరదాగా ..కల్ప వృక్షానికి  1971లో జ్ఞాన పీఠ పురస్కారం అందుకొన్న తోలి తెలుగు కవి అయ్యారు .వీరి నవలేతిహాసం అంటేక్లాసిక్ నవల ‘’వేయి పడగలు ‘’దీనికి ఆంద్ర విశ్వ విద్యాలయం నగదు బహుమతి పొందారు .’ప్రక్రుతి సమతుల్యతను ప్రతిపాదించిన నవల ఇది .మూడు తరాల ఆంద్ర జాతి  పరిణామాన్ని చూపించింది .భారతీయతపై పాశ్చాత్య ప్రభావం తిరస్కరించబడింది. ’ఏక వీర ‘’నవల మనస్తత్వ పరిశీలనకు నిలు వెత్తు అద్దం..

కవిసామ్రాట్ ,కళాప్రపూర్ణ ,మొదలైన బిరుదులూ అనేక సాహిత్య సంస్తలచేత పురస్కారాలు పొందారు .భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారమందించి గౌరవించింది .ఉజ్జయిని వారి కాళిదాస సమ్మాన్ అందుకొన్నారు .1966-76కాలం లో ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవులుగా ఉన్నారు .కేంద్ర ,రాష్ట్ర సాహిత్య అకాడెమి సభ్యులైనారు .గుడివాడలో గజారోహణం అందుకున్న కవిసామ్రాట్ విశ్వనాధ .81ఏళ్ళు సార్ధక జీవితం గడిపి 18-10-1976 న కవిసామ్రాట్ విశ్వనాధ సత్య నారాయణ కవితా విశ్వనాధుడై  విశ్వేశ్వరునిలో ఐక్యమయ్యారు .  .

విశ్వనాధ గీర్వాణ కవితా గీర్వాణం

విశ్వనాధ దాదాపు 146 గ్రంధాలను తెలుగు సంస్కృత భాషలలో రాశారు .అందులో సంస్కృతం లో మూడు నాటకాలు ‘అమృత శర్మిస్టం’’ ‘’గుప్త పాశుపతం ‘’’అశని నిరాసనం ‘’రాశారు .సంస్కృత కావ్యాలు శివ పంచశతి ,దేవ త్రిశతి ,గురుప్రసాదం ,శారదా చంద్ర మౌళి సుప్రభాతం ‘’రచించారు .

అమృత శర్మిస్టం

‘’యయా తేరివ శర్మిస్టా భర్తుర్బహు హమతాభవ ‘’అనేకాళిదాసు సూక్తిని ఆధారం చేసుకొని దానికి వ్యాఖ్యానంగా శర్మిష్ట ను నాయిక ను చేసి తొమ్మిది అంకాల మహానాటకాన్ని సంస్కృతం లో రచించారు . దీన్ని ‘’అమృత శర్మిస్టం’’అన్నారు .శర్మిష్ట శాపకారణం గా భూమిమీదకు వచ్చిన అప్సరస .భరత ముని శిష్యురాలై ఆయన నాట్య శాస్త్ర ఆవిర్భవానికి కారకురాలైంది .ఇందులో విశ్వనాధ ‘’రసయానం ‘’అనే దాన్ని ప్రతిపాదించారు .

‘’క్రతు ద్వంసీ సంధ్యా ప్రణయ భర సంస్పంది చరణ –స్పురన్నాట్యక్రీడా ప్రధమ రస నిష్యందన గురుః

తపస్చాంత ర్వ్రుతత్తిః సరస మ్రుదుభావైః పరిణతాం-సమాన స్కందా రోపణకృతి కృపః పాతు  గిరిశః ‘’అనే నాందీ శ్లోకం తో ప్రారంభమైంది. కర్మ జ్ఞాన ధ్యాన మార్గాలతో బ్రహ్మానంద సబ్రహ్మ చారి అయిన రసాను భూతికూడా సమాన ప్రతి పత్తి కలిగి మోక్షాన్ని అమృతత్వాన్ని ఇస్తుంది అని భావం .కాళిదాసుని శాకుంతల నాటకం లో లాగానే సన్నివేశాలు ,ప్రతిపాదనలు ,శ్లోక రచనా ఉన్నాయని శ్లాఘించారు శ్యామలానంద .’’సప్రభాతరలంజ్యోతి రుదేతివసుదా తలాత్ ‘’అన్న కాళిదాసు శ్లోకం తో సమానంగా విశ్వనాధ ‘’భో అమృత లో భాత్ పశ్యన్తి దివి మానవాస్సర్వే ‘’శ్లోకం రాశారు .కావ్యాన్ని ఏదో కాలక్షేపం కోసం చదవ రాదు .అది ‘’రసయానం ‘’మోక్ష దాయకం అవుతుంది అని చెప్పారు విశ్వనాధ .ఈ నాటకానికి భరతవాక్యం గా విశ్వనాధ ‘’

‘’వాచో మహా కవీనాం జయంతు నితరాం భవంతు ఫలితార్ధాః-వాగర్ధ మనో హృదత్ ,వివర్ధతాం రస మయంచ మహః ‘’చెప్పారు .

గుప్త పాశుపతం

పరమ శివుడిని మెప్పించి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించినా ,లోక క్షేమం కోరి దాన్ని కురు క్షేత్ర యుద్ధం లో ఎప్పుడూ ప్రయోగించలేదు .అది గుప్తం గానే ఉంది .యుద్ధం జరిగేటప్పుడు పశుపతి నాధుడైన శివుడు అదృశ్య రూపం లో యుద్ధాన్ని గమనిస్తూనే  ఉన్నాడు .అంటే శివ కేశవులు అద్వైతం గా సృష్టి స్తితి లయలను పర్య వేక్షిస్తూనే ఉంటారు .లోక నాశన కరమైన ఆటం ,హైడ్రోజెన్ బాంబు లాంటి ఆ అస్త్రాన్ని ప్రయోగించని నరోత్తముడు నరుడైన అర్జునుడు .కనుక అర్జునుని మనవడైన పరీక్షిత్తుకు ప్రాణాన్ని రాజ్యాన్ని ,ఇద్దరూ కలిసి ఇచ్చారు .ఆధునికకాలం లో వార్ వెపన్స్ మానవాళికి యెంత ప్రమాదకరమో ఆలోచించుకోవాలని విశ్వ నాద చెప్పిన హితవు ఇది .పది అంకాల మహా నాటకం గుప్త పాశుపతం .వీర రస నాటకం గా కనిపిస్తూనే శాంత రసాన్ని ధ్వనిగా చెప్పింది .వేణీ సంహార నాటక శైలిలో ఇందులో బాలాకీ ,కౌబేరి ,ఘటకుడు అనే విచిత్ర పాత్రల్ని విశ్వనాధ సృష్టించారు .

నాటక పీఠిక లోనే విశ్వనాధ ‘’ఆత్ర చ బహుదా వీరః శాంతే పర్య వశ్యతి .శబ్ద ప్రయోగ లాలిత్యాది విషయేషు గుప్త పాశుపతం ప్రౌఢ మార్గమనుసరతి .ఏతత్ సర్వం కిమపి మహాధ్వని సర్వస్వం .అన్యదప్య స్తితి కించిత్ సర్వం దైవ నిర్మితం .దైవ చలితం .దైవ ప్రవర్తితం ,మహా ప్రళయ  సంబంది కర్మకాత్ మహేశ్వరః ‘’అని తెలియ జేశారు .నరుడైన అర్జుండు నరజాతికి ప్రతినిది . .బాలాకి చేత ‘’అర్జున ! బ్రహ్మ నిస్టస్త్వం .జగాన్నిర్మాణవేత్తాత్వం ‘’అని పిస్తారు .ఇదే ఈనాటక ఉద్దేశ్యం .మానవాళి సుభిక్షంగా ఉండాలన్నది విశ్వనాధ యోచన .భరత వాక్యం లో శివ కేశవులనిద్ద్దరిని కవి విశ్వనాధ –

‘’శాస్త్రై త్వత్ కృపయా యదోః కులపతే జ్ఞాత్వాపి నజ్ఞాయతే –గంగా జూట జుటీక  మృత్యు ముపరి స్తిత్వా భవిష్యామి కిం

దృష్ట్యా ద్యాపి బిభేమి లోకమిహ త్వత్పాదాబ్జ యోర్భంభరీ-భూతం నిత్య పరి భ్రమం తమను మాం ప్రేమ్ణా కురూమాపతే’’ అని ప్రార్ధించి లోకం లో పీడనం లేకుండా జనం సుఖ శాంతులతో వర్ధిల్ల జేయమని భావం .అంతటి మానవీయ కోణం లో రాసిన నాటకం ఇది .

ఆశని నిరాసనం

ఆశని అంటే పిడుగు .నిరాసనం అంటే మరల్చటం .పిడుగును మరల్చటం అనే ఈ ‘’వ్యాయోగం ‘’అని పిలువ బడే సంస్కృత రూపకం ఏకాంకిక .తెలుగు వారి వైదిక సంస్కృతీ పరి రక్షణ దీక్షకు నిలువుటద్దం గా విశ్వ నాద చేసిన అపూర్వ సృష్టి .ఉరుములు ఉరిమినప్పుడు  ‘’అర్జున ఫాల్గుణ పార్ద’’అనే మంత్రాన్ని,అందులో అర్జునుడికిఉన్న పదిపేర్లు  మనం చదువుతాం .అలా చదివితే పిడుగు మనమీద పడదనే విశ్వాసం. ఇది ఒట్టి విశ్వాసం కాదు .తైత్తిరీయ ఆరణ్యకం లో ఉన్న ‘’విద్యుద్వధ ‘’ఘట్టాన్ని మేళవించి వైదిక వాజ్మయం ద్వారా వేద వ్యాస మహర్షి అందించిన విజ్ఞాన శాస్త్రం అని దాన్ని మానవ జాతి వదులు కోవద్దనీ విశ్వనాధ హిత సందేశం .కొంచెం ఫ్లాష్ బాక్ కు వెడదాం

ఏక చక్ర పురం లో బ్రాహ్మణ వేషం లోఅర్జునుడు  భిక్షాటన చేస్తున్నప్పుడు పిడుగు పాటుపై ఉన్న భయాన్ని వ్యాసుల వారికి చెప్పుకున్నాడు .అక్కడ వ్యాసాశ్రమం లో పిడుగు ఎలా ఏర్పడుతుంది అనేదాన్ని రసాయనిక శాలలో అంటే లాబ రేటరి .లో ప్రత్యక్షం గా చూసి మహర్షిద్వారా తీలుసుకొంటాడు .ఒక సారి తనపై పడ బోతున్న పిడుగును ఉత్తరీయం చెంగున బంధిస్తాడు .అది విడుదల చేయమని ప్రార్ధిస్తుంది .ఇక మీదట తన పేర్లు చదివే వారిపై పడరాదు అని పిడుగు వద్ద హామీ తీసుకొని అర్జునుడు దాన్ని వదిలేస్తాడు .భయంకరమైన పిడుగు పాటు మరణం నుంచి మానవ జాతిని రక్షించటానికి అర్జునుడు చేసిన ప్రయత్నం ,ఆధునిక విజ్ఞాన ప్రయోజనాలకు మార్గ దర్శక మౌతుంది .పాశ్చాత్య విద్యలు ఎన్ని నేర్చినా భారతీయతను మరచి పోవద్దని హెచ్చరిస్తూ సందేశం  ఇచ్చే రూపకం ఇది  .

‘’యూయం పశ్చిమ బుద్ధయస్తదను  మా భూయస్త భో భో నరాః-మావిద్విష్యాచ సేతు సీత నగ యోర్మధ్యే త్రవైయాసకీం

జానీయాత పరాశారాత్మజ మిమాం దాత్రీం సమద్దర్తుమే –వోద్భూతం పరమేశ్వరం రుషి గణైః సంప్రార్ధ మానం హరిం ‘’

’వ్యాసర్షి మానవాళికి చేసిన మహోపకారాన్ని ‘’

‘’బహుయుగ పరిదీప్తా సాదు సంగృహ్య విద్యా –క్రుతవతి పది ఏనాకారీ విస్పష్ట రేఖా

నిఖిల జగదనంత ప్రాప్త పుణ్యైక మూర్తిః-జయతి స శుక తాతః స్ఫీత వేదార్ధ భూతః ‘’శ్లోకం తో కీర్తిస్తారు .

ఇలా మూడు రూపకాలలో విశ్వనాధ సంస్కృత సాహిత్యం లోనూ తనకొక ప్రత్యెక స్థానాన్ని పొందారు .విశ్వనాధ రచించిన  సంస్కృతకావ్యాలు –శివ పంచశతి ,దేవవగైరా  త్రిశతి ,గురు ప్రసాదం ,శారదా చంద్ర మౌళి సుప్రభాతం  స్తుతి కావ్యాలు .భక్తికి జ్ఞానానికి నిలయాలు .జీవ దేవ సంబంధాలు .

మొత్తంమీద 30కావ్యాలు ,20నాటకాలు ,60నవలలు ,10విమర్శన గ్రంధాలు ,35చిన్నకధలు ,౩ నాటికలు ,70సాహిత్య వ్యాసాలూ ,10ఇంగ్లీష్ వ్యాసాలూ ,10సంస్కృత రచనలు ,3 అనువాదాలు .100 ఉపోద్ఘాతాలు లేక పీఠికలు ,మరెన్నో రేడియో భాషణలు చేసిన ‘’సాహితీ కల్ప వృక్షం ‘’విశ్వనాధ .’’తను కావించిన సృష్టి తక్కోరుల కాదు ‘’అన్న తిక్కన్నకు దీటైన వాడు. ఆయన రచనలో ‘’ఏదీ ఎంగిలి కూడు కాదు ‘’అని చెప్పుకొన్న సత్తా ఉన్నవాడు .’అంటే ఒకదానిలో ఉన్న విషయం మరో దానిలో ఉండదు అన్నమాట .

’’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాద్రు శుం-డలఘు స్వాదు రసావ తార ధిషనణాహంకార  సంభార దో-హల  బ్రాహ్మీ మయ మూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే-శలచా౦ద్రీ మృదు కీర్తి చెల్లపిళ వంశ స్వామికున్నట్లుగన్ ‘’  ‘’అని  తనలాంటి శిష్యుడు ఉన్నాడన్న కీర్తి  గురువు చెళ్ళపిళ్ళ వారికే  దక్కిందని గర్వంగా చెప్పుకోన్నవాడు .దీనినే’’దిషణాహంకారం’’. అన్నారు .’’నా మార్గాముకాదునా తాత ముత్తాతల మార్గమూ ‘’కాదు ఇతనిదిఒక కొత్త మార్గం అని గురు ప్రశంస పొందినవాడు .’’అవిచ్చిన్న సంప్రదాయ వాది’’’’continuation with the past ‘’తో యుగ కర్త అయిన వాడు విశ్వనాధ .’’ఏ బాటలో నడిచినా సమ్రాట్టు .ఆత్మీయం ,ఆత్మాశ్రయం ,ఆత్మ నాయకం ‘’గా వర్దిల్లాడు .ఈ శతాబ్ది చైతన్యమంతా అగస్త్యునిలా ఆపోసన పట్టి భారతీయ దార్శనిక మూలాలతో విలువకట్టిన ప్రజ్ఞా మూర్తి .అయన పలుకే ఒక ప్రమాణం .ఆయన జీవుని వేదనే కల్ప వృక్ష రామాయణం .షేక్స్పియర్ లాగా నాలుగు విషాదాంత నాటకాలు రాసి మెప్పించిన వాడు విషాదాంత నాటక శిల్ప చతురాననుడు విశ్వనాధ .ఆయన విమర్శలు ప్రతీకాత్మక విమర్శకు ప్రామాణిక సూక్తాలు .ఆయన ఒక సమగ్ర వ్యక్తీ .కళా ప్రపూర్ణుడు .

‘’రసం వేయి రెట్లు గొప్పది అని ఢంకా బజాయించి చెప్పినవాడు .ఆయన వ్యక్తికాదు .సంప్రదాయ యుగా ప్రవక్త .’’నన్నయ తిక్కన నన్నావేశించిరి ‘’అని ,ఆగ కుండా వారి మార్గాన్ని మెరుగులు దిద్దుతాను అని  చెప్పుకున్న ధీశాలి ,ప్రయోగ శీలి .శృంగార రస ద్రష్ట ,స్రష్ట కవిసార్వ భౌముడు  శ్రీనాధుడు అయితే కరుణరస ద్రష్ట ,స్రష్ట కవిసామ్రాట్ విశ్వనాధ .’శిల్పం కాని సాహిత్యం కాని విజాతీయామి ఉండ రాదు .జాతీయమై ఉండాలి .వ్రాసిన వానికి ముక్తి చదివిన వానికి రక్తి ముక్తి .యెంత సముద్రం మీద ఎగిరినా పక్షి రాత్రి గూడుకు చేరు కుంటుంది .ఇది జాతీయత .ఇది సంప్రదాయం ‘’అన్న వాడు .’’నేను పొతే నాతొ పోయేవాళ్ళు నన్నయ ,తిక్కన,ఎర్రన ,నాచన సోమన ,శ్రీనాధుడు ,పోతన ,పెద్దన తెనాలి రామ లింగడు మొదలైన వారు ‘’అని ఎలుగెత్తి చాటి చెప్పి సంప్రదాయ పరిరక్షణకు దీక్ష  పూనాడు  .ఆయన చేబట్టని,  చేబట్టిన దాన్ని స్వర్ణ మయం చేయని సాహిత్య ప్రక్రియ లేనేలేదు .’’అని ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం గారు మహోదాత్తంగా విశ్వనాధ ఆత్మను ఆవిష్కరించారు .ఇంగ్లీష్ నవలలెన్నో చదివాడు ఇంగ్లీష్ సినిమాలేన్నిటినో చూసి జీర్ణించుకొన్నాడు .ఎక్కడ ఏ కొత్తదనం వున్నా దాన్ని భారతీయత తో  దాని శైలిలో రంdగరించి తీర్చి దిద్దటం విశ్వనాధ ప్రత్యేకత ..’’నిన్నటి నన్నయ భట్టు నేటి కవి సమ్రాట్టు ‘’విశ్వనాధ అని ఆయన తెలుగు వారి ‘’గోల్డు నిబ్బు –మాట్లాడే వెన్నెముక పాటపాడే సుషుమ్న ‘’అంటూ ప్రశంసించాడు శ్రీ శ్రీ ,

‘’శ్రీ విశ్వనాధ కవిపండిత సార్వ భౌమ –సుజ్ఞాన పీఠం,సదామృత కావ్య శిల్పాత్ద్

ఐదిష్యదాంధ్ర సుర భారత భానుఃదీప్తి  -విశ్వాద్వాధ్యవాజ్మయ నభస్య ప్రభాం గణేషు’’

‘’రసమయ శుభ  విశ్వ శ్శ్రేయ  కావ్యాననేకాన్ –సరళ తరల సత్ప్రౌఢిప్రసాను సాధాత్

సకల సుగుణ సంపూర్ణాను మోదప్రభావాత్ –దశ దిశు సుధా దావల్య కాంతే రతన్వన్ ‘’ (సుధీంద్ర ప్రహ్లాద )

‘’ప్రతిభయే రూపం ధరిస్తే విశ్వ నాధుడే –హిమ గిరి శిఖరం చలించి వస్తే విశ్వనాదుడే

వర్షామేఘం కవనం రాస్తే విశ్వ నాధుడే –వాణి ఆంధ్రుడై వసుధ జనిస్తే విశ్వనాధుడే ‘’

మరో మహా కవితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-15-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.