విశ్వనాధ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం

తెలుగు వాడైన విశ్వనాధ చాందసుడని  ఆయన రాసినకొద్దీ వేదకాలం మరీ వెనక్కి పోయిందని ఎక్కిరించారు .ఆయనకు ప్రపంచ సాహిత్యం, అందులోని మార్పులు కవితోద్యమాలు ప్రక్రియా వైవిధ్యం ఏమీ తెలియవని అన్నారు .ఈ అన్నవారందరికంటే ఆయనే ఎక్కువగా విశ్వ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవలోడనం చేసుకొన్నట్లు కనిపిస్తుంది .ఆయనకే సాహిత్యమూ ‘’అంటరానిది కాదు ‘’.వాటిలో ఉత్కృష్ట భావనలుంటే వాటిని భారతీయీకరణం చేసి ఈ ప్రధాన ప్రవాహం లో కలిపేసిన నేర్పు ఆయనది .ఇందులో కొన్ని ఆయనే చెప్పుకొన్నవి .కొన్ని ఆయన శిష్య పరంపర ,అభిమానులు చెప్పినవిఉన్నాయి .వాటిని వివరించే ప్రయత్నమే చేస్తున్నాను .

జ్ఞాన పీఠ పురస్కారం లభించినప్పుడు ఆయన్ను క్షుణ్ణంగా ఇంటర్వ్యు చేశారు .ఒక రకంగా శల్య పరీక్ష చేశారు .అప్పుడాయన చెప్పిన మాటలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం .అయన వాణి లోనే ‘’నాకు గోగోల్ తెలుసు .టాల్ స్టాయ్ ,దాస్తోవిస్కి తెలుసు . మాక్సిం గోర్కీకొంతవరకు తెలుసు .సోమర్ సెట్ మాం ,ఇబ్సన్ ,నియోత్ ,కూర్ట్ ల గురించి తెలుసు .బుద్ధిజం గురించి విస్తృతంగా చదువుకొన్నాను .వందల కొద్ది పేర్లు నాకిప్పుడు గుర్తులేవు .ఎంత మందిని చదివానో అ పేర్లుకూడా గుర్తులేవు .శాస్స్త్రాలు మతాలూ కళలు ,నేను చదివిన వాటి గురించి నా నవలలో చర్చించాను .వేట గురించి కూడా నాకు తెలుసు .జిమ్ కార్బెట్ ,పాండల్సన్ సింగ్ మొదలైన వారిని చదివాను .ఈ పరిజ్ఞానాన్ని నా రామాయణం లో ఉపయోగించుకున్నాను . రాముని అరణ్య వాస రచనలో ఈ నా పరిజ్ఞానమంతా ఉపయోగ పడింది .

‘’నేను అర్ధ శాస్త్రం చదివాను .కారల్ మార్క్స్ దాస్ కేపిటల్ గురించి కొంత తెలుసు .డబ్బు గురించి బాగా తెలుసు .ప్రతి వారి గురించి నాకు కొంతలో కొంత తెలుసు .ప్లాటో గురించి ,షోపనాల్ ,స్పినోజా ,బెర్గ్ సన్ ,శాంతాయన ,క్లోస్ ,డైలీ ల గురించికొంత  తెలుసు .సైన్సు విజ్ఞాన చరిత్ర కూడా చదివా .అయిన్ స్టీన్ గురించి ,మాధవ పోర్ట్ గురించి చదివా .గ్రాంధిక వ్యావహారిక భాషల గురించి నన్నడిగితే ,వాటి గురించి ఒక ఒక పుస్తకమే రాయాల్సినంత గ్రంధం ఉంది నేను రాస్తే .

‘’నేను తులసీదాసు రామాయణం ‘’చదివాను .కంబ రామాయణాన్ని చదివానని చెప్పలేను .కొంత వినికిడి వలన తెలుసుకొన్నాను .రామాయణాన్ని ‘’అద్వైత మత స్థాపన ‘’కోసం రాశాను .వాల్మీకి విశిష్టాద్వైతానని స్థాపించటానికి రాశాడు అనే వాదాన్ని కాదనటానికీ రాశాను .రామకధ జరిగిన కాలం లో ఉన్నది ‘’సాంఖ్య దర్శనం ‘’ఇది అద్వైతం తోప్రక్కప్రక్కనే సంచరించేది .సీతా, లలితాదేవి ల గురించీ రాశాను. వాల్మీకి కంటే గొప్ప కళాకారుడు ఉండడు.దీన్ని వివరించటానికి కనీసం రెండుమూడు వేల పేజీల గ్రంధం రాయాలి .

‘’రాజ్య తంత్రం గురించి రాశాను .యుద్ధ తంత్రం సైనికులకు సంబంధించిన ‘’మిలిటరి ‘’గురించి కూడా రాశాను రాముడు సర్వాంతర్యామి అనే కోణం లో వాల్మీకాన్ని వ్యాఖ్యానించాను .నా రామాయణం లో అనేక వేదాంత తత్వాలను బోధించాను .మంత్రం శాస్త్రం చెప్పాను .పశ్చిమ దేశ గొప్ప కళాకారుల కు కూడా నేను కృతజ్ఞుడను .ఎడ్గార్ అలాన్ పో శిల్పం ప్రత్యేకమైనది .నియోల్ కవార్డ్ ,సోమర్సెట్ మాం లలో ఎవరి శిల్ప రీతి వారిది .హెమింగ్వే శిల్పరీతి వేరు .సర వాల్టర్ స్కాట్ తీరువేరు ఇది కాలదోషం పట్టింది .సిన్క్లార్ లూయీస్ రీతి వేరు .ఆధునిక విజ్ఞాన  శాస్త్ర వేత్తలు అయిన్ స్టీన్, రూధర్ ఫోర్డ్ ల వెనకాల పడ్డారు .విజ్ఞాన పరిధిలో వారిది ప్రత్యేక మైన రీతి .ఈ విధంగానే నేను నా సొంత శిల్ప రీతిని సాధించుకోన్నాను.నా  శిల్ప రీతి అనేక ఇతర విషయాలతో కలబోసి ఉంటుంది .వైదిక సత్యాలు ,భాషా శాస్త్ర విషయాలు సత్యాలు .మన స్మృతులలో ఉన్న సత్యాలు భాష్యాలలో ఉన్నాయి .అందుకనే వీటిని తెలుసుకోవటం కష్టం .

‘’నేను సుమిత్రను సృష్టించినట్లు ఎవరూ ఊహించి ఉండరు .ఆమె ఎంతో నెమ్మది .మన తెలుగు మధ్య తరగతి స్త్రీ లాగా ఉంటుంది.ఆమె  ఉన్నట్లు వ్యక్తిగా స్పష్టంగా కనిపించదు కాని ఆవిడ లేకుండా ఇల్లు నడవదు .విచారం వల్లకలిగే కల్లోలాన్ని కుటుంబం లో ఇతరులు సహించేలా చేస్తుంది .రామాయణం లో ప్రతిపాత్రను నేను కొత్తగా సృష్టించాను .రావణుడిని కొత్తగా తయారు చేశాను .ఆయన ‘’ఖడ్గ రావణ  మంత్రం ‘’అనే ఒక మంత్రానికి అది దేవత .శ్రీవిద్యలో ఈ రహస్యం దాగిఉంది .దాన్ని నేను సాధించి రాశాను .ఇది తెలియాలంటే ‘’కామకళా  విలాసం ‘’చదవాలి .శ్రీ విద్యోపాసనకు ఇది ‘’బైబిల్ ‘’వంటిది .

‘’జాన్ సరూ వర్డ్ బ్లాకీ ‘’ప్రసిద్ధ గ్రీకు పండితుడు .స్కాట్ లాండ్ వాడు .ఆస్చిలాస్ రాసిన అయిదు ప్రఖ్యాత నాటకాలను అనువదించాడు .తన అనువాదానికి ముందుమాట రాస్తూ ‘’పద్యం అనేది కవికీ తత్వ వేత్తకూ సాధారణమైన సంగతి .తత్వ వేత్తకు తత్వ వేత్తగా పద్యం అందదు .కవికి కవిగా పద్యం’’ కీ’’దొరుకు తుంది .’’అన్నాడు మిల్టన్ ఒక కవి .కీట్స్ ఒక కవి.షేక్స్ పియర్ గొప్ప నాటక కర్త .,తాత్వికుడు .మౌలికంగా కవికాడు .పాఠకుడు నిజమైన కవిత్వం విన్నప్పుడు మరోప్రపంచం లోకి వెడతాడు .అతనికళ్ళుఆ సంగతిని వ్యక్తం చేస్తాయి .

విశ్వనాధ చాలామంది యూరోపియన్ అమెరికన్ రచయితలను చదివాడు .ఆయనమాటల్లోనే ‘’విస్తృతంగా చదివాను ‘’.ఆయనకు హెచ్ జి వేల్స్ అంటే ఇష్టం అన్నాడు .ఆల్డస్ హక్స్లీ ,మపాసా ,ఓ హెన్రి ధామస్ హార్డీ ల రచనలన్నీ లోతుగా చదివాడు .ఇంగ్లీష్ నాటక కర్తల రచనలన్నీ చదివాడు .గార్దేనర్ ,మిలని ,ప్రాస్ట్ ,రాబర్ట్ లిండ్ ,బ్లోవోస్కి ,బెర్ట్రాండ్ రసెల్ లను  తరచాడు..ఆయన మాటల్లోనే ‘’ రష్యన్ రచయితల అనువాదాలు ఫ్రెంచ్ రచయితల రచనలు ఆపోసనం పట్టాను .మీరు నవ్వకుండా ఉంటె వందల కొద్దీ క్రైం కధలు చదివాను ‘’అని చెప్పాడు . ‘’జేమ్స్ బాండ్ ,బాస్ నవలలు చదివాడు .ఇగాన్ స్టాన్లీ ,గార్దేనల్ రచనలు చదివేశాడు .’’పశ్చిమ దేశాలనుండి వచ్చిన చదువ దగ్గ పుస్తకాన్ని దేన్నీ వదిలిపెట్టలేదు .బానిసల వ్యాపారానికి చెందిన అమెరికన్ నవలలు చాలా చదివాను .’’అని స్పష్టంగా చెప్పాడు .సైన్సు చరిత్ర ,పశ్చిమ దేశాల తత్వ శాస్త్రం  భూ గర్భ శాస్త్రం ,డార్విన్ పరిణామ సిద్ధాంతం లను కూడా పూర్తిగా తరచి చదివాడు విశ్వనాధ .’’బెక్సన్ ‘’గురించి ‘’ధిల్లీ’’అనే ప్రఖ్యాత అమెరికన్ తత్వ వేత్తనూ చదివాడు .’’షేక్స్పియర్ నాటకాలన్నీ చదటమేకాదు .ఆయన పై వచ్చిన విమర్శన గ్రంధాలు దాదాపుగా అన్నీ చదివాను ‘’అని చెప్పుకున్నాడు .’’తెలుగు పద్ధతిలో వ్యక్తం చేయాలంటే నేను ఆంగ్ల సాహిత్య చరిత్ర ,ఆంగ్ల భాషాచార్యులు విస్తు పోయెంతగా చదివాను ‘’అని ఢంకా బజాయించి మరీ చెప్పాడు .’’కేమిస్ట్రి లెక్కలు ఫిజిక్స్ ఆల్జీబ్రా తప్ప మిగిలిన శాస్త్రాలన్నీ ఎంతో కొంత తెలుసు .’’అన్నాడు .ప్రాక్ ,పశ్చిమాల గురించి విశ్వనాధకు బాగా తెలుసు .ఉపనిషత్తులు బ్రాహ్మణాలు ,భాష్యాలు చదువుకున్నాడు .’’ప్రతి శాస్త్రం గురించీ కొంతవరకు తెలుసు ‘’అని తన సర్వ శాస్త్ర జ్ఞానాన్ని గురించి చెప్పాడు .సంస్కృత కావ్య నాటకాలు బాగా తెలుసు ‘’తెలుగులో యెంత ప్రసిద్ధ విమర్శకుడి నో సంస్కృతం లో కూడా అంతే ‘’అంటాడు .

‘’ఇంగ్లీసుభాష లోని  ఆధునిక నాటకాలు చాలా చదివాను .ప్రీస్త్నీ ,గైట్స్ఇంకా ఇతర నాటక కర్తలవి చూశాను .19 50-60కాలం లో వచ్చిన వారిరచనలు కూడా చదివాను .కొంతమంది ఆదునిక విమర్శకులవి చదివాను .వారిలోపాలు మెరుగులు అవగతమైనాయి .’’అన్నాడు విశ్వనాధ .అందుకే  సాహిత్య విమర్శ కు చెందిన కొన్ని గ్రంధాలు రాశాడు విశ్వనాధ .దానిపై ‘’తెలుగులో విమర్శనా విధానాన్ని మార్చి అనగా పరి వర్తనం చేసి అవి కొత్త  విప్లవాన్ని సృష్టించాయి తెలుగు సాహిత్యం లో కొత్తగా ఆలోచించే విమర్శనా పద్ధతులకు నేనే శ్రీకారం చుట్టాను ‘’అని రొమ్ము విరుచుకుని చెప్పాడు .

‘’బెంగాలీ పధ్ధతి చిత్ర కళా రీతుల గురించి నాకు తెలుసు .నేను నాటక ప్రయోక్తను .నాటక కళ బాగా తెలిసిన వాడను .రెండు మూడు నాటక కంపెనీలకు శిక్షణ ఇచ్చాను .చిన్నప్పుడు పాటలు బాగా పాడే వాడిననే పేరు0డేది నాకు.’’మ్రోయు తుమ్మెద ‘’నవలలో హిందూస్తానీ సంగీతం పుట్టుక,పెరుగుదల  గురించి రాశాను .కర్నాటక సంగీతం గురించి నాకు కొంత తెలుసు .సుమారు యాభై  ఏళ్ళ కిందటే  ‘’ఏక వీర ‘’నవలలో కూచి పూడి నృత్యం గురించి రాసిన మొదటి వాడిని  .కూచిపూడి నృత్యానికి వేయిపడగలు లోని ‘’గిరిక ‘’ప్రతిభా వంతమైన దర్పణం .నేను కళాత్మక ఆంగ్ల చిత్రాలు చాలా చూశాను అలా చూడటం నా హాబీకూడా ‘’

సంస్క్రుతకవుల మార్గాలను బేరీజు వేస్తూ కాళిదాసు సహజ సుకుమార మార్గ గామి. భవ భూతి మురారిలుశబ్ద బ్రాహ్మలు .భారవి అర్ధ సంగ్రహణ శీలి .అలాగే తెలుగు కవుల గురించి విశ్లేషిస్తూ నన్నయ సహజ సుకుమార మార్గం లో ప్రయాణించాడు .ప్రౌఢకదా నిర్మాణం లో  ,జ్యోతిశ్శాస్త్ర విషయాలు గుప్పించటం లో ,లోకజ్నత్వం లో ,లోకం లోకి పలుకుబడులు నుడికారం ,లోకోక్తులు విరివిగా వాడాడు .తిక్కన మార్గం వేరు సౌకుమార్యం ఉండదు కాని లోతైన పరిశీలనం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది అన్నాడు ‘’నాది తిక్కన మార్గం .నన్నయ గారి పోకడ నా దగ్గర లేదు .నాస్వభావం లో ప్రక్రుతిలోకూడా లేదు శైలి అనేది కవి జీవ లక్షణం దాన్ని ఎవడూ మార్చు కోలేడు.అందుకే మహా కవులకు వారి వారి ముద్రలు ఉంటాయి .

 

విశ్వనాధ కాల్పనిక సాహిత్యాన్ని కాని కవిత్వాన్నికాని రాస్తున్నప్పుడు ఆనందిస్తూ అనుభవిస్తాడు.ఎప్పుడూ ఒక మానసిక స్తితిలో ఉంటాడు .ఒకరకమైన పారవశ్య స్తితిలో తన్మయత్వం లో ఉంటాడు .దాన్ని డిస్టర్బ్ చేస్తే సహించడు.రవీంద్రుని ప్రేరణతో భావకవిత్వ ఉద్యమం వచ్చిందని ,తనపై టాగూర్ ప్రభావం కొద్దికాలమే ఉందని ,అది తనకేమీ ఉపకారం చేయలేదని ,కాని ఆయనకదానికలు చదివి ఆనందించానని అన్నాడు .’’మన సుసంపన్నమైన  తెలుగు సాహిత్యం టాగూరు ను మించినది .పాశ్చాత్య రచయితలనుకూడా మించి పోయినది’. ఇక్కడ వేదోపనిషత్తులున్నాయి .డాస్తోవిస్కి భారత దేశం లో పుట్టి ఉంటె   ‘’ఇడియట్ ‘’నవల రాసి ఉండేవాడు కాదు .ఇక్కడ పుట్టి ఉంటే షేక్స్పియర్ ‘’హామ్లెట్ ‘’రాసేవాడుకాడు .ఎందుకంటె ఒక దేశపు సంస్కృతీ ,మతం ,భాష ,ఆచారాలు ,ఆ దేశపు రాజ్యాంగం తప్పకుండా వాటి ప్రభావాన్ని ఆ దేశపు గొప్ప కవు లందరిమీదా చూపిస్తాయి ‘’అని నిర్ద్వందంగా విశ్వనాధ చెప్పాడు .దీన్ని బట్టి  విశ్వనాధ విశ్వ సాహిత్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశాడనిఅర్ధమౌతోంది ..

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦-9 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.