కపోతానికి శరణిచ్చి డేగ కు శరీరమాంసాన్ని కోసిచ్చిన శిబి కపోతేశ్వరుడైన –చేజెర్ల
శిబీ ,దధీచి మొదలైన దాన కర్ణులకు త్యాగమూర్తులకు నిలయం భారత వర్షం .వీరి త్యాగాలు అజరామరమై నిలిచాయి .అలాంటి శిబి చక్రవర్తి త్యాగ గాధ జరిగిన చోటే చేజెర్ల .గుంటూరు జిల్లా నెకరికల్లు మండలం లో చేజెర్ల గ్రామం ఉంది .నరసరావు పేటకు పదిహేను కిలోమీటర్లు .ఇక్కడ స్వయంభు గా వెలసిన శ్రీ కపోతేశ్వర స్వామి కీర్తి దశ దిశలా వ్యాపించింది .
చారిత్రిక నేపధ్యం
కపోతేశ్వర ఆలయం క్రీ శ .3,లేక 4శతాబ్దాలలో నిర్మించాబదినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి .కుబ్జ విష్ణు వర్ధనుడి పాలనలో చేజెర్ల ప్రసిద్ధ నగరంగా వర్ధిల్లింది .ఆలయం లో క్రీ శ 1140,1247సంవత్సరాలలో రాయబడిన శాసనాల నాధారంగా చేజెర్ల పేరు –చేరుం జర్ల ,చేంజర్ల , చేజెర్ల గా ఉంది .శాసనాలు పాళీ ,సంస్కృత ,తెలుగు లలో ఉన్నాయి . ఆలయ విశిష్టతలు
కపోతేశ్వరాలయం ‘’గుడిసె ఆకారం ‘’లో ఉండటం ఒక విశిష్టత .ప్రధాన దేవాలయం ‘’హస్తి పుష్టి ‘’ఆకారం లో ఉండి,ఇసుక ,సున్నం తో కట్టబడింది .గర్భాలయం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉండటం మరో ప్రత్యేకత .ముఖ భాగాలపై ఉన్న శిల్పాలు అరుదైనవి .మనదేశం లో హస్తి పుష్టి ఆకారం లో ఉన్న అరుదదైన దేవాలయాలలో ఇది ఒకటి .హస్తి పుష్టి విమానం తో నిర్మించబడిన ఏకైక దేవాలయం ఇదొక్కటే. అదీ దీని మరో గొప్ప ప్రాముఖ్యత .షోలాపూర్ దగ్గర టెక్కలి లో ఉన్న త్రివిక్రమ దేవాలయం కపోతేశ్వరాలయాన్ని పోలి ఉండటం మరో విశేషం .ఆలయ ఈశాన్య భాగం లో వేదికమీద ఆరడుడుగుల ఎత్తున వశిష్టమైన ‘దశ సహస్ర లింగా కృతి ‘’ఉండటం వింతలలో వింత .నైరుతిలో సప్త మాత్రుకల విగ్రహాలు ,,దక్షిణాన మల్లికాంబ పుష్కరిణి ,పడమర వైపు చెరువులు ఉంటాయి ..పురాతన ఆలయం లో ఏడు ప్రాకారాలు ఉండేవి .అవి శిధిలమై ప్రస్తుతం రెండే ప్రాకారాలున్నాయి .కపోతేశ్వరాలయం అంటే కోటి న్నోక్క లింగాలు ,శాసనాలు ,బౌద్ధ ఆరామ విశేషాలు ఉన్న ప్రాంతం .
కపోతేశ్వర స్వామి చరిత్ర
కాశ్మీర దేశాన్ని శిబి చక్రవర్తి పెద్ద తమ్ముడు మేఘాడంబరుడు ,రెండో తమ్ముడు జీమూత వాహనుడు తీర్ధ యాత్ర చేస్తూ చేరు౦జెర్ల వచ్చి పర్వత గుహలో తపస్సు చేస్తూ శివ సన్నిధానంఅంటే లింగాకృతిపొంది దేహ త్యాగం చేశారట .ఈ విషయం తెలుసుకొన్న శిబి చక్రవర్తి తల్లి అనుమతిపొంది చేజర్లలో ‘’శత యజ్న దీక్ష ‘’ప్రారంభించాడు . శిబి చక్రవర్తి మాంధాత మహా రాజు కుమారుడు .యయాతి మహారాజు మనవడు అని మహా భారతం చెబుతోంది .
శిబి కి సత్య లోక ప్రాప్తి కలిగించటానికి ముందు ఆయన దాన శీలతను పరీక్షించాలని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంకల్పింఛి ఇక్కడి ‘’రూపెన గుంట్ల’’లో రూపాలను మార్చుకొన్నారు .విష్ణు మూర్తి కపోతం (పావురం )గా ,బ్రహ్మ’’ డేగ’’ గా(బాణం )గా ,ఈ శ్వరుడు’’ కిరాతకుని’’గా మారారు .కిరాత శివుడు పావురం వేటలో బాణం సంధిస్తే గాయపడ్డ పావురం ‘’కుంకల గుంట’’అనే ప్రదేశం లో పడింది .దేవతలు విడిది చేసిన ప్రదేశాన్ని ‘’విప్పర్ల ‘’అంటారు .పావురం చేరిన ప్రదేశాన్ని ‘’చేజెర్ల ‘’అనిప్రసిద్ధికెక్కాయి .కుంటుకుంటూ గాయపడిన కపోతం శిబి చక్రవర్తి పాదాల చెంతకు చేరి శరణుకోరి ప్రాణభిక్ష పెట్టమని వేడింది .శిబి అభయమిచ్చాడు .పావురాన్ని తరుముకుంటూ వచ్చిన కిరాతుడు అక్కడికి చేరి పావురం తనది అని ఇచ్చేయ్యమని అడిగాడు . తాను శరణు ఇచ్చానని కావాలంటే పావురం బరువుతో సరి తూగే తన శరీరం లో మాంసం ఇస్తానన్నాడు ..కిరాత శివుడు ,సరే నన్నాడు .త్రాసు తెప్పించి పావురాన్ని అందులో పెట్టించి శిబి తన శరీరం లోని మాంసాన్ని కోసి త్రాసులో వేసి తూస్తాడు ఎంతమాంసం కోసి వేసినా పావురం బరువుకు సరిపోవటం లేదు .ఆశ్చర్య పోయాడు శిబి చక్ర వర్తి .చివరికి తన తల నరికి త్రాసులో వేయబోతుంటే త్రిమూర్తులు ప్రత్యక్షమై అతని దానశీలతను పరీక్షించటానికి ఇదంతా చేశామని తెలియ జేసి అతని త్యాగానికి మెచ్చి వరం కోరుకో మంటారు .శిబి తాను శివునిలో ఐక్యం కావాలని కోరతాడు .తదాస్తు అన్నారు ముగ్గురు మూర్తులు .అప్పటి నుండి ఈ క్షేత్రం కపోతేశ్వర స్వామి క్షేత్రమైంది .శిబి చక్ర వర్తి లింగా కారం పొంది శివునిలో ఐక్యమై తన పరివారాన్ని కూడా లింగాలుగా మార్చమని కోరాడు .అనుగ్రహించి పరమేశ్వరుడు వారందరినీ కోటి లింగాలుగా మార్చాడు .కపోతాన్ని రక్షించి శిబి చక్ర వర్తి లింగాకృతి పొందిన లింగానికి ‘’కపోతేశ్వర లింగం ‘’అనే పేరొచ్చింది .కనుక స్వయంభు కపోతేశ్వర లింగమైంది . ఈ ప్రదేశాన్ని ‘’కపోత కందర పురం ‘’అనీ పిలుస్తారు. నాలుగవ శతాబ్దం లో కుబ్జ విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్నే రాజధానిగా చేసుకొని ఆంద్ర దేశాన్నిపాలించాడు .ఈ వంశ రాజు ‘కంద రాజు ‘’శిధిలా వస్తలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించాడని చరిత్రలో ఉంది .కపోత కుందరపురమే ఇప్పుడు మనం పిలుస్తున్న చేజెర్ల అయింది .డేగకు మాంసం కోసిచ్చాడనీ కొన్ని చోట్ల ఉంది .బ్రహ్మ శివుని శరం రూపం లో వచ్చాడని కూడా ఉంది డేగ రూపం లో వచ్చాడని వేరొక చోట ఉంది ..చేజెర్ల గొప్ప బౌద్ధ క్షేత్రం కూడా .అందుకే యాత్రికుల రద్దీ ఎక్కువ
కపోతేశ్వర లింగం ప్రత్యేకత
శిబి చక్రవర్తి శరీరమే లింగా కారం దాల్చిందని చెప్పుకున్నాం .శిబి శరీర మాంసాన్ని కోసిన దాఖలాలుగా లింగం అంతా పెద్ద పెద్ద గాట్లు కనిపిస్తాయి .అంటే సిబి శరీరమంస ఖండాలు కోయబడిన ప్రదేశాలన్నమాట ఇవి .శిబి తలను ఖండించుకోన్నాడని మనం చెప్పుకున్నాం .దీనికి ఆధారం గా లింగం పై భాగాల రెండు పెద్ద రంధ్రాలు లోతుగా కనిపిస్తాయి .ఒక రంధ్రం లో నుండి స్వామికి చేసిన అభిషేకజలం బయటికి ఎక్కడికో వెళ్లి పోతుంది .ఎక్కడికి వెడుతుందో ఇప్పటికీ ఎవరూ కని పెట్ట లేక పోతున్నారు .రెండవ రంధ్రం ద్వారా పచ్చిమాంసం రక్తం వాసన ఇప్పటికీ వస్తూ ఆశ్చర్యం కలిగిస్తుంది .అందువలన ఈ కపోతేశ్వర లింగం మహా మహిమాన్వితమైనదని భావిస్తారు . కపోతేశ్వరాలయం లో శివరాత్రి ని మహా వైభవంగా నిర్వహిస్తారు.తప్పక అందరూ దర్శించాల్సిన పుణ్య క్షేత్రం చేజెర్ల .అవకాశాన్ని చేజార్చుకో వద్దు .శ్రీ కపోతేశ్వర స్వామిని దర్శించి తరిద్దాం .
ఆధారం –గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కాలేజిప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి తో రెండు నెలలక్రితం శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి ద్వారా పరిచయ భాగ్యం కలిగింది. అప్పటినుంచి ఫోన్ లో తరచుగా పలకరించుకొంటున్నాం .నా మూడవ గీర్వాణానికి నేనుకోరిన కవుల గ్రంధాలు ,వివరాలు అందజేశారు .వారు స్వయంగా మహా కవులు గొప్ప కవితా ధార వారిది .చంద వోలు కు చెందినబ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు వారి తండ్రిగారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారలు రచించిన ‘’శ్రీ రామ కదామృతం’’గ్రంధం పై సమగ్ర పరిశోధన చేసి ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి పి.హెచ్ డి పొందారు .’’రామాయణం –సమాజ దర్పణం ‘’అనే రెండుభాగాల గ్రంధం ,శ్రీ రామ వాణి,వాల్మీకి వాణి,హనుమద్వాణి మొదలైన గ్రంధాలు రాశారు .
ఇవి కాక ముఖ్యంగా శ్రీ రాజ రాజేశ్వరీ శతకం ,శ్రీ వీరాంజనేయ శతకం ,శ్రీసత్యనారాయణ శతకం ,శ్రీ త్రికూటేశ్వర శతకం రాశారు .
చేజెర్ల వెళ్లి శ్రీ కపోతేశ్వర స్వామి ని దర్శించి ,అక్కడి రిటైర్డ్ మండల రెవిన్యు అధికారి శ్రీ దొడ్లేటి సత్యనారాయణ ,గ్రామస్తుల కోరికపై శ్రీ కపోతేశ్వర శతకం రాసి సార్ధకత తెచ్చారు .ఈ వ్యాసానికి ఈ పుస్తకమే ఆధారం అని మనవి చేస్తున్నాను. అందులో నుంచి ఒక పద్యం –
‘’కరుణాన్తః కరణుండునాన్ శిబి పరీక్షం జేయ ,నింద్రాగ్నులన్ –సురలె పావుర మౌచు ,డేగ యగుచున్ ,జూపట్టి రందాది ,మున్
శరణంచున్ దన జేర వచ్చిన ప్రదేశంబిద్ది ,చేజెర్ల యై –వరలెన్ ,రేడు ప్రతిష్ట జేసి నిను ,దేవా ! శ్రీ కపోతేశ్వరా’’
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –14-10-15-ఉయ్యూరు
.