విశ్వనాధ మెత్తని యెద

విశ్వనాధ మెత్తని యెద

‘’తన యెద ఎల్ల మెత్తన ,కృత ప్రతి పద్యము నంతకంటె మె-త్తన,తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి మెత్తన ‘’ అని తన గురువు చెళ్ళపిళ్ళ వారి మెత్తని హృదయాన్నిమెత్త మెత్తగా  ఆవిష్కరించాడు విశ్వనాధ  .విశ్వనాధ దీనికేమీ తీసిపోయిన వాడు కాదు .గురువును మించిన శిష్యుడు .ఈయన యెద అంతకంటే మరింత మెత్తన .అదెలాగో తెలుసు కొందాం .

శ్రీ సురగాలి తిమోతీ జ్ఞానందకవి బొబ్బిలి వాడు .విశ్వనాధ కవిత్వమంటే తీరని దాహం లో ఉన్నవాడు చూడటానికి బెజవాడ వచ్చాడు .బజారులో గురువుగారిపక్కన శ్రీ పాటి బండ్ల మాధవ శర్మ ,శ్రీ పొట్ల పల్లి సీతారామా రావు ఉన్నారు .విశ్వనాధ గురించి వారినడిగి తెలుసుకొని అమాంతంగా ఆశువుగా’’తెలుగుం గబ్బము లల్లునట్టి కవులీ దివ్యాంధ్ర భూమీస్తలిన్ –కలవారెందరో ?వారు నీకు సములా ?కావ్య ప్రపంచాన ,నీ-కల మెన్నో విధముల్ చెరించెడిని విఖ్యాతిం బ్రఫర్శి౦చెడిన్ –పలుకన్ నీకును నీవె సాటి గురుదేవా ౧ సత్యనారాయణా ‘’అని మొదలుపెట్టి చివరగా ‘’కమనీయార్ధ రసావతార దిషణాగంభీర మూర్తీ!దయా –సముద్రా వివిదార్ధ కావ్య రచనా సామ్రాజ్య పట్టాభిషి –క్త  మహాన్ద్రాభ్యుదయాభిమానీ ,విలసద్బ్రాహ్మ స్వరూపా ,గుణో-త్తమ ,యౌదార్య రసస్వభావ ,గురునాధా విశ్వనాధా నమః ‘’అని నాలుగు పద్యాలు చెప్పి విశ్వనాధ మహోన్నత వ్యక్తిత్వాన్ని మనసారా ఆవిష్కరించాడు . గురూజీ ఉబ్బి తబ్బిబ్బై ‘’నువ్వెవరవునాయనా ?’’అని అడిగాగానే ‘’వాడి జోకును జడిపించి సగర గుండె –జీల్చి చెండాడి పులి యని సెప్పుకొన్న –పాపరాయండు పుట్టిన ప్రదిత సీమ –బొబ్బిలి పురమ్ము నా పుణ్య భూమి ‘’అన్నాడు పద్యం వదిలి వచనం లో పరిచయం చేసుకో అన్నారు .వదలలేదు శిష్యపరమాణువు .మళ్ళీ ఆశువులోనే ‘’తేనెలు సోనలు గురియగ –ధీ నిదులెల్లరు నుతించు దివ్యదఖండ –శ్రీ నాయ కవిత చెప్పెడి –జ్ఞానానందకవి రత్నము నామము వాడన్ ‘’అన్నాడు .ఇదంతా మొగల్రాజ పురం తూము దగ్గర జరిగిన సంఘటన .గురువు మది మెత్తనై’’నీ కవిత్వం భేషుగ్గా ఉంది .కొంచెం కృషి చేస్తే గోప్పకవివి అనిపించుకొంటావు ‘’అని దీవించారు గురు బ్రహ్మ .ఈ గురుశిష్య సంబంధం విశ్వనాధ జీవిత పర్యంతం కొన సాగింది .స్వంత కొడుకులాగా ఆయన్ను విశ్వనాధ ఆదరించాడు. ఈ కవి కావ్యాలన్నిటికి ముందుమాట రాసి మెచ్చి ప్రోత్సహించిన వాత్సల్యం విశ్వనాధ ది.’’కవికోకిల’’ బిరుదునిచ్చి సత్కరించారు విశ్వనాధ ఆయనకు ప్రయాణాలకు ఛార్జీలిచ్చి పంపేవారు .విశ్వనాధకు కుల సాహిత్యం తో సంబంధం లేదని కవితా గంధం ఉన్న వారెవరైనా ఆయనకు ఆత్మీయులేనని తెలియ జేసే ఉదాహరణ ఇది .

రాయుడు శాస్త్రి అని పేరున్న బ్రహ్మశ్రీ తాతాసుబ్బరాయ శాస్త్రిగారు ఒక సారి బెజవాడవచ్చి విశ్వనాధ ఇంటికి  వెడితే ఆయన ఇంట్లో లేకపోతె తానొచ్చానని భార్యకు చెప్పమని రైల్ స్టేషన్ కు  వెళ్ళారు ఇంటికొచ్చిన విశ్వనాధ విషయం తెలిసి ఆగమేఘాలమీద స్టేషన్ కెళ్ళి శాస్త్రి గారిని కలిసి నమస్కరించాడు .ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ‘’నాయనా !నీ పుస్తకాలు చదివాను ‘’అనగానే విశ్వనాధ ఆర్ద్ర హృదయుడై ఆనంద బాష్పాలు కారుతుండగా ,మాట రాక  రుద్ధ కంఠంతో వినయంగా మాట పెగుల్చుకుని ‘’నేను మీ దగ్గర చదువు కోలేకపోయినందుకు బాధ పడుతున్నాను ‘’అన్నాడు .శాస్త్రిగారు కూడా ఆనంద  బాష్పాలు రాలుస్తూ విశ్వనాధ బుజం తడుతూ ‘’ఎక్కడ చదువుకొంటే నేం నాయనా !నీకు మంచి భవిష్యత్తు ఉంది ‘’అని దీవించారు .ఇది ఇద్దరు మహానుభావుల సమాగమం .ఆనంద పులకా౦కితం .కృతజ్ఞతా భావ సమ్మిళితం .

విశ్వనాధ వారి ‘’దయాంబుధి ‘’పద్యాలు జిజ్ఞాస పెంచే అనుభూతి శకలాలు .’’నీరదము ‘’అనే పద్యాలలో ‘’అచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది ఇదని గుర్తేమి కన్పడును ?’’అనే చరణాలు కన్నీళ్లు తెప్పిస్తాయి .’’గొంగళి పురుగు ‘’కద మానవ స్వభావం మీద వ్యాఖ్య .ఒకరి దొడ్లో ములగ చెట్టు ఉంది .కొమ్మలు పక్క వాళ్ళ దొడ్లోకి వెళ్లి కాయలుకాసి ఇద్దరిమధ్యా ఆవేశకావేశాలు పెరిగి కోర్టుదాకాపోయి చెట్టు కొట్టేశారు .కాని దానికి అంటిపెట్టుకున్న గొంగళి పురుగులు మాత్రం  రెండు కుటుంబాల ఇళ్ళల్లో చేరి బాధించాయి .స౦కుచిత స్వభావాలమీద చెణుకుఇది . ఒక వీధికుక్క దిక్కు లేని చావును గురించి ‘’నిర్దయ ‘’పద్యాలు రాశాడు కరుణ రసానికి పరాకాష్ట .బజారు బజారంతా కావలికాసే కుక్కకు స్థలాభిమానం లేదు .చివరికి ఆ అభిమానం తో ఊరి వైపు చూస్తూ చచ్చిపోయిందట వీదికుక్కను వస్తువు చేసి రాయటం ఆయనకే చెల్లింది .కారణం ఆయన యెదమెత్తన .

చూరు కింద నుంచోటానికి చోటు ఇవ్వక పొతే ఒక చిన్న మేక పిల్ల వానలో తడిసి చనిపోయింది .దీనిపై ‘’ ‘’రాశారు .విశ్వనాధ కాలాన్ని వెనక్కి తీసుకు వెడతాడు అని నిందించే వారికి ఇది కను విప్పు కలిగిస్తుంది .పిల్లల మనస్తత్వాన్ని చక్కగా వివరిస్తాడు విశ్వనాధ .పసివాడు ఏడుస్తుంటే తండ్రి రాజుగారి ‘’పట్టపు ఏనుగు’’ చూపించి దానిమీద కూర్చోబెడతానని సముదాయి౦చినా ఏడుపు మానలేదు .కాని బజారులో ‘’రంగుల పచ్చి పేడ బొమ్మ’’ కొనిస్తే యిట్టె యేడ్పు ఆపేశాడు .

కిన్నెర సాని పాటలలో ‘’తెలుగు వంపు ,తెలుగు మెత్తన ,తెలుగు ప్రతిభ ‘’ప్రతి ఫలించేట్లు రాశానని చెప్పుకొన్నాడు  .దిక్కు లేని వాళ్ళ చావును ‘’అసృత బాష్పము ‘’శీర్షికతో పద్యాలు రాశాడు .ఒక పేదరాలు పాము కరిచి మర్రి చెట్టు నీడన చనిపోవట౦ ,ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోవటంపై ‘’గొడుగు లడ్డమ్ముగా బెట్ట్టు కొనెడి వారు  -గాని ,యాదారి బోవు నొక్కరును వచ్చి –‘’యామె’ మృతికేమి హేతువో’’ యని తలంచు –వారు ముక్కుపై వ్రేలుంచు వారు లేరు ‘’అన్నారు .శ్రీ శ్రీ’’ భిక్షు వర్షీయసి’’ని చదివి ఓహో అంటాం కాని దీన్ని పట్టించుకొన్న వారు లేరు .

చిన్న పిల్లాడొకడు అన్నం తినే  ముందు కాళ్ళు కడుక్కోవటానికి దొడ్లోకి వెళ్లి తులసి మొక్కను పీకాలను కొంటాడు .దానిప్రక్కనున్న మల్లెమొక్క వద్దని వారిస్తుంది .తులసి కూడా పీకద్దని ప్రాధేయ పడింది .ఇంతలో తల్లివచ్చి అన్నానికి వాడిని తీసుకెళ్ళింది .తులసి మొక్కను పీకావా అని అడిగితె వాడు ‘’తులసి చెల్లిని ముద్దాడుతున్నాను ‘’అంటాడు ‘’మా నాయనే ‘’అని తల్లి కొడుకును అక్కున చేర్చుకుంటుంది. సుకుమారమైన అందమైన కల్పన చేశాడు చిన్నపద్య  కధలో విశ్వనాధ .లలితంగా పిల్లలకు ప్రకృతిని పరిచయం చేయటమే ఆయన ఉద్దేశ్యం .

ఒక కమ్మ వారమ్మాయి  చిన్నతనం లోనే విధవ రాలైతే విశ్వనాధ తన ఇంట్లో ఆమెను కూతుర్లా పోషించి మరొక మంచి వాడికి రెండవ వివాహం చేసిన ఔదార్యంచూపాడు  ఆయన యెద మెత్తన కాదా .

అబ్బూరివారద రాజేశ్వర రావు తో ‘’మీనాన్న రామ కృష్ణారావు రాయాల్సిన బృహత్ కావ్యాన్ని నేను రాయాల్సి వచ్చిందయ్యా ‘’అన్న సంస్కారి .అబ్బూరి పాండితీ గరిమకు గొప్ప నివాళి కూడా .ఇలా విశ్వనాధ యెద సుతి మెత్త్తన అని చెప్పటానికి ఎన్నో ఉన్నాయి .

ఆధారం –తెలుగు యూని వర్సిటి ప్రచురణ ‘’విశ్వ నాద ఒక కల్ప వృక్షం ‘’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.