వారసత్వ నీడలు
- 11/09/2015
- -మురహరి ఆనందరావు
అలనాడు మహానటులు నిర్మించిన స్వర్ణయుగం -నేడు వారసత్వ నటులతో వెలవెలపోతోంది. వారసత్వం తరంపోతే తరం దూసుకొస్తుంది. వెండితెర, కోట్ల పారితోషికం, వారసత్వ ప్రోత్సాహం వెరసి చిత్రసీమను నాశనం చేస్తున్నాయనిపిస్తుంది. వారు చూపించిందే నటన. పిచ్చిపిచ్చి గంతులే నృత్యాలు. పిడికిలి బిగించడమే పోరాటాలు. అలా వారసులేం చేసినా ప్రేక్షకులు (అభిమానులు) చూసి తీరాల్సిందే. అప్పటితరం కీర్తిని గడిస్తే, నేటితరం కాసులు గడిస్తున్నారు. అప్పటితరం పాత్రల్లో జీవిస్తే, నేటి వారసులు పాత్రలకు పాతరేస్తున్నారు. అప్పట్లో విజయశాతం 90గా వుంటే, ఇప్పుడు పరాజయాల శాతం 90శాతానికి చేరుకుంటుంది. నేటి ప్రపంచ సినీ రంగ నటీనటులకు వారసత్వం అర్హత, జన్మహక్కు. అందువల్లే సినిమా రంగం వారసులతో నిండిపోయింది. తండ్రి- తాతల పేర్లు చెప్పుకుంటూ, వంశాల గురించి సొంత డబ్బాకొట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. నట వారసులుగా రంగప్రవేశం చేస్తున్నారే తప్ప జవసత్వాలు కలిగిన నటన చూపలేకపోతున్నారు. అందం, చందం, ఆకర్షణ, నటన లేకపోయినా వారసత్వపు ముసుగులో ముసిముసి నవ్వులతో వెండితెరపై అరంగేట్రం చేసి, ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తూ, చిత్రస్థాయిని నానాటికీ దిగజారుస్తున్నారు. పెట్టుడు బిరుదులనే ఇంటి పేరుగా మార్చుకుని చెట్టులేని చోట ఆముదం చెట్టే గొప్పదనే సామెతను నిజం చేస్తున్నారు. ఎవరికివారు -నేనే నెంబర్‌వన్ అనుకునే పరిస్థితికి వచ్చారు. మీడియా-బుల్లితెర సైతం రేటింగుల కోసం అలాంటి వాళ్లకు వత్తాసు పలుకుతుంది. చదువు, భవిష్యత్, కుటుంబ బాధ్యతలను మర్చిపోయిన వీరాభిమానులు మాత్రం పరస్పరం బురద చల్లుకునే స్థితిలోనే ఉండిపోతున్నారు. సంభాషణలు చక్కగా పలకకున్నా ఫరవాలేదు. పదిమందికీ పేడి ముఖం నచ్చకున్నా నష్టం లేదు. కళ్లెక్కడో అగాధంలో వున్నా.. పిచ్చిగెడ్డాల ఫ్యాషన్‌ను పూసుకున్నా బాధ లేదు. గాంభీర్యం లేని గొంతు పీల శబ్దాన్ని తలపోస్తున్నా… నవరసాలకు అర్థం తెలియక హావభావాలను ప్రస్ఫుటించలేకున్నా.. అసలు పాత్రలో జీవించలేకపోయినా -వారసత్వం ముసుగులో వ్యవహారాన్ని చక్కబెట్టుకోవచ్చు. అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తారు. పిచ్చిగెంతులతో పాటలు, సహజత్వంలేని పోరాటాలు, పోజులతో నెట్టుకొస్తున్నారే తప్ప -నటనతో కాదన్నది వాస్తవం. కోట్లు, క్లబ్బులు, వసూళ్లు, రికార్డుల గోలతో ముందుకు సాగుతున్నారే తప్ప, పదికాలాలపాటు గుర్తుండే పాత్రలతో ఒక్కటంటే ఒక్క చిత్రాన్నీ నిర్మించలేకపోతున్నారు. పైరవీ అవార్డులతో తామే గొప్ప అనుకుని భ్రమపడటం తప్ప, ఆత్మసాక్షి వేసే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పరిస్థితి. హిందీ చిత్రసీమను పరిశీలిస్తే అలనాటి దిలీప్‌కుమార్, దేవానంద్, మీనాకుమారి, వైజయంతి మాల అభినయంలో నేటి వారసులు పదోశాతం నటన చూపేవారే లేరు. రాజ్‌కుమార్, శత్రుఘ్నసిన్హాలను మించి సంభాషణలు పలికేవారు వారసుల్లో ఒక్కరూ కనిపించరు. అలా 24 సినీరంగ విభాగాల్లో నేటి వారసులు -లిల్లీపుట్లు అనుకోవాల్సిందే. అతిగా ఖర్చు పెట్టించడం, విదేశీ షూటింగులకు పనికట్టుకు వెళ్ళడం, సాంకేతికంగా (గ్రాఫిక్స్) అడ్వాన్సు కావడం, స్ర్తిపాత్రలకు దుస్తులు తగ్గించడం, భారీగా పారితోషికం అందుకోవడం, థియేటర్లను కళ్యాణ మంటపాలుగా మార్చడం, సినిమా టికెట్ల ధరను అమాంతంగా పెంచేయడం, పైరసి అభివృద్ధికి కారణం కావడం ఈ నటవారసుల ప్రవేశమే అనక తప్పదు. కోట్ల వసూళ్లని వ్యాపారపరంగా గొప్పగా ప్రకటించుకుంటున్నారే తప్ప, చిత్రం పది కాలాలపాటు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంటుందా? అని మాత్రం ఆలోచించరు. వంద రోజుల విజయం సాధించిందని కూడా చెప్పలేరు. కోట్లు రాబట్టింది, చరిత్ర తిరగరాసిందంటూ గర్వపడటం తప్ప, ఆరు మాసాల పిదప ఆ చిత్రాన్ని ఎవరైనా తలచుకుంటారా? అన్న దిశగా ఆలోచించరు. ఏదో ఏడాదికి రెండో మూడో కాస్త మంచి (పూర్తిమంచివి కాదు) చిత్రాలు రాగానే వారు వారు పొగుడుకోవడం, మీడియా ఇంకాస్త ముందుకెళ్లి -ఇంటర్వ్యూలు, బిట్లు, అభిప్రాయాలు, లైవ్షోలతో మేకప్ చేయడంతో వారసులంతా ‘అబ్బో’ అనుకునే నిదురమత్తులోకి జారుకుంటున్నారే తప్ప, పాత్రను ప్రేక్షకులు గుర్తుంచుకుంటారా? చిత్రం పది కాలాలపాటు జీవంతో వుంటుందా? అని మాత్రం ఆలోచించడం లేదు. హిందీ సినీ రంగం సైతం వారసులతో కిటకిటలాడుతోంది. వారసులే తప్ప బయటి నటీనటులు లేరని గట్టిగానే చెప్పుకోవచ్చు. బయటివాళ్లు వచ్చే ప్రయత్నం చేసినా -వారసులు రానివ్వరు, అడుగుపెట్టనివ్వరు, ప్రోత్సహించరు, బహిష్కరిస్తారన్నది అక్షర సత్యం. అందువల్లే హిందీ రంగంలోనూ నాసి పెరుగుతోందే తప్ప వాసి తగ్గుతోంది. ఖర్చు కోట్లకు చేరుతోంది. నటన నాస్తికి చేరుతోంది. డ్యాన్సులు, ఫైట్లను నమ్ముకుని చిత్రాలను నిర్మిస్తున్నారే తప్ప, మంచి పాత్రలను మలిచే సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టేటనే్న. గుర్తుంచుకునే స్థాయి చిత్రాలు నిర్మించలేకపోతున్నారన్నది అక్షర సత్యం. ఇదే వారసత్వ రోగం (క్యాన్సర్) హాలీవుడ్ రంగంలోనూ లేకపోలేదు. తండ్రీ కుమార్తెలు హెన్రిఫోండా, జోన్ ఫోండా; ఆలుమగలైన నికోల్కిడ్మెన్, ట్రాంక్రూస్; ఏంజలీనాజోలి, బ్రాడ్‌పిట్; ఎలిజబేత్ టేలర్, రిచ్చర్డ్ బర్టన్; అన్నదమ్ములైన సెల్విస్టర్ స్టాలోన్, థిమోతి స్టాలోన్; తండ్రీ తనయులైన సీన్ కానరి, జూసూస్ కానరి; విల్‌స్మిత్, జెరోమిస్మిత్; కిర్క్ డగ్లాస్, మైకల్ డగ్లాస్; బ్రూస్ లీ, బ్రాండన్ లీ.. అలా వారసత్వం తొంగి చూస్తూనే ఉంది. కాకపోతే, వాళ్ల మందటి తరం స్థాయిని అందుకోవడంలోనూ, లేదా తరువాతి తరం తమకంటూ ప్రత్యేకతను చూపించడంలోనో సక్సెస్ అవుతూ వస్తున్నారు. చెట్టుపేరుతో కాయలు అమ్ముకునే ప్రయత్నాలు, పనికిరాని భుజకీర్తి బిరుదులు తగిలించుకోకుండా -ఐడెంటిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ -మన టాలీవుడ్ మాత్రం వారసత్వపు నటులతో చిక్కిపోతుంది. ముందరి తరం నటులు స్వర్ణయుగం ఆవిష్కరించారు. వారసులతరం ప్లాఫ్ల యుగాన్ని నడిపిస్తున్నారు. అప్పట్లో వారు కీర్తిని గడిస్తే, నేటితరం కాసులు గడిస్తున్నారు. అప్పటితరం పాత్రల్లో జీవిస్తే, నేటి వారసులు పాత్రలకు పాతర వేస్తున్నారు. అప్పట్లో విజయశాతం 90గా వుంటే, ఇప్పుడు పరాజయాల శాతం ఆ సంఖ్యకు చేరుకుంది. అప్పట్లో తక్కువ పారితోషికంతోనే నవరసాలు చిలికించారు. నేడు నవరసాలను బూడిదలో పోసేస్తున్నారు. అప్పట్లో నటనకు అవార్డులు అందుకునేవారు. నేడు పైరవీల అవార్డులతో భుజాలెగరవేస్తున్నారు. అప్పటి సాహిత్యం పరిమళించేది. నేటి సాహిత్యం కంపు కొడుతోంది. అప్పటి గాత్రాలు మధురంగా మనసును తాకేవి. నేటి గాత్రాలు చెవుల తుప్పు వదిలిస్తున్నాయి. అప్పటి నృత్యాలు ఆహ్లాదపరచేవి. నేడు జుగుప్సకు నిలయమయ్యాయి. అప్పట్లో నిండైన దుస్తులతో భారతీయత కనిపించేది. నేటి విలువలు వదిలేసిన వలువలు భారతీయతను పరిహసిస్తోంది. అలా వివరిస్తూ పోతుంటే అలనాడు మహానటులు నిర్మించిన స్వర్ణయుగం -నేడు వారసత్వ నటులతో వెలవెలపోతోంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. వారసత్వం తరంపోతే తరం దూసుకొస్తుంది. వెండితెర, కోట్ల పారితోషికం, వారసత్వ ప్రోత్సాహం వెరసి చిత్రసీమను నాశనం చేస్తున్న దృశ్యాలే గోచరిస్తున్నాయి. వారు చూపించిందే నటన. పిచ్చిపిచ్చి గంతులే నృత్యాలు. పిడికిలి బిగించడమే పోరాటాలు. అలా వారసులేం చేసినా ప్రేక్షకులు (అభిమానులు) చూసి తీరాల్సిందే. మెచ్చుక తీరాల్సిందే. బిరుదులిస్తూ పోవాల్సిందే. మీడియా ఆకాశానికి ఎత్తాల్సిందే. ఎంత చెప్పినా, ఎలా చెప్పినా నాట వారసత్వంతో -టాలీవుడ్ రంగం నాణ్యత, వాసి పోగొట్టుకుందన్నది నిజం. సినీ రంగం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లాలంటే నేటి వారసులంతా -అక్కినేని, నందమూరి, ఎస్వీర్, సావిత్రి, జగ్యయ్యలు నటించిన చిత్రాలు పదేపదే చూడాలి. నటన, హావభావాలు, సంభాషణలు పలికే తీరు- పాత్రలో జీవించడం లాంటివి నేర్చుకోవాలి. నవరసాల అభినయమెలా అన్నది
కోవాలి. అంతవరకు చెత్త సినిమాలే.. పైరవీ అవార్డులే. అవి చరిత్రలో పేజీ నింపవు. మరిచిపోక తప్పదు.