తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-2
శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ బాపు –రమణల ఇంటికి వెళ్ళాడు .అప్పుడు రమణ ఇంటిని ‘’ముళ్ళ పూడి వెంకట రమణ అనే సదా బాలుడిది ఆ ఇల్లు ‘’అన్నాడు .కవిత్వం లో వచ్చిన శైలీ భేదాలే బాపు చిత్ర శైలిలోనూ వచ్చాయని ,ఒకప్పుడు ఆంద్ర జ్యోతి వారపత్రికలో 1/8 డెమ్మీ ఆకారం లో ‘’చిత్ర కల్పన’’శీర్షికతో ప్రశస్తమైన తెలుగుపద్యాలకు ఏం వి .ఎల్ నరసింహారావు వివరణలతో బాపు విశిష్ట చిత్ర రచన చేశాడని ,అలాగే చైతన్య భారతి సంస్థ కోసం తనూ ,నండూరి రామమోహనరావు సంపాదకత్వం వహించి వెలువరించిన ‘’మహా సంకల్పం ‘’అనే ఆధునిక కవిత్వ సంకలనానికి బాపు ‘’కష్టజీవి ‘’తలపాగాలో తురాయి తురిమి చిత్రించిన బొమ్మ ఆధునిక కవిత్వ మహా సంకల్పానికి గీటు రాయి గా నిలిచిందని చెప్పాడు .ఇతిహాస యుగం నుండి ఈ నాటి ఆధునిక యుగం వరకు తెలుగు కవిత్వానికి ఎన్ని శైలున్నాయో అన్నిటి ఊహా సమాహారమే బాపు చిత్ర రచనా శైలి అన్నాడు .ఆయనది రేఖలలో ,రంగులలలో ఒక చిత్రమైన శైలి .
స్వర్గీయ దాశరధి కృష్ణమాచార్య తన ‘’గాలిబ్ గీతాలకు ‘’బాపు తో చిత్రాలు గీయి౦చానని, ఆ పుస్తకాన్ని బొంబాయి కవి సమ్మేళనానికి తీసుకొని వెళ్లానని ఆసభలో తానొక్కడే తెలుగు వాడినని తనకున్న ఉర్దూ పరిచయం తో ఆహ్వానం అందుకోన్నానని ,అక్కడి కవులకు ఆపుస్తకం చూపించానని ఒక్కో చిత్రాన్ని చూసి క్వాజా అహమ్మద్ అబ్బాస్ ,కైఫీ ఆజ్మీ సలాం మచ్లీ షహరీ మొదలైన ఉర్దూకవులు గాలిబ్ ఒరిజినల్ గీతాలను చదివి పరవశం కలిగించారని గాలిబ్ మహా కవి కవితామదురిమను రేఖా చిత్రాలలో బాపు అందించిన తీరు పరమాద్భుతం అని మెచ్చుకున్నారు .గాలిబ్ కవితా స్వరూపాన్ని చిత్రాల ద్వారా అందించిన ప్రముఖులు ఇద్దరే ఇద్దరని అందులో ఒకరు ‘’చుగ్తాయి ‘’కాగా, రెండవ వారు ‘’బాపు ‘’అని చెప్పారు .’’బాపు చిత్రకళా భాషల పరిధులు దాటి ,దేశాల అవధులు దాటి అఖిల ప్రపంచ ఖ్యాతి ఆర్జి౦చగలదు ‘’అని ఆనాడే దాశరధి శుభాశీస్సులు అందజేశాడు . .
శ్రీరమణ –‘’బాపు ‘’జనార్దనాస్టకం’’కు వేసిన చిత్రాలలో ‘’ముక్కు ప్రాణం బుక్కు మీదికి వచ్చింది ‘’అంటాడు .రేఖల్లో ,బొమ్మల్లో ,రంగుల్లో హ౦గుల్లోనే కాదు ,అక్షరాలలో కూడా స్వంత శైలిని ప్రవేశపెట్టాడు అనీ ,ఎప్పుడూ వాయిదాలతో కాలయాపన చేసే లాయర్ వృత్తిని ఆయన ప్రవృత్తికి విరుద్ధమవటం తో ప్రాక్టీస్ వదిలేసి ఇష్టమైన బొమ్మల ప్రాక్టీస్ మొదలెట్టాడని చెప్పారు .బాపు ను ఒకప్పుడు ఇంటర్ వ్యూ చేశాడు .అందులో బాపు చెప్పిన మాటలు ‘’కొన్ని రోజులు నేను ఎస్ ఎస్ చామకూర్ అనే పోర్ట్రైట్ ఆర్టిస్ట్ ,దామెర్ల రామా రాగారి శిష్యులు వద్ద కళాభ్యాసం చేశా . గోపులు గారి శిష్యరికం నన్ను ‘’అడ్వర్ టైజింగ్’’శాఖకు మళ్ళించింది .జే వాల్టర్ ధాంసన్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్ అవటానికి గోపులు గారే కారణం .తర్వాత ఫ్రీ లాంసర్ గా ఉండి ,ఆంధ్రపత్రిక అధినేత శివలెంక రాదా కృష్ణగారి ‘’అమృతాంజన్ ‘’పబ్లి సిటీ లో పనిచేశా .ఉయ్యూరు కే సి పి అధినేత వెలగ పూడి రామ కృష్ణ తమ కంపెనీ తయారు చేసే స్వీట్లకు ఎఫిషియెంట్ పబ్లిసిటీ వారిపై ఒత్తిడి చేసి నన్ను ఆర్ట్ డైరెక్టర్ ను చేశారు ‘’.అన్నాడు బాపు .
స్కూల్ లో చేరి కళాభ్యాసం చేయక పోయినా .ఎందరో గురువులకి తానూ ఏకలవ్య శిష్యుడనని చెప్పాడు .తన గురుపరంపర ‘’ఆర్ధర్ రాజాం ,రేజనాల్ద్ క్లీవర్ ,పీటర్ ఆర్నో ,జార్జ్ ప్రైస్,ద్యూలాక్ ,హోమ్ సోయ్ ,గోపులు , ,అహ్మద్ మొదలైనవారు అన్నాడు .’’ఒక్క సంకీర్తనే చాలు నన్ను రక్షింప ,తక్కినవి నీ భాండారాన ఉంచుకో ‘’అని అన్నమయ్య గడుసుగా ,చనువుగా స్వామికి చెప్పినట్లే ఒక్క బాపు బొమ్మ చాలు ‘’కళాప్రపూర్ణ ‘’ఇవ్వటానికి .రస రేఖ ఒక్కటి చాలదా కళా ప్రపూర్ణుడు అవటానికి ?’’అన్నాడు శ్రీరమణ .
జీవితం లోంచి నిత్య కృత్యాలలో౦ ఛి ,నాజూకైన హాస్యాన్ని వడగట్టటం బాపునైజమని ,కొండ౦త అతిశయోక్తి నుంచి రవ్వంత కార్టూన్ ఉద్భవిస్తుందని ,బాపు కొంటె బొమ్మలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయని శ్రీ రమణ అంటాడు .ఆయన కృషి అనంతమైనదని అందుకే ‘’నానృషి కురుతే కార్టూన్ ‘’అన్నానని ‘’తామునిగింది గంగ –తా వలచింది బాపు బొమ్మ ‘’అన్నాడు ‘
తనికెళ్ళ భరణి ‘’తెలుగు వారికి భాషాభిమానం లేక పోయినా ‘’బాపాభి మానం ‘’చాల ఎక్కువ .సీతాకల్యాణం లో గంగావతరణం ప్రపంచ చలన చిత్ర తెర మీదే అద్భుతం .లండన్ లో ప్రదర్శిస్తే ముక్కు మీద వేలేసుకొని బోల్డు ఆశ్చర్యపోయారు క్రిటిక్కులు .దాన్ని ఫిలిం టెక్స్ట్ బుక్కు గా పెట్టుకొన్నారు .ముత్యాలముగ్గులో ‘’అల్లు ‘’చేత కోతియేమోఅన్నంత అద్భుతంగా చేయించిన బాపు ప్రతిభకు హేట్స్ఆఫ్ .పెళ్లి పుస్తకం సినిమా చూసి గుమ్మడి ‘’మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించి౦దయ్యా ‘’ఆన్నాడట .బాపు రమణల స్నేహం అద్వైతం .వాళ్ళిద్దరూ రెండు వెలుగులు, రెండు చీకట్లు, రెండు కస్టాలు, రెండు సుఖాలు .అంచేత వాళ్ళు ‘’సత్తిరాజు వెంకట రమణ ‘’,మరియు ‘’ముళ్ళ పూడి లక్ష్మీనారాయణ ‘’అవుతారు .ఎవరైనా పాదాభి వందన చేయటం ,పొగట్టం ,అతివాగుడూ అతి తాగుడూ ,కేమేరాకేసి చూట్టం ఓవర్ యాక్టింగ్ ,మైకు ము౦దు మాట్లాడమనటం ఆయనకు నచ్చదు.’’ ఆయనలోని సిగ్గే ఆయన బొమ్మలకొచ్చింది ‘’.మోడేస్టేకి పరాకాష్ట బాపు .’’బ్రహ్మ బాపు బొమ్మ లాంటి అమ్మాయిని సృష్టిస్తే చూడాలని ఆశ .’’తెలుగువాళ్ళం మనం అదృష్ట వ౦తులం .మనకొక్కరికే బాపు ఉన్నాడు ‘’అన్నాడు భరణి .
చిత్రకారుడు జయదేవ్ బాపును చేసిన ఇంటర్వ్యు సారాంశం ‘’కార్టూన్ క్రూడ్ గా ఉండనంతవరకు పరవాలేదు .అంగ వైకల్యం వంటి వాటిమీద కార్టూన్లు వేయ రాదు .విదేశీ కార్టూనిస్ట్ లలో వెయ్యిమందికి పైనే నేను అభిమానించే వారున్నారు .అందులో ‘’గాలఘర్ ‘’అంటే చాలా ఇష్టం ‘’.పీనట్స్ సృస్తికర్త ‘’Shulz’’ అంటే కూడా బాగా ఇష్టం .నా చిత్రం నాకే బాగా లేదనిపిస్తే ఎంతమంది బాగుందని అన్నా పెద్ద అనుభూతి రాదు నాకు .నేనేమీ గొప్ప పనులు చేయలేదు కనుక నాకు వారసుడు అంటూ ఎవరూ లేరు .ఇతరులకు సలహా ఇచ్చేంత స్తోమత నాకు లేదు ‘’అని చెప్పాడు బాపు .
నం.పా.సా.అనే నండూరి పార్ధ సారధి ‘’రచయితకి రస పిచ్చి ,చిత్రకారుడికి బొమ్మలపిచ్చి ,సినీ దర్శకుడికి సినేమియా ప్రకోపం విధాయకమే కాని చిత్రకారుడికి ,చలన చిత్రకారుడికి శాస్త్రీయ సంగీతం ఉండటం అపురూపమే బాపు విషయం లో’’ అంటాడు .’’బాపు ఫస్ట్ లవ్ సంగీతమే .సంసారం చిత్రకళతో.హిందూస్తానీ సంగీతం బాపు ప్రాణం .బడేగులాం ఆలీఖాన్ ను పరిచయం చేసినవాడు పీ బి శ్రీనివాస్ .ఖాన్ సాబ్ సంగీత టేపులు ఆయనకొడుకు మున్వార్ ఆలీ దగ్గరకూడా ఉందడి ఉండవు . ఖాన్ మ్యూజిక్ వినటమే బాపు గాలి నీరు ఆహారం .తర్వాత ఎనిమిదేళ్ళకి ‘’నజామ్త్ ఆలీఖాన్ ,సలామత్ ఆలీఖాన్ అనే పాకిస్తానీ సోదరుల సంగీత మోజులో పడ్డాడు .వాద్య సంగీతం లో విలాయత్ ఖాన్,అలీం జఫార్ ఖాన్ ల సితార్ సంగీతం మహా ఇష్టం .పన్నాలాల్ ఘోష్ వేణువు బాగా ఇష్టం .అందులో యమన్ ,శ్రీ ,భూపాలీ ,తోడి రాగాలంటే బహు ఇష్టం .సజ్జాద్ హుస్సేన్ మా౦డలీన్ ప్రత్యేకాభిమానం .ఈయనకు రావలసినంత పేరు రాకపోతే బాపు ప్రత్యేకంగా కచ్చేరీలు పెట్టించాడు ముత్యాలముగ్గు సినిమాలో ఒక అందమైన సన్నివేశానికి ఆయనతో సంగీత౦ చేయించాడు .
తర్వాత గజల్ కళాకారుడు మెహదీ హసన్ బాపు మనసులో దూరాడు .హసన్ బాపు హృదయ సామ్రాజ్యాన్ని అయిదేళ్ళుఏలాడు .తర్వాత గులాం ఆలీ దాడి చేశాడు .మెహదీ హసన్ గజల్ వినకుండా ఒక్క పూటకూడా గడిపే వాడుకాదు .అలాగే సినీ సంగీత దర్శకుడు సి రామ చంద్ర ఆకర్షణీయమైనాడు .బడే గులాం ,అజాకత్ ,సలామాద్ ,మెహ్దీ,గులాం ఆలీ ,సజ్జాద్ ,సి రామచంద్ర ల కళా వైభవాల ప్రభావం బాపు చలన చిత్ర కళా శైలిని తీర్చిదిద్దాయి .ఈ రకంగా బాపు పై మహమ్మదీయ సంగీత దండయాత్ర జరిగింది .
కర్నాటక సంగీతం పై ఆసక్తి తక్కువగా ఉన్నా రామభక్తి కారణం గా బాపుకు త్యాగయ్య గారు దగ్గరయ్యారు .రామదాసు తో ఆత్మీయత పెరిగింది .మహదేవన్ పరిచయం తో కర్నాటక శాస్త్రీయ సంగీత సంబంధం బలపడింది .బాపు కు ఇష్టం అయిష్టం మాత్రమె తెలుసు. ఒక మోస్తరు అనేది ఆయనకు గిట్టదు .ఇష్టమైతే నిండా మునిగిపోవటమే .సంపూర్ణ రామాయణం తీసేటప్పుడు రామాయణాలన్నీ పారాయణ చేయటం తో రామభక్తిలో నిండా మునిగిపోయాడు బాపు .’’త్యాగ రాజుగారు నూరిపోసిన ‘’రామ రసం ‘’తో బాపు వ్యక్తిత్వం ఓవర్ హాలయి పోయిందని,త్యాగరాజు ఆత్మ ఈయను ఆవహించిందో ఈయన త్యాగరాజుతో తాదాత్మ్యం చెందాడో తెలీనంత అను బంధమేర్పడి ,ఆ సినిమాకి సౌండ్ ట్రాక్ అంతా త్యాగరాజు కృతులే వినిపించాయి ‘’అని పోఎటిక్ గా చెప్పారు నం .పా. సా .
త్యాగయ్య సినిమా నాగయ్యగారు తప్ప ఎవరూ తీయలేదు .ఆయన త్యాగయ్య రామదాసులలో ప్రధాన పాత్రలు రామభక్తులేకాని రాముడుకాదు .రామభక్తికనిపిస్తు౦ది కాని రాముడు కనిపించడు.రామపాత్ర ను బాపు తీర్చి దిద్దినంత ఉదాత్తంగా ఏ దర్శకుడూ చిత్రించ లేదు .సీతాకల్యాణం సినిమాలో సీత అంటే బాపూయే అనిపిస్తుంది .ఈ సినిమా చూస్తె ప్రేమ నిషా నాస్తికులకు కూడా పట్టుకునే ప్రమాదం ఉందనిపిస్తుంది .’’సంగీత జ్ఞాన యోగం లో త్యాగయ్య గారు చూపిన మార్గం లో పయనిస్తున్న కళా పదికుడు బాపు .సంగీత జ్ఞానము భక్తీ వినా సన్మార్గము గలదే ‘’అని బాపుగారి సంగీత కలాభిజ్ఞానం పై ముక్తాయింపు ఇచ్చాడు నం.పా.సా.
ఈ సారి తోటి చిత్రకారులు బాపుపై చ(అ)ల్లిన రంగుల చిత్రాల గురించి తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-15-ఉయ్యూరు