ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-2
హామ్స్ గా మారటం ఎలా ?
ఔత్సాహిక రేడియో ఆపరేటర్లుగా అంటే హామ్స్ గా అన్నిరంగాల వారు ఉన్నారు .సామాన్యుల దగ్గరనుండి లాయర్లు ,ఇంజనీర్లు డాక్టర్లు ,సైంటిస్ట్ లు ,పైలట్లు ,పోలిటీ షియన్లు ,ఆస్ట్రోనాట్స్,రాజులు మంత్రులు కూడా హాం సభ్యులే .వీరందరూ యువకులుగా ఉన్నప్పుడే హాం గా లైసెన్స్ పొందుతారు .ముందే చెప్పినట్లు 12 ఏళ్ళు దాటినవారెవరైనా టెలికం డిపార్ట్ మెంట్ వారి ప్రభుత్వసాధారణ ‘’ అమెచ్యూర్ స్టేషన్ ఆపరేటర్ పరీక్ష’’ రాసిఆపరేటర్ లైసెన్స్ పొందవచ్చు .అమెరికా ,జపాన్ మొదలైన కొన్ని దేశాలలో 12 ఏళ్ళ లోపు వారికీ హామ్స్ లైసెన్స్ పొందే అవకాశం కల్పిస్తున్నారు .అమెరికా వెళ్ళాలనుకొనే యువకులకు ఇండియాలోనే ఈ పరీక్ష నిర్వహించి లైసెన్స్ ఇస్తున్నారు .
హామ్స్ చేసేపనేమిటి ?
హామ్స్ ఏదో కాలక్షేపం కోసం అవతలి వారితో హాం చేస్తూ అంటే’’ సుత్తి కొట్టు’’ కుంటూకూర్చోరు .ప్రజా ప్రయోజనాలకోసం ఎన్నో ప్రయోగాలు చేస్తూ కొత్త పరికరాలను కనిపెట్టి ఉపయోగం లోకి తెస్తారు .రిసీవర్లు ,యా౦ టేన్నాలలో కొన్ని టెస్ట్ పరికరాలు ,ఆపరేటింగ్ సూత్రాలు కనుక్కొంటారు .సాధారణ ప్రాధమిక జ్ఞానం పె౦పొంది౦చు కొంటారు .ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నిక్ కోసం ప్రయత్నాలు చేస్తారు. తమ అనుభవాలను ఇతరులతో పంచుకొంటారు .దీనితో విప్లవాత్మమైన మార్పులకు అవకాశాలు కల్పిస్తారు .సాఫ్ట్ వేర్ ,హార్డ్ వేర్ లలో ప్రయోగాలు చేసి అభి వృద్ధికి బాటలు వేస్తారు .అంటే ఒక సైంటిస్ట్ చేసే పనులన్నీ చేస్తాడు .అలా తన గౌరవాన్ని పెంచుకొంటాడు
హామ్స్ కున్న గుర్తి౦పేమిటి ?ఖర్చు మాటేమిటి ?ఫ్రీక్వెంసి ఎవరిస్తారు ?
గుంపులో గోవింద లాగా హామ్స్ ఉండరు .వారికొక ప్రత్యెక గుర్తింపు అంటే ఐడెంటిటి ఉంటుంది .ఆపరేటర్ లైసెన్స్ పరీక్ష పాసైన తర్వాత ప్రభుత్వంనుండి లైసెన్స్ తో బాటు ఒక గుర్తింపు సంఖ్య(కాల్ సైన్ )పొందుతారు .ఉదాహరణకు ‘’vu2My ‘’.అనేదానిలో’’ vu ‘’ అనేది మన ఇండియాకు గుర్తింపు .’’2’’అనేది ఏ గ్రేడ్ లో లైసెన్స్ పొందారో లేక దేశం లోని ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియ జేస్తుంది .’’My’’అనేది పేరు ను తెలియ జేస్తుంది ఇక్కడ సూరి శ్రీరామ మూర్తి పేరును తెలియ జేస్తోంది అన్నమాట .దీన్ని బట్టి హాం ఏదేశం వాడో ఏ గ్రేడ్ వాడోలేక ఆదేశం లో ఏ ప్రాంతం వాడో ,అతని పేరేమిటో తెల్సిపోతుంది అవతలి హాం మిత్రుడికి .ఇదీ హాం గుర్తింపు కోడ్.
ప్రపంచం లోని 30లక్షలమంది హామ్స్ లో సరాసరి ఇంట్లో ను౦చి కాని, హాం క్లబ్ ను౦డి కాని ,హాయిగా కారులో ప్రయాణం చేస్తూకాని మాట్లాడుకోవచ్చు .దీనికోసం టాక్ టైం అంటూ ఉండదు .పైసా కూడా ఎవరికీ డబ్బు చేల్లి౦చక్కర లేదు .ఒక సారి పరికరాన్ని తయారు చేసుకున్నా ,కొనుక్కుని పెట్టుకున్నాఆ పైన ఖర్చేమీ ఉండదు .లైసెన్స్ ఫీజు కూడా గవర్నమెంట్ 20ఏళ్ళకు 1,000-అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమె .అంటే ఏడాదికి యాభై రూపాయలే .లైసెన్స్ (asol)ను పరీక్ష పాసైన వారికే ఇస్తారు .పరీక్ష పాసవటం మహా తేలిక .కొద్దిగా టెక్నికల్ పరిజ్ఞానం ఉంటె పాసై పోయినట్లే పెద్దగా కస్టపడనక్కర లేదు .
హం లైసెన్స్ తో బాటు ఆపరేటర్ల కోసం ప్రభుత్వం రిజర్వ్ చేయబడిన ఫ్రీక్వెంసి (పౌనః పున్యం)ని ఉపయోగించటానికి ఉచితంగా కేటా ఇస్తారు .దీన్ని వాడుకొని ఉపయోగించుకోవటమే .చూశారా యెంత తేలికగా ఉందో విధానమంతా ? హాయ్ గా జాయ్ గా హాం కావాలని అని పిస్తోందా?అని పిస్తుంది అంతటి ఎట్రాక్షన్ ఉంది దీనికి .మిగిలిన వివరాలు తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-15-ఉయ్యూరు