విశ్వ నాధీయం

విశ్వ నాధీయం

‘’తెలుగుకవులది ఒకదారి ,విశ్వనాధది వేరొక దారి ‘’అని ఎర్రద్దాలు పెట్టుకున్నవారన్నమాట .ఆయన ఏది రాసినా మానవ జీవితోద్ధరణకే ,ఉత్తమ మానవతకే రాశాడని ఎందరో ఎలుగెత్తి చెప్పారు ఆయనా అప్పుడప్పుడు చెప్పుకొన్నాడు .ఆయన ద్రుష్టి నిజంగానే వేరు ఆయనది  అందరూ నడిచే బాటకాదు. అందరి చూపులాంటి చూపుకాదు  .అందుకే విలక్షణంగా కనిపిస్తాడు .లోచూపున్నవాడు .పైమెరుగులకు భ్రమసేవాడుకాడు .ఆయన ప్రతి  మాట కదలిక ఆలోచనల్లో నిజాయితీ భారతీయత ఆంధ్రత్వం తొణికిస లాడుతుంది.ఒక్కడు నాచనసోమన అని ఆయనే అన్నట్లు ‘’ఒక్కడు విశ్వనాధ ‘’ఇది తిరుగు లేనిమాట .ఆ మహోన్నత వ్యక్తిత్వాన్ని అన్ని కోణాల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం .

నవ్య సంప్రదాయ ఉద్యమానికి నాయకుడై విశ్వనాధ నాలుగు దశాబ్దాలు యుగ కర్తగా నిలిచాడు .కవి సార్వ భౌముడైన శ్రీనాదునితో సరిసమానం గా ఈ’’ కవిసామ్రాట్’’నిలిచాడు .విషాదాంత నాటక రచన చేసి ప్రాక్ పశ్చిమ నాటక శిల్ప సమన్వయము చేసిన ప్రయోగశీలి .ఆయన ముట్టని ప్రయోగం శిల్పం లేదు. సమకాలీన జీవిత చైతన్యానికి ఎత్తిన పతాకగా నిలిచాడు . ఆయన మధ్యాక్కరలు  ప్రవ్రుత్తి నివృత్తుల మధ్య ప్రతిస్పందించే జీవుని వేదనలే.భవ్య సంగీతాలే .కల్ప వృక్ష రామాయణం ఆధునిక మానవ చైతన్యం లో ప్రపంచమంతా ప్రతిఫలిస్తున్న ఆధ్యాత్మిక అన్వేషణకు అద్దం పట్టే ఇతిహాస కావ్యం ‘’.నాభక్తిరచనలు నావి కాన’’ అని మళ్ళీ రామాయణమా? అన్నదానికి సమాధానంగా చెప్పాడు .పరానికి పనికొచ్చే రచన చేయమన్న తండ్రిగారి ఆదేశామూ నెరవేర్చాడు .ఈ శతాబ్ది చైతన్యాన్ని ఆపోసనపట్టి  భారతీయ దార్శనిక మూలాలతో విలువకట్టిన ప్రజ్ఞా మూర్తి .ఆయన పలికిన పలుకే ఒక ప్రమాణం .ఒక ఆలోచనా సరళికి ఆదర్శంగా నిలచిన పూర్ణ ప్రతిభా మూర్తి .

ఇంగ్లీషు నవలా ప్రక్రియలో వచ్చిన ప్రయోగాలకు సాటి వచ్చే తెలుగు నవలలు రాసిన ఏకైక నవలా కర్త .రచయితగా సమగ్ర వ్యక్తీ .కళా ప్రపూర్నుడు .శిల్పానికి తెలుగు తోట అయిన నన్నయ తిక్కనలే ఆయన్ను ఆవేశించారు .పాశ్చాత్య శిల్పం తో బలపడి వినూత్న భారతీయ వ్యక్తిత్వం తో వెలిగే సాహిత్య శిల్పాన్నికోరి అలాగే ప్రత్యక్షరం రాసి చూపించాడు .’’నాలాంటి కృతి శత నిర్మాత ను బిడ్డగా పొంది నా తండ్రి గొప్పవాడయ్యాడు’’అన్నదానిలో ఆత్మ విశ్వాసమే ఉంది ,గర్వంకాదు .’’అలనన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యంబు ‘’అన్నప్పుడూ అంతే .వీటిలో ధ్వని గ్రహించాలి .ఆయనది వ్యవహార భాష .మంధర శైలి .రస ధ్వనులకు ప్రాధాన్యం  .ఆయన చేతన నిత్య వేగి .శబ్దాన్ని ఏరుకోవటానికి చిన్నము కూడా నిలవలేదు .అంతటి భావ తీవ్రత ఆయనది .

విశ్వనాధ రాసిన ‘’నా కన్నుల ఎట్ట యెదుటన నాపుత్రుని కంఠ ముత్తరించి –నేను దయా౦బు ధిని కాదా యటంచు నన్నడిగే ఓ ప్రభూ ‘’అనే పద్యాన్నిశ్రీ అబ్బూరి వరద రా రాజేశ్వర రావు మేనత్త బియ్యం యేరు కుంటూ తనలో తానూ చదివేదట .ఆమె చదువుతూ ఉంటె హృదయం ద్రవి౦చి పోయినట్లు ఉండేదని వరద చెప్పాడు .శ్రీ దాసు శ్రీరాములుగారు ‘’తెలుగునాడు  ‘’మొదటి  భాగమే రాశారు .రెండవది రాయలేకపోయారు .విశ్వనాధ వరదతో ‘’శ్రీరాములుగారు రెండోభాగం కూడా రాసి ఉంటె ఆంద్ర దేశం లో కన్యాశుల్కం తోబాటు ఇదీ చిరస్థాయిగా ఉండేది ‘’అని నిండుమనసుతో మెచ్చిన సహృదయుడు విశ్వనాధ .

‘’భావనా శబ్దాలత వల్లా ,ఆవేశ శుద్ధి చేత ,అనుభవ వస్తు గుణం  వలన ఎంతోమందికి ఎన్నో ప్రాంతాలలో విశ్వనాధ పద్యాలు వాచో విదేయాలుగా ఉన్నాయి .కవిత్వానికి ఇదే మూల లక్షణం ‘’అన్నారు గురువు  శ్రీ చెళ్ళపిళ్ళ శాస్త్రిగారు .ఇదేభావాన్ని ఆంగ్లకవి డబ్ల్యు హెచ్ ఆడెన్ కూడా చెప్పాడు .కవిత్వం లో విశ్వనాధ ఎన్నో రూపకల్పనలు చేసి ,పద్యాన్ని వశ పరచుకొన్నారు .తెలుగు జీవితాన్ని అమూలం విశ్లేషించి చూసి తన పద్యాలలో నిక్షేపించారు .అందుకే ఆయన ఖండక్రుతులు కల్ప వృక్షం కలకాలం నిలుస్తాయి .తన ఆనందం ముఖ్యంగా ‘’కావ్యానందమే ‘’అని చెప్పుకొన్నాడు .

విశ్వనాధ శబ్దాలు ,,తత్వ బోధలు ,కావ్యలక్షణాలు అన్నిటినీ ‘’శ్రీరామ చంద్రాత్మ’’గా భావన చేసి కల్ప వృక్షం రాశారు .ఇదంతా ఆయన సాధనయే .లోకానికి అదికావ్యం .దీనికి ఆయన కోరింది కూడా కావ్యానందమే తప్ప వేరుకాదు .పూర్వజన్మ సంస్కారం వలన అద్వైతి అయ్యారు .ఆయనకు శివకేశవులకు రామ విష్ణువులకు  భేద మేలేదు .రామాయణం రాసి ఇలవేల్పు విశ్వేశ్వరునికి అంకితమిచ్చారు .ఖండా౦తపద్యాలన్నీ శివభక్తిపారమ్యాలే.ఆయనే రాముడు ఆయనే పరబ్రహ్మ .నిజానికి అయన గుండెపై స్వారి చేయాల్సినవాడు శ్రీ కృష్ణుడు .వాళ్ళ ఊరిలో సంతాన వేణుగోపాల స్వామి అంటే ప్రాణం .స్వామి విగ్రహం లో చాలామార్పులు చేశారు .తండ్రి శోభనాద్రి గారు ప్రతిష్టించిన శివలింగం జ్ఞానమూర్తిగా విశ్వనాధ భ్రూ మధ్యమంలో ఆడుతూ ఉంటాడు .

కల్ప వృక్షం లో భరతుడు అగ్ని ప్రవేశం చేసే సందర్భాన్ని ఆంజనేయుడు రాముడికి సంగీతం పాడుతూ వినిపించాడు యుద్ధకాండ చివరలో ఉన్నఘట్టమిది .చివర్లో రాసిన 325వ పద్యం లో మూడు చరణాలు పూర్తియ్యాయి. నాలుగవది యెంత ప్రయత్నించినా రావటం లేదు .స్నానం చేశాడుకాని భోజనం చేయబుద్ధికాలేదు ఇంట్లో అందరూ గొడవ . చివరికి స్పురించి ‘’జైత్ర యాత్రా0 చ చ్చ్రీ మధుసూదనాస్య పవమానా పూర్ణ మైనట్టులన్ ‘’అని పూర్తీ చేశారు .పై చరణాలలో ‘’కంఠ శంఖం ‘’అని రాశారు .రాముడు విజయ యాత్రకు బయల్దేరినప్పుడు పరమేశ్వరుని కంఠం నుండి వచ్చిన వాయువు చేత నినదించి నట్లున్నది అనిభావం .భరతుడు శంఖావతారం .దీన్ని తన ఆత్మారాముడు పూరించిన చరణంగా విశ్వనాధ భావించాడు .’నా స్వామి రాముడు నాభాష వాడే ,ఆయనకు తెలుగు వచ్చు ‘’అని చమత్కరించాడు విశ్వనాధ .విశ్వనాధను ఆవేశించి రాముడు తన కద రాయి౦చు కున్నాడుకదా

తనను తాను’’బ్రాహ్మీమయ మూర్తి ‘’అని చెప్పుకోవటానికి ఎన్ని గుండే లు ఉండాలో  అన్నీ ఉన్నవాడు విశ్వనాధ .ఆయన ఎన్నో కష్టాల్ని , ఆపదల్ని పోతనగారి భాగవత షస్ట స్కంధం లోని’’ నారాయణ కవచ ‘’పారాయణం చేసి  పోగొట్టుకున్నాడు .శుక్రవారం బజారు వెళ్ళినప్పుడు తెలిసిన కొట్టువాడు కొబ్బరిముక్క ప్రసాదంగా ఇస్తే ,ఇంకోకోట్లో ‘’ఉప్పు గల్లు’’అడిగి తీసుకొని ,పచ్చిమిరపకాయలు కనిపించగానే దానితో కొబ్బరీ ఉప్పూ కలిపి నోట్లో వేసుకొని రుచి ఆనందాన్ని పొందేవాడు .అప్పుడే ఆయనమనసు ఏకాగ్రమై గోప్పభావనతో ఇరవై ముప్ఫై పద్యాలు మనసులోనే రాసుకోనేవారు .ఇంటికి రాగానే గ్రంధస్తంమయ్యేవి  .ఆయన శరీరం లోని జీవుడు అంటీ ముట్టకుండా ఉంటాడా అన్నదానికి ఇదే సమాధానం అన్నారు శ్రీ పేరాల భారత శర్మ

ఆయనది ఆడంబరం లేని జప విధానం .రోజుకి కనీసం ఒక్కొక్క మంత్రాన్ని మూడు వేల సార్లు మూడు మంత్రాలు జపించేవారు .పగలు తక్కువ కాలం రాత్రి ఎక్కువకాలం జపం లోగడిపేవారు .రాత్రి సుమారు రెండుగంటలకు నిద్ర కు ఉపక్రమించి ఉదయం కొంచెం ఆలస్యంగా లేచేవారు .లేవగానే వ్యాయామం శీర్షాసనం ఆసనాలు ,పొట్ట అక్కళించటం  తప్పనిసరిగా చేసేవారు .మయూర ,హలాసన ,సర్వా౦గాసనాలు 75 ఏళ్ళ వయసులోనూ వేసేవారు .రాత్ర్తిపూట తలకింద దీపం పెట్టుకొని తెల్లవారేదాకా ఇంగ్లీష్ నవలలు చదివేవారని పేరాలవారి ఉవాచ .రాముడికి36ఏళ్ళ వయసులో సీతా వియోగం జరిగితే విశ్వనాధకూ అదేవయసులో భార్య వరలక్షమ్మగారు చనిపోయారు .విశ్వనాధ శరీరం నేలమీద ఒక మోటారు .ఆయన మనసు ఆకాశం  లో ఒక విమానం .గ్రంధ రచనలో ఆయన ధారణ అపారం,ఆశ్చర్యకరం .మాస్కో లోని తెలుగు అకాడెమీ అధ్యక్షురాలు వేయిపడగలను స్తుతించటం గురజాడ వారి పూర్ణమ్మను విశ్వనాధవారి కిన్నెర సానిని పొగడటంచేస్తే  కమ్యూ నిస్ట్ నాయకుడు ముక్కామల   నాగభూషణంగారు ముక్కు మీద వేలేసుకొన్నారు .

కైక రాముని సాధారణ మనిషిగా ఊహించినదుకు రాముడి మనసు చివుక్కుమన్నదట .దీన్ని విశ్వనాధ అద్భుత శిల్ప నైపుణ్యం తో చెప్పాడు .పాత్రను పాఠకుల హృదయంలో  చిర ప్రతిష్ట చేసి రసాస్వాదన కలిగించే నేర్పు తిక్కనగారిది మళ్ళీ విశ్వనాధది. ఊర్మిలా లక్ష్మణుల సంసార రహస్యం గురించి వాల్మీకి మౌనం వహిస్తే విశ్వనాధ ఆ మౌనానికి అద్భుత వ్యాఖ్యానం చేశాడు. వైదిక సంస్కృతీ ,సంప్రదాయం ,తాత్విక సిద్ధాంతాలను ఆధారంగా విశ్వనాధ కల్పనలు చేస్తాడు ‘’అనాసక్తి యోగం ‘’తో ఊర్మిళా  ,లక్ష్మణుల  సంసార యాత్ర సాగింది. ఊహ సంపత్తి ,కధాకధన శిల్పం ,వాల్మీకానికి బయటికారణం వీటికి  తోడుజీవుని వేదన మొదలైన వాటిని పరమేశ్వరార్పణంగా విశ్వనాధ పండించాడు అది ఆయన కవితా రూప తపస్సు .’’నన్ను కూల్చటానికే కాని సీతను అపహరించటానికి కాదు ‘’అన్నమారీచుని భావం లో యెంత అర్ధముందో గ్రహించాలి .మాయలేడి కధలో ఋషుల భావన ఆయా వ్యక్తుల ప్రభావాన్ని ప్రబోధింప జేసే అకార్య నిర్వహణం చేయగలిగింది అని విశ్వనాధ వ్యాఖ్యానం .మారీచునిలోను జీవుని వేదన చొప్పించాడు .విశ్వనాధ ఊహ మన పరిధిని దాటి ఉండటం ప్రత్యేకత . కిష్కింద కాండలో చేసిన రుతు వర్ణనలు  సీతా రాముల కదా తో ముడి పడి  ఉంటాయి .అరణ్యవాసం లో వారివి ‘’సాదు శృంగార లీలా ప్రసన్న గాధలే ‘’అన్నాడు .

విశ్వనాధ ‘’కధక చక్రవర్తి ‘’.ఆయనకున్నది మంచితనంపై పూర్తినమ్మకం .ప్రతిమనిషికి ‘’డ్రై వింగ్ ఫోర్స్ ‘’ఉంటుందిఅది ఉన్నత ఆశయాలకోసం పరుగు పెడుతుంది అన్వేషణ చేయిస్తుంది మనిషికిఉన్న ఆవేదన లో మానవత్వం ఉంటుంది అదే మనిషిని మంచివాడిని చేస్తుంది .సుగ్రీవుడిలాగా కొందరికి లక్ష్యం మరుగున పడుతుంది అప్పుడు మేల్కొలపటానికి హనుమ ,లక్ష్మణులు కావాలి .విశ్వనాధ ‘’అవిచ్చిన్న సంప్రదాయార్ది ‘’.ఆయన పాత్రలు మూసలో ఇమడవు .అల్పాక్షరాల్లో అనల్పార్ధ రచనకు ఉదాహరణ ‘’దుందుభి కద’’.సంధ్యాకాలం నుండి మళ్ళీ సంధ్యాకాలం వరకు జరిగిన సుందరకా0 డకద ఆయన ఒక’’ ఉపాసన’’గా భావించాడు .బాలకాండలో కనిపించిన మనస్సౌన్దర్యం మళ్ళీ సుందరకాండలో కనిపిస్తుంది .శృతి కాఠిన్యం లేని వార్తాకధనానికి ,ఆవేశం లేని సరళ భక్తి నివేదనకు విశ్వనాధ మధ్యాక్కరలు వాడాడు .హనుమ లంకలో సీతను వెతికేటప్పుడు మత్తకోకిల వృత్తాలలో రఘువంశ పురుషుల గొప్పతనాన్ని వర్ణించారు మహేంద్ర గిరి నుండి హనుమ దిగేటప్పుడు సముద్రాన్ని భుజంగ వృత్తం లో వర్ణించాడు .అలాగే సముద్ర వర్ణన కు ‘’అష్ట మూర్తి ‘’,వరాహ ;;వృత్తాలను ఎన్నుకొన్నాడు .రాముడు సముద్రునిపై కోపం తో బాణం ఎక్కు పెట్టినప్పుడు ‘’శాలూరం ‘’సముద్రుడి వేదనను ‘’దుర్మిల’’,సముద్రునిస్తిమితమనస్సును ;;కిరీటం ;;, సంతోషాన్ని ‘’హంసి ‘’వృత్తాలలో చెప్పాడు .నరేంద్ర వృత్తం కూడా ప్రయోగించాడు .బహువిధ ఛందస్సులతో సుందరాన్ని మరింత సుందరం చేశాడు .కల్ప వృక్షం మొదటినుంచి చివరిదాకా ‘’శ్రీరామ చంద్ర తేజస్సంక్రాంతి’’విజ్రుమ్భించింది .

విశ్వనాధ వర్ణనలు మహా విచిత్రాలు .ఆయనది ఆలోచనామృతం ‘’పురుగు తొలచిన దూలం నుండి పొడి రాలినట్లు సన్నని మంచు కురుస్తోంది ‘’అన్నాడు వేయిపడగలలో  ‘’,’’రస ఉపనిషత్ రహస్య వేత్త ‘’విశ్వనాధ .జ్ఞాత శిల్పి .’’విశ్వనాధ సాహిత్య విలసనం ఆంద్ర సాహితీ నందనోద్యానమున వేయి శరజ్జ్యోత్స్నాలు వెదజల్లిన సమయం .ఆయన సాహిత్య సృష్టి విచ్చిన నెమలి పించం లాగా తళ తళలాడుతూ కన్నులు మిరుమిట్లు గొల్పును ‘’అన్నమాట యదార్ధం .’’నాకు ఏదో ఒక రోజు చావు ఉంది ‘అని తెలుసుకొన్నవాడు విజ్ఞానియే ‘’అన్న వివేకానందుని మాట విశ్వనాధకు స్పూర్తి .మధ్యాక్కరలలో వ్యాజ స్తుతి ఎక్కువగానే చేశారు .నెత్తినెక్కి పిండికోడుతున్నావ్ వంటి  పలుకుబడులు విపరీతం .’’కాలికి వేస్తె వేలికేస్తావు ,పిచ్చి కుదిరింది పెళ్లి కుదరలేదు , .కాళ్ళను  బదడ్డపాము కరవక మానదు ,మొదలైనవెన్నో రాశాడు .’’నీకంటే పల్నాటి నూతులు నయం ,నీకు మూతి మొహం లేవు జనం యెట్లా చూడగలరు ?నిన్ను అయినకాడికి అమ్మేస్తాను అని విశ్వేశ్వరునే బెదిరించిన భక్త శిఖామణి విశ్వనాధ .ఆయన మధ్యాక్కరలు మధు బిందు సమానాలు .

‘’శృంగార వీధి ‘’ మైమరపిస్తుంది .ఈకావ్యం తోనే అయన లోఉన్న మహాకవిబీజాలు మొలకెత్త సాగాయి .దీనిలో శృంగారం భక్తీ పర్యవసానం  అయింది .లౌకిక భావాన్ని అలౌకిక సత్యం తోకలిపి ‘’గోపికా గీతలు ‘’రాశాడు .ప్రతి వృత్తం మీదా విశ్వనాధ ముద్ర ఉంటుంది .పద్యంలాగే మనోహర వచనమూ సాగుతుంది .కవితా సుందరి శరీరం శబ్దం .నడకలో ఒయ్యారం ఛందస్సు .శబ్దార్ధ చమత్కారాలే గతి విన్యాస శోభ .అదే శ్రోతల్ని ఆకర్షిస్తుంది ప్రాచీనతలేకపోతే నవీనతకు అర్ధం లేదు అన్నది విశ్వనాధ నమ్మకం .

‘’‘’ ఏకవీర ‘’నవల మధురలోని వైగై నదీతీరాన ప్రారంభమై అక్కడే అంతమవుతుంది. నదికూడా నవలలో ఒక పాత్ర .’’ధర్మం చెయ్యి ‘’ అనేది దీని ముఖ్య సంకేతం. భావ కవిత్వోద్యమకాలం లో వచ్చిన ఏకవీర లోని అమృతం పాత్ర వేయిపడగలు నవలలో పసరికగా రూపు దాల్చింది ‘’అన్నారు ప్రోలాప్రగాదవారు .’’ధర్మ రేఖను అతిక్రమిస్తే దారుణ మరణమే తప్ప నిష్కృతి లేదు ‘’అని చెప్పిన నవల ఇది . ‘’తెరచి రాజు ‘’లో పతాక సన్నివేశం ఏకవీర పతాక సన్నివేశం నుండి రూపు దిద్దుకోన్నది .నైతిక సూత్రాలపట్లా ,సాంప్రదాయ జీవన మార్గం పట్లా విశ్వనాధకున్న విశ్వాసం గౌరవం ప్రతిఫలించే నవలలలివి .’’కాళిదాస భావభూతుల శైలిని తిక్కన మార్గాన్ని ,టాగూర్ శరీర వాంచలేని ‘’నౌకభంగం ;;లోని ప్రేమను నా భావనా రచనా చమత్క్రుతినికలిపి ఏక వీర రాశాను ‘’అని విశ్వనాధ చెప్పుకొన్నాడు .

విశ్వనాధ తులసీదాసు ,సూరదాసు ,మైధిలీ శరణ గుప్త ,దినకర్ మహాదేవివర్మ కవితలు చదివాడు .ఆయన మాటలకున్న అర్ధాలను మూలాలలోకి వెళ్లి చెప్పగలరు. లావణ్యం అంటే లవణం అంటే ఉప్పుకుండే నిగనిగ అని అర్ధం చెప్పారు .శ్రీ ఆచంట సాంఖ్యాయన శర్మగారిని కలిశాడు ఒకసారి విశ్వనాధ ఈయన సత్తా ఏమిటో ఆయన ప్రశ్న పరంపరాలతో ఆయన తెలుసుకొని సన్మానం చేసి పంపారు .ఆయన టేబుల్ సొరుగులో ‘’భగవద్గీతా, ఈయన ఆంద్ర ప్రశస్తి ‘’పుస్తకాలు ఉండటం చూసి అవాక్కయ్యాడు విశ్వనాధ .’’ప్రేమను అణచుకోవటం మహా పురుషుల లక్షణం ‘’అని అప్పుడు గ్రహించాడు విశ్వనాధ.

రామ ధూర్జటుల తత్త్వం విశ్వనాధను ఆవహించి  కల్ప వృక్షం లో హనుమ కార్య శూరత్వానికి దారి చూపింది .రామకధను ‘’నాధ కద ‘’అన్నాడు   .కట్టు కధకాదు మోక్షకద .’’ఇష్టిఖండం ‘’తోప్రారంభమై ‘’ఉపసంహరణ ఖండం ‘’టో పూర్తయింది .ప్రతికా0డ ను అయిదు భాగాలుగా విభజించటం ఆయన ప్రత్యేకత .అది ప్రతీకాత్మకాంశం .షట్ చక్రాలకు ప్రతీక .అదొక మహామాలా మంత్రం .కైకేయీ తత్త్వం రామాయణ కల్ప వృక్ష శాఖలపై సుపుష్పితమైంది. ఆయన వాల్మీకానికి చేసిన వ్యాఖ్యానాలు కావ్యమార్గం ఆశ్రయించి వ్యంగ్య మర్యాదను పాటించాయి .ముని వేషం లోఉన్న రాముడు పూర్వం దశరధుని  బాణం చేత కొట్టబడ్డ ముని కుమారుడులాగా ఉన్నాడట .కార్యకారణ సంబంధాన్ని ఇక్కడ ధ్వనింప జేశాడు. సీత అశోక వనం లో అగ్నిలా ఉందనటం వైశ్వనాదీయం .రాముడు నడుస్తున్న రత్న దీపం అట .కల్ప వృక్షం అర్ధం చేసుకోవటానికి భావుకత్వం అత్యవసరం .’’కనకదుర్గమ్మ నవ్వులకు మల్లికార్జునుడికి పులకలు వచ్చాయట. ‘’శివుని మౌళి  పై నుంచి వెన్నెలలు కృష్ణపై నుంచి వచ్చే చల్లని గాలులు పూచిక ముల్లుల్లాగా స్వామిని పోడుస్తున్నాయట.మనోహరభావం .

‘’నాపాట ‘’లో ఆయన అల్లిన లలితగీతం దిగంతాలకు పోయి నిలవలేక ఉపసంహరించిన అస్త్రం లాగా మళ్ళీ తననే వరించింది అంటాడు .’’సంధ్యవార్చడు ,అధ్యయనం లేదు ,కర్మపై నమ్మకం లేదు ‘’ఇదీ నేటి బ్రాహ్మణ్యం స్తితి అని వాపోయాడాయన .ఒకడు ‘’నార్మా షెవర్ ‘’అనే హాలీవుడ్ నటికీ ఉత్తరం రాసి జవాబుకోసం రోజూ పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నాడట .తనకు నోబుల్ ప్రైజ్ వస్తుందని దాన్ని ఏయర్ పోర్ట్ లేని తన వూళ్ళో విమానం లో తీసుకోస్తారని ఇంకోడు రోజూ ఆకాశం వైపు చూస్తున్నాడు అని చమత్కరిస్తాడు ‘’’విశ్వనాధ వాడిన భాష నవ్యం అది ఆయన సృష్టి .దాన్ని విశ్వనాధ శైలి అనాలి ‘’అని శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మగారు తరచుగా సభలలో చెప్పేవారట .

విశ్వనాధ ఉపన్యాస ధోరణి విలక్షణమైనది .అక్షర తూణీరం నుండి వ్రేలికి వచ్చే అస్త్ర పరంపరలాగా పాఠకుల హృదయాలలోకి చొచ్చుకుపోతాయి ఆయన మాటలు .’’నాచన సోమన ,కృష్ణ దేవ రాయలు ,తెనాలి రామ కృష్ణుడు-ఈ ముగ్గుర్ని కాచి వడగడితే అయిన వాడు విశ్వనాధ ‘’అన్నాడుశ్రీ కాటూరికవి  .’’సత్యనారాయణ భావయిత్రీ శక్తి ముందు రాయలదికూడా తీసికట్టే .ఆయన సోమన అంతటివాడు .ఒకడు నాచన సోమన అన్నట్లే ఒకడు విశ్వనాధ .

ఆధారం –శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ –‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’

గాంధీజయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.