ఒంటరితనం ,అమ్మతనం ,కమ్మదనం కలబోసిన శీలాసుభద్రాదేవి గారి ‘’ఏకాంత సమూహాలు ‘
శ్రీమతి ’సుభద్రా దేవి గారు ఎప్పుడూ ఏకాంత గోళం లోఒంటరిగా గడియారపు ముల్లును మోసుకు పోతూ విహరిస్తున్నట్లు ,చుట్టూ జనసమూహాలు ఉరుకులు పరుగులూ తో వెనక వచ్చే నీడనైనా పట్ట్టి౦చు కోకుండా పరిగెత్తే తీరు చూసి ఆశ్చర్యపడ్డారు . తమనీడనే చూడలేనివారు ఆమెలోని స్పందనలను ఎలా గ్రహించగలరు ?ఇష్టం లేకపోయినా ఆమె చుట్టూ శూన్యమే ఆవరించి ఉంది. దాన్ని తొలిచే చిన్న కీటకమైనా వస్తుందేమోనని ఆశపడతారు .మిత్రత్వానికి స్నేహ హస్తం చాచుతున్నా వారు దూరమై పోతూనే ఉన్నారు. . తనకు తానే శత్రువుని పోతున్నానేమో ననే శంకా, భయం ఆవరించాయి .అక్కడే ఒంటరి శిల్పాన్నైపోతానేమో నన్న ఆందోళన పెరిగింది .లోకం పోకడ గమనిస్తే తానే కాదు తనలాగా మరెందరో ఒంటరి తనం తో బందీలై పోతున్నందుకు బాధ పడ్డారు అందుకే శీర్షిక ‘’ఏకాంత సమూహాలు ‘’అయి అందర్నీ ఒక్క క్షణం నిలకడ గా నిలిచి ఆలోచి౦ చుకోమని పిలుపు నిచ్చారు. ఈ సంపుటిలో మొత్తం 40 కవితలు విలక్షణతతో ఉన్నాయి .అందమైన బౌండ్ పుస్తకం .ముఖ చిత్రం భర్త శ్రీ వీర్రాజు గారు చిత్రి౦చినదే . వెనుక ముఖ చిత్రం లో సుభద్రగారు ‘’తెలుగింటి ఆడపడుచు ‘’గా సంప్రదాయ బద్ధం గా కూర్చుని ఉండటం పుస్తకానికి హై లైట్ .ఆమెతో పాటున్న మిగిలిన మూడు చిత్రాలు స్త్రీ ల విభిన్న దశలను చూపాయి .
సుభద్ర గారు అంటే మాటల మంత్రజాలం . ఆలోచనల దివ్య సారం .ఏది చెప్పినా అనుభవైక వేద్యంగా వైద్యంగా నే ఉండటం ఆమె ప్రతేకత .’’పచ్చని జీవితం పై పూస్తున్న ఆశల్ని –పిడికెడు బూడిదగా కాల్చేస్తూ ‘ఎక్కడినుంచో అశనిపాతం జరిగి వ్యధ రగిల్చి మిగిలిల్చింది. అయినా ఆమె ‘’అమ్మ గుండె కన్నీటి తోరణాలతో ‘’మళ్ళీ మరో జీవితానికి గూడు సిద్ధం చేసిన స్థైర్యం ఆమెది .ఒక్కోసారి జారి పోయిందనుకున్న నిద్ర ‘’చటుక్కున కలల దారం తో రెప్పల్ని కుట్టేస్తుంది .’’దీనితో మనసు చుట్టూ గూడు అల్లే ప్రయత్నమూ జరిగిపోతుంది .ఆమె జీవితాన్ని కలలు శాసి౦చలేవు .ఆమె ‘’జీవితాన్నే కలలు కనటం అలవాటు చేసుకొన్న గడుసు పిండం .’’కలైనా జీవితమైనా ‘’ఆమెకు తేడాలేదు రెండూ ఒక్కటే .ఆమె ‘’తెగిన పాటల పతంగి ఏదో ఆలోచనల రెమ్మకు చిక్కుకుందేమో ‘’నని స౦దేహం .తన రాగాలకోయిల అలకమాని కొత్త రంగులు అద్దుకొని మళ్ళీ కంర పేటికపై వాలేవరకు పిలుస్తూనే ఉండే ఓపిక ఆమెది .
‘’సమాజానికి సూక్ష్మ రూపమైన కుటుంబాన్ని మోస్తూ ‘’నిత్య చైతన్య జ్వాలతో ,ప్రతిక్షణం మహోన్నతం గా నిలిఛి ,ఒంటినిండా ఆత్మ గౌరవ పర్వతాలు మొలిపించుకొంటూ ,వెలుగు కిరణాలమై ,’’చివరివరకు జీవితం సాగించాలన్న పిలుపు ఆమెది .’’మనలోని చిన్న ఆకాశాన్ని విస్తృతంగా మార్చుకోవటం మన చేతిలోని పనే ‘’అని,’’ ఊకోట్ట్టే తోడు’’ఉంటె అసాధ్యాన్ని సుసాధ్యం చేయచ్చు అనే భరోసా ఇస్తారు .కాలం కాటేసిన క్షణాలలో చూపు కూడా గమనాన్ని మర్చిపోయినా ,మళ్ళీ దారి లోకి మళ్ళాలి .ఆహ్లాదకర సమయాలు ఐస్క్రీము ల్లాగా కరిగిపోతాయి .అప్పుడు ‘’మనల్ని పదును పెట్టేవి గుండె అడుగు పొరల్లోకూరుకుపోయిన ఎదురు దెబ్బలే ‘’అని సాంత్వన వచనం పలికారు .ఒక్కోసారి ‘’కొలతల మధ్య ఇమిడి పోయే మరుగుజ్జు వృక్షాలు ‘’గా మారి పోతాం .ఇది తాత్కాలికం. స్వస్వరూప జ్ఞానం త్వరలో పొంది ముందుకు సాగాలి .’’మనజీవితం మనదే కాకూడదు .మనం సాధించిన విజ్ఞాన సర్వస్వాలు రేపటి తరాల్ని ఉత్తేజితుల్ని చేయాలి ‘’అని ప్రబోధించి ‘’ఈ జీవన కావ్యానికి –చివరి సిరి చుక్క సంతక౦ మాత్రం కావద్దు ‘’అని హెచ్చరిస్తారు .ఆమె స్త్రీలకోసమే చెప్పినట్లు ఉన్నా ఈ వాక్యాలు అందరికీ శిరో దార్యాలే .
తనకో స్వంత చిరునామాకావాలి కాని గుంపులో గోవింద లాగా ఉండకూడదు .అది ‘’నన్ను నేనుగా గుర్తు పట్టేందుకు .నాదైన –అచ్చంగా నాదే అయిన ముఖం కావాలి నాకు ‘’అంటారు .తనకోసం తానూ ఒలక బోసుకొనే కన్నీటి తోనైనా –‘తన సంతకాన్ని ముద్రిస్తూ ‘ఉండే’’ స్వంత చిరునామాను సంపాదించు కోవటమే ఆమె ఏకైక లక్ష్యం .ఇది అందరి స్త్రీల లక్ష్యం గా ఉండాలనేదే ఆమె కోరిక ,తాపత్రయం .ముసలితనం లో,ఒకరకమైన వ్యాధికి నడక అవసరమని డాక్టర్ల సలహా .కాని గమ్యం లేని నడక ఆమె కిష్టం లేదు కారణం ఆమె ‘’నిమిషాల్ని ఏరుకొంటూ-గంటల్ని ముడుచుకొంటూ- నాగేటి చాలుకు కట్టిన ఎద్దులా ‘’తిరుగుతూనే ఉంది .
విదేశీయతలో మనం మమ్మీలంగా మారకుండా ‘’రేపటి తరాన్ని వేలు పట్టి నడిపించి –మన అక్షరాల్ని మనమే దిద్దిద్దాం –మన సంస్కృతీని ఉగ్గుబాలతో తాపించుదాం ‘’అని ఒక తెలివిగల బాధ్యత తెలిసిన ఒక అమ్మ లాగా స్పందించారు –ఆకాశవాణి లో ప్రసారమైన ‘’మనసుల్ని తెరచి ‘’కవిత లో . దుఖానికి వార్నింగ్ ఇస్తూ ‘’నన్నూ ఈ భూమినీ విడిచి నీ దారిన నువ్వు అనంత విశ్వం లోకి ఫో ఫో ‘’అని దుఃఖ రహిత సమాజం కోసం పరితపించారు .ధిల్లీ ఆకాశవాణి లో ప్రసారమైన ‘’ఉద్యమం ఒంటరిది కాదు ‘’కవితలో మానవ సమాజ పోకడలను తెలియజేస్తూ తెరల మాటునే మనసులు ,మాటలు దాచుకొంటున్నామని ,మనిషికి మనిషికీ మధ్య గోడలు కట్టుకొంటున్నామని బాధ పడుతూ ‘’తెరల్ని తొలగించుకోక పొతే –ఏకాకిగా మిగిలే ఒంటరి పక్షులమై పోతాం ‘’అని హెచ్చరించి ‘’ఉప్పెనైనా ,ఉద్యమమైనా ఒంటరిగా రాదు .పెదాలు కలిస్తేనే మాటౌతుంది ‘’అంటూ మనసులుకలిపి మానవతా హారమై ఉద్యమించాలని ఉద్బోధించారు .ఉద్యమం లేనిది లక్ష్యం సాధించటం కుదరదనే సూచన ఉంది .
విదేశం లో కొన్ని నెలలుఉండి ఇంటికి తిరిగి వస్తే ‘’దిగులు కళ్ళతో –పాలిపోతున్న పచ్చదనం తో –ఒళ్ళంతా తడుముతూ హత్తుకున్నాయి’’ –బాల్కనీలోని ఆమె పెంపుడు బిడ్డలు అంటే ‘’మొక్కలు’’ . ఎంత హృదయ స్పందనగా నో చెప్పిన కవిత ఇది! .
‘’ఊపిరి పోసుకున్నప్పుడే కాదు ,ఆ తర్వాతా –మనిషిగా బతికినవాడు –ఊపిరి కడబట్టినప్పుడు కూడా –జనం ఊపిరై జీవిస్తూ ఉంటాడు ‘’అన్న వాక్యాలు ‘’సుభద్రా మానుషోపనిషత్’’ వాక్యం లా పరమప్రబోధకంగా పవిత్రంగా ఉంది .’’అంతరా౦తరాల్లోకి ‘’కవితలో సైంటిఫిక్ వింతలూ శస్త్రచికిత్స విజయాలు నెమరేస్తూ ‘’మెదడు పొరల్ని తిరగేసి ,మరగేసి –పంక్తులలో గాధల్ని తరచి తరచి తవ్వి –అవి చేసిన గాయాల మరకల్ని స్కాన్ చేయండి ‘’అని హితవుపలుకుతూ ,చేసేవారి జీవిత అనుభవాలను కూడా జోడించి మూల్యాంకనం చేయమని అంటూ ‘’కానీ –అది మీ కత్తులు చేయలేవు –మా కలాలకే అది సాధ్యం ‘’అని కత్తికంటే కలం గొప్పదని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిభాషలో చెప్పారు .
‘’నదైనా ,మనిషైనా స్త్రీ కావటమే ‘’అన్న సామ్యాన్న బాగా చెప్పారు ‘’ఒకే ఒక్కటి ‘’లో .ఆమెది ఎల్లలు లేని ప్రేమ వార్ధి .’’ముళ్ళతో పొగరుగా చూసే ఎడారి మొక్కైనా –ఠీవిగా తలెత్తి నిలిచే మహా వృక్షమైనా –మొగ్గ తొడిగి బతుకు పండినప్పుడు మాత్ర౦ –ప్రేమ తెలిసిన మనసౌతుంది .’’ఇక్కడ సుభద్రా దేవిగారి అమ్మతనం ,ప్రేమ మాధుర్యం చక్కగా వ్యక్తమయ్యాయి .ఆమె తనచుట్టూ తాను తిరిగే బొంగరమై ‘’చిన్నారి వెలుగు చుట్టూ పరిభ్రమించే వసుంధర నయ్యాను-అవును –నేను తల్లికి తల్లినే కదా ‘’ అని గుర్తు చేసుకొన్నారు . తాను భూమాత అయి, ఆమెలోని సహజ సహనానికి ప్రతీకగా నిలిచి వెలుగు ప్రసరించే కారుణ్య దీపమైనారు .ఇంతకంటే కవి సాధించాల్సినదేమి ఉంది ?సార్ధకం ఆమె జీవితం ,కవితా జీవితం కూడా .మంఛి కవితా సంపుటి ‘’ఏకాంత సమూహాలు ‘’.చదివి అభినందించాల్సిన పుస్తకం .2007ఏప్రిల్ లో ప్రచురితమైంది .కిందటివారం సుభద్రగారు నాకు దీన్ని ఆత్మీయం గా పోస్ట్ లోపంపారు .చదివి ఆనందించి మీరూ సంతోషిస్తారనే ఈ పరిచయం రాశాను .అంతేకాని ముంజేతి కంకణానికి అద్దమేల ?
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-15-ఉయ్యూరు