గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు

కృష్ణా జిల్లా అవనిగడ్డ వాస్తవ్యులు  శ్రీ  జోశ్యుల సూర్యనారాయణ మూర్తి గారు  సంస్కృతా౦ధ్రాలలొ  మహా విద్వాంసులు .గొప్పకవి .కృష్ణా జిల్లా పరిషత్ లో తెలుగు పండితులుగా పని చేసి రిటైర్ అయ్యారు . తేనెల వాకల లాంటి పదాలతో అద్భుత ప్రసంగాలు చేసేవారు .విశ్వనాధ అంటే వీరభక్తి .తాను ఉయ్యూరు దగ్గరున్న తాడంకి హైస్కూల్ లో పని చేస్స్తుండగా విశ్వనాధను ఆహ్వానించి కల్ప వృక్షం పై ప్రసంగి౦పజేసి మహా సత్కారాన్ని చేశారు .నాకూ చాలా సన్నిహితులే. మానాన్నగారు మృత్యుంజయ శాస్త్రి గారి విద్వత్తును గూర్చి తరచూ చెప్పేవారు . తరువాత అవనిగడ్డలో శ్రీ మండలి కృష్ణా రావు గారు ఏర్పాటు చేసిన ‘’గాంధి క్షేత్రం ‘’లో ఉంటూ అక్కడ సాంస్కృతిక సాహిత్య సేవలందించారు. క్రిష్ణారావుగారికి ,వారికుమారుడు బుద్ధ ప్రసాద్ గారికి అత్యంత సన్నిహితులే .బుద్ధప్రసాద్ మూర్తి గారి శిష్యుడై ఉండవచ్చు .రామాయణం లోని అనేక విషయాలపై వారు పుస్తకాలు రాశారు నాకూ అందజేశారు .సంస్కృతం లోనూ అపార పాండిత్యం ఉన్నవారు కనుక గీర్వాణ రచనా చేశారు .

మూర్తిగారి గీర్వాణ రచన

మాతృలహరి అనే  సంస్కృతకావ్యం మూర్తిగారు రాశారు .అందులో ‘’తవ శ్రీ చక్రం మందిరమితి తదన్తర్గత,మహా –సహస్రారం కోశం స్థితి రితి చ యోగీశ్వర వచః

అహం దేవి త్వాంకధ మకృత పుణ్యః పరిచరా –మ్యయోగాధ్యాభ్యాసస్తవ చరణ సేవైక గతికః ‘’అని లలితాపరమేశ్వరిని ప్రస్తుతించారు .

‘’వెంకటేశ్వర స్తుతి శతకం’’కూడా రాశారు –‘’జయత్యనంతః ఖలు వెంకటేశ్వరో –భవాన్ భావాసుప్త జన ప్రబోధకః

సదా పరీక్షా ప్రవిదాన లాససో –జనైశ్చ నిత్యం  స్తవనీయ విగ్రహః ‘’నిత్యం భక్తులనుఏదోపరీక్ష పెట్టి నిగ్గు తేలుస్తూ ఉంటావుకదా వెంకటేశ్వరా! అని భావం . ‘’గురుక్రుపాలహరి ‘’,భారత ధీరతా దిలీపః ‘’కావ్యాలు రాశారు . ‘’నవీన సద్భాత రక్షణాయ –నార్యస్చ వీరాఃపురుషాస్తధైవ-నిశ్చిత్య చిత్తే దృఢ బుద్ధి మంతః –సమాప్నుయు సత్యాగ గుణం విశిష్టం ‘’మూర్తిగారు ‘’దుర్గా నాగేశ్వరాస్టకం ‘’’’వాతాత్మజాస్టకం’’,ఆంజనేయ కరావ లంబ స్తోత్రం ‘’కూడా రాశారు .

413-ఇతర కృష్ణా జిల్లా కవులు

డా.కంభం పాటి రామ గోపాల కృష్ణ మూర్తి ‘’సౌందర నందం ‘’,అన్నమాచార్య చరిత్ర ‘’నాటికలను సంస్కృతం లో రాశారు .శ్రీ ఉపద్రష్ట వెంకట క్రిష్నయ్య ‘’చాణక్య ‘’,’’శివాజీ ‘’ప్రహ్లాద ‘’అనే ఏకపాత్రాభినయాలను ,’’సనత్కుమార ఆశ్రమం ‘’’’మహిళానాం మిత్ర బాంధవ్య కల్పకం ‘’’’భోజనం దేహిరాజేంద్ర’’’’తరతి శ్లోక మాత్మ విత్ ‘’సంభాషణలు,శ్రీ దుర్గా స్తోత్రం ,వందేమాతరం  రాశారు . ‘’భాక్తానుగ్రహ పారీణాంసర్వ దుఃఖ నివారిణీం-మోక్షదాం కామదాం దివ్యాందుర్గం దేవీం నమామ్యహం ‘’అని దుర్గా స్తోత్రం చేశారు

శ్రీ రాణి సదాశివ మూర్తి ‘’అగ్ని పుత్రావయాం భారతాః’’’’జీవ బ్రహ్మైవ నా పరః ‘’’’శివ పాణినీయం ‘’నాటకాలను ,’’సరద్విరాగం ,’’ఋతు సందేశం ‘’నృత్య రూపకాలను రచించి పైన చెప్పిన అగ్ని పుత్ర కు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందారు .శారదా స్తవ మంజరి ,గాయత్రీ స్రగ్ధరా సుప్రభాతం ,జగన్నాధ సుప్రభాత స్తవ మంజరి ,వాస్తు పురుష అష్టోత్తర నామ స్తోత్రం కూడా చేశారు .గాయత్రి సుప్రభాతం లో ‘’ప్రత్యూష జాత పవనాః ప్రసర౦తిమందం-పద్మాకరే కమల షండ సుగంధ వాహాః –మాకంద లోల మధుపాస్తవ కీర్తిగానాః-గాయత్రి దేవి ,మహితే కురు సుప్రభాతం ‘’అని కమనీయంగా చెప్పారు .

శ్రీ ఎస్.టి జి వరదాచార్యులు ‘’సుషుప్తి వృత్తం ‘’,కావ్యం ,’’భాషా శాస్త్ర సంగ్రహం ‘’రాస్తే శ్రీపోలా రామ సుబ్రహ్మణ్యం ‘’శ్రీ భద్రాచల సీతారామ వివాహ మహోత్సవః ‘’లో’’ మంద్రం మంద్రంమదన గమకై ర్మంజుమంజీరనా –మాతా సీతా  ధవళ ధవలైర్మంద హాసైర్మనొజ్నైః-మందం,మందంచరణ చలనైః రామ ,నాద వరంత్వాం-ఆగచ్చంతీ శుభ మభి ముఖం శోభతే సుప్రసన్నా ‘’అని మంద్ర మంద అందాలతో సీతారామ వర్ణన చేశారు .

‘’శ్రీ పమిడిపాటి పట్టాభిరామారావు ‘’శ్రీ బాలకృష్ణ చరిత్రం లో ‘’ఏకా కాచన చుమ్బితేవపిబతి స్వీయాధరం లీలయా -‘ఏకా కాచన పీడితేవ కుచయొః స్తౌతి చ –ఏకాకాచన సంగతేవ సురతే సౌఖ్యేన సంజల్పతే –ఏవం రస విలాస సౌఖ్య మతులం  గోపీ జనైర్భావ్యతే ‘’అని రాసక్రీడను తనివార వర్ణించారు . ’,’’శకుంతలా ‘’కూడా రాశారు. శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ‘’గాయత్రి జయరామం ‘’లో’’రామే రామే సకల జనతా తన్నిరీదిపస్తం –  ‘’రాజం కర్తుం సమఖిల షతః కింతు దైవేన రుస్టం-కైకేయ్యై ప్రాగ్వర యుగ మదాత్ భూపతి స్తత్ప్రభావాత్ –రామోరణ్యం ప్రతి చలితవాన్ సీతాయా లక్ష్మణేన-చాన్డ్రీ –‘’ రాయగా ,శ్రీ దంటు సుబ్బావధాని ‘’ధర్మ పధం ‘’శ్రీ కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు ‘’గురుక్రుపాలహరి ‘’రాశారు .అందులో ఒక మచ్చు ‘’-వాణీ యన్ముఖత స్స్వయం క్వణయతే వీణాం పునర్యత్పదే –లక్ష్మీర్యత్ర శివోదయ స్సుకలితా  సృస్టిశ్చ యత్రాత్యుతం –రక్షా కార్యమతో జగద్విలయనం యత్రాద్భుతం శామ్భవం –  వందే తత్కిమపి త్రిశక్తిక మహా త్రై పూరుషంగౌరవం ‘’

ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి ‘’పుష్ప విలాపః ‘’,’’కున్తీకుమారీ ‘’అనే  కరుణశ్రీ ఖండకావ్యాలను గురుప్రపత్తి ,ధ్యానాస్తకం ,ఈశ వింశతి  సంస్కృతం లో రాశారు .ఇవికాక ‘’నిద్రేమే ప్రియ వల్లభే ‘’,’’విధరహో బలవాన్ ‘’రచించారు .శ్రీ పేరి వెంటేశ్వర  శాస్త్రి ‘’నాగేశ గూడార్ధదీపికా ‘’వ్యాకరణ శాస్త్ర గ్రంధాన్ని ఆగిరిపల్లిలో రాశారు .శ్రీ పసుమర్తి రంగనాధం ‘’ఆత్మ తత్వ ప్రకాశికా ‘’వేదాంత గ్రంధం రాశారు .

శ్రీ కూచిభట్ల చంద్ర శేఖర శర్మ ‘’గాయత్రీ శంకరాచార్య ‘’,నవగ్రహ సుప్రభాతం ‘’రాయగా శ్రీ పోలా  సుబ్రహ్మణ్యం’’వీరేశ్వర సుప్రభాత స్తవః ‘’ శ్రీ మల్ల్లాది సుబ్రహ్మణ్య శర్మ ‘’మహేశ మాలా స్తోత్ర కదంబం ‘లో –‘’జిహ్వే కీర్తయ శంకరం పురహరం  చేతో భజ శ్రీధరం –పాణిద్వంద్వ సమర్చయేశ్వర కదాఃశ్రోత్త్ర ద్వయ త్వం శృణు –శంభుం లోకయ లోచనద్వయ  విభోర్గచ్చా౦ ఘ్రి యుగ్మాలయం –జిఘ్ర ఘ్రాణ మహేశ బిల్వ సురభిం మూర్ధన్నమోమాపతిం ‘’అని అత్యంత భక్తిని ప్రదర్శించారు  ’శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి శ్రీ మాత్రుస్తవః ‘’,రాశారు .

శతావధాని శ్రీ వేలూరి శివ రామ శాస్త్రి కొవ్వూరులో శతావధానం చేశారు .అందులో ‘’కర్నాత్మజా ముదవహ ద్విబుదో ఫై పార్ధుః ‘’అనే సమస్యకు సంస్కృత శ్లోకం –‘’ధర్మాత్మజం ద్రుపదజాం పరిదృశ్య వేగా –చ్చాన్ద్రాయణా చరణ బద్ధ విదిర్విదేశాన్ –పశ్యన్ తదీయ పృధు సుందర మీక్ష్య చక్షుః –కర్నాత్మజా ముదవహ ద్విబుదోపి పార్ధుః అని చెప్పారు .

శ్రీ రొంపి చర్ల శ్రీనివాసాచార్యులు గుడివాడ తాలూకా నందివాడలో సంస్కృత అవధానాలు చేశారు .ప్రముఖ వాగ్గేయ కారులు శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ సంస్కృత కీర్తనలు రాశారు .అందులో గురుదేవులు పారుపల్లి రామక్రిష్ణయ్యగారిని ఒక కీర్తనలో ‘’మహనీయ మధుర మూర్తే –కమనీయ గానమూర్తే –సహన సౌశీల్యాది  సద్గుణొ పేతసత్కర్తే –మహతీ మంత్ర సుగాత్ర మాం పాహి గురుమూర్తే ‘’—అహరహ మానందమయ గాన బోధనాను రక్తే –ఆశ్రిత మురళీ కృత మృదు సంగీత సుదాసక్తే –మామ్పాహి చారు మూర్తే –‘’కీర్తించారు .

బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారు ,బ్రాహ్మశ్రీ  ముదిగొండ వెంకట రామ శాస్త్రి గారు విజయవాడలో గొప్ప సంస్కృత పండితకవులు తర్క వ్యాకరణాలలో అద్వితీయులు .వీరు సంస్కృత గ్రంధ రచన చేసినట్లు విన్నాను కాని నాకు లభించలేదు .

ఇంతవరకు స్వాతంత్ర్యానంతరం అరవై ఏళ్ళలో కృష్ణా జిల్లా పండించిన  గీర్వాణపంట ను వీక్షించం దీనికి ముఖ్యాధారం ముందే మనవి చేసినట్లు ‘’సంహూతి ‘’.అందులో శ్రీ పాలపర్తి వారి వ్యాసం .

414-శ్రీ సువర్చలా౦జనేయం కర్త శ్రీగుర జాడ పూర్ణ చంద్ర శర్మ గారు (1910)

మేము ఉయ్యూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠ శాలలో తొమ్మిది పది  తరగతిచదువుతుండగా మాకు తెలుగు బోధించిన శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మగారు ఉయ్యూరు దగ్గర గురజాడ వాస్తవ్యులు .శ్రీ గురజాడ సాల్వపతి శర్మ ,శ్రీమతి సూర్యకాంతమ్మ దంపతుల కు 23-10-1910న జన్మించారు .కౌండిన్య గోత్రీకులు .శ్రీ శర్మగారు ప్రముఖ కవి శ్రీ గురజాడ రాఘవ శర్మగారి పెదనాన్న కుమారులు .శ్రీ సువర్చలాన్జనేయం ‘’అనే సంస్కృత కావ్యాన్ని మనోహరంగా రాశారు దీనిని శ్రీ ఆంజనేయ స్వామి కలలో కన్పించి రాయమని ఆదేశిస్తే వారి అనుగ్రహ ఫలితంగా నే రాశానని చెప్పుకున్నారు ..దీనిని గురజాడలో శ్రీ కోదండ రామాలయం లోశ్రీరాముని ఎదురుగా  ప్రతిష్టితులైన  శ్రీ  ఆంజనేయస్వామికి మేష్టారు 11-2-1976అంకితమిచ్చారు .ఇదికాక ‘గురు గౌరవం ‘’అనే సంస్కృత నాటకం  ‘’ప్రహ్లాద చరిత్ర ,హరిణీ నారదం ,జడ భరతచరితం ,గజేంద్ర మోక్షం గ్రంధాలు రచించారు  తెలుగులో ‘’అచ్చ తెలుగు పార్వతీ పరిణయం ‘’,గేయ రామాయణం ,పుష్పకం,సీతాకల్యాణం ,పార్వతీ కళ్యాణం ,శివ భాగవతం ‘’రాశారు దాదాపు అన్నీ అముద్రితాలే . నాకు ఒక్క శ్రీ సువర్చలాన్జనేయం మాత్రమె లభించింది .దీన్ని ఆధారంగానే వివరాలు రాశాను . నేను రాసిన ‘’దర్శనీయ ఆంజ నేయ దేవాలయాలు ‘’గ్రంధం లో ‘’శ్రీ సువర్చలాంజ నేయం ‘’ను యధాతధం గాసంస్కృత శ్లోకాలతో బాటు నేను  సంక్షిప్తంగా వాటికి రాసిన తాత్పర్యాన్ని చేర్చి సరసభారతి తరఫున ప్రచురింఛి 13-5-2015 నశ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరులో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో స్వామి సమక్షం లో శాసనమండలి సభ్యులు శ్రీ వై వి .బి రాజేంద్రప్రసాద్ చేత ఆవిష్కరింప జేశాం  .ఈ గ్రంధాన్నిఅమెరికాలో ఉంటున్న మా చిన్న మేనల్లుడు ఛి వేలూరి  మృత్యంజయ శాస్త్రి (జయ వేలూరి) శ్రీమతి విజయ లక్ష్మి దంపతుల సౌజన్యం తో ప్రచురించి మా చిన్నక్కయ్యా బావా శ్రీమతి వేలూరి దుర్గ శ్రీ వేలూరి వివేకానంద దంపతులకు వారి ‘’వివాహ వజ్రోత్సవ కానుక ‘’గా అంకితం చేశాం .

శ్రీ సువర్చలాంజ నేయ కావ్య సౌరభం

ఈ కావ్యం లో నారద తు౦బురులు తామలో ఎవరు గొప్ప సంగీతవిద్వా౦సు లో తెలియ జేయమని శ్రీ హనుమ దగ్గరకు వస్తే ఆయన శ్రీరామ నామ కీర్తనలతో మైమరపిస్తే అక్కడి రాతి అరుగు కరిగి నీరై  దానికి ఆనించిన వీణలు అందులో కూరుకు పోయాయి .హనుమ భక్తీ సంగీతానికి ఆశ్చర్య పడి తమ తప్పు తెలుసుకొని భక్తీ సంగీతం లో హనుమ ను మించిన వారు లేరని గ్రహించి హనుమను ప్రశంసించి ఆయన హృదయం లో చూపిన సీతా రామ దర్శనం తో పులకించి వెళ్ళటం కద.

మొదటి శ్లోకం –‘’శ్రీ మద్విద్యా దానోద్దండం –అపశబ్ద దోష రిపు ప్రచండం –హస్తే స్వాత్మీయ దంత దండం –వందే ప్రణవ స్వరూప తుండం ‘’అని వినాయక స్తుతి చేశారు నారద తుం బురులు ‘’భగవతి హనుమతి ధృత్వా మోదం  -కుర్వతి మధురం రామ నినాదం –సద రతిబాష్ప వారి యశోదం-సుముత్తితౌ వక్తుం వాదం ‘’బాష్పవారి పరిపూర్ణ లోచనుడైన హనుమ వారిని ఆశ్చర్యంగా చూసి కూర్చోబెట్టాడు .’’దృష్ట్వా దృష్ట్వా శ్రీహనుమంతం –సంతుస్టువతుర్బహు గాయంతం –పాదోక్షేపణగతి నృత్యంతం –తౌ మే నాతేమహిమా వంతం ‘’పార వశ్యం తో చిందులు తొక్కుతూ రామగానం చేస్తున్న హనుమను చూసి అతనిమహిమ తెలుసుకున్నారు .ఇలా మధుర శబ్దవిన్యాసం తో శర్మగారు రాస్తారు .వాళ్ళ వీణలను శ్రీ రాముని స్మరించి కరిగిన శిలాద్రవం నుండి తీసిచ్చాడు .భక్తియే శరీరంగా అవతరించిన మూర్తి హనుమ .

తాము వచ్చిన పని చెప్పి అంతకు ముందు వారిద్దరి విద్యా స్పర్ధను వివరించారు .సరస్వతి లక్ష్మి కూడా తేల్చలేక పోయారన్నారు .హనుమయే సరైన న్యాయ నిర్ణేత అని పంపారు .వారిద్దరిని గానం చేయమన్నాడుహనుమ .చేశారు కాని వారికే నచ్చలేదు చివరికి హనుమ భక్తికి దాసోహం అన్నారు .భక్తీ మహిమకు అపజయం లేదని అర్ధం చేసుకున్నారు గర్వం ఖర్వమైంది .

‘’యహ్ పాషాణౌద్రావ యతీతి –యస్సర్వాన్ విస్మయ యతీతి –యో భక్తాన్ సంతార యతీతి –సమహాన్ నిశ్చిత ఏవ జయీతి ‘’-భక్తీ మహిమతో రాళ్ళు కూడా కరిగిపోతాయి .ప్రాణికోటి ఆశ్చర్యం లో మునిగి పోతుంది .తరించటానికి భక్తియే సాధనం .అలాంటి వాడే జీవిత విజేత .అని అర్ధం .హనుమను తమకు రామదర్శనం చేయించమని వారిద్దరూ కోరగా గుండె చీల్చి చూపించాడు .

‘’తాభ్యాం గర్వ సుస్టూ త్యక్త –తత్రాధిక ప్రసంగో ముక్తః శ్రీ రామ ఇత్యరనత ముక్తః –హనుమాన్ తృస్టోవక్తు మశక్యతః ‘’-ఇద్దరూ గర్వాన్ని వదులుకొని  శ్రీరామ సంకీర్తన చేసి హనుమకు ఆనందం కల్గించారు

‘’హృదయే దైవం కః స్థాపయతి –హృదయం చిత్వా కో దర్శ యతి –గానేన శిలాః కో ద్రావయతి –సమహాన్ హనుమానేకో జయతి ‘’-అంటే-హృదయం లో ప్రతిష్టి తుడైన దైవాన్ని ,తెర తీసినట్లు తీసి హృదయం చీల్చి దర్శన మిప్పించి ,తన అఖండ గాన మహిమతో కఠిన శిలను గానమహిమతో కరిగించిన హనుమ ఒక్కడే జయ శాలి ‘’.అప్పుడు దేవతలు పుష్ప వర్షం కురిపించారు .

‘’సర్వస్మిన్ స్తు వతిసతి –యదా స్వరూపం ధృత్వా శ్రీ భగవాన్ –హనుమాన్ సువర్చ లాధ్యః – సత్కల్యాణం తదాప్త వాన్ ‘’విధి విధానం లో హనుమ సువర్చలా కల్యాణం జరిపించి మంగళాభరణాలను సమర్పించి సంతోషించారు .

‘’రామాలయ నటంతం –సంభాషంతం క్వాపి చ నా వశ్యం –తాద్రుశ్యమాత్రా వశ్యం –శ్రీకపి మితి నారదో మేనే ‘’-కదలాడే ,మధురంగా భాషించే ‘’శ్రీ రామాలయాన్ని ‘’ఎక్కడైనా ఎవరైనా చూశారా?అలాంటి సాక్షాత్తు’’ శ్రీ రామాలయం’’గా భాసించిన శ్రీ హనుమత్ ప్రభువును సందర్శించే  భాగ్యం కలిగిందని నారద తుంబు రులు సంతోషం ఆనందం పొందారు .ఈ విధంగా శ్రీ  సువర్చలాన్జనేయ స్వాముల కల్యాణాన్ని జరిపించి,సుఖ సంసారం చేయించి  వారికి పుస్టుడు,తుస్టుడుఅనే ఇద్దరు కొడుకులు జన్మించారని ముగించారు .

దీనితో కృష్ణా జిల్లా కవుల సంస్కృత రచనలు సమాప్తం .తరువాత నెల్లూరు  జిల్లా రచయితల గురించి తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.