సిక్కోలు బడిలో ‘స్కైప్’ పాఠాలు 11/10/2015వి.శ్రీనివాస్ a

సిక్కోలు బడిలో ‘స్కైప్’ పాఠాలు

  • 11/10/2015
  • వి.శ్రీనివాస్

ప్రపంచం ఇప్పుడు డిజిటల్ మయం అయిపోయింది. కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆధునిక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ మనిషి జీవితంలో ఓ భాగమైపోయాయి. చదువూసంధ్యా సహా అన్ని అవసరాలనూ వీటి సాయంతో తీర్చుకోవడం పరిపాటై, అలవాటైపోయింది. అవి లేకపోతే కాళ్లూచేతులూ ఆడటం లేదు. ‘మనం మెలకువగా ఉన్నామా, నిద్రపోతున్నామా అని ఎవరూ చూడటంలేదు…మనం ఆన్‌లైన్‌లో ఉన్నామా, ఆఫ్‌లైన్‌లో ఉన్నామా అనే చూస్తున్నారు’ అని ఈ మధ్య అమెరికాలో మన ప్రధాని నరేంద్రమోదీ అన్న వ్యాఖ్య..నూటికి నూరుపాళ్లు నిజం. ఆ సాంకేతిక విప్లవం ఇప్పుడు పల్లెల్లో కొత్త వెలుగులకు కారణమవుతోంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్తతరహా సాంకేతిక ప్రగతి పిల్లలకు పాఠాలు నేర్పుతోంది. కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు ఇంకా అందని పల్లెల్లో, అవన్నీ అమాంతం అందుబాటులోకి వచ్చి ఒక్కసారిగా స్కైప్ పాఠాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది గ్రామీణ భారతంలో.. ఓ మూలనున్న ఆంధ్రప్రదేశ్‌లోని సిక్కోలు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. అత్యంత సామర్థ్యంతో పనిచేసే ఇంటర్నెట్ వ్యవస్థ ఎంత తొందరగా అందుబాటులోకి వస్తే ఆ మార్పు అంత తొందరగా ఫలితాన్నిస్తుంది. అందాకా ఇంటర్నెట్ లేకపోయినా టీవీలో మిగిలిన ‘వైట్‌స్పేస్’ ఆధారంగా బోధన సాగిపోతోంది. అదెలాగో చూద్దాం… శ్రీకాకుళం జిల్లా జనాభా 27,77,343మంది . ఇంటర్నెట్ కనెక్షన్లు లక్షా 27 వేలు ఉండవచ్చని అంచనా. బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ద్వారా 6,432 బ్రాండ్ బాండ్ కనెక్షన్లు ఉండగా, 2,671 మంది డేటాకార్డుల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతున్నారు. మిగిలిన వినియోగదారులు ప్రైవేటు నెట్ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని అతి తక్కువ వ్యయంతో జిల్లాలో అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకు వచ్చింది. టెలివిజన్‌లో వృథాగా మిగిలిపోయిన వైట్‌స్పేస్ ద్వారా ఇంటర్‌నెట్ అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ జిల్లాలో అమలు చేస్తోంది. డిజిటల్ విధానంలో తక్కువ ధరకే ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన జిల్లాలో ఐదు పాఠశాలలను ఎంపిక చేశారు. ముందుగా ఈ పాఠశాలల్లో అమలు చేసి, తర్వాత జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటారు. మైక్రోసాఫ్ట్ సంస్థ పైలెట్ ప్రాజెక్టుగా ఐదు ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేసింది. మారుమూల గ్రామాలకు అతి తక్కువ వ్యయంతో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడంతోపాటు, పాఠశాల విద్యార్థులకు స్కైప్ ద్వారా బోధన అందిస్తున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ ఐటీ సంస్థల సీఈవోలతో ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల భేటీ అయినపుడు శ్రీకాకుళం జిల్లా పేరు ప్రస్తావనకు రావడంతో ‘స్కైప్’ ప్రాజెక్టు గురించి మిగతా ప్రాంతాల వారికి తెలిసింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ భారత్‌లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్న విషయం గుర్తుచేశారు. ప్రధానికి ఈ విషయం చెబుతూ ఆయన సిక్కోలులో తమ ప్రాజెక్టు గురించి వివరించారు. గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్‌బాండ్ సదుపాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘1970లో పాఠశాల విద్యార్థులు ట్రాన్సిస్టర్లలో అతికష్టం మీద పాఠాలు వింటున్న రోజులు నాకు గుర్తున్నాయి.. అప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామాల పిల్లలు కూడా ఇలాగే ట్రాన్సిస్టర్ల ద్వారా పాఠాలు వినేవారు… ఇప్పుడు అదే జిల్లా పిల్లలు స్కైప్ ద్వారా వీడియో పాఠాలు వింటున్నారు..’ అని సత్య నాదెళ్ల డిజిటల్ ఉద్యమం గురించి వివరించారు. అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలన్నది నేడు ఒక ఉద్యమంలా జరుగుతోంది. దీనికోసం ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ సంస్థలు ఇప్పటికే భారీ ఎత్తున పరిశోధనలు చేపట్టాయి. మైక్రోసాఫ్ట్ వైట్‌స్పేస్ ఆధారిత నెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న కృషితోపాటు పలు దేశాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో గూగుల్, ఫేస్‌బుక్ శ్రీలంక, అమెరికా దేశాల్లో తమ ప్రాజెక్టులను అమలు చేయబోతుండగా, అంతకుముందే మైక్రోసాఫ్ట్ శ్రీకాకుళం జిల్లాలో టివి వైట్‌స్పేస్‌తో బ్రాడ్‌బాండ్ అమలు చేయడంతో అంతర్జాతీయ చిత్రపటంలో సిక్కోల్‌కు స్థానం దొరికింది. ఇలా మొదలు మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో జిల్లాలో 204 పాఠశాలల్లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఎడ్యుకేషనల్ అండ్ రిసెర్చ్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తోడ్పాటును అందిస్తున్నాయి. ఈ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, గార మండలాలకు చెందిన ఒప్పంగి, సింగుపురం కస్తురిబా గాంధీ బాలికల పాఠశాల, ఫరీదుపేట, సతివాడ, వమరవల్లి జెడ్పీ హైస్కూల్‌ల్లో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు బోధన జరుగుతోంది. ఈ డిజిటల్ విద్యా బోధనకు 68 మంది ఉపాధ్యాయులకు ఎంపిక చేసి తగిన శిక్షణ ఇచ్చినట్టు జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం సమీపంలోని ఒప్పంగిలో బేస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో సిగ్నళ్లు అందుతాయి. వైఫై అయితే కేవలం 100 మీటర్లకు మాత్రమే పరిమితమవుతోంది. దీంతో టీవీ వైట్‌స్పేస్ పథకానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒప్పంగిలో బేస్‌స్టేషన్ ఏర్పాటు చేయడంతోపాటు మిగిలిన నాలుగు క్యాంపస్‌లు సింగుపురం, ఫరీద్‌పేట, సతివాడ, వమరవల్లి పాఠశాలల్లో సిగ్నళ్లను తీసుకునేందుకు వీలుగా రిసీవర్లను ఏర్పాటు చేసారు. విద్యార్థులతో మాటామంతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పంగి, సింగుపురం పాఠశాలల విద్యార్థులతో స్కైప్ ద్వారా విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఇటీవల మాట్లాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సింగుపురం కెజిబివి విద్యార్థినులతో మాట్లాడారు. ఒప్పంగి (జెడ్పీ హైస్కూల్) శ్రీకాకుళం పట్టణానికి అతి దగ్గరలోని గ్రామం ఒప్పంగి. అన్ని సౌకర్యాలు ఉన్నా ఇంటర్నెట్ సౌకర్యానికి నోచుకోని గ్రామం. ప్రైవేటు ఇంటర్నెట్‌లు, వైపై సౌకర్యాలు లేని ఇక్కడి జెడ్పీ హైస్కూల్‌లో బేస్‌స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న మిగిలిన నాలుగు పాఠశాలలకు రిసీవర్లను అమర్చేందుకు ఒప్పంగిని స్కైప్ స్టేషన్‌గా మైక్రోసాఫ్ట్ సంస్థ మార్చేస్తోంది. ఇక్కడ నుంచి ఏ దిక్కుకైనా పది కిలోమీటర్లు వ్యాప్తిచెందే ఈ తరంగాలు స్కైప్ బోధనా విధానానికి సులువైన మార్గంగా మారుస్తోంది. దేశంలో ఎక్కడా మొదలుకాని వైట్‌స్పేస్ పథకం కోసం ఒప్పంగిలో బేస్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. కొద్దిరోజులుగా స్కైప్ పాఠాలు ప్రారంభమయ్యాయి. 339 మంది విద్యార్థులు ఇక్కడ ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 130 మంది విద్యార్థులు ఉండేవారు. స్కైప్ బోధనా విధానం అమలైన నాలుగు నెలల్లోనే డ్రాపౌట్లు లేకుండా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కార్పొరేట్ స్కూళ్ళలో అమర్చే ఇంటర్నెట్‌ల కంటే ఒప్పంగిలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసే కంప్యూటర్లు, వీడియో కెమెరాలు, స్క్రీన్, రిసీవర్లు వంటి అత్యాధునిక సాంకేతిక హంగులు ఇక్కడి సర్కార్ బడి రూపురేఖలు మార్చేశాయి. సింగుపురం (కెజిబివి) జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్లు దూరం. 16వ నెంబర్ జాతీయరహదారి పక్కనే ఉన్న గ్రామం అది. 195 మంది బాలికలు చదువుకుంటున్నారు. వీరికి స్కైప్ ద్వారా తరగతులు బోధించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ అన్నీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ డిజిటల్ విద్యాబోధన ప్రారంభమైంది. అంతకు ఆరు మాసాల ముందే ఈ సాంకేతిక విప్లవానికి ఇక్కడ శ్రీకారం పలికారు. సతివాడ, వమరవల్లి (జెడ్పీ హైస్కూళ్లు) జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న సతివాడ, వమరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఈ డిజిటల్ విద్యా విధానానికి ఎంపిక కాగా ఇప్పటికే కంప్యూటర్లు తదితర సామాగ్రి చేరాయి. ఒప్పంగిలోని ట్రాన్స్‌మిషన్ ద్వారా సతివాడ, వమరవల్లి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన రిసీవర్లుకు సమాచారం అందుతుంది. సతివాడ, వమరవల్లి పాఠశాలల్లో చెరో 11 చొప్పున కంప్యూటర్లు ఇతర సామగ్రిని రూ. 50 లక్షల వ్యయంతో అందజేసారు. ప్రస్తుతానికి స్కైప్ సేవలు పూర్తిస్థాయిలో లేకపోయినా ఉపాధ్యాయులు సిడిల రూపంలో డేటా సేకరించి కంప్యూటర్లు, ప్రొజెక్టర్ల ద్వారా డిజిటల్ బోధన సాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సౌకర్యాలు కల్పించి సరైన ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బంది ఎదురవుతోంది. ఫరీదుపేట (జెడ్పీ హైస్కూల్) ఈ గ్రామం ఆధ్యాత్మికతకు మారుపేరు. ఈ గ్రామంలో కొలువైన శ్రీరంగనాథుడిని ప్రతి ఇంటా ఆరాధిస్తారు. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేసిన బొడ్డేపల్లి సత్యన్నారాయణ ఇదే పాఠశాలలో చదువుకున్నవారే. ఇంతటి చరిత్ర కలిగిన పాఠశాల దేశంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా స్కైప్ బోధనా విధానానికి ఎంపికయింది. వౌలిక సదుపాయాలు, సాంకేతిక పరికరాలు అమర్చినప్పటికీ, ఇంటర్నెట్ కనెక్టుకాక స్కైప్ బోధనకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. సిగ్నల్స్ లేకపోవడం వల్ల యూట్యూబ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని సైన్స్, మేథ్స్, ఇంగ్లీషు గ్రామర్ పాఠాలు బోధిస్తున్నారు. వారానికి ఒక తరగతికి చొప్పున స్కైప్ విధానంలో ఇక్కడి ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఈ పాఠశాలలో 175 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్కైప్ ద్వారా విద్యాబోధనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరువాత మైక్రోసాఫ్ట్ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వెనుకబడిన మారుమూల ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని ఆ సంస్థ సిఇఒ సత్య నాదెళ్ల అనుకున్నారు. ఈ జిల్లాతో ఆయనకు కొంత అనుబంధం ఉంది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకూడా సై అన్నారు. అంతే రెండు నెలలనుంచి అక్కడ స్కైప్ బోధన ప్రారంభమైంది. కానీ వారనుకున్నంత స్థాయిలో ఇంకా జరగడం లేదు. బాలారిష్టాలు ఎదురౌతున్నాయి. నాలుగు గ్రామాల్లోని స్కూళ్లలో స్పైప్ బోధన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా ఇంకా అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి రాలేదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఒక్క పాఠశాలలో పూర్తిస్థాయిలో స్కైప్ బోధన సాగుతోంది. మరో పాఠశాలలో కొంతవరకు అమలవుతోంది. ఇంకా రెండు పాఠశాలల్లో ఇంకా బోధన ప్రారంభం కావలసి ఉంది. కొత్త పథకాలు, అదీ సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉండాల్సిన ఇలాంటి పథకాల అమల్లో సాధకబాధకాలు తెలుసుకునేందుకే పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్, వీడియోకాన్ఫరెన్స్‌వంటి కొత్తకొత్త విషయాలను పల్లెజనం ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఈ మార్పువల్ల ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు మళ్లుతున్నారు. అటు సాంకేతికతపై పట్టు, ఇటు సర్కారీ విద్యపై ఆసక్తి రేపుతున్న ఇలాంటి పైలట్ ప్రాజెక్టులు విజయవంతమైతేనే దేశాభివృద్ధికి పల్లెసీమలు పట్టుగొమ్మలవుతాయి. సిలికాన్‌వ్యాలీ నేర్పిన పాఠాలు, మైక్రోసాఫ్ట్ చెబుతున్న బోధనలతో సిక్కోలు వాసుల విజన్ ఇప్పుడిప్పుడే మారుతోంది. అభివృద్ధికి అదే ముందడుగుకదా. * స్కైప్…టీచింగ్ ‘స్కైప్’.. ఇది కంప్యూటర్, టెలిఫోన్, ఇంటర్నెట్ తెలిసిన ప్రతిఒక్కరికి తెలిసిన టెలికమ్యూనికేషన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని ఇంటర్నెట్ ద్వారా టీవీ, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్, స్మార్ట్ఫోన్, వెబ్‌కేమ్, ఇతర మొబైల్ డివైజ్‌లలో వీడియోకాల్స్, వీడియో ఛాటింగ్, వాయిస్ కాల్స్, మెసేజింగ్, వీడియో, టెక్స్ట్ ఫైల్స్ మార్పిడి చేసుకోవచ్చు. దీనికి పెద్దగా రుసుం కూడా ఉండదు. స్కైప్ వినియోగదారునిగా నామమాత్రపు చెల్లింపుపై రిజిస్టర్ అయితే చాలు. 2003లో ఇది ఆవిర్భవించింది. 2011లో దీనిని మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసి, అభివృద్ధి చేసింది. స్కైప్ అనుసంధానంతో విద్యాబోధన, వివిధ భాషల ట్రాన్స్‌లేషన్‌కు కొత్తకొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు భారతదేశంలో స్కైప్ ద్వారా దృశ్య,శ్రవణ విద్యకు సహకరిస్తోంది. అదీ ఉచితంగానే. స్కైప్ ఇన్ క్లాస్‌రూమ్, వైట్‌స్పేస్ టెక్నాలజీ సాయంతో విద్యాబోధనకు కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో అమలవుతోంది. ఎలా పనిచేస్తుంది..? స్కైప్‌తో అనుసంధానం అయి, ఇంటర్నెట్ సాయంతో వారి వెబ్‌సైట్‌ను సందర్శించి ఆయా పథకాల్లో చేరొచ్చు. వీడియో ఛాటింగ్ ద్వారా విద్యాబోధన జరుగుతుంది. పాఠ్యాంశాలలో థియరీకి తోడుగా ప్రాక్టికల్స్‌ను తిలకిస్తూ నేర్చుకోవచ్చు. ఆయా అంశాల్లో నిపుణులు ఈ భూగోళంలో ఏఏ ప్రాంతాల్లో ఉన్నా, వారిని అప్పటికప్పుడు స్కైప్‌లైన్‌లోకి రప్పించి ప్రత్యక్షంగా సందేహాలు తీర్చుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ మాదిరిగా అన్నమాట. శ్రీకాకుళం జిల్లాలో ఆ విధానం ఇప్పటికే ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు కోటిమంది వినియోగించే స్కైప్‌కు 2013 నాటికి 30కోట్లమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సర్కారీ బడుల్లో కార్పొరేట్ విద్య స్కైప్ ద్వారా విద్యాబోధన కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది. పిల్లలపై ఒత్తిడి ఉండదు. ఒక విషయాన్ని పదేపదే చెప్పడం కంటే దానిని దృశ్యం ద్వారా చూపించి పాఠాలు చెప్పడంతో పిల్లలు వేగంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ విధానం డ్రాపౌట్లను గణనీయంగా తగ్గించింది. గ్రామీణ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడం తగ్గవచ్చు. -ఎం. రాజ్యసుందరి, బయాలజీ అసిస్టెంట్, ఒప్పంగి జెడ్పీ హైస్కూల్ బోధన సులభతరం స్కైప్ ద్వారా బోధన చేయడం చాలా సులభంగా ఉంది. విద్యార్థులను బాగా తీర్చిదిద్దవచ్చు. నైపుణ్యంతో కూడిన విద్య అందించడం ప్రాథమిక స్థాయిలో మరింత సులువు. -బి.జయదేవి, హెచ్‌ఎం, ఫరీదుపేట సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశాన్ని ఈ బోధన ద్వారా పెంపొందించుకోవచ్చు. సాంకేతిక విద్యపై మక్కువ పెంచుకునేందుకు దోహదపడుతుంది. -ఎం.వసంతరావు, ఫిజిక్స్ టీచర్ , ఫరీదుపేట ఆసక్తి పెరిగింది.. ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న బోధనా విధానం విద్యార్థుల్లో కుతూహలాన్ని కలిగిస్తోంది. పాఠ్యాంశాలపై వారికి మంచి అవగాహన కలుగుతోంది. కొత్తవిషయాలను నేర్చుకోవాలన్న తపన వారిలో పెరుగుతోంది. -వి.కుసుమకుమారి, సైన్సు టీచర్, సతివాడ. మంచి ప్రయోగం అంతర్జాలం ద్వారా విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి వారిని మరింత ప్రయోజకుల్ని చేసే ఈ ప్రయత్నం మంచిదే. డిజిటల్ విద్యాబోధనకు మా పాఠశాలను ఎంపిక చేయడం గర్వంగా ఉంది. -వై క్రిష్ణారావు, హెచ్.ఎం., వమరవల్లి. మా పిల్లలనైనా చదివించుకుంటాం మాకు ఎలాగూ చదువు అబ్బలేదు. కనీసం మా పిల్లలనైనా బాగా చదివించుకుందామనుకుంటున్నాం. ప్రభుత్వం ఇటువంటి ఉన్నత సాంకేతిక విద్య అందించడం అభినందనీయం.. -పెదలాపు నాగేశ్వరరావు, రైతు, సతివాడ. ఖరీదైన విద్య అందుతోంది ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన పిల్లలకు స్కైప్ బోధన ద్వారా ఖరీదైన చదువు అందుతోంది. కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడుతుంది. -సత్తారు వనాజాక్షి, విద్యార్థి తల్లి, ఫరీదుపేట ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు స్కైప్ ద్వారా పాఠాల బోధనతోపాటు ఏ దేశం నుంచైనా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేరుగా ఇక్కడి విద్యార్థులు మాట్లాడారు. విషయ పరిజ్ఞానం ఉన్న నిపుణులతో బోధన సాగించేందుకు అవకాశం ఉంటోంది. డిజిటల్ లెర్నింగ్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ- సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా శాస్తవ్రేత్తలు, నిపుణుల సందేశాలు, బోధనలు అందించేందుకు అవకాశం ఉంటోంది. -ఎ.బలరామకృష్ణ, హెచ్‌ఎం, ఒప్పంగి ఫలితాలు సాధిస్తున్నాం 163 మంది విద్యార్థులున్న మా పాఠశాల ఫలితాల సాధనలో అగ్రగామిగా ఉంది. విద్యార్థుల ప్రతిభ, శతశాతం ఉత్తీర్ణత, తదితర అంశాల ఆధారంగా మా పాఠశాలను డిజిటల్ విద్యా బోధనకు ఎంపిక చేశారు. -సాయిబాబు, హెచ్.ఎం, సతివాడ. అభినందనీయం విద్యార్థులకు ఇ-లెర్నింగ్, డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నాం. స్కైప్ ద్వారా క్లౌడ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బోధనా ప్రక్రియను రూపొందించారు. ప్రతి విద్యార్థి రాణించడానికి వీలుగా ఉంది. -కె.వరప్రసాదరావు, ఇంగ్లీషు టీచర్, సతివాడ. ‘ప్రావీణ్య’ అనే పేరుతో ఎస్‌సిఇఆర్‌టి సిలబస్‌ను వైట్‌స్పేస్ పథకంలో స్కైప్ ద్వారా అప్‌లోడ్ చేసి ఆ పాఠాలను బోధించే అవకాశం కలిగింది. నిపుణులతో బోధన జరుగుతోంది. విద్యార్థినులు కోరుకుంటే.. ఎక్కడనుంచైనా సరే నిపుణులతో పాఠాలు చెప్పించే విధానాన్ని కూడా ప్రారంభించాం. ఆరుమాసాల క్రితమే సాంకేతిక పరిజ్ఞానంతో పాఠాలు చెప్పాలంటూ బ్రాడ్‌బాండ్ సౌకర్యం కల్పించినప్పటికీ, మైక్రోసాఫ్ట్ సంస్థ రెండు నెలల క్రితం అమర్చిన రిసీవర్ల ద్వారా స్కైప్ విధానంలో బోధనా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ పద్ధతిని 2008లో దక్షిణాఫ్రికాలో అమలు చేసారు. దామోదర్‌పాత్రుని శారద, స్పెషల్ ఆఫీసర్, కెజిబివి-సింగుపురం టెక్నాలజీతో అభివృద్ధి స్కైప్ సాంకేతిక పరిజ్ఞానంతో మరింత అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. ఈ తరహా బోధనకు ‘గైడ్’ అవసరమే. సాంకేతిక నిర్వహణ సామర్థ్యం, క్రమశిక్షణ నేర్పేందుకు ఏర్పాట్లుండాలి. -ఎంజి శంకరరావు, మేథ్స్ అసిస్టెంట్, ఒప్పంగి జెడ్పీ హైస్కూల్ సమయం ఆదా స్కైప్ ద్వారా సమయం కూడా వృథా కాదు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు సులభంగా, వేగంగా అర్థమవడానికి ఈ విధానం ఉపయోగపడుతోంది. -ఎస్ దేవికుమారి, 10వ తరగతి, సింగుపురం బోధన సులభం స్కైప్ ద్వారా బోధన, అభ్యాసం, నేర్చుకోవడం చాలా సులభంగా ఉంది. సైన్స్‌కు సంబంధించిన బొమ్మలు చూడడం వల్ల ప్రత్యక్షంగా చూసినంత అవగాహన కలగడంతో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. -బొమ్మన ప్రియతం సాయి, 9వ తరగతి, సింగుపురం మా గ్రామాన్ని గుర్తించటం ఆనందం కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వం ఇటువంటి విధానాలను ప్రవేశపెట్టడం సంతోషకరం. మా గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేయటం ఆనందంగా ఉంది. -పెదలాపు శ్రీరాములు, ఉద్యోగి, సతివాడ. బాగా అర్థమవుతోంది కేవలం వినడం ద్వారానే కాకుండా విడియో బొమ్మల రూపంలో సాగిస్తున్న బోధన బాగా అర్థం అవుతోంది. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా లభిస్తోంది. -చల్లా జ్యోతి, 10వ తరగతి, సతివాడ. ఎంతో ఉపయుక్తం డిజిటల్ విధానం ద్వారా సాగించే వివరణాత్మకమైన బోధనపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. పాఠ్యాంశాల వారీగా బోధన ఉపయుక్తంగా ఉంటోంది. -ఎ.అప్పన్న, ఉపాధ్యాయుడు, వమరవల్లి.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.